23, జులై 2011, శనివారం

ఫో (కధ)



--శశిశ్రీ 
అహమద్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. కొంచెం గట్టిగా చూస్తే కానీ, అంత వయసు కనిపించదు.

పొట్టితనంలో వయసు దాక్కునింది.
ఈ సువిశాలమైన కడప నగరంలోని నివాస జనాభా మూడు లక్షల మందిలో అతనూ ఒకడు. ఇంటర్ వరకు చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకునే తెలివితేటలు అబ్బకపోవడంతో, అన్ని రకాల పనులు నేర్చి, అవసరమైనప్పుడు ఒక్కోపని చేసి బతికేస్తున్నాడు.

భార్య చనిపోయింది. ఇంకొకామెను చిత్తూరు జిల్లా ‘మహల్’ పోయి చేసుకొచ్చినాడు. పేరు ఆస్మా. ఆమె ఇంట్లోనే ఉన్నా, చేతులు ముడుచుకుని కూర్చోదు. ఏ సంఘం బీడీలో, ఏ లింగం బీడీలో, ఏ తులసి బీడీలో చకాచకా చుట్టి రోజుకింత సంపాదిస్తుంది. ఇంక అహమద్ మొదటి భార్య రొఖయాకు పుట్టిన కొడుకు ఉన్నాడు. పేరు ఫకర్‌దీన్. వాడు ఎనిమిదో తరగతి రెండేళ్లు చదివి, చేతికి, నోటికి అందిరాని చదువు జోలికి ఎందుకులే అనుకుని, ఎంచక్కా ఇంజినీరింగ్ వర్క్‌షాపులో టర్నర్‌గా ట్రైనింగ్ అవుతున్నాడు.

అహమద్ గురించి సరాసరి చెప్పకుండా అతని కుటుంబ సభ్యుల గురించి చెప్పాల్సి వచ్చిందంటే, అహమద్ జోలికిపోతే ఇక అటు ఇటు చూసే తీరిక కళ్లకు దక్కదు. సరే, అది అహమద్ కుటుంబం.
అహమద్ ఏ పని చేసినప్పటికీ ఇంట్లో రోజుకింత జేబులో ఉన్నప్పుడు ఇచ్చేస్తాడు రెండో భార్య ఆస్మాకు. ఉన్న కొడుకూ బుద్ధిగా ఆమె చేతికిచ్చేస్తాడు. మారుతల్లి అని ఆమె కానీ, ఆ పిల్లోడు కానీ యేనాడూ అనుకోలేదు. అనుకునేలా ప్రవర్తించలేదు కాబట్టి ఆ కుటుంబం అట్ల సాగిపోతోంది.
ఇక అహమద్ జోలికొస్తే, గొప్ప మ్యూజికల్ ఆర్టిస్ట్. అతనికి ఏడు తరాలపైన కానీ ఇక రాబోయే ఏడు తరాలకు కానీ అంత కళాకారుడు రాడు అని తానే గ్యారంటీ చెప్తాడు.

కడపలో ఎవరు ఏ పాట రాసినా, గేయం రాసినా హార్మోనీ పెట్టె ముందు పెట్టుకుని, అయిదే అంటే అయిదు నిమిషాల్లో రెండు మూడు రకాల బాణీలు కట్టి వినిపిస్తాడు. అయితే అహమద్ గొంతు వింటే, కక్కుకుని కక్కుకుని నీళ్లు వచ్చే వీధి కొళాయి గొంతుకలా ఉంటుంది. బాణీ మాత్రం అదిరిపోయేటట్లు కట్టడం అతనికి వరించి వచ్చిన విద్య.

అహమద్ శిష్యుడు పర్వేజ్ ఉన్నాడు. ‘నాకు అంతా గురువులే. శిష్యులు లే’రని చెప్తాడు అహమద్ చమత్కారంగా. చిలకల బావి వీధిలో షెడ్డు పెట్టుకుని ఆటోలకు బాడీ బిల్డింగ్ చేస్తుంటాడు పర్వేజ్. పైగా ఒక కాలు కుంటి. అవన్నీ ఎట్లుంటే ఏం కానీ, పర్వేజ్ గొంతు విప్పినాడంటే చాలు, మహమ్మద్ రఫీ, ఘంటసాల మించినోడు అనిపిస్తాడు. పర్వేజ్ భూమి మీద పుట్టిన సంగతి తెల్సుకునే ఆ ఇద్దరు చనిపోయారని అహమద్ వేళాకోళంగా అంటుంటాడు.

మ్యూజికల్ నైట్స్ కళాక్షేత్రంలో ఏర్పాటైనప్పుడు సంగీతం అహమద్ అనీ, సింగర్ పర్వేజ్ అనీ ఉంటే చాలు! ఆ రోజు రాత్రి కడప టౌన్లో అంగళ్లు చాలా తొందరగా మూత పడాల్సిందే. మ్యూజికల్ నైట్‌కి వాళ్లంతా రావాల్సిందే.
అహమద్‌ది కాకి గొంతు అయితే, అతని శిష్యుడు పర్వేజ్‌ది కోయిల గొంతు. అన్నట్లూ ఆ ఇద్దరూ నలుపు కూడా.
అటువంటి అహమద్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కనిపించడం లేదు. ఎటు పోయాడో ఎవరికీ దిక్కుతోచడం లేదు.
రాత్రి తొమ్మిది గంటలైనా అహమద్ జాడ లేదు. తప్పిపోవడానికేమైనా చిన్నపిల్లోడేమి కాదు. మట్టంగా యాభై ఏళ్లు.

కనిపించకపోతే, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఎవరికి? అంటే, అతన్ని రెండు నెలల కింద ఉద్యోగంలో పెట్టుకున్న అన్నమయ్య రియల్ ఎస్టేట్ శివారెడ్డి ఉన్నాడే, అతనికి ఇబ్బంది వచ్చిపడింది. నెలనెలా హౌసింగ్ ప్లాట్ల డిప్పు తీసినాక, కస్టమర్ల దగ్గరకు పోయి, రసీదు రాసిచ్చి, డబ్బులు రాబట్టుకుని, ఆఫీసులో కట్టడం అహమద్ పని. ఆ పని చేసిందానికి నెలకు అయిదు వేలు జీతం ఇస్తారు. బయట తిరగడానికి ఆఫీసు టూ వీలర్ ఉపయోగించుకోవచ్చు.

ఈ రోజు అన్నమయ్య రియల్ ఎస్టేట్ ఆసామి అయిన శివారెడ్డి, ఆలంఖాన్‌పల్లె దగ్గర పన్నెండు సారల బ్రిడ్జీ పక్కనే అయిదెకరాల స్థలం కొత్త వెంచర్ కోసం రైతులతో బేరం కుదుర్చుకున్నాడు. అగ్రిమెంటు రాసుకోవడానికి ముందు మాట ఒప్పందం కోసం సంచకారం అడ్వాన్సు లక్ష రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది.

లక్ష రూపాయలు ఆఫీసులో తీసుకుని ఆలంఖాన్ పల్లెకు ఉన్నపళంగా బయల్దేరి రమ్మని శివారెడ్డి అహమద్‌కు పని పురమాయించాడు. నమ్మినబంటులా ఆఫీసు మేనేజర్ జమాల్‌సాబ్ దగ్గర లక్ష డబ్బు లెక్కపెట్టి ఎంచుకుని, తీసుకుని హ్యాండ్‌బ్యాగులో భద్రంగా పెట్టుకుని, సరిగా సాయంత్రం 6 గంటలకు ఆఫీసు టూ వీలర్‌లో బయల్దేరినాడు అహమద్.

అంతే! రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నా అయిపు జాడ లేకుండా ఎట్లో ఎల్లబారిపోయినాడు. అతని దగ్గర మొబయిల్ ఫోన్ కూడా ఉంది. ఫోన్ చేసినారు. రింగ్ అవుతున్నదే కానీ ఎత్తడం లేదు. సెలైన్స్ మోడ్‌లో పెట్టుకున్నాడో ఏమో!
అల్మాసుపేటలోని వాళ్ల ఇంటికి అర్జెంటు పని పడి ఏమైనా పోయి ఉంటాడేమోనని, అక్కడికి పోయి చూసినాడు ఆఫీసు మేనేజరు జమాల్‌సాబ్.

‘‘ఇంత తొందరగా మా ఇంటాయన ఎప్పుడొచ్చినాడన్నా! వస్తే ఏమైనా చెప్పాల్నా అన్నా’’ అని అడిగింది అహమద్ రెండో భార్య ఆస్మా.
‘‘వస్తే, అర్జెంటుగా ఫోన్ చేయమని చెప్పమ్మ చాలు’’ అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చి అడిగాడు మేనేజరు.
‘‘టౌన్లో అహమద్ యాడ యాడ ఉంటాడో నీకేమైనా తెల్సి ఉంటే చెప్తావా అమ్మా? ఆయన్తో అర్జెంటు పని ఉంది’’ అన్నాడు.
‘‘మీకు తెలియంది ఏముంది? యాడన్న పాట కచేరీ ఉందేమో చూడండి. అది ఉందంటే మా ఆయనకు ఇంకేం కాబట్టదు కదా’’ అంది జవాబుగా ఆస్మా.

మేనేజరుకు తలలో మెరుపు మెరిసినట్లయ్యింది. పాట కచేరీలు కానీ, నాటకాలు కానీ, సన్మాన సభలు కానీ కడప కళాక్షేత్రంలోనే కదా జరిగేది. అక్కడికి పోయి చూస్తే సరి, అనుకుని బయల్దేరాడు మేనేజర్ జమాల్‌సాబ్.
అయినా ఒక బాధ్యత అప్పచెప్పి, పైగా లక్ష రూపాయలు నగదు ఇచ్చి, అర్జెంటుగా ఇచ్చి రమ్మంటే ఆ పనిని గాలికొదిలేసి, పాట కచేరీలో పోయి కూర్చుంటాడా ఎవరైనా బుద్ధి ఉండే మనిషి! అలా అయి ఉండకపోవచ్చు!!
మరి అట్ల కాకుండా, లక్ష రూపాయలు తీసుకుని జంప్ జిలానీ అంటూ ఊరు విడ్సి పారిపోయి ఉంటాడా?

లక్ష రూపాయలకే ఊరు విడిచిపోతాడా? పైగా ఊర్లో భార్యని, కొడుకుని విడ్సిబెట్టి. ఆ విధంగా పారిపోయే మనిషి కాదు అహమద్. ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది?
ఏదైనా జరగరానిది జరిగి ఉంటుందా? జరగరానిదంటే, ఏదైనా రోడ్ ఆక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరిగి, ఆసుపత్రిలో చేరినాడా ఏమి? ఇలా రకరకాలుగా మేనేజర్ జమాల్‌సాబ్‌కు ఆలోచనలు తలలో చకచకా వచ్చాయ్.
కానీ, తాను ఇప్పుడు తమ ఆఫీసు ఉండే ఏడు రోడ్ల కూడలి దగ్గర్నుంచే కదా ఈ అల్మాసుపేటకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే దోవలోనే కదా తిరిగి వస్తుండేది. దార్లో ఆక్సిడెంట్ జరిగిన వాతావరణమే కనబడలేదే అనుకున్నాడు మేనేజరు.

ఒకవేళ రోడ్ ఆక్సిడెంట్ జరిగి ఉన్నా, సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పుడు 9 గంటలు అవుతుంటే, ఈ మూడు గంటల కాలంలో ఆక్సిడెంటు సీను అట్నే ఉంటుందా? పైగా అహమద్‌ది టీవీఎస్ చిన్న బండి. ఏమో? ఏదైనా జరిగి ఉండవచ్చు. ఏమైతేనేం, కనీసం ఈ పెద్ద మనిషి అహమద్ తన దగ్గర ఉన్న, మెబయిల్ ఫోనెత్తి ఏం జరిగిందో చెప్పి ఉంటే బాగుండేది. పోనీ నిజంగానే ఆక్సిడెంటు అయినా, పక్కన వాళ్లతో ఫోన్ చేయించి తెలిపి ఉండవచ్చు కదా. ఇలా ఆలోచిస్తూ దారెంట ఏదైన ఆక్సిడెంటు ఆనవాళ్లు కనిపిస్తాయేమోనని చూడసాగాడు మేనేజర్ జమాల్‌సాబ్.

మొత్తానికి ఏదో జరిగే ఉంటుంది. అది ఏం జరిగిందో ఇక తెలియాల్సి ఉంది.
ఆ ఆలోచనలతో రాత్రి తొమ్మిదిన్నరకి కడప కళాక్షేత్రం దగ్గరకొచ్చాడు మేనేజరు.
అహమద్ రెండో భార్య ఆస్మా చెప్పినట్లు ఈ కళాక్షేత్రంలో ఉంటాడేమోనని, అటుకేసి తన బండి తిప్పాడు మేనేజరు, అసహనం పెరిగిపోతుండగా.

అర్జెంటుగా ఆలంఖానుపల్లెకు పోతున్న అహమద్ ఎప్పుడూ అలవాటుగా పోయే మద్రాసు రోడ్డులో కాకుండా, కలెక్టర్ ఆఫీసు దారిలో పోతున్నాడు.
జేబులో మొబయిల్ ఫోన్ కదిలినట్లు అయి, కళాక్షేత్రం పక్కన టీ హోటల్ సలామ్ అంగడి దగ్గర ఆపి, ఫోన్ తీసి చూశాడు. రెండు మిస్డ్ కాల్స్ కనిపించాయ్. ఆ మిస్డ్‌కాల్స్ ఎవరివో కావు. తమ అన్నమయ్య రియల్ ఎస్టేట్ ఆసామి శివారెడ్డివే! తొందరగా రమ్మని చెప్పడానికే చేసి ఉంటాడనుకున్నాడు అహమద్.
సరే ఎటూ పోతూనే ఉన్నాడు కదా తను - ఇక మళ్లీ ఫోన్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేయడం అనుకున్నాడు.
బండి కిక్కరుపై కాలు పెట్టబోయి, టీ హోటల్ సలామ్ పలకరింపుతో ఆగిపోయాడు. మాటల్లోనే సలామ్ స్ట్రాంగ్‌గా టీ చేసి గ్లాసు అహమద్ చేతికందించాడు.
టీ తాగడానికెంత సేపు అవుతుంది అని తాగుతూ, కళాక్షేత్రం ద్వారంపై రంగురంగుల సీరియల్ లైట్ల మధ్య వెలిగిపోతున్న ఫ్లెక్సీ బ్యానర్‌ని గమనించాడు.

పర్వేజ్ అండ్ పార్టీచే మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రాం అని రాసుంది. ‘‘ఒరే వెధవా! నన్ను గురువు గురువు అని కదా అంటుంటావ్. కనీసం ఈ గురువుగాడికి ఇలా ఈ ప్రోగ్రాం ఉందని చెప్పి ఉంటే, ఏం పోయేది. నేనే యాంకర్‌గా పనిచేసి ప్రోగ్రాం రక్తి కట్టించి ఉందును కదా’’ అనుకున్నాడు అహమద్.
‘‘ఏమోలే! ఎవరో అర్జెంటు ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఉంటారు. తొందరగా అరేంజ్ చేసుకుని ఉంటాడు. ఎంతకాలం నాపైన ఆధారపడతాడు. వాడూ ఇప్పుడు ఓ మోస్తారు ఆర్టిస్టు అయిపోయినాడు. వానికీ ఇప్పుడు శిష్యులు ఏర్పడినారు. సొంత కాళ్లపై నిలబడటం మంచిదే’’ అని తనకు తానే జవాబు చెప్పుకున్నాడు.

‘అవతల శివారెడ్డి డబ్బుకోసం ఎదురు చూస్తుంటాడు. పదా వెళ్లిపోదామ్’ అని మనసు అహమద్‌ని తొందరించింది. అంతలోని కళాకారుడు ‘లోపలికి కొంచెం తొంగి చూసి పోతే పోలా? ఎంతసేపో వద్దు. ఓ అయిదే అయిదు నిమిషాలు’ అని లోపలి కళాకారుడు ఊరించాడు.
స్ప్రింగు మింగిన కోతి అయిపోయింది అహమద్ శరీరం. అదే అతని బలహీనత. అదే అతని బలం. బలహీనతే అతన్ని బతికిస్తోంది. ఆ బలహీనత మరో పేరే కళాత్మక భావన. ఆ భావన వస్తే చాలు అహమద్ సాధారణ మనిషి నుంచి క్షణాల్లో అసాధారణ మనిషైపోతాడు. ఇప్పుడు అదే జరిగింది అహమద్ విషయంలో.

ముందు వరుస కుర్చీల్లో పోయి కూర్చుంటే, తన శిష్యుడు పిలిచి స్టేజీ ఎక్కించి, చేతికి మైకు ఇచ్చి యాంకరింగ్ చేసి పెట్టమని కోరనే కోరుతాడు. ఆ ఆహ్వానమే చాలని తాను ఒప్పుకోక తప్పదు. ఇన్ని బాదరబంధులు ఎందుకు? మర్యాదగా మూడో వరుస కుర్చీల్లో సాధారణ ప్రేక్షకుల్లో తానూ ఒకనిగా కూర్చొని, రెండు పాటలు విని, తన దారి పట్టుకోని తాను వెళ్లిపోతే మంచిదనుకున్నాడు అహమద్.
మూడో వరుసలో వేసి ఉన్న కుర్చీల్లో ఎక్కడైనా ఖాళీ కుర్చీ ఉందేమోనని దృష్టి సారించాడు.

ఒక విరిగిన కుర్చీ, ఇంకొకటి కాలు బయటికి సాగిన కుర్చీ కంటపడింది. ఎందుకైనా మంచిది వెళ్లి ముందు వరుసలోకే పోదామా అని మనసు చెప్పగా అటుగా చూశాడు. అక్కడ ఒరుసుకొని కూర్చొని ఉన్నారు. ఖాళీ లేదు. ఇక ఆలస్యం చేస్తే, ఆ వికలాంగ కుర్చీలూ దొరకవు అనుకుని, వాటిలో కాస్త గట్టిగా బరువు మోసే నమ్మకం కలిగించిన కాలు సాగిన కుర్చీలో కళ్లు విప్పార్చుకుని స్టేజీకేసి చూస్తూ కూర్చునేశాడు అహమద్.

‘హై దునియా కే రఖ్ వాలే’ రఫీ పాట ఎత్తుకున్నాడు అహమద్ శిష్యుడు పర్వేజ్.
ఈ పాట ఎంత గొప్పగా పర్వేజ్ గొంతులో పలుకుతోందో కదా.
ఈ ఒక్క పాటను తాను ఎన్ని తెల్లవారుజాములు పర్వేజ్‌తో పాడించినాడో కదా అనుకున్నాడు అహమద్.
అప్పుడు బరువు పడిన అహమద్... ఈ రోజు చూడు ఎలా ఎంత నీలాజాలంగా పాడేస్తున్నాడో. ఆరోహణంలో ఎలా గాలిపటంలా పైపైకి పోతున్నాడో. ఏమైనా నా శిష్యుడు కదా! అరే! చూడు చూడు అవరోహణంలో కూడా ఎంత హాయిగా గగనం నుండి భువనానికి గాల్లోంచి దిగుతున్న దైవదూతలా దిగుతున్నాడో అని తనలో తానే మురిసిపోసాగాడు అహమద్.

తాను ఇచ్చిన శిక్షణ వృథా పోలేదు. వీడ్ని ఆ సినిమావాళ్లు చూస్తే, లడ్డు నోటికి ఎత్తుకున్నట్లు ఎత్తుకెళ్తారు. కానీ ఈ కడపలో అంత మొగోళ్లు ఎవరు ఉన్నారు అనుకుంటూ తన శిష్యుని పాట ఆస్వాదించడంలో లీనమైపోయాడు అహమద్.
ముందు వరుసలో కూర్చున్నవాళ్లు, ప్రోగ్రాంకు స్పాన్సర్ల మాదిరి ఉన్నారు. మహ్మద్ రఫీ పాటలు కొసరి కొసరి అడిగి మరీ వినాలనుకుంటున్నట్లుంది.

ఈసారి పర్వేజ్, ‘బహారో ఫూల్ బర్‌సావో - మెర మెహబూబ్ ఆయాహై’ పాటను పాడబోయి, ప్రేక్షక శ్రోతలను ఉద్దేశించి, ‘‘ఈ పాట ఇంత వినసొంపుగా నేను పాడగలుగుతున్నానంటే, దీనికంతా కారణం మా గురువు అహమదే! ఈ పాటను మా గురువు ఎక్కడున్నా ఆయనకిది అంకితం’’ అని పాట ఎత్తుకున్నాడు.
ఆ మాటలు విన్న అహమద్‌కు కన్నీళ్లు వచ్చేశాయ్. తన శిష్యుడు తన పరోక్షంలో కూడా ఎంత గురుభక్తి ప్రదర్శించాడో అని పొంగిపోయాడు.
‘‘రేయ్ బేటా పర్వేజ్! నేను ఇక్కడే ప్రేక్షకుల్లో ఉన్నానురా. నీ మాటలు, నీ పాటలు వింటున్నానురా’’ అని చెప్పాలనిపించింది అహమద్‌కు. ఎందుకో సంస్కారం అడ్డు వచ్చి, ఆ మాటలు పదేపదే మనసులోనే అనుకున్నాడు.

తన ముందుకంటే, తన పరోక్షంలోనే శిష్యుడు మరింత విజృంభించి పాడటం గమనించాడు అహమద్. తను స్టేజీపై యాంకరింగ్ చేస్తూ, పర్వేజ్‌తో పాడించి ఉంటే, కొంత బెరుకు, కొంత భయంతోనే పాడేవాడు. ఎంతైనా గురువు ముందు పాడాలంటే శిష్యునికి ఇబ్బందే మరి. ఇప్పుడు చూడు ఎంతో సహజంగా, యావత్తు తన స్వర సామ్రాజ్యాన్ని ఎలా ప్రకటించుకుంటున్నాడో అనిపించింది అహమద్‌కు.
పరోక్షంగా శిష్యుని ఎదుగుదల చూస్తుంటే, సొంత కొడుకు తన పరోక్షంలో ఆకాశమంత ఎత్తు ఎదిగాడని మరొకరు చెప్తుంటే విన్నట్లు ఉందనుకొన్నాడు తన్మయత్వంలో.
ఆ మధుర స్వర డోలికల్లో తూగి తూగి తూలి తూలి సోలిపోతున్నప్పుడు ఎవరో అపరిచిత అరసికుడు భుజంపై బరువు చెయ్యి వేసినట్లు అనిపించింది.

తదేకంగా స్టేజీపైనే పర్వేజ్‌ని చూస్తున్న అహమద్, భుజంపై ఉన్న ఎవరిదో ఆ చెయ్యిని, అటు చూడనన్న చూడకుండ తొలగించేశాడు. ఆ పరిస్థితిలో మిన్ను భుజంపై వాలినా అలవోకగా గడ్డిపోచని తీసేసేలా ఉన్నాడతను. తిరిగి మళ్లీ అదే స్పర్శ! అదే చెయ్యి బరువు! మళ్లీ తోసేశాడు ఆ చెయ్యిని అహమద్.
ఈసారి ‘అహమద్’ అని ఎవరో గంభీరంగా, కాస్త కోపంతో పిలిచినట్లు అయ్యింది.
మంచి పాటల ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఈ అనవసర అంతరాయం కలిగిస్తున్న ‘బద్మాష్’ ఎవడని, నుదుటిపై ముడతలతో చూశాడు- పిలుపు వచ్చినవైపు అహమద్.

‘‘ఏందయ్య ఇది. నీ పని ఏమైన మర్యాదగా ఉందా? అవతల ముఖ్యమైన పని చూడమని పంపిస్తే, ఆ పని సంగతి చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటావా?’’ అని గుడ్లు ఉరిమి చూశాడు ఆఫీసు మేనేజరు జమాల్‌సాబ్.
జవాబు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అహమద్ ఆలోచించే లోగానే మళ్లీ ఆఫీసు మేనేజరే గొంతు విప్పాడు.
‘‘ఆ డబ్బు ఏది?’’ చాలా ఆత్రంగా అడిగాడు. అప్పటికి అహమద్‌కు కూడా గుర్తులేదు. తన సంకలో మినీ బ్యాగు ఒకటి ఉందని. జవాబు ఏమని చెప్పాలో అర్థంకాక, ‘‘ఏం డబ్బు?’’ అనేశాడు అహమద్.

‘‘అదేనయ్యా! లక్ష రూపాయలు. ఏది?’’ దాదాపు గద్దించినట్లు అడిగాడు మేనేజరు.
‘‘ఇదో. తీసుకుని ఫో’’ అని ఇచ్చేసి లేచి, కొంత దూరంలో మరోచోట మంచి కుర్చీ ఖాళీ అయి ఉంటే, అక్కడికి వెళ్లి కూర్చున్నాడు అహమద్ జరిగింది ఏమాత్రం పట్టించుకోకుండా.
అతని దృష్టి శిష్యుడు పర్వేజ్ ఆలపించే పాటలపైనే ఉంది. అహమద్ ప్రవర్తన అర్థంకాని మేనేజర్ జమాల్‌సాబ్ లక్ష రూపాయల నగదు పోకుండా చేతికి మళ్లీ వచ్చిందే చాలన్నట్లు అక్కడి నుండి బయటికి నడిచాడు.


20, జులై 2011, బుధవారం

సీరియల్ రైటర్


.................... కాండూరి వెంకట సన్యాసిరావ్ 
నేనెక్కిన ఆటో కాస్త భారంగా పరిగెడుతోంది. డ్రైవరుకి చెరోపక్క రక్షకుల్లా ఇద్దరు, బేబీ సీట్లో పెద్దలు నలుగురు, నేను కూర్చున్న అసలు సీట్లో నాతో పాటు నలిగిపోతూ మరో ముగ్గురు స్త్రీలు, మా వెనుక తొట్టిలాంటి ప్రదేశంలో మూడు నిండు తట్టలు, వాటి యజమానులు. ఇంత బరువు మోస్తున్నా నన్న ఆలోచన ఆటోకి రాకుండా అర్థమవ నివి కొన్ని, అర్థం లేనివి కొన్ని పాటలు!

ఒక ఊరు రాగానే బేబీ సీట్లో కూర్చున్నాయన దిగిపోయాడు. అతగాడు దిగిపోవడం నాకెందుకో నచ్చింది. ఎందు కేంటి? ఆటో రాగానే సీట్లో మొట్ట మొదట కూర్చున్నది నేనే. మూడు ఆడ భారీ కాయా లొచ్చి తటపటాయిస్తుంటే, నన్ను డ్రైవర్ పక్కన కూర్చోమని సలహా ఇచ్చాడు. అందుకే అతగాడంటే చిరాకేసింది.

నేను సీటు మారనని తెగేసి చెప్పడంతో మహిళా మణులు ముగ్గురూ నా పక్కనే కూర్చు న్నారు. ఆటో చక్రం గోతిలో పడ్డప్పుడు కలిగిన కుదుపుకి వాళ్లు నా వైపుగా వచ్చేస్తూ దాదాపు తొంభైశాతం ఆక్రమణ చేసేశారు. నా పక్కనున్న పెద్దావిడ మోచేయి నా పొట్టలో తగులుతుంటే కొంచెం ఇబ్బందిగా చూశానో లేదో, ఆటోలో ఇలాంటివి తప్పవని కళ్లతోటే జవాబిచ్చింది.

ఉచిత సలహాలరాయుడు దిగిపోవడం నచ్చిందనేసరికి డ్రైవరుకి మహోపకారం చేసే చాన్సు తగిలింది. ‘‘ఏయ్ బాబూ! ఇప్పుడు దిగినతను డబ్బు లివ్వకుండా వెళ్లిపోయాడు. చూసుకున్నావా?’’ అన్నాను. ‘‘అతను సీరియల్ రాస్తాడండీ. డబ్బులిమ్మంటే బాగోదు’’ వివరించాడు డ్రైవరు బాబు.
సీరియల్ అనగానే ముగ్గురు స్త్రీల మొహాల్లో మూడు వేల ఓల్టుల బల్బు వెలిగినట్లు కనిపించింది.
నన్ను మోచేత్తో పొడుస్తున్నావిడ- ‘‘ఇప్పుడు దిగి పోయినతను సీరియల్ రాస్తాడటర్రా’’ అంది మిగిలిన ఇద్దరితో.

‘‘నిజమా? ఏం పేరు?’’ అడిగింది రెండో ఆవిడ.
‘‘ఇగో బాబూ! సీరియల్ రాసే అతని పేరేంటి?’’ అడిగేసింది మూడోస్త్రీ.
క్షణం పాటు వెనక్కి తిరిగి చూసి, ‘‘పెద్దప్పడు’’ అని చెప్పి రోడ్డు చూసు కున్నాడు డ్రైవరు.
ఇంతలో డ్రైవరుగారి సెల్ రింగ య్యింది. పాటల సౌండు బాగా తగ్గించి, చెవికి, భుజానికి మధ్య ఫోన్ గట్టిగా నొక్కి పెట్టి, కబుర్లాడేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం తప్పు అని తెలిసీ జాలేసిందో, ప్రాణభయం ముంచు కొచ్చిందో గాని, ‘‘సెల్ నేను పట్టుకుంటాను, నువ్వు మాట్లాడు’’ అని జాగ్రత్తగా డ్రైవర్ చెవికి ఫోన్ ఆనించి పట్టుకున్నాడు కుడిపక్క కూర్చున్న పెద్దమనిషి.

ఇక్కడ మోచేతి పొడుపులావిడ, ‘‘వరం.. పెద్దప్పడు గారి సీరియల్ ఏదై ఉంటదంటావ్? నిత్య సరాగాలేటి?’’ అంది.
‘‘ఛీ! కాదు. ఆ సీరియల్లో అలాటి పేరే కనబడదు’’ చెప్పింది వరం.
‘‘సీరియల్లో సొంత పేర్లుంటాయేటి. వేరే పేర్లు పెడతారు’’ అంది రెండో ఆవిడ.
‘‘తెలుసు. కాని, సీరియల్ రాసినోళ్లు, తీసినోళ్లు, చేసినోళ్లు అందరి పేర్లు ప్రతిరోజూ చూపెడతాడు కదా. వాటిల్లో పెద్దప్పుడు పేరు లేదు’’

‘‘మరైతే ఎదురింటావిడ?’’
‘‘కాదు’’ రిథమ్‌తో చెప్పింది వరం.
‘‘ముళ్ల గులాబీ?’’
‘‘కాదు’’ అదే స్టైల్, అదే టెంపో.
‘‘వెనకటికొకసారి?’’
‘‘కానే కాదు’’ స్టైల్ మార్చినా అందం అగుపించింది.
వాళ్ల సంభాషణ అలా సాగుతుంటే, ‘ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తి దగ్గర బీడీ కంపొచ్చిందేంటా’ అనుకున్నాను నేను.

అవును మరి. కథ అరంగుళమైనా ముందుకు కదలకుండా ఎపిసోడ్ పూర్తవ్వాలి. ఆర్నెల్లకో చిన్న ట్విస్ట్, ఏడాదికో కొత్త పాత్ర. అదీ కథకి ఏమాత్రం సంబంధం లేని పాత్ర సృష్టించగలగాలి. ఎంతో శ్రమ, మరెంతో పరిశ్రమ, అనుభవం... ఎట్సెట్రా మేళవిస్తే గాని అంత సాగతీతకి చెయ్యి తిరగదు. మానసికంగా ఎంత అలసట కలుగుతుందో! రిలాక్సేషన్ కోసం ధూమ పానం తప్పనిసరి. సాధారణంగా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లు సిగరెట్ ఎంచు కుంటారు. ఇతగాడెందుకో బీడీతో రిలాక్సవు తున్నాడు అనుకున్నాను.

నడిచిపోయినవి, నడిచి సగంలో ఆగిపోయినవి, ప్రస్తుతం నడుస్తున్నవి, భవిష్యత్తులో నడవబోయేవి... ఇలా ఎన్ని పేర్లు చెప్పినా పెద్దప్పుడు వారి సీరియల్ మాత్రం ‘ఇదీ’ అని ఓకే చెయ్యలేదు వరం!

మధ్యన కూర్చున్నావిడ మరి ఉండలేక డ్రైవరు భుజం మీద కొట్టి మరీ పిలిచి, ‘‘బాబూ! అతను ఏ సీరియల్ రాశాడూ?’’ అని అడిగింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడబోయి తమా యించుకుని కీచుమంటూ ఆగింది. ఏ చూలు పందో అడ్డొచ్చిందనుకున్నాన్నేను. కానీ నవ్వడం కోసం బండి ఆపాడట! పగలబడి, విరగబడి నవ్వుతున్నాడు డ్రైవరు. మేం నల్గురం మొహాలు చూసుకున్నాం. ఎలాగో అతికష్టం మీద నవ్వు ఆపుకుని చెప్పాడు- ‘‘పెద్దప్పడు స్టాండ్‌లో ఆటోలకి సీరియల్ రాస్తాడు’’ అని.
ఆటో మా గమ్యం చేరేవరకు ఒక్కరం మాట్లాడితే ఒట్టు.


పేదరికం (కధ)

- వాణిశ్రీ


శివానందుడు గురుకులంలోని విద్యార్థులకు ద్రుపదుడు, ద్రోణుల కథ చెప్పాడు.
ద్రుపదుడు, ద్రోణులు గురుకులంలో సహాధ్యాయులు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పేదరికంలో కన్నకొడుక్కి పాలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాడు.

ద్రోణుడి భార్య ‘‘మీ సహాధ్యాయి మహారాజయ్యాడు గదా! మీరు వెళ్లి ఒక ఆవును దానంగా ఇవ్వమని అడగండి. పిల్లవాడికి కడుపు నిండా పాలు తాగించవచ్చు’’ అన్నది.
గురుకులంలో ఉన్న విద్యార్థులంతా రాజులు, మంత్రులు, ధనవంతుల పిల్లలు. అందులో విక్రముడు అనే శిష్యుడు లేచి, ‘‘గురువర్యా! పేదరికం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

శివానందుడు వెంటనే సమాధానం చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు. పేదరికం అంటే ఏమిటో గురువు గారికే తెలియదని విక్రముడు సహాధ్యాయులతో అన్నాడు.
ఒకరోజు శివానందుడు బయల్దేరుతూ, ‘‘మీరంతా ఈ రోజు చెప్పులు వేసుకోకుండా నా వెంట నడిచి రండి’’ అన్నాడు.

గురువుగారు తమకి కొత్త చెప్పులు తయారు చేయించడానికి తీసుకెళ్తున్నాడేమోనని అందరూ సంబరపడ్డారు. చెప్పులు లేకుండా నడవడం మొదలుపెట్టారు. కాళ్లకు పలుకురాళ్లు గుచ్చుకుంటున్నాయి. ఎండ ముదిరిన తర్వాత వేడికి కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. కొందరికి ముళ్లు గుచ్చుకున్నాయి. అయినా బాధను ఓర్చుకుంటూ గురువుని అనుసరించారు.

మిట్టమధ్యాహ్నమైంది. అందరికీ ఆకలవుతోంది. ఆశ్రమంలో ఈపాటికి గురుపత్ని అందరికీ ఆహారం వడ్డించేది. గురువు అందరినీ ఒక చెట్టు నీడకు చేర్చాడు.
‘‘తినడానికి ఏమీలేదు. ఆ సెలయేట్లో నీళ్లు తాగి ఆకలి తీర్చుకోండి’’ అన్నాడు.

అందరూ సెలయేట్లోకి వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగారు. తాత్కాలికంగా కడుపు చల్లబడింది. తర్వాత మామూలే. కడుపులో మంట మొదలైంది. ఎలాగో ఓర్చుకున్నారు. కాసేపు చెట్టు కింద విశ్రమించారు.
ఇంతలో మబ్బులు కమ్ముకొన్నాయి. గాలివాన మొదలైంది. తల దాచుకోవడానికి ఎక్కడా ఇల్లు లేదు. చెట్టు కిందనే నిలబడిపోయారు. వర్షం పెద్దదైపోయింది. అందరూ తడిసిపోయారు. మార్చుకోవడానికి మరొక జత దుస్తులు లేవు. చలికి గజగజ వణకసాగారు.

కొంతసేపటికి వర్షం వెలిసింది. బతుకు జీవుడా అంటూ అంతా గురుకులం చేరుకున్నారు.
‘‘గురువర్యా! మమ్మల్ని చెప్పులు లేకుండా అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు?’’ అని విక్రముడు అడిగాడు.
శివానందుడు నవ్వి, ‘‘మీకు పేదరికం అంటే ఏమిటో తెలియజెప్పటానికే’’ అన్నాడు.
శిష్యులు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు.

‘‘చెప్పులు లేకపోవడం వలన బాధ అనుభవించారు. ఆకలైనప్పుడు తినడానికి ఆహారం లేక అలమటించారు. ఎండ, వానల నుంచి తలదాచుకోవడానికి ఇల్లు లేకపోవడం ఏమిటో చెట్టు కింద వర్షంలో తడిసినప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది. వానకి ఒంటిమీద దుస్తులు తడిస్తే, కట్టుకోవడానికి మరొక జత లేక చలికి వణికారు. పేదరికం అంటే అదే. కూడు, గూడు, గుడ్డ లేకపోవడమే పేదరికం’’ అని వివరంగా చెప్పాడు శివానందుడు.

పేదవాళ్లు అవసరాలు తీరక ఎంత బాధపడుతుంటారో అనుభవ పూర్వకంగా తెలియజెప్పడానికే గురువు ఇలా చేశాడని శిష్యులకు అర్థమైంది. ఆయనకు వందనాలు సమర్పించుకున్నారు.

హ.... కథవిధీ


--నాయుని కృష్ణమూర్తి

అన్వేషి కథలు రాయడానికి నిర్ణయించుకొన్నాడు. అతడెప్పుడూ కథలు చదవలేదు. తెలివైనవాడు కాబట్టి మొదట వీలైనన్ని కథలు చదివి, ఆ తర్వాత కథాగర్భం తెచ్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు.

మార్కెట్లో దొరికే అన్ని పత్రికలూ కొన్నాడు, దినపత్రికల్లో సహా. అన్నీ ముందు పెట్టుకొని దీక్షగా చదివాడు. చాలా కథలు అర్థంకాలేదు అన్వేషికి. కొన్నింటిలో భాష అసలు అర్థం కాకపోవడం వల్ల చదవడం చాలా ఆలస్యమైంది. మొత్తం మీద మొదటి మారుగా కొన్న పత్రికల్లోని అన్ని కథలు పూర్తయ్యాయి. ఈ లోపల మార్కెట్లో కొత్త పత్రికలు వచ్చాయి. వాటినీ కొన్నాడు. ఆ కథలూ చదివే లోపల మళ్లీ కొత్తవి.

తొమ్మిది నెలలు గడిచిపోయాయి.
ఈ కథలు చదివే కాలంలో అన్వేషికి చాలామార్లు కడుపు ఉబ్బరించింది. కథాగర్భం రావడం వల్ల కడుపు పెద్దదయింది అని పొరబాటు పడ్డాడు. తర్వాత విరేచనాలు, వాంతులు అయ్యాయి. కథాగర్భం కాదని అన్వేషికి అర్థమయింది.

అన్వేషిలో మానసికంగా కూడా చాలా మార్పు వచ్చింది. స్పష్టమైన ఆలోచన ఏదీ రావడం లేదు. మనసంతా గజిబిజి, గందరగోళం. ప్రపంచమంతా దీనమైన, హీనమైన, విషాదభరితమైన పాత్రలతో నిండిపోయిందా అనిపించింది అన్వేషికి.

ఇది కథ రాయాలి -
కథకు ఒక నీచమైన, నికృష్టమైన, సమాజం ఇనుప పిడికిళ్లలో నలిగిపోతున్న, వ్యథాభరితమైన ఒక పాత్ర కావాలి!
ఎంత ఆలోచించినా అన్వేషికి రాయాల్సిన కథ స్ఫురించలేదు. వీధులు తిరిగాడు, ఊళ్లు తిరిగాడు.
హఠాత్తుగా ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి ముష్టి వాళ్ల మీద మొదటి కథ రాయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇక, ఆ దృష్టితో ముష్టివాళ్లను వెదకి ఎవర్నైనా ఒకర్ని ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత కథ రాద్దామనుకొన్నాడు. అలా చేస్తే కథలో వాస్తవికత ప్రతిబింబిస్తుంది అని బలంగా అనిపించింది.
మూడు రోజుల ప్రయత్నం తర్వాత ఒక ముష్టివాడు ఒంటరిగా ఒక చెట్టు కింద దొరికాడు అన్వేషికి.
ధైర్యం చేసి అతడి దగ్గరికి వెళ్లి, పక్కనే ఒక చిన్న తిన్నెలాంటి రాయి కనిపిస్తే కూర్చున్నాడు.
అన్వేషి వంక ఆ వ్యక్తి అనుమానంగా, చిరాగ్గా, ఇబ్బందిగా, భయంగా, ప్రశ్నార్థకంగా, కోపంగా చూశాడు.

బలవంతాన ముఖం మీద నవ్వు పులుముకొని, ‘‘నీ పేరు?’’ అని మొదటి ప్రశ్న వేశాడు అన్వేషి.
అతడు సమాధానం చెప్పలేదు. అయోమయంగా చూశాడు ప్రశ్నించిన వ్యక్తి వంక.
మాటలు పెగలడం లేదు అన్వేషికి. దగ్గి గొంతు సవరించుకొన్నాడు. జుబ్బాను పెకైత్తి ముఖం మీద పట్టిన చెమటలు తుడుచుకొన్నాడు. జేబులు తడుముకొన్నాడు. తల సవరించుకొన్నాడు.
చెట్టు కింది వ్యక్తి పైకి లేచి అక్కణ్ణుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని అతని శరీర కదలికల్ని బట్టి అన్వేషి గ్రహించాడు.

దొరికిన అవకాశం చేజారిపోతున్నట్టు అనిపించింది అన్వేషికి. ‘‘ఆగాగు. యెల్లిపోకు. నేను కద రాద్దామని..’’ నసిగాడు.
‘నేను కద రాద్దామని...’ మళ్లీ మొదలుపెట్టాడు అన్వేషి.
వీడెవడో పిచ్చిమాలోకమని అర్థమయింది అవతలి వ్యక్తికి. కాస్సేపు కాలక్షేపం అవుతుంది కదా అనుకొన్నాడేమో, సర్దుకొని కూర్చుని బీడీ ముట్టించాడు. రెండు దమ్ములు లాగి అడిగాడు. ‘‘ఏందీ... కద రాద్దామనుకొంటున్నావా?’’ ఆ అడగడంలో కొంత ఎగతాళి కూడా ధ్వనించింది.
నేరం చేస్తున్నవాడిలా తల ఊపాడు అన్వేషి.

‘‘కదంటే...’’ నింపాదిగా అడిగాడు బీడీ దమ్ము లాగుతూనే.
‘‘కదంటే...’’ అని ఆగి, సమాధానం చెప్పడానికి బదులు, భుజానికి తగిలించుకొన్న సంచీలో నుండి ఒక పత్రిక ఇవతలికి లాగి, ఏదైనా కథ కనిపిస్తుందేమోనని గబగబా పేజీలు అటూ యిటూ తిప్పుతూ, ‘‘నీ పేరు...’’ అన్నాడు.
‘‘నర్సిమ్ములు.’’
పత్రికలో ఒక పేజీ దగ్గర ఆగాడు అన్వేషి. ఆ పేజీని నర్సిమ్ములుకు చూపిస్తూ, ‘‘కదంటే ఇది’’ అన్నాడు.

నర్సిమ్ములు అన్వేషి వంక జాలిగా చూస్తూ, ‘‘తమదే ఊరు?’’ అడిగాడు.
‘‘యీ వూరే.’’
‘‘వంట్లో బాగుండ్లేదా?’’
అన్వేషి సమాధానం చెప్పకుండా నర్సిమ్ములు వంక సూటిగా చూశాడు.
నర్సిమ్ములు సర్దుకొన్నాడు. ‘‘కదంటే నాకు తెల్దయ్యా. నువ్వేదో ఆ బుక్కులో సూపిస్తా ఉండావు. కదంటే అదేనా?’’

ఔను అన్నట్టు తల ఊపాడు అన్వేషి.
‘‘మీరు పెద్దోళ్లు. మీరు కదల్రాస్తారో, ఏం రాస్తారో నాకు తెల్దు. ఇదంతా నాకెందుకు సెప్తా ఉండావో అసలు తెల్దు. గంగమ్మ తల్లి మీద ఒట్టు.’’
నర్సిమ్ములు ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో అన్వేషికి కూడా తెలీలేదు. అయినా ప్రయత్నం చేస్తూ, ‘‘నువ్వుండావు నర్సిమ్ములూ. జీవితంలో యెన్నో అగసాట్లు పడుంటావు కదా. అవన్నీ నేను తెల్సుకోని రాస్తే కదవుతుంది. యిలాంటి బుక్కులో యేస్తారు’’ అన్నాడు.

నర్సిమ్ములు నోరు తెరిచేశాడు. ‘‘నా ఇవరాలన్నీ దాంట్లోకి ఎక్కిస్తారా? వద్దులే సామీ. నా మానాన నన్ను ఇట్టుండనీ. అయినా ఆ కద రాస్తే నాకేం ఉపయోగం?’’ లాయర్లా అడిగాడు.
‘‘ప్రపంచమంతా నీ గురించి తెలుసుకుంటుంది. అయ్యో పాపం అనుకుంటుంది. అంతేకాదు. ప్రపంచం ముష్టివాళ్ల పట్ల తన దురుష్టి కోనమే మార్చేసుకుంటుంది నర్సిమ్ములూ...’’
‘‘దాంతో నాకేమొస్తుంది?’’
చప్పున సమాధానం చెప్పాడు అన్వేషి. ‘‘నీ కద అందరికీ తెలిస్తే, సదివినోళ్లంతా నీమీద సానుబూతి సూపిస్తారు.’’
‘‘దాంతో నాకేమొస్తుంది?’’ మళ్లీ అదే ప్రశ్న వేశాడు నర్సిమ్ములు.

‘‘అదేనయ్యా. నిన్నిప్పుడు అందరూ కసురుకొంటారు కదా. అట్లా సెయ్యరు. అయ్యో పాపం అని సాయం సేస్తారు.’’
‘‘నాకయితే నమ్మకం కుదర్లేదు’’ ఆరిపోయిన బీడీ ముక్కను నోటితోనే తుపుక్కున ఉమ్మేశాడు నర్సిమ్ములు.
‘‘పాటకుల్లో వొకరో యిద్దరో అయినా మారిపోతారు నర్సిమ్ములూ’’ - నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, లేకుంటే ఇన్ని వందల కథలు ముష్టివాళ్ల మీద ఎందుకొస్తాయి? అనే పద్ధతిలో సమాధానమిచ్చాడు అన్వేషి.
నర్సిమ్ములు తల అడ్డంగా రెండు మూడు మార్లు ఊపాడు.

అన్వేషి మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘యిలాంటి పుస్తకాల్లో ముష్టోళ్ల మీదే కాదు... అప్పులు తీర్చలేక పానాలు తీసుకునేవాళ్లమీదా, బూములు అమ్ముకొని యేడ్చేవాళ్ల మీదా, పేదోల్ల రగతం తాగే భూకామందుల మీదా, బిడ్డలికి యింత అన్నం పెట్టాలని యబిచారం సేసేవాళ్లమీదా... అందరి మీదా కదలు రాస్తారు.’’

ఆశ్చర్యంగా తల పంకించాడు నర్సిమ్ములు. ఇక వినే ఓపిక లేనట్లు భుజం పైనున్న తుండుగుడ్డను విదిలించుకొంటూ పైకి లేచి, ‘‘ఏమో సార్! నువు సెప్పినోల్లందరి మీద కదల్రాసి రాసీ, మీ రాసేవోళ్లు గ్యానం పెంచుకుంటా ఉండారేమో. నాకయితే ఏమీ బుర్రకెక్కడం లేదు. నువ్వు ఎవురిమీదయితే కద రాస్తావో ఆల్లెవురూ నీకదల్జదవరు. నువ్వే రాసుకోవల్ల. నువ్వే సదువుకోవల్ల!’’ అని తను చెప్పదలచుకొన్నది తేల్చి చెప్పినట్లు, అన్వేషితో సంబంధం లేనట్లు ఆ దృశ్యం నుండి నిష్ర్కమించాడు.

దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిన అన్వేషి, ఒక నిశ్చయానికి వచ్చినవాడివలే లేచి నేరుగా పత్రికా కార్యాలయం వైపు అడుగులు వేయసాగాడు. ఎలాంటి కథ రాయాలన్న ఆలోచన అతడి మనసులో సుళ్లు తిరుగుతూనే ఉంది. తెలుగుపత్రిక సంపాదకుడితో మాట్లాడితే మరికొంత స్పష్టత వస్తుంది అని బలంగా అనిపించింది.

పత్రికా కార్యాలయంలో మొదటి మారుగా అడుగుపెట్టిన అన్వేషి ఒకమారు తల విదిలించుకోవడమే కాదు, తన ఒంటిని తనే గిచ్చుకొని, మేలుకొనే ఉన్నానని ధ్రువపరచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.

అతడు నేరుగా లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా కొన్ని బల్లలు అడ్డంగా కనిపించాయి. ఒక్కో బల్ల వెనుక ఒక స్త్రీ మూర్తో, పురుష మూర్తో నిలబడి లోపలికి వస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు.
మొదటి అడుగుపెట్టిన అన్వేషిని, మొదటి బల్ల ఆధిపత్యం వహిస్తున్న స్త్రీమూర్తి ఆపి, ‘‘మీ పేరు, చిరునామా, మిగిలిన వివరాలు ఈ కాగితంలో రాయండి’’ అంది.
అన్వేషి రాశాడు.
రెండో బల్ల దగ్గరున్న వ్యక్తి, ‘‘మీరెవరో రుజువు చేయగలిగిన గుర్తింపు కార్డు చూపెట్టండి’’ అన్నాడు.
అన్వేషి చూపెట్టాడు.

మూడో బల్ల వెనుకనున్న వ్యక్తి, ‘‘మీకు తెలిసి, మీకు ఏవైనా జబ్బులు ఉన్నాయా?’’ అని అడిగాడు.
‘‘లేవ్!’’ కచ్చితంగా చెబుతున్నట్టు చెప్పాడు అన్వేషి.
‘‘మీ బీపీ చూడాలి’’ అన్వేషి చెయ్యి ముందుకు చాపాడు.
బీపీ పరీక్ష అయింది.
‘‘గతంలో ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా?’’ ఆ వ్యక్తే అడిగాడు.
‘‘ర్యాలా!’’

‘‘మంచిది. వస్తే వెంటనే ఈ మూడు టాబ్లెట్లు వేసుకోండి. పరీక్షల ఖర్చు నిమిత్తం అయిదు వందల రూపాయలు ఆ కౌంటర్లో కట్టి రసీదు తీసుకోండి. ఇక్కడ ఈ రిజిస్టర్లో మీ వేలి ముద్ర వేసి వెళ్లండి.’’
‘‘సమించండి. యిన్ని పరీస్సలు, యీ తతంగం అంతా యెందుకో తెల్సుకోవచ్చా? అసలు యిది తెల్గుపత్రిక కార్యాలయమే కదా!’’

ఆ వ్యక్తి అన్వేషి ముఖం వంక ఎగాదిగా చూసి అన్నాడు. ‘‘మీరెవరు? మీ ముఖం చూస్తుంటే ఇంతవరకూ తెలుగు పత్రిక కార్యాలయంలో అడుగుపెట్టిన పాపాన పోయినట్లు లేదు.’’
‘‘నిజమేనండి! నాకెప్పుడూ లోపలికి అడుగుపెట్టాల్సిన అవసరం యేర్పడలేదు. నేన్లోపలికెల్లొచ్చా?’’
‘‘అది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.’’

అన్వేషికి అయోమయంగా ఉంది. విసుగ్గా ఉంది. కోపంగా ఉంది. ఉక్రోషంగా ఉంది. తన పరిస్థితికి తనమీద తనకే జాలిగా కూడా ఉంది. గందరగోళంగా ఉన్న మనసును అదుపులో పెట్టుకొంటూ, ‘సంపాదకుడు’ అని బోర్డు ఉన్న గది తలుపుని విసురుగా తోశాడు. కీచుమని శబ్దం చేస్తూ తలుపయితే తెరచుకొంది గాని, ఎదురుగా కనిపిస్తున్నది సంపాదకుని గది కాదేమో అని అనుమానం కూడా కలిగింది.

ఆ గది జన సమూహంతో కిక్కిరిసి ఉంది. ఎవరు ఎవరో ఏమీ అంతుబట్టడం లేదు. సంపాదకుడు ఎక్కడున్నాడో అన్వేషి కనిపెట్టలేకపోయాడు. మధ్యలో ఏడెనిమిది మంది ఒకేచోట గుమిగూడి ఉండడంతో అన్వేషి అక్కడికి దోవచేసుకొని వెళ్లాడు.

అక్కడ, సింహాసనం లాంటి ఒక కుర్చీమీద ఒకతను కూర్చొని ఉన్నాడు. మనిషి ఆజానుబాహువులాగా ఉన్నాడు. ఎత్తు ఏడెనిమిది అడుగులు ఉంటాడేమో! అతడి మెడలో ‘తెల్గు కథాకుమార్’ అనే బోర్డు వేలాడుతూ ఉంది.

చుట్టూ గుమిగూడినవాళ్లు ఆ కథాకుమార్‌ను తమ శక్తివంచన లేకుండా బాధిస్తున్నారు. పైగా ఒక దెబ్బకొట్టడం - వీపు మీద ఒక చరుపు చరిచి ‘సెహబాష్! కలికితురాయి లాంటి ఒక కథ నీ ఖాతాలో జమయింది’ అనడం.

అన్వేషి కథాకుమార్‌ను కొడుతున్న వాళ్లెవరో తెలుసుకోవాలనిపించి మరింత పరీక్షగా చూశాడు. అందరి మెడల్లోనూ అట్టముక్కలు వేలాడుతూ కనిపిస్తూనే ఉన్నాయి. అట్టముక్క పైభాగంలో పెద్ద అక్షరాలతో దళిత రచయిత, విప్లవ రచయిత, స్త్రీవాద రచయిత, బ్రాహ్మణ రచయిత, శూద్ర రచయిత, జాలరి రచయిత, వడ్రంగి రచయిత, మాల రచయిత, మాదిగ రచయిత, తెలంగాణ రచయిత, సర్కార్ రచయిత, కృష్ణా రచయిత, ఒంగోలు రచయిత, చిత్తూరు రచయిత, తిరుపతి రచయిత... అని రాసి ఉంది. కింద ట్యాగ్‌లైన్ - మరియు కవి, సమీక్షకుడు, విమర్శకుడు, ఎత్తిపోతల పథకం శ్రామికుడు మరియు ముఠామేస్త్రి. లెక్కలేనంత మంది, దాదాపు ప్రతి జిల్లాకు ఒకరు ఉన్నట్టున్నారు.

తలపట్టుకొన్నాడు అన్వేషి.
అందరూ అలసిపోయినట్టు కాస్సేపు విశ్రాంతికని పక్కకు జరుగుతూ అన్వేషికి అవకాశం ఇచ్చారు.
అన్వేషి రెండడుగులు ముందుకు వేశాడు.

అన్ని వాదాల కవులు, అన్ని ప్రాంతాల కవులు కోరస్‌గా, ‘‘నీదేజిల్లా? నీదేవాదం?’’ అని ఆ గది ప్రతిధ్వనించేలా ప్రశ్నించారు.
అన్వేషి పాపం జవాబు చెప్పలేకపోయాడు. ఏ జిల్లా అంటే చెప్పగలడేమో గాని, ఏ వాదం అంటే చెప్పడానికి సమాధానం సిద్ధంగా లేదు. బిక్క ముకం వేశాడు.

కుర్చీలో మహారాజులా కూర్చొని, దీనాతిదీనమైన చూపుల్తో అందరి దెబ్బల్నీ భరిస్తున్న తెల్గు కథాకుమార్ అనునయంగా, ‘‘రా! నాయనా! రా! ఏ వాదం మీద కథ తీసుకొచ్చావు? నన్నెక్కడ కొడతావు?’’ అని అడిగాడు.

అన్వేషి కథాకుమార్ వైపు పరీక్షగా చూశాడు. అతడికి ఒక కాలు పొట్టి, ఇంకో కాలు పొడవు. చేతి వేళ్లన్నీ రకరకాల సైజులో ఉన్నాయి. చేతులు ఒక్కోచోట బలంగా, ఇంకోచోట ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. పొట్ట బాగా ఉబ్బినట్లుంది.

అన్వేషికి ముఖంలో ఆవేశం పొంగుకొచ్చింది. కళ్లలో నీళ్లు నిండుకొన్నాయి.
కథాకుమార్ ఓదార్పుగా అన్నాడు. ‘‘బాధపడకు నాయనా! ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. ఒక్కోపూట ఒక్కోరకం తిండి అధికంగా పెట్టేస్తున్నారు. దాంతో శరీరంలో ఒక పార్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకో రకం తిండి పెట్టి ఇంకో పార్ట్ పెంచేస్తున్నారు. మొత్తం పైన సమతులాహారం లభించక పోవడం వల్ల నా శరీరం అస్తవ్యస్తమైపోతోంది. నువ్వే పార్ట్ పెంచుతావో ఏమో... కానీ నాయనా..!’’

నోరు తెరవలేకపోయాడు అన్వేషి.
ఇంతకూ సంపాదకుడు ఎక్కడున్నాడా అని గదంతా చూపుల్ని కలియతిప్పాడు.
ఒక మూల ఒక చిన్న కుర్చీ మీద ఒక వ్యక్తి ముఖం వేలాడేసుకొని కూర్చుని ఉన్నాడు. అతడి మెళ్లో ‘సంపాదకుడు’ అనే బలహీనమైన అట్టముక్క వేలాడుతూ ఉంది. ఇంకా పరీక్షగా చూసిన అన్వేషికి అతడి నోటికి వేసిన ‘ప్లాస్టర్’ కనిపించింది.

అన్వేషి తన కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలు ఉపయోగించి అతి జాగ్రత్తగా సంపాదకుడి నోటికి వేసిన ప్లాస్టర్‌ను తొలగించబోయాడు. మరుక్షణం అతడి మీద నలభై చేతులు పడ్డాయి. పిడిగుద్దులతో ఆ గది మార్మోగిపోయింది.


కిరాయి కన్నీళ్ళు(కధ)


ఈజిప్ట్ మూలం:సమీరా అజ్జామ్ 
అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

పరస్పర విరుద్ధమైన ఆ రెండు కళలు ఖానమ్ రక్తంలో ఎలా ఇమిడాయో నాకైతే తెలియదు. పెళ్లి నిశ్చితార్థాల్లోనూ, పెళ్లి మహోత్సవాల్లోనూ పాటలు పాడటంలో ఆమె ఎంత సమర్థురాలో, శవసంస్కారాల్లో గుండెలు బాదుకుంటూ ఏడ్వడంలోనూ ఆమె అంతే ఉద్దండురాలు. ఆమెను చూడటానికి ముందే ఆమె గురించి ‘అన్ని’ విషయాలూ విన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకే మా ఇంటి సమీపంలో ఎవరో టపా కట్టారు. అప్పుడే నాకు ఆమె ‘శోక కళ’ ప్రావీణ్యపు పరిచయ భాగ్యం కలిగింది.

నేను ఆయేషా చేయి పట్టుకుని గుంపు కట్టిన జనంలోంచి దారి చేసుకుని ఆ ఇంటి ముంగిట్లోకి వచ్చేసరికి అక్కడ మాలాంటి ‘ఏమీ తెలియని’ వారెందరో పాడె కడుతున్న దృష్యాన్ని చూస్తూ నిలబడి ఉన్నారు. మేము దూరంలోనే నుంచున్నాం. నిట్టూర్పులు, వెక్కిళ్లు, రోదనలు, గుసగుసలు మా చెవుల్ని తాకసాగాయి. హఠాత్తుగా అక్కడ భూకంపం వచ్చిన అనుభూతి కలిగింది. దబదబ గుండెలు బాదుకుంటూ, ఫ్యాక్టరీ సైరన్‌లాంటి కంఠంతో కేకలు పెడుతూ అక్కడ ఖానమ్ ప్రత్యక్షమైంది. తలుపుల దగ్గర నుంచున్న వారిని అటూ ఇటూ తోసేస్తూ నేరుగా శవం దగ్గరికి చేరుకుంది. తన బురఖా తీసేసింది. జేబలోంచి నల్లటి కరవస్త్రాన్ని తీసి తలకు చుట్టుకుని ఒక్కసారిగా ఆర్తనాదం చేసింది.

అబ్బా! ఆ అర్తనాదపు తాకిడికి నా గుండె గజ గజ వొణికింది. ఆ తర్వాత ఆడవాళ్లను పక్కకు తోసేసి నీళ్ళు నింపిన కుండ దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్ళు తీసుకుని ముఖం మీద చల్లుకుంది. ఆమె మళ్ళీ శవం దగ్గరికి వచ్చేసరికి ముఖానికి పులుముకున్న సురమా, పౌడర్, రోజ్- అంతా నీళ్ళ వల్ల కరిగిపోయాయి. అవన్నీ ఒకదానిలో ఒకటి కలగలసి ముఖమంతా పరుచుకుని భయం గొలిపే చారలు, చారలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ ఒక్క అబ్రా అనే కాదు, ఊళ్లో ఏ పెద్ద మనిషి గుటుక్కుమన్నా అక్కడ ప్రత్యక్షమవుతుంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది.

చనిపోయిన వ్యక్తి బంధువుల సంబంధ బాంధవ్యాలన్నీ గుర్తుకుతెచ్చుకుని మరణించిన వ్యక్తి వాళ్లను ఎలా అభిమానించేవాడో ఆ సంగతులన్నీ సవివరంగా వర్ణిస్తోంది. ఆమె అలా గొంతు చించుకొని ఏడ్వటం- ఆ తర్వాత ఆమెకు లభించే ‘దక్షిణ’ కోసమేనని అక్కడున్న వారందరికీ తెలిసిన విషయమే. అయితే ఖానమ్ అక్కడి శూన్య వాతావరణంలో ఒక విధమైన దుఃఖాన్ని, శ్మశాన సన్నివేశాన్ని సృష్టించడంలో సఫలీకృతమైంది. ఖననాంతరం అలసిసొలసిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించడానికి కంబళి పరిచారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవటానికి చొక్కా చేతుల్ని పైకి మడిచినవారిలో ఖానమ్ అందరికంటే ముందుంది. ‘బిస్మిల్లా’ అంటూ అన్నం ముద్దను గొంతులోకి దించేవారిలోనూ ఆమెయే తొలివ్యక్తి. అంతటితో ఆగకుండా భోజనం ముగించగానే ఆహారపదార్థాలను పార్శిల్ కట్టుకుంటూ ‘నా బిడ్డ మసూదాకు కాసింత పట్టుకెళతాను. చావు కబురు విన్నాక ఆమెకు స్వయంగా వంట చేసుకోవటానికి మనసెలా ఒప్పుతుందో మీరే చెప్పండి? పైగా తిథి భోజనం చేస్తేనే పుణ్యఫలం లభిస్తుంది. ఎంతైనా ఇది ప్రసాదం’ అంది. అక్కడ ఆమె ఉనికి ఎంత అనివార్యమో అప్పుడే నాకు అర్థమైంది.

కొన్నాళ్ళ తరువాత మేము ఒక పెళ్ళికి అతిథులుగా వెళ్ళాం. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే తలుపు దగ్గర నుంచోని స్వాగతం చెప్పేవాళ్ళల్లో అందరికంటే ముందు నుంచున్న వ్యక్తి ఖానమ్. తన ఒత్తయిన జుత్తును రంగురంగుల క్లిప్పులతో అలంకరించుకుంది. నోటినిండా మిఠాయి కుక్కుకుంటూ, గట్టిగా మాట్లాడుతూ, నవ్వులు చిందిస్తూ, భుజాలు తట్టి అందర్నీ పలకరిస్తూ ఎక్కడ చూసినా తనే అన్నట్టు పాదరసంలా తిరుగతోంది. పెళ్ళి మంటపమైనా, శ్మశానవాటికైనా ఖానమ్ దృష్టిలో రెండూ ఒకటేలా ఉన్నాయని నాకు అప్పుడు అనిపించింది. వంటవాడి దగ్గరికి వెళ్ళి వంటకాల్లో ఉప్పు, కారం సరిగ్గా ఉందో లేదో రుచి చూసింది.

అరబ్బుల శాస్త్ర ప్రకారం ‘ఇస్మత్’ (పాతివత్యం) గురించి పాటలు పాడింది. ‘జోడి సలామత్ రహే’ (వధూవరులు నూరేళ్లు సుఖసంతోషాలతో బతకాలి) అని ఆశీర్వదించింది. అందరి నోళ్ళలోనూ ఖానమ్ పేరే!

అవి వేసవి రోజులు. మండే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎక్కడ చూసినా టైఫాయిడ్ జ్వరం వ్యాపించింది. ఖానమ్‌కు ఆ రోజుల్లో శుక్రదశ పట్టినట్టయింది. ప్రతిరోజూ మూడు, నాలుగు చావులకు హాజరై నిర్విరామంగా ఏడవసాగింది. అదృష్టదేవత తలుపుల్ని బార్లా తెరిచింది. ‘మరణం’ ఆమె చేతికి డబ్బు సంచిని అందించింది.

చివరికి ఒక రోజు చావు చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఖానమ్ ఇంట్లో కూడా జొరబడింది. ఆమెకున్న ఒక్కగానొక్క కూతుర్ని టైఫాయిడ్ క్రిములు ఆక్రమించుకున్నాయి. ఖానమ్ రాత్రీపగలూ ‘మిన్నత్’ (మొక్కుబడులు) కట్టుకుంది. దర్గాలకు తిరిగింది. యమపాశం కన్నీళ్ళకు కరగలేదు. ఆ రాత్రి ఖానమ్ తలుపులు తెరిచింది. మృత్యుదేవత ఖానమ్ కూతురు మసూదాను తీసుకెళ్ళింది. తెల్లవారగానే ఈ వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. ‘ఖానమ్ తన ఒక్కగానొక్క కూతురికి ఎలా ‘సోగ్’ (శ్రద్ధాంజలి) ఘటిస్తుందో చూద్దాం’ అని అనుకుంటూ జనం అక్కడికి చేరుకున్నారు.

ఆమె ఒక్కసారి ఆర్తనాదం చేస్తే చాలు, భూమి బ్రద్దలవుతుంది, ఆకాశం విరిగిపడుతుంది అని జనం అనేవారు. ఆ గదిలో సుమారు ఇరవై అయిదు, ముప్ఫయి మంది కూర్చోగలిగినంత స్థలం ఉంది. ఖానమ్ కంఠం ఎక్కడా వినిపించలేదు. నేను కంగారుగా ఆమె కోసం వెతకసాగాను. చివరికి ఆమె కనిపించింది. గదిలోని ఓ మూలలో మౌనంగా కూర్చుని ఉంది. తలకు నల్లవస్త్రాన్ని చుట్టుకోలేదు. చెంపలపై చారలు లేవు. కళ్ళల్లో నీళ్ళు లేవు. కేకలు లేవు. ఆర్తనాదాలు లేవు.

అంతటా భయాన్ని గొలిపే నిశ్శబ్దం...
మొట్టమొదటిసారిగా అనాధ భావనతో అలసిపోయిన ఖానమ్‌ను చూశాను. ఒట్టి అనుభవాల ముద్ద. కాలిగోటి నుంచి తలముడి వరకు శోకమే రూపుదాల్చిన మూర్తిలా కనిపిస్తోంది. బాధ వల్ల, గర్భశోకం వల్ల మూగదైన, మౌనియైన వ్యక్తిని చూశాను. అణువణువూ మౌనం నింపుకున్న ఆ స్త్రీని చూసి భయం కలిగింది. కొందరు వెక్కి వెక్కి ఏడ్వసాగారు. ఖానమ్ వారి వేపు మెరుపులా తిరిగి గుర్రుగా చూసింది. శవాన్ని ఎత్తటానికి మనుషులు వచ్చారు. ఖానమ్ గుండెలు బాదుకోలేదు. శవవాహకులకు అడ్డుపడలేదు. ఏడవలేదు. ఆర్తనాదాలు చేయలేదు. పెడబొబ్బలు పెట్టలేదు. నిశ్శబ్దంగా నుంచుంది. మౌనంగా వాళ్లను అనుసరించింది. ఈ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నారు.

‘కడుపుకోత వల్ల పిచ్చిదయిపోయింది’, ‘అవును, పిచ్చిదై మూగదైంది’, ‘కూతురి కోసం ఖర్చు పెట్టడానికి ఆమె దగ్గర కన్నీరు ఎక్కడుంది?’
అంతలో ఆయేషా ఇలా అంది-
‘ఖానమ్ దగ్గర కిరాయి కోసం కన్నీళ్లు దొరికేవి. ప్రతి కన్నీటిబొట్టుకూ లెక్కగట్టి కిరాయి వసూలు చేసుకునేది. అయితే ఇప్పుడు చనిపోయింది మసూదా. ఆమె కన్న కూతురు. ఆమె కన్నీళ్లకు కిరాయి ఇవ్వగలరా?’

సమీరా అజ్జామ్
ఈజిప్ట్ కథా క్షేత్రానికి కొత్త మలుపును చూపిన సమీరా అజ్ఞామ్ పాలస్తీనాలోని అక్రెలో 1927లో జన్మించారు. యూనివర్శిటీ విద్య అభ్యసించకపోయినా స్వయంకృషితో విజ్ఞానాన్ని సముపార్జించారు. ‘ఫతల్-ఆల్-సహేల్’ కలం పేరుతో పత్రికలకు రివ్యూలు, కథలు రాయటం మొదలుపెట్టారు. 1948 నుంచి 1967లో కారు ప్రమాదంలో మరణించేదాకా ఆమె రాస్తూనే ఉన్నారు. జీవితాన్ని, జీవితంలోని అనేక కోణాల్ని అత్యంత సూక్ష్మంగా చూడటం వల్ల సహజంగానే ఆమె కథల్లో వ్యంగ్యం తొంగి చూస్తూ ఉంటుంది. రెండు నవలలు, నాలుగు కథాసంపుటలను వెలువరించారు.

17, జులై 2011, ఆదివారం

జగమెరుగని ఝాన్సీరాణి

జగమెరుగని ఝాన్సీరాణి

కొందరు నేతలు ఆకాశంలో ఉల్కల్లా కాంతివంతంగా ప్రకాశించి నేల రాలిపోతారు. వీరు జీవించేది అతి కొద్ది కాలమే అయినా ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోతారు. చరిత్ర కూడా వీరికి ఒక సుస్థిర స్థానం కల్పిస్తుంది. ఇలాంటి వారిలో ఝాన్సీ లక్ష్మిబాయి ఒకరు. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడటం విధి వైచిత్రి అనే చెప్పాలి. 14 ఏళ్లకు పెళ్లి.. 18 ఏళ్లు నిండకుండానే భర్త మరణం.. మధ్యలో అస్వతంత్ర జీవనం.

ఆ తర్వాత బ్రిటిష్‌వారిపై పోరాడుతూ వీరమరణం పొం దటం.. ఇవన్నీ 23 ఏళ్ల జీవితం లోనే ముగిసిపోయాయి. 1857 నాటి పరిస్థితుల గురించి.. లక్ష్మీబాయి జీవితం గురించి విష్ణుభట్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇటీవల ఇంగ్లీషులోకి అనువదించారు. దాని నుంచి- లక్ష్మిబాయి జీవితంలోని ముఖ్య మలుపులు.. ఘట్టాలు మీ కోసం అందిస్తున్నాం..

"ఝాన్సీకి వెళ్లాలనుకున్న తర్వాత నాకు రాము మామ చెప్పిన అనేక విషయాలు గుర్తుకువచ్చాయి. రాము మామ చెప్పిన సమాచారం ప్రకారం- ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పదిహేను లక్షల దాకా ఉంటారు. దేశంలోని అతి పటిష్ఠమైన కోటల్లో ఝాన్సీ కోట కూడా ఒకటి. పూణేలో పేష్వాలు బలహీనపడిన తర్వాత గ్వాలియర్ మాదిరిగానే ఝాన్సీ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఝాన్సీని పాలించిన రాజులలో చాలామందికి పిల్లలు లేరు. హిందూ సమాజంలోని ఉన్నత కులాల వారి మాదిరిగానే వారు కూడా మగపిల్లలను దత్తత తీసుకొనేవారు. మహారాజు మరణించిన వెంటనే అతని దత్తత కుమారుడు పరిపాలన చేపట్టేవాడు.

ఝాన్సీ మహారాజు గంగాధరరావు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాపిల్లలు పుట్టలేదు. మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలనే గంగాధరరావు అభిమతానికి బ్రిటిష్ పాలకులు అడ్డుపుల్ల వేశారు. అతను పెట్టుకున్న దరఖాస్తులకు కలకత్తాలోని గవర్నర్ జనరల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు లేరనే బాధతో గంగాధరరావు మరణించాడు. అతని భార్య లక్ష్మీ బాయి ఒక పన్నెండేళ్ల కుర్రాడిని దత్తత తీసుకుంది. బ్రిటిష్ పాలకులు ఆ దత్తతను కూడా చట్టబద్ధం చేయటానికి అంగీకరించలేదు. ఈ లోపులో సిపాయి తిరుగుబాటు జరిగింది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ బాయే పగ్గాలు చేపట్టింది...అసలేం జరిగిందంటే..''

పెరిగింది ఇలా..
రాము మామకు లక్ష్మీబాయి వాళ్ల నాన్న రాజశ్రీ మోరోపంత్ తాంబే బాగా తెలుసు. బిత్‌పూర్‌లో ఒక పెద్ద యాగశాల ఉంది. పిల్లలకు వేదం కూడా నేర్పుతూ ఉంటారు. రాము మామ ఈ యాగశాలకు అధిపతిగా ఉండేవాడు. ఆయన వచ్చేసిన తర్వాత మోరోపంత్ అధిపతి అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. దీనితో ఒకే ఒక బిడ్డ అయిన ఛాబిలీని అల్లారుముద్దుగా పెంచుతూ ఉండేవాడు. ఛాబిలీ చూడటానికి చాలా అందంగా ఉండేది.

తల్లి బతికి ఉంటే- ఛాబిలీని అసలు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదేమో! ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల - ఛాబిలీ కూడా తండ్రిలాగానే ఉదయాన్నే యాగశాలకు వచ్చేసేది. అక్కడే ఆడుకునేది. అక్కడే తినేది. మధ్యాహ్నం నిద్ర వస్తే అక్కడే పడుకొనేది. చుట్టూ ఉన్నది మగపిల్లలే కావటంతో, వారితోనే ఆడేది. చదవటం, రాయటంతో పాటు ఆమె విలువిద్య, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చుకుంది. అలా చూస్తుండగానే- ఛాబిలీకి పన్నెండేళ్లు వచ్చేశాయి. మోరోపంత్ ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఛాబిలీ జాతకం ఎవరికీ నప్పేది కాదు. దీనితో అనేక మంది వెనక్కి వెళ్లిపోయారు. అంతే కాకుండా- బాగా చదువుకున్న తన కూతురును పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి ఇష్టం లేదు.
సరిగ్గా అదే సమయంలో గంగాధర రావు భార్య చనిపోయింది. అతను మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరి జాతకం అతనికి నప్పలేదు. మరి కొందరు అతని గురించి వచ్చిన వదంతులకు భయపడ్డారు. ఈ వదంతుల ప్రకారం-

కొన్ని సార్లు గంగాధరరావు తన దర్బారు నుంచి నేరుగా రాణివాసానికి వెళ్తాడు. అక్కడ మగ దుస్తులను వదిలేసి, పట్టుచీర, పావడా కట్టుకుంటాడు. చేతికి గాజులు వేసుకుంటాడు. ముక్కుకు పుడక పెట్టుకుంటాడు. కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో కేవలం ఆడవాళ్లతోనే మాట్లాడతాడు. మగవారితో మాట్లాడడు. అంతే కాకుండా నెలలో నాలుగు రోజులు మైల ఉందని- విడిగా ఒక గదిలోకి వెళ్లిపోతాడు. (మహిళలకు రుతుస్రావం అయినట్లు). ఆ సమయంలో దర్బారుకు రాడు. నాలుగవ రోజు స్నానం చేసి..పూజలు చేసిన తర్వాతే తిరిగి దర్బారుకు వస్తాడు. ఈ సమయంలో గోర్డన్ సాహెబ్ అనే అధికారి బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండేవాడు. గంగాధరరావు గురించి వచ్చిన వదంతులు ఆయనకు కూడా చేరాయి. గోర్డన్ సాహెబ్ ఒకసారి గంగాధరరావును కలిసాడు. "నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. మీరు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.

మీ తాతలు, తండ్రులు చాలా గొప్పవారు. అలాంటి వంశంలో పుట్టిన మీరు సంప్రదాయాలన్నింటిని వదిలేసి- ఆడవాళ్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? నెలకు నాలుగు రోజులు మైలను ఎందుకు పాటిస్తున్నారు. మీకు ఒక అమ్మాయిగా మసలటం ఇష్టమయి ఇలాంటి పని చేస్తున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా?'' అని అడిగాడు. "నేనో చిన్న రాజ్యానికి రాజును కావచ్చు. కాని పెద్ద పెద్ద రాజ్యాలను పాలించే నా సోదర రాజులు సైతం ఏడు సముద్రాల అవతల నుంచి వచ్చిన మ్లేచ్ఛుల నియంత్రణలోకి వెళ్లిపోయారు. వారి రాజ్యంపైన వారికి అధికారం లేదు. ప్రజల దగ్గర నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించే అధికారం లేదు. మేమందరం స్వేచ్ఛను పోగొట్టుకొన్నాం. నిస్సహాయులుగా జీవిస్తున్నాం.

ఒక మహిళ ఎంత భయం భయంగా బతుకుతుందో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. అందుకే నేను కూడా ఒక మహిళలా గాజులు వేసుకుంటున్నా..నాలుగు రోజులు విడిగా కూర్చుంటున్నా..'' అని సమాధానమిచ్చాడు. మోరోపంత్ ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట విన్నాడు. గంగాధరరావు తొలి భార్యకు ఒక బిడ్డ పుట్టి చిన్నప్పుడే చనిపోయాడు. అందువల్ల గంగాధరరావు మగవాడు కాకపోయే అవకాశం లేదని మోరోపంత్ భావించాడు. గంగాధరరావు ప్రవర్తన ఎలా ఉన్నా రాజ్యపాలన మాత్రం బావుండేది. దీనితో గంగాధరరావుకు ఛాబిలీని ఇచ్చి పెళ్లి చేయటానికి మోరోపంత్‌కు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. గంగాధరరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారితో ఈ విషయం చెప్పాడు.

అనుమానపు మొగుడు..
మోరోపంత్ అనే పురోహితుడి కుమార్తె చాలా అందంగా ఉంటుందని..ఆమెకు పెళ్లి చేయటానికి సంబంధాలు వెతుకుతున్నారని కొందరు మధ్యవర్తులు గంగాధరరావుకు చెప్పారు. వెంటనే గంగాధరరావు తన మనుషులను మోరోపంత్ దగ్గరకు పంపాడు. తనకు కన్యాశుల్కం అక్కరలేదని.. అయితే పెళ్లి ఖర్చులన్నీ గంగాధరరావే పెట్టుకోవాలని మోరోపంత్ షరతు విధించాడు. దీనికి గంగాధరరావు అంగీకరించాడు. గంగాధరరావు, ఛాబిలీల పెళ్లి ఝాన్సీలో ఘనంగా జరిగింది. అప్పుడే ఛాబిలీలి పేరు లక్ష్మిబాయిగా మారింది.

లక్ష్మిబాయి సంసారం మొదటి నుంచి అంత ఆనందంగా గడవలేదు. గంగాధరరావుకు తన కన్నా చాలా చిన్నదైన లక్ష్మిబాయిపై అనుమానం ఎక్కువ. దీనితో ఆమెను రాణివాసం నుంచి కూడా బయటకు రానిచ్చేవాడు కాడు. పడకగదిలోనే ఉంచి తాళం పెట్టేవాడు. మగవాళ్లు ఎవరూ ఆమె మహలు వైపు కూడా చూడటానికి వీలులేకుండా కొందరు మహిళా సైనికులను కాపలా పెట్టాడు. ఇంత కట్టుదిట్టం చేయటం వల్ల లక్ష్మిబాయి మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిగా ఉండటం కన్నా అబ్బాయిగా పుడితేనే మేలని భావించేది. చిన్నప్పుడు స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగిన రోజులు ఆమెకు గుర్తుకువస్తూ ఉండేవి. దీనితో ఆమె కొన్ని సార్లు మగవాళ్ల బట్టలు వేసుకుంటూ ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే గంగాధరరావు అనారోగ్యం పాలయ్యాడు. మరణశయ్యపై నుంచి గోర్డన్ సాహెబ్‌కు కబురుపెట్టాడు. "నా భార్య ఇంకా యుక్తవయస్సులో ఉంది. పిల్లలు లేరు.

అందువల్ల మా బంధువుల పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటానికి అంగీకరించండి..'' అని అడిగాడు. గంగాధరరావు అంటే గోర్డన్ సాహెబ్‌కు కొంత సానుభూతి ఉంది. దీనితో అతను కలకత్తాలో ఉన్న తనపై అధికారులకు విషయాన్ని వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. కానీ కలకత్తాలో అధికారుల వ్యూహం మరోలా ఉంది. "గంగాధరరావుకు పిల్లలు లేరు. అందువల్ల ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధ్యతలు చేపట్టండి'' అని కలకత్తా నుంచి సమాధానమొచ్చింది. ఇక చేసేదేమీ లేక- గోర్డన్ సాహెబ్ ఝాన్సీ సామ్రాజ్యాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలో గంగాధరరావు మరణించాడు. గోర్డన్ సాహెబ్ మాత్రం లక్ష్మిబాయి పట్ల సానుభూతితోనే వ్యవహరించాడు. కోటలో కొద్ది భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. గంగాధరరావు వదిలి వెళ్లిన సంపదను కూడా ఆమెకే వదిలేసాడు.

అన్నీ అడ్డంకులే..
భర్త చనిపోయిన కొద్ది కాలానికి లక్ష్మిబాయి-తాను ఒక బ్రాహ్మణ వితంతువులా జీవితాన్ని సాగించాలనుకుంది. గుండు చేయించుకొని వితంతువుగా మారటానికి కాశీ, ప్రయాగ పుణ్యక్షేత్రాలకు వెళ్లటానికి అనుమతి ఇవ్వమని గోర్డన్ సాహెబ్‌కు అర్జీ పెట్టుకుంది. దీనిని కూడా బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. స్వతహాగా లక్ష్మిబాయి చాలా తెలివైంది. బ్రిటిష్‌వారి నుంచి తనకు వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలంటే మగపిల్లవాడిని దత్తత చేసుకోవటం తప్పనిసరని గ్రహించింది. ఒక పిల్లవాడిని దత్తత తీసుకొనే విషయమై బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. 1857 మే నాటికి దేశ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి.

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తారనే వార్తలు దావానలంలా వ్యాపించటం మొదలుపెట్టాయి. దీనితో బ్రిటిష్ పాలకులు- సంస్థానాధీశులపై పట్టుబిగించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్ష్మిబాయి పెట్టుకున్న దత్తత అర్జీలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆమెకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా నిలుపుచేశారు. ఈ పరిస్థితుల్లో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కొందరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీనితో ఝాన్సీ కంటోన్మెంట్‌లో నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారులకు వణుకుపుట్టింది. ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని బ్రిటిష్ అధికారులు గమనించారు. తమకు సాయం చేయమని లక్ష్మిబాయిని కోరారు.

జూన్ 8, 1857..
ఝాన్సీ కంటోన్మెంట్ అంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. అప్పటికే మీరట్‌కు చెందిన సైనికులు క్రమంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల అభిమానాన్ని పొందటానికి బ్రిటిష్ వారికున్న ఏకైక మార్గం సంస్థానాధీశులను మంచి చేసుకోవటం. ఝాన్సీ సంస్థానంలో ఉన్న ప్రాంతాలన్నిటి పరిపాలనను లక్ష్మిబాయికి అప్పచెబుతున్నామని.. ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వచ్చే 25 లక్షల రూపాయల ఆదాయాన్ని ఇకనుంచి ఆమే అనుభవించవచ్చంటూ గోర్డన్ సాహెబ్ లక్ష్మిబాయికి ఒక వర్తమానాన్ని పంపాడు.

రాజ్యంలో ప్రశాంతత ఏర్పడేవరకూ ఆమే సర్వాధికారిణి అని..అయితే బ్రిటిష్‌వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆమె గోర్డన్ సాహెబ్, ఇతర బ్రిటిష్ అధికారులకు రక్షణ కల్పించాలనే షరతు కూడా ఆ వర్తమానంలో ఉన్నాయి. దాన్ని చదివిన లక్ష్మిబాయికి విపరీతమైన కోపం వచ్చింది. "నన్ను ఒక రాణిగానే మీరు గుర్తించలేదు. కలకత్తాలో జరిగిన రాజ్యాధీశుల సమావేశానికి పిలవలేదు. నా భర్త చివరి కోరికగా- ఒక బిడ్డను దత్తత తీసుకుంటానంటే అంగీకరించలేదు. నేను కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి, ఇవన్నీ ఇస్తున్నారా? మిమల్ని దయతో మా దగ్గర ఉంచుకోవాలా? బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన సైనికులు దీనికి అంగీకరిస్తారా? మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారని తెలిసిన తర్వాత వాళ్లు మమ్మల్ని వదులుతారా? '' అని అవేశంగా మధ్యవర్తిని ప్రశ్నించింది. బ్రిటిష్ వారి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది..

అర్థరాత్రి అయింది. అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు. చీకటి మాటున గోర్డన్ సాహెబ్ ఒంటరిగా రాణిమహల్‌కు వచ్చాడు. "నా భార్యకు ఏడోనెల. బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. బ్రిటిష్ ప్రజలు కనిపిస్తే చంపేస్తున్నారు. కంటోన్మెంట్‌లో సిపాయిలు రేపు తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మీరు రక్షణ ఇవ్వకపోతే- మా ప్రాణాలకు ముప్పు తప్పదు. నా భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడండి..'' అని లక్ష్మిబాయిని వేడుకున్నాడు. లక్ష్మిబాయి మనసు కరిగింది. మహిళలకు, పిల్లలకు రక్షణ ఇవ్వటానికి అంగీకరించింది. మర్నాడు ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ అధికారుల భార్యలు, పిల్లలు రాణివాసానికి రహస్యంగా వచ్చేశారు.

జూన్ 9, 1857..
ఉదయం పది అయింది. ఒక్క సారి పెద్ద అల వచ్చినట్లు.. సైనికులందరూ రోడ్ల మీదకు వచ్చారు. సైనిక క్యాంపును కాపలా కాస్తున్న బ్రిటిష్ అధికారులను విచక్షణారహితంగా చంపేశారు. క్యాంపుకు నిప్పు అంటించారు. ఆ తర్వాత సైనికులందరూ రాణివాసం దగ్గరకు వచ్చారు. "మీరే మాకు సర్వ సైన్యా«ధ్యక్షురాలు. మీ ఆదేశాలు మేం పాటిస్తాం..'' అని పెద్దగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సైనిక దుస్తుల్లో రాణి లక్ష్మిబాయి వారి ముందుకు వచ్చింది. "పెద్ద యుద్ధం ఇంకా ముందు ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే శత్రువును తరిమి తరిమి కొట్టగలుగుతాం..'' అంటూ ప్రసంగించింది లక్ష్మీబాయి. ఝాన్సీ ప్రాంతానికి తాను రాణిగా పాలనాబాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయుధాల కర్మాగాలన్నింటిలోను ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికులకు బ్రిటిష్‌వారు తగ్గించిన వేతనాలను తిరిగి పెంచుతున్నట్లు ప్రకటించింది.

పరిపాలన షురూ..
రాణి లక్ష్మిబాయి చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేది. వ్యాయామం పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. పెళ్లి అయిన తర్వాత భర్త పెట్టిన నిబంధనల వల్ల వ్యాయామం మానేసినా భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వ్యాయామం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి కొద్ది సేపు కుస్తీ పట్టేది. ఆ తర్వాత బరువులు ఎత్తేది. ఈ రెండూ పూర్తయిన తర్వాత గుర్రపు స్వారీ చేసేది. గుర్రపు స్వారీలో అనేక రకాల విన్యాసాలు ప్రదర్శించేది. వేగంగా వెళ్తున్న గుర్రం మీద నుంచి గోడల మీదకు దూకేది. అక్కడ నుంచి కందకం సైతం దాటి బయటకు దూకేది. ఒక్కోసారి సుగంధద్రవ్యాలతో రెండు మూడు గంటలు స్నానం చేసేది.

ఆమె స్నానం కోసం పదిహేను నుంచి ఇరవై పెద్ద పెద్ద గుండిగలతో నీళ్లను కాచేవారు. స్నానం తర్వాత తెల్లని చందేరీ పట్టు చీరను కట్టుకొనేది. కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు బ్రిటిష్ పాలకులు అంగీకరించకపోవటంతో- లక్ష్మిబాయి తన శిరోజాలు తీయించుకోలేదు. శాస్త్ర ప్రకారం- శిరోజాలు తీయించుకోని విధవరాలు - కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్ప భగవంతుడిని పూజించకూడదు. అందువల్ల ప్రతి రోజు లక్ష్మిబాయి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ తర్వాత శివప్రార్థనకు ఉపక్రమించేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఆమె కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనేది. కొన్నిసార్లు ఆమె దర్బారుకు మగదుస్తులలో వచ్చేది. పంచె, పైన కోటు, కుచ్చుతలపాగా పెట్టుకొనేది. నడుముకు బంగారు ఎంబ్రైడరీ చేసిన గుడ్డ కట్టుకొనేది. దానికే కత్తి వేళ్లాడుతూ ఉండేది. కొన్ని సార్లు ఆమె ఆడవేషంలో కూడా దర్భారుకు వచ్చేది. భర్త మరణం తర్వాత లక్ష్మిబాయి ముక్కుపుడక పెట్టుకోవటం మానేసింది.

మట్టి గాజులు వేసుకోవటం మానేసి- బంగారు గాజులు మాత్రమే ధరించేది. మెడచుట్టూ ఒకే వరస ఉన్న ముత్యాలు, చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకొనేది. నాకు తెలుసున్నంత వరకూ ఆమె ఎప్పుడూ ఇతర ఆభరణాలు ఏమీ ధరించలేదు. ఆమె జుట్టును గుండ్రంగా చుట్టుకొనేది. కొన్ని సార్లు జడ కూడా వేసుకొనేది. ఆమె దర్బార్ హాలులో కూర్చున్నప్పుడు తెల్ల శాలువాను నెత్తి మీద నుంచి కప్పుకొనేది. రాజ ప్రధాని లక్ష్మణ రావు ఆమె ముందు నిలబడి ఉండేవాడు. ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఆమె జారీ చేసిన ఆదేశాలను నమోదు చేస్తూ ఉండేవారు. లక్ష్మిబాయి ఏ వివాదాన్నయినా చాలా సులువుగా పరిష్కరించేది. కొన్నిసార్లు నేరస్తులను ఆమే స్వయంగా కర్రతో కొట్టేది.

చూడటమే వేడుక..
లక్ష్మిబాయి గుర్రపు స్వారీని గాని, రథయాత్రను గాని చూడడం ఒక వేడుక. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆమె ర«థాన్ని రెండు వైపులా బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ కర్టెన్లతో మూసేసేవారు. మెరిసిపోయే ముత్యాల సెట్‌తో పాటు అందమైన పట్టుచీర కట్టుకొనేది. మగబట్టలు కట్టుకున్నప్పుడు తలపాగ తప్పనిసరిగా ఉండేది. ఆమె రథంతో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు పక్కన పరిగెడుతూ ఉండేవారు. వీరికి చిన్నతనం నుంచి రాణి పక్కన రథంతో పాటు పరిగెత్తటాన్ని శిక్షణ ఇచ్చేవారు. సాధారణంగా వీరు దక్షిణభారతదేశానికి చెందినవారై ఉండేవారు.

అందమైన ఈ అమ్మాయిలు ఒక చేతిలో బంగారపు కర్రలు, మరో చేతిలో బంగారపు విసనకర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే- వారిని చూడటానికి వందలమంది గుమిగూడుతూ ఉండేవారు. రథం ముందు కొందరు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉండేవారు. వెనక దాదాపు రెండు వందల మంది సైనికులు నడుస్తూ ఉండేవారు. వీరందరితో పాటు - రథం వెనక ప్రధానితో సహా అనేక మంది ముఖ్యాధికారులు కూడా ఉండేవారు. లక్ష్మిబాయి గుర్రం స్వారీ చేసేటపుడు ఇంత ఆర్భాటం ఉండేది కాదు. కొద్దిమంది అధికారులు, సైనికులు మాత్రమే ఆమె వెంట ఉండేవారు. రాత్రి అయితే ఆమెకు దారి చూపించటానికి కాగడాలను మోసేవారు కూడా ఉండేవారు. కాని చాలాసార్లు లక్ష్మిబాయి వారిని దాటి చీకట్లోనే కోటలోకి వెళ్లిపోయేది.

వందేళ్లకు ఇంగ్లీషులోకి...
విష్ణుభట్ గాడ్సే అనే చిత్‌పవన్ బ్రాహ్మణుడు బొంబాయి సమీపంలోని వార్సాయ్‌లో నివసిస్తూ ఉండేవాడు. కడు పేదవాడు. ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద యాగం జరుగుతోందని తెలిసి కొంతమందితో కలిసి అక్కడికి బయలుదేరి వెళతాడు. ఇంతలో సిపాయి తిరుగుబాటు మొదలవుతుంది. విష్ణుభట్ బృందం ఆ జ్వాలల్లో చిక్కుకుపోతుంది. ఒక పక్క బ్రిటిష్ సేనలు మరోపక్క భారతీయ సైనికులు వాళ్లందరిని తప్పించుకుంటూ ఆయన మో నుంచి ఢిల్లీ దాకా అనేక ప్రాంతాలు తిరిగాడు. 1857-58 మధ్య కొన్ని నెలల పాటు ఝాన్సీ కోటలో పురోహితుడిగా ఉన్నాడు.

లక్ష్మీబాయిని బ్రిటిష్ వాళ్లు చంపేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా బతుకుతెరువు కోసం ప్రయత్నించి చివరికి నిరాశతో స్వగ్రామం చేరుకున్నాడు. తాను ఉత్తరభారత దేశంలో చూసిన సంఘటనలన్నిటితోను మరాఠీలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మజాప్రవాస్: 1857 చా బండాసి హకీకత్ (నా ప్రయాణాలు: 1857 తిరుగుబాటు కథ). ఈ పుస్తకాన్ని ఆయన దాదాపు 30 ఏళ్ల తర్వాత రాస్తే అది అచ్చయి బయటికి వచ్చింది. 1907లో దానిలో ఝాన్సీ సంస్థానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు- విష్ణుభట్ స్వయంగా చూసినవి. మరికొన్ని వాళ్లు వీళ్లు చెప్పగా విన్నవి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇంగ్లీషులోకి అనువదించారు.

అనువాదం : సివిఎల్ఎన్ ప్రసాద్ 

ఉర్సు (కధ)

ఉర్సు

ఉరుకురికి ఇమ్లిబన్ బస్‌స్టాండ్ చేరుకుని, నల్గొండకు టికెట్ తీస్కొని బస్కెక్కి కూసున్న. బస్సుతోపాటు నా ఆలోచనలు గుడ కదిల్నయ్. ఇప్పట్కె లేటైంది. మా చెల్లెండ్లు గయ్యిమంటరు. మమ్ముల 8 గంటలకె గుట్ట కాడ ఉండాలని గట్టిగ చెప్పి, నువ్వేమో ఇప్పుడా వచ్చేది అని కస్సుమంటరు.?

నల్గొండ పోతున్నమన్నా, నల్గొండ మదిల మెదిలినా ముందుగాల ఆ రెండు గుట్టలె యాది కొస్తయ్. టౌనంత ఆ గుట్టల ముందల, మద్యల్నె ఉండటం గమ్మత్తు. అందుల ఒక గుట్ట - లతీఫ్ షా వలి పహాడ్ - లతీఫ్ సాబు గుట్ట. ఆ గుట్ట మీద లతీఫ్ షా వలి దర్గా ఉండబట్టి ఆ పేరొచ్చింది. ఎత్తైన గుట్ట. ప్రతి ఏడాది అక్కడ ఉర్సు సాగుతది. గుట్ట ముందంతా తిరునాల.. జాతర.. సందడే సందడి. పిల్లలకు పండగ. పెద్దలకు ఉర్సుకు రావడం.. గుట్ట ఎక్కడం ఒక రివాజు.. ఒక రిలీఫ్.
ఉర్సు అనంగనె అందమైన రుక్సానా యాదికొస్తది. కండ్లల్ల ఆ రూపం నిండి కన్నీళ్లతో పాటు ఒలికిపోతది. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ చంపేస్తది. బస్సు దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌ల ఆగి మల్ల కదిలింది.

చిన్నప్పుడు ఉర్సు కోసం ఎంత ఎదురుచూసేదో.. ఉర్సు వస్తుందంటె మనసు ఉరకలేసేది. రెండు మూడు రోజుల ముందే పొద్దుటి పూట మా ఊర్లెకు గుట్ట మీద సున్నం వేసిన మెట్లు మబ్బుల్లకు దారేసినట్లు కనిపించేవి. రాత్రి పూట మెట్లెంట వేసిన లైట్లు పూల జడ మాదిరి కన్పించేవి. ఎప్పుడెప్పుడు శుక్రారం వస్తదా.. జనంల పడి రంగుల నవ్వుల్ల పడి గుట్ట మీదికి పతంగి లెక్క ఎగరాల్నా అని మనసు ఉరకలేసేది. బేస్తవారం నాడు పొద్దుగూకేసరికి అందరం తయారై గుట్టకాడికి చేరుకునేది. అయాల సందల్. లతీఫు సాబుకు సందల్ (గంధం), చాదర్ (పూల దుప్పటి) వగైరా ఎక్కిస్తరు. గుట్ట ముందంత జనం కిటకిటలాడేది. పెద్దోల్లల్ల ఆడోళ్లంతా గుట్ట దామన్‌ల (దాపున) కూసునేది.

మగోళ్లు పిల్లలకు తిర్నాలల ఏమన్న కొనిస్తానికి పొయ్యేది. కొద్దిగ పెద్దగున్న పిల్లలు సావాసగాళ్లతోని తిర్నాల గల్లీలన్నీ తిరుగుతుండేది. ఎన్నిరకాల బొమ్మలో.. ఎన్నెన్ని మెరుపులో! బొమ్మల్ని దాటి కొద్దిగ వయసు పెరిగితె.. కళ్లద్దాలు.. బెల్టులు.. టోపీలు.. తీరు తీర్ల సోకులబడే సామాను. ఆడపిల్లలకైతె ఎక్కడ్లేని వింతలు. చిన్నపిల్లల తర్వాత ఆడపిల్లల సామానె ఎక్కువుండేది. వో..! ఝుంకాలు, ముక్కుపుల్లలు.. తీరొక్క గొలుసులు.. ఉంగరాలు.. అరష్ - కాజల్ - సుర్మా డబ్బాలు.. గాజులు.. చెప్పులు.. బర్ఖాలు.. బట్టలు..! అసలు అదొక రంగుల లోకం.. ఆ రంగుల్లో తీరొక్క బుగ్గలమై తేలిపొయ్యేది.

జామ్ మజీద్ నుంచి సందల్ ఊరేగింపుగా వచ్చేది. ఆ సమయం దగ్గర పడుతుంటె గుట్ట ముందంతా జనం కిటకిటలాడిపొయ్యేది. గుట్ట మీదికి పొయ్యే దారికి అటూ ఇటూ తాళ్లు పట్టుకుని పోలీసోళ్లు నిలబడ్డా దారి మీదికి తోసుకొస్తుండేది. ముందంత మగవాళ్లు ఎక్కువగా తెల్లని బట్టల్లో, ఆ తరువాతి వరుసలంతా ఆడవాళ్లు నల్లని బుర్ఖాలు.. పిల్లలంతా తల్లిదండ్రుల చేతుల్లో.. సందల్ ఊరేగింపు తొలి కమాన్ కాడికొచ్చేసరికి జనం సముద్రపు అలల్లెక్క కదిలేది. తొలిమెట్టు కాన్నుంచి సందల్ ముందుకెళ్లడమే కష్టం గుండేది. ప్రతి ఒక్కరు సందల్ ముట్టుకొని కళ్ల కద్దుకోవాలని ఆరాటం. పిల్లల నుదుటికి అద్దాలని తోపులాట.. ఓఫ్.. ఆ దృశ్యమంతా చూస్తేనె మజా.
బస్సు హయత్‌నగర్ బస్టాండ్‌ల నిలబడ్డది. డ్రైవర్‌కు చెప్పి కొద్దిగ రోడ్డుమీదికి పొయ్యి ఒక చాయ్ తాగిన. మల్ల వచ్చి కూసున్న. బస్సు కదిలింది.

నాకు ఉర్సు అనంగనె నల్లని బుర్ఖాలె మదిల మెదుల్తయ్. బహుశా వయసొచ్చిన తొలినాళ్లలో ఆ బుర్ఖాల వెంటపడ్డందుకె కాబోలు. డిగ్రీ రెండో సంవత్సరంల వచ్చిన ఉర్సులనె ఎదురుపడ్డవి ఆ కళ్లు. చంద్రగోళాల్లాంటి ఆ కళ్లు. చుట్టూ నల్లటి మబ్బుల మధ్య అందమైన కళ్లు. తెల్లని ఒంటి రంగు నడుమ, నల్లని కాటుక మధ్య, తెల్లని కళ్లు. మధ్యలో నల్లని కనుపాపలు. నన్నెంత ఆకర్షించాయో.. వాటి వెంట నేను పడ్డనో అవి నా వెంట పడ్డ్డాయో తెలియదు. కాని ఒకరికి తెలియకుంట ఒకరం మళ్ల మళ్ల ఎదురుపడ్డం. పడ్డప్పుడల్లా పరిచయస్తుల్లెక్కనె ప్రేమగ చూసుకున్నయ్ మా రెండు జతల కళ్లు.

ఇగ అది మొదలు - ఆ ఉర్సు సాగిన వారం పది రోజులు.. రోజు టంచనుగ గుట్ట కాడికెళ్లడం,సైకిల్ పక్కన పెట్టి ఆ తిరునాల దుక్నాల మద్యన తిరుగడం. కొనేదేమీ లేకున్నా ఏదో కొనేటోడి లెక్కనె వెతుకుతూ తిరిగేది. కొనే వస్తువు కోసం కాదు, ఆ కమ్మని రుచినిచ్చే కళ్ల చూపుల్ని తాగడానికి. ఆ కళ్ల నవ్వుల్లో తేలిపోవడానికి. చివర్లో షాపులొక్కొక్కటి ఎత్తేస్తుంటే ఆ రోజు కష్టపడి అడగనే అడిగిన - "ఏం పేరు?'' అని. "రుక్సానా'' అని చెప్పింది. ఏం చదువుతున్నవంటె ఇంటర్ సెకండియర్ అని చెప్పింది. నా పేరు 'యూసుఫ్' అని చెప్పిన. పక్కన సహేలీలు జోకులేస్తు కిల్లున నవ్వు తున్నరు. ఏ కాలేజి, మిగతా వివరాలడిగిన. ఆఖరికి 'కొద్దిగ ఆ నఖాబ్ తొలగించరాదూ.. మొఖమన్న చూస్త' అని బతిలాడిన. 'కల్ మిలేంగే' అని వెళ్లిపోయింది.
నా గుండెలే అంత ఊటగ కొట్టుకుంటున్నయంటె ఆ పిల్ల గుండెలు మరెంత కొట్టుకున్నయో అనుకొన్న. అయాల రాత్రి నిద్దర పట్టలె. ఎప్పుడు తెల్లార్తదా.. ఎప్పుడు పొద్దు గూకుతదా.. అని ఒకటె ఆరాటం.

అయాల నా బలవంతం మీద ఒక సహేలీని బతిలాడుకొని దుకాణాలను దాటి కొద్దిగ గుట్ట పైకి మెట్ల పక్కకు.. వచ్చి బండరాళ్ల సాటున కూసున్నది. వాళ్ల వెనక నడుచుకుంట వెళ్లి పక్కన కూసున్న.
"ఇప్పుడన్నా నఖాబ్ తీయరాదూ!'' అన్న.
ముడి విప్పి నఖాబ్ తొలగించింది రుక్సాన. పండువెన్నెల జాబిల్లి లెక్క మెరిసింది ఆ మోము. 'వాహ్!' అనుకోకుండ ఉండలేకపోయ్‌న. "కైసీ హూఁ?'' అన్నది నవ్వుకుంట.
"ఆకాశంలో చాంద్ మాయమై ఇక్కడ తేలినట్లుంది'' అన్న. నవ్వు వెన్నెల మళ్లీ కురిసింది. అట్లా అర్ధగంటసేపు గుండెల లయల వేగాల్ని, సప్పుడుల్ని కొలుచుకుంట మాట్లాడుకున్నం.
అది మొదలు.. రోజు ఎక్కడో ఒక తాన కలుసుకునేది. తను కనబడని రోజు నాకు గాని, తనకు గాని మనశ్శాంతి ఉండకపొయ్యేది. ఇంటర్ తర్వాత తనను చదువు మాన్పించేస్తారట అని ఒకసారి కలిసినపుడు వెక్కివెక్కి ఏడ్చింది రుక్సానా. ఏం చెయ్యాల్నొ తోచలేదు. ధైర్యం చెప్పడానికి నా కాడ ఏ తొవ్వా కనిపించలె. నాకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక చెల్లె షాదీ అయిపొయ్‌నా ఇంకా ఇద్దరు చెల్లెళ్లు పెండ్లి కున్నరు. చదువు మధ్యల ఉంది. ఏం చెయ్యగలను? "నన్ను పెండ్లి చేసుకోవా?'' నోరు తెరిచి అడిగింది రుక్సానా. గుండెలు పిండేసినట్లు బాదపడ్డ. ఎట్ల చేసుకోను? ఏం చేస్తున్ననని చేసుకోను. ఇంటి పరిస్థితేం బాగలేదు. తను అప్పుడు పెళ్లి చేసుకుంటె ఇల్లు ఆగమైపోతది. ఎట్ల ... ఎట్ల..

"ఎట్లన్న చేసి రెండు మూడేళ్లు ఆపలేవా మీ ఇంటోళ్లను?'' అన్న.
"లేదు. ఈ ఎండాకాలమె పెండ్లి చేసేస్తరంట. మా ఫుప్పమ్మ (అత్తమ్మ) కొడుకు తొందరపెడుతుండు'' అన్నది.
"ఏం చేస్తడు మీ ఫుప్పమ్మ కొడుకు?''
"మెకానిక్''
"మెకానికా? మెకానిక్‌కు ఇంటర్ చదివిన పిల్ల ఎందుకంట? మీవాళ్లకన్నా బుద్ది లేదా?''
"మావాళ్ల తాహతు అంతే!''

"మరి ఎందుకు చదివించిన్రు?''
"నేనే చదువుకుంటనని కొట్లాడి కొట్లాడి చదువుకుంట వస్తున్న .''
"మరి ఇప్పుడు కూడ కొట్లాడు, అతన్ని చేసుకోనని.''
"వింటలేరు.''
"మరేం చేస్తవ్?''
"నువ్వే చెప్పాలె.''
"నేనిప్పుడే చేసుకోలేను రుక్సానా! ఇంట్ల ఇద్దరు చెల్లెళ్లున్నరు. ఇంటి పరిస్థితి అంత బాగలేదు..'' అని నచ్చచెప్పబోయిన. "మరెందుకు ప్రేమించినవ్? అంతకుముందే ఎందుకు ఇవన్నీ ఆలోచించలేదు?'' ఉక్రోషంగా అడిగింది రుక్సానా. ఏం చెప్పాల్నో సమజ్ కాలేదు.
అంతే. ఏడ్సుకుంట వెళ్లిపోయింది. ఎంత పిల్చినా ఆగలేదు. వెంట సైకిలేసుకుని పోతనె ఉన్న. తను బుర్ఖా లోపల్నే పెద్దగ ఏడుస్తున్నట్టు తెలుస్తునె ఉంది. నేను బతిలాడుతున్న. వాళ్ల ఇంటి గల్లీ వచ్చేసరికి నా సైకిల్‌కు బ్రేకులు పడినై. తను ముందుకెళ్లిపోయింది. ఇంట్లకు పోతూ ఒక్కసారి వెనక్కి మళ్లి చూసింది. అది ఆఖరి చూపు అవుతుందని నేనస్సలు అనుకోలేదు. కాని అదే ఆఖరి చూపు!

ఇగ ఎన్నిసార్లు ఆ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన్నో. ఏనాడూ రుక్సానా కనిపించలేదు. ఆ ఇంటిముందలికి పోంగనె రుక్సానా కోసమే వేయించిన సైకిల్‌బెల్లు 'టింగ్ .. టింగ్'మని మోగించేటోన్ని. ఎన్నిసార్లు మోగించినా రుక్సానా బైటికి రాలేదు. కొన్ని దినాలు పిచ్చోన్నై పోయ్‌నంత పనైంది. అన్నం సయించేది కాదు. నిద్దర పట్టేది కాదు. ఇంటి బైట మంచం ఏసుకొని పండుకుంటే పైన ఆ జాబిలిలో రుక్సానా మొఖమే కన్పించి బోరున ఏడ్చేటోణ్ణి. పట్టక పట్టక నిద్ర పడితె తెల్లార్లూ రుక్సానా కలలే. నా పరధ్యానానికి మా ఇంటోళ్లంతా పరేశానయ్యేది. ఆ ఎండాకాలం చివర్లో రుక్సానా ఇల్లు షాదీ కళతోని కళకళలాడింది. నాకు సమజైపోయి షానా ఏడ్చిన. ఒకరోజు పెళ్లి కూడా అయిపోయింది! ఆ రోజు పిల్లను పోగొట్టుకున్న కాకి తిరిగినట్టు ఆ ఇంటిచుట్టూ తిరిగిన. కాని ఏం లాభం?

***

బస్సు పెద్ద గడియారం సెంటర్ల ఆగంగనె దిగి గుట్ట దిక్కు జల్ది జల్ది నడిచిన. గుట్ట ఉన్న రోడ్డు మొదుగాలనె పెద్ద కమాన్ కట్టిన్రు. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతోటి ఉర్దూల, తెలుగుల, ఇంగ్లీషుల 'లతీఫ్ షా వలీ ఉర్స్' అని ఉంది. కమాన్ దాటి ముందలికి అడుగెయ్యంగనె అటుపక్క ఇటుపక్క నాలుగ్గిల్లల బండ్లు, దుకానాలు మొదలైనయ్. దాటుకుంట గుట్ట ముందుకెళ్లిన. పైకి చూస్తె చిన్నప్పటి సంబరమంత కళ్లముందు కదలాడింది. చెట్లు బాగా పెట్టిన్రు. జనం మస్తుగున్నరు. జల్ది జల్ది కుడి పక్క యాపచెట్ల కిందికి పోయ్‌న. అక్కడ నిలబడి ఉన్నరు మా చెల్లెండ్లు. నన్ను సూడంగనె వాళ్ల మొఖాలు ఎలిగినయ్. అంతల్నె ఇంతసేపా? అన్నట్లు కస్సుమన్నై. వాలేకుమ్ సలామ్‌లు చెప్పుకుంట అందర్నీ తేరిపార జూసుకున్న. పిల్లలు నన్ను అల్లుకుపోయిన్రు. బాగోగులు అడిగి, "చలో చలో'' అన్న. అప్పటికి 8:30 అయింది.
మా ముగ్గురు చెల్లెళ్లు, వాళ్ల పిల్లలు, మా తమ్ముడు - వాని భార్య అందరం కదిలినం. నేను ఊరి ముచ్చట్లు అడుగుతున్న. తమ్ముడు, చెల్లెండ్లు చెప్తున్నరు. అమ్మ గుట్ట ఎక్కలేనని రానన్న విషయం అంతకు ముందే ఫోన్ల చెప్పిన్రు. మా ఆమె జొరమొచ్చి వస్తలేదని నేను గుడ చెప్పి ఉంటి.

అయాల ఉర్సు తొలి రోజు కాబట్టి గుట్ట మెట్లెంట జనం యమున్నరు. పది, పదకొండు గంటలకు ఇంకా పెరుగుతరు. ఎనిమిదిన్నరకే - అప్పుడే ఎక్కి దిగేటోల్లు దిగుతనె ఉన్నరు.
తొలి కమాన్‌కాడి తొలిమెట్టు మొక్కి కదిలినం. అక్కడున్న ఫకీర్ కష్కోల్ ఘల్ మనిపించుకుంట.. మోర్చా కట్టతోని మా తలకాయల మీద దీవిస్తున్నట్టుగ మెల్లగ కొడుతున్నడు. నేను జేబుల్నుంచి చిల్లర తీసి ఫకీర్ చేతిలున్న కష్కోల్‌ల ఏసి కదిలిన. ఫకీర్ అందరి కణతలకు ఊది రాస్తున్నడు. మెట్లకు రెండు పక్కల ఫకీర్లు కూసొని "అమ్మా! అమ్మా! బాబా! బాబా!'' అని ఖైరాత్ అడుగుతున్రు. గుడ్డోల్లు.. కుంటోల్లు.. కుష్టోల్లు.. వాళ్లను చూస్తె షానా బాదనిపిస్తుంటది. అందరం.. ముఖ్యంగ చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఫకీర్లకు వెయ్యడానికనే ఇచ్చే చిల్లరను వేస్కుంట గుట్టెక్కుతుంటరు.
నేను మా చిన్న చెల్లె బిడ్డను ఎత్తుకొని మెల్లగ మెట్లు ఎక్కుతున్న. చిన్నప్పుడు లెక్కపెట్టిన గుర్తు లెక్కన 14 వందల మెట్లేమో ఉంటయ్. అప్పుడు ఒక్కరోజె రెండ్రెండుసార్లు ఎక్కి దిగేది అని యాజ్జేసుకుంట దిగేటోళ్లను, ఎక్కేటోళ్లను పరికించుకుంట ఎక్కుతున్న.
"ఏమేం తెచ్చిన్ర''ని అడిగిన పెద్ద చెల్లెను.
"ఏముంది, రోటీ - దాల్!'' అన్నది చెల్లె.
"అంతేనా?'' అన్న నిరుత్సాహంగ.

మా రెండో చెల్లె ఉండబట్లేక "నీ పసంద్ గూడ తెచ్చినం లే భాయ్'' అన్నది.
"తలాయించి తెచ్చిన్రా?'' అడిగిన నోరూరంగ.
"ఆ! కిలోన్నర తెచ్చి సగం తలాయించినం, సగం కూర వండి తెచ్చినం'' అన్నది.
మా చుట్టాలు, పరిచయస్తులు, ఆళ్లీల్లు కలుస్తుంటె పలకరించుకుంటనె ఎక్కుతున్నం.
"అమ్మహ్! నా కాళ్లు నొస్తున్నయ్. కొద్దిసేపు ఆగుదాం'' అన్నది పెద్ద చెల్లె.
మెట్లకు కొంచెం పక్కకు జరిగి బండల మీద కూసున్నం. ఎండ ఊటగైతున్నది. దూపయినోళ్లు బాటిల్లల్ల తెచ్చిన నీళ్లు కొద్దికొద్దిగ తాగిన్రు. పిల్లలకు తాపిచ్చిన్రు.
కిందికి చూస్తె గుట్టకు ముందలి నల్గొండ అంత కనిపించబట్టింది. ఎడం పక్క కొద్దిగ కనిపిస్తున్నది కాని కుడిపక్క గుట్ట ఎత్తుగ ఉండడంతోని అవతలి దిక్కు కనిపిస్తలేదు.
మల్ల షురూ ఐనమ్. పైకెక్కుతున్న కొద్దీ కింద ఇండ్లు బొమ్మరిళ్ల లెక్క, రోడ్లు గీతల్లెక్క కనిపిస్తున్నయ్. ఒకింత దూరం ఎక్కినంక మల్లొకచోట ఆగినం. మా తమ్ముడు వాని బార్యకు మా ఊరి రోడ్డు, దూరంగ కనిపిస్తున్న చెట్లను చూపించుకుంట అదే మా ఊరు అని చెప్తున్నడు. నేను గూడ ఆ రోడ్డెంట చూపు పోనిచ్చి మా ఊరు- కేశరాజుపల్లిని ఎతుకుతున్న.

మల్ల ఎక్కేటోల్లను చూసిన. ముస్లింలెంత మంది ఉన్నరో, ముస్లిమేతరులు అంతకన్న ఎక్కువే ఉన్నరు. ఇదీ అసలు బహుజన సంస్కృతి అంటే.. అనిపించింది. దర్గా ముస్లింది కాబట్టే ఎక్కేటోళ్లెవరి నుదుళ్లమీద బొట్లు లెవ్వు. వాళ్ల బట్టలను బట్టి, భాషను బట్టి తెలుస్తుంటది. నిజానికి కొన్ని జమాత్‌లు చేస్తున్న ప్రచారంతోని ముస్లింలు ఒకవైపు, హిందూత్వ సంస్థలు, పార్టీలు చేస్తున్న ప్రచారంతోని ముస్లిమేతరులు మరోవైపు దర్గా సంస్కృతికి దూరమవుతున్నరు. కాకపోతె జనాభా పెరుగుతున్నది కాబట్టి ఎప్పటిలెక్కనె దర్గాలు కళకళలాడుతునె ఉన్నయ్. కాని మజీదులల్ల మౌలానాలు దర్గాల కాడికి పోవద్దని, అక్కడ సిజ్దా చెయ్యొద్దని చెప్తున్నరట. అది తెలిసి షాన బాదైంది తనకు.. ఈ ఉర్సుల భవిష్యత్తు చివరికి ఏమైతదో ఏమో..!

నా చూపు కింది నుంచి పైకి ఎక్కుతున్న ఒక బుర్ఖా పై పడింది. దూరంగ ఆ మొఖం ఎక్కడ్నో చూసినట్లే అనిపించింది. వెంట ఒక ఆడపిల్లున్నది. ఒక చిన్న పిలగాని చేయి పట్టుకొని మెల్లగ మెట్లు ఎక్కిస్తున్నదామె. అట్లనె చూస్తున్న. ఇంకింత దగ్గరికొచ్చింది. ఒక్కసారిగ గుండె ఆగి మల్ల కొట్టుకున్నట్లనిపించింది. ఆమె... ఆమె- రుక్సానా! అట్లనె స్థాణువు లెక్క నిలబడిపోయ్‌న. మెదడు మొద్దుబారిపోయింది. రుక్సానా దగ్గరికొస్తున్నది.
మా చిన్న చెల్లె "చలేంగే?'' అనడుగుతున్నది.
రుక్సానా మాకు సమానంగా వచ్చేసింది. కాని మా దిక్కు చూడలేదు. దాటి వెళ్లిపోతున్నది.
"రుక్సానా!'' అనే పిలుపు నాకు తెలియకుంటనె బైటపడ్డది.
పరేశాన్‌గ చూసింది రుక్సానా. కొద్దిసేపు ఎవరో ఏమిటో సమజ్ కానట్లుంది. తర్వాత గుర్తు పట్టింది. కాని ఏదో గుబులుగా చూసింది. నా చుట్టూ ఉన్న అందర్నీ కొంచెం బెదురుగ చూసింది. నేను తేరుకొని -
"ఇదర్ ఆవో రుక్సానా!'' అన్న.
"సలామలైకుమ్'' అనుకుంట పిలగాన్ని మెల్లగ నడిపించుకుంట మా దిక్కు వచ్చింది.
"కైసె హై?'' అన్న.
"హై ఐసె!'' అన్నది తలగుడ్డ విప్పుకుంట.
మావోళ్లు పరేశానై చూస్తున్నరు.

రుక్సానకు మావోళ్లను పరిచయం చేసిన. మా చెల్లెండ్లు సలామ్ చేసుకుంట, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంట అసలు తనెవరన్నట్లు నా దిక్కు చూసిన్రు. నేను కాలేజ్ చదివేటప్పుడు ఈ ఉర్సుల్నే పరిచయం అయిందని చెప్పిన. అనుమానంగ చూసిన్రు గని సర్దుకున్నరు. రుక్సానానె చూస్తున్న నేను. తను గూడ నన్నే చూస్తున్నది. నేను చూడంగనె చూపు తిప్పుకుంటున్నది. మంచి నీళ్లు అందిచ్చిన. "హై'' అన్నది. కొంచెం గాభరా పడుతున్నది. పిలగాన్ని ఎత్తుకున్న. ముద్దుగున్నడు. పిల్లలు ఇద్దరు గుడ తెల్లగ ఉన్నరు. ఆడపిల్ల రుక్సానా లెక్కనె ఉన్నది.
నాకు షానా ఖుషీగ ఉన్నది. రుక్సానా కలిసినందుకు. ఒక్కసారిగ మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలు, గుట్ట పరిసరాల్లో పెట్టుకున్న ముచ్చట్లు మనసు చుట్టూ ముసిరినయ్. భారంగ నిట్టూర్చిన.
మా రెండో చెల్లె - "ఎక్కడ ఉంటరు?'' అని మాట్లాడించింది రుక్సానను. అందరి అటెన్షన్ అటు మళ్లింది.
"యహీ. హైదర్‌ఖాన్ గుడె మె'' అన్నది రుక్సానా.
"ఒహో, నల్గొండల్నె ఇచ్చిన్రా'' అనుకున్న.
"ఇన్‌కె అబ్బా నై ఆయె?'' అని పిల్లల్ని చూపెట్టుకుంట వాళ్ల నాయ్‌న గురించి అడిగింది పెద్ద చెల్లె.
"నై. ఆయనక్కొంచెం పని ఉండి రాలె'' అన్నది రుక్సానా.
"చలేంగే?'' అన్నడు మా తమ్ముడు.
అందరం కదిలినం.

నేను రుక్సానా కొడుకుని ఎత్తుకొని ఉండేసరికి మా తమ్ముడు మా చిన్నచెల్లె బిడ్డను ఎత్తుకున్నడు.
మా రెండో చెల్లె ఏదో ఒకటి మాట్లాడించుకుంట రుక్సానా ఎంట మెట్లెక్కబట్టింది. నేను రుక్సానా బిడ్డను ఏం చదువుతున్నవని అడుగుతూ మెట్లెక్కుతున్న. ఎనిమిదేళ్ల పిల్ల. తను మాట్లాడుతుంటె సేమ్ అప్పుడు రుక్సానా మాట్లాడుతున్నట్లె అనిపించింది.
మా తమ్ముడు మా మర్దలు ముందు, వాళ్ల కన్నా ముందు చెల్లెండ్ల పిల్లలు నలుగురు, మా రెండో చెల్లె - రుక్సానా - పెద్ద చెల్లె ఒకసరిగ, ఆ వెనక నేను, నాతోపాటు రుక్సానా పిల్లలు, మా వెనక మా చిన్న చెల్లె తన ఐదేళ్ల కొడుకు చెయ్యి పట్టుకొని ... నడుస్తున్నం. మా చిన్న చెల్లెకు మద్యలో ఈ రుక్సానా ఏంది షర్బత్‌లో పుల్లలాగా అనిపిస్తున్నట్లుంది. కొంచెం మొఖం మాడ్చుకుంది.
దగ్గరికొచ్చేసినం. ఎనక్కి తిరిగి చూసింది రుక్సానా. తన కొడుకును క్షేమంగానే నేను ఎత్తుకొని ఉన్న. నేను చూడంగనె ఎక్కడ్లేని ఆనందం ఆ కళ్లలో మెరిసింది. మళ్ల ముందుకు మళ్లింది.

ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం అన్న నేను. ఒక్కసారి కిందికి చూడొచ్చని. పోరగాన్ని ఎత్తుకొని మెట్లెక్కుతుంటె అలిపిరొస్తున్నది గుడ. మళ్ల అందరం ఆగి గుట్ట చుట్టూ ఉన్న పరిసరాల్ని చూడబట్టినం. కుడి వైపున లతీఫు సాబు గుట్టకు సమానమైన ఎత్తున ఉన్నది కాపురాల గుట్ట. దానిమీద కోట గోడలు కనిపిస్తున్నయ్. రెండు గుట్టల నడుమ జామ్ మజీదు దగ్గరి ఇండ్లు ఇరుకిరుగ్గా కనిపిస్తున్నయ్. గుట్ట పైకి చూసినం. దర్గా కనిపిస్తున్నది. దాని పక్కన చెట్టు. దానికి పెద్ద పెద్ద ఆకుపచ్చ జెండాలు ఎగురుతున్నై.
మళ్ల కదిలినం. దర్గా దగ్గరపడ్డది. మెట్లకు రెండు దిక్కులా ఫకీర్లు గుడ్డలు పర్సుకొని "బాబా!బాబా!'' అని అరుస్తున్నరు. జేబులున్న చిల్లరంత వేసుకుంట ముందుకు కదిలినం. మెట్లు అయిపోంగనె, రుక్సానా దగ్గరగ నడిచి మాతోనే ఉండమని చెప్పిన. అందరం దర్గాకు ఎడమ దిక్కు ఉన్న పెద్ద బండరాయి దిక్కు నడిచినం. బండరాయిని ఆనుకొని ఉన్న చెట్టు మా ఊర్లెకు హిప్పి కటింగోని లెక్క కనబడుతుంటది. బండరాయి వెనక చెట్ల కింద సోటు సూసుకొని కూసున్నం.

కొద్దిసేపు సేద తీరినంక మా తమ్ముణ్ని, మరదల్ని మేమొచ్చినంక పోదురు, అక్కడ్నె కూసొమ్మని చెప్పి నేను, మా చెల్లెండ్లు, రుక్సానా కలిసి దర్గా కాడికి పోయ్‌నం. నేను తలకు దస్తీ కట్టుకున్న. మా చెల్లెండ్లు, రుక్సానా కొంగులు తలనిండా కప్పుకున్నరు. దర్గా కాడికి పోంగనె ఊద్, ఊద్‌బత్తీల వాసన, మల్లెపూలు, గులాబీల వాసన కలగలిసి అదో లోకంలోకి తీసుకెళ్తున్నది. అందరం దర్గా చుట్టు మూడుసార్లు తిరిగినం. తర్వాత మా చెల్లెండ్లు ఒక తలుపు బయటే నిలబడి కొబ్బరికాయలు కొట్టించి, తెచ్చిన మిఠాయి ఫాతెహా ఇప్పిస్తున్నరు. వాళ్లు లోపలికి వచ్చేదానికి లేదు. నేను మగవాళ్లు లోపలికి వెళ్తున్న తలుపుల్నుంచి లోపలికి వెళ్లిన.

దర్గా మ«ధ్యలో లతీఫ్ సాబ్ మజార్ (సమాధి) ఉంది. దాని నిండా పూల చాదర్‌లు నిండి అంత ఎత్తుగ కనిపిస్తున్నది. కొద్దిసేపు ఆ లోపలి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయిన. లోపల ఫాతెహా లిస్తున్న ముజావర్లు పెద్ద పెద్ద గడ్డాలతోని ఉన్నరు. నేను మజార్ మీది పూల మీద తల ఆన్చిన. మొఖమంతా ఆ పూలలోకి మెత్తగా కూరుకుపోయి కమ్మని హాయి నిచ్చింది. గుండెలనిండా పూల ఘుమ ఘుమ. కొద్దిసేపు అట్లనె ఉండిపొయ్‌న. తర్వాత మెల్లగ లేషి ఎదురుంగ చూస్తె అవతలి గుమ్మంలో నన్నే చూస్తు నిలబడి ఉంది రుక్సానా. రుక్సానాను కొద్దిసేపు కన్నార్పకుండా చూసిన. తను కూడా అట్లనే చూస్తున్నది. ఎన్ని భావాలో ఆ చూపుల్లో.. గుండె బరువెక్కింది. మెల్లగా బైటికి కదిలిన. తను గూడ వెనక్కి మళ్లింది.

బైటికొచ్చి దర్గాకు ఎడమ పక్కన ఉన్న చెట్టు దిక్కు చూసిన. ఆ చెట్టుకే మా అమ్మ చాలాసార్లు జెండా ఎక్కించేది. పరేషాన్లు తీరాలనో.. మా చెల్లెండ్ల పెండ్లిళ్లు కావాలనో.. మేము పరీక్షల్లో పాస్ కావాలనో.. మాకు ఉద్యోగాలు రావాలనో! ఏవి తీరినయో, ఏవి తీరలేదో మా అమ్మకే తెలుసు. అమ్మ చెప్పినట్లు చిన్నప్పుడు అమ్మ వెంట ఆకుపచ్చని జెండా పట్టుకొని గుట్ట మీదికి పరుగెత్తుతుండేది.. అంతే! అందరం కలిసి మల్ల బండరాయి వెనక్కి వచ్చేసినం. మేం రాంగనె మా తమ్ముడు, మర్దలు బయల్దేరిన్రు దర్గా కాడికి. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నరు. ఆ బండరాయికి ఒక పక్కనుంచి ఓ పది మెట్లు కట్టి ఉన్నయ్. అవెక్కితే అక్కడ బండలోకి ఒక చెల్మె ఉంటది. మా చిన్నప్పుడు అందులో ఎప్పుడూ నీళ్లు ఊరి ఉండేవి. తాగడానికి ఎంత తీసుకున్నా మళ్లీ ఎప్పటిలెక్కనె ఉండేవి. తర్వాత కొన్నాళ్లకు అది ఎండిపోయింది. ఆ స్వచ్ఛమైన చెల్మలో ఎవరో అన్నం తిని చెయ్యి కడిగిన్రని, అందుకని అది ఎండి పొయిందని చెప్తరు. ఇంక గుట్టసుట్టు అట్లాంటి వింత కథలెన్నో ఉన్నై.

మా చెల్లెండ్ల పిల్లలు వచ్చి మిఠాయి, కొబ్బెర ముక్కలు తలా కొంచెం తీసుకొని తిని మాయమైన్రు. రుక్సానా బిడ్డ చిన్నోన్ని తీసుకొని ఎటో పొయింది. మా చెల్లెండ్లు గుడ ఎటో తప్పుకున్నరు. దాంతో రుక్సానా, నేను మిగిలినం.
"ఎట్లున్నవ్?'' అనడిగిన.
"బానె ఉన్న. తర్వాత నీకెప్పుడు గుర్తు రాలేదా నేను?''
"అసలు మర్చిపోతేగా'' అన్న.
"నేను ప్రతి ఏడాది ఈ గుట్టెక్కినప్పుడల్లా నీకోసం వెతుక్కునేది. ఒక్కసారన్నా కనిపించలేదు గనీ..'' నారాజ్‌గ అన్నది. "అవునా ... నేను ఎక్కినప్పుడు గుడ చూసేది గానీ మరి ఇద్దరం ఒక్క టైంలో ఎక్కినట్లు లేదు. అయినా ఈ మద్య షానా ఏండ్లయింది ఎక్కక'' అన్న.

వాళ్లాయన గురించి అడగాలని నోటిదాంక వచ్చింది. మధ్యలో ఆయన టాపిక్ ఎందుకులే - అని ఊకున్న.. నేను తనకు అన్యాయం చేసిన్నన్న బాధ నా మనసుల మెలిపెడుతున్నది.
"అప్పుడెందుకు... మళ్ల నాతోని కలవడానికి ఒక్కసారన్న రాలేదు?'' మళ్ల అడిగిన.
"అప్పట్కె నీతో మాట్లాడుతుంటె చిచ్చా చూసి మా ఇంట్ల చెప్పిండు. నువ్వేమో అప్పట్లో పెండ్లి చేసుకునేటట్లు లేదంటివి. ఇంకేం చెయ్యను. మా బావతోని షాదీ పక్కా చేసిన్రు. నేనింకా చదువుకుంటనని ఎంతగనమో చెప్పి చూసిన. ఎవ్వరు వినలె...''
"సరె, ఇప్పుడు అంతా మంచే కదా...''
బదులేం చెప్పకుండ అదోలా చూసింది రుక్సానా.
నాకేం అర్థం కాలె.

"నువ్వు షానా గుర్తొచ్చెటోడివి. ఎందుకో తెలియదు. ఆ ఒక్క ఏడాదిల్నె నిన్ను షానా ఇష్టపడ్డ. మా బావ మెకానిక్ కావడం వల్లనో, నువ్వ చదువుకుంటుండడం వల్లనో కావొచ్చు. నిన్ను చేసుకోలేక పోయ్‌నందుకు మనసు ముడుచుకుపోయింది. బైట పడతానికి షాన్నేళ్లు పట్టింది. నీకేంది, మగవాడివి... నువ్వు బాగనె ఉన్నవ్.''
నేనేదో చెప్పబోయిన. అంతల్నె రుక్సానా పిల్లలు వచ్చిన్రు. ఇక ఒక్కొక్కరు అందరు వచ్చి కూసున్నరు. మా చెల్లెండ్లు, రుక్సానా మంచిగ మాట్లాడుకుంటుంటె సంతోషమేసింది.
నేను రుక్సానానె చూసుకుంట ఉన్న. తను కూడా మ««ధ్యమధ్య నన్ను చూస్తున్నది. ఆ చూపులో ఏదో ఆత్మీయత! దగ్గరితనం! అవునూ.. రుక్సానా భర్త ఎందుకు రాలేదు? అంత బాగా కలిసి ఉండరా? అని నా లోపల ఏవో అనుమానాలు... అందరి టిఫిన్లు ఇప్పి కొసరి కొసరి వడ్డించుకుంట ముచ్చట్లు చెప్పుకుంట తిన్నం.
మా చెల్లె కొడుకు అడిగిండు- "ఈ దర్గా ఇంపార్టెన్స్ ఏంది మామా?'' అని.
నేను దర్గాల గురించి కొంచెం వివరంగ చెప్పబట్టిన - "ఈ దర్గాలన్ని సూఫీలవి. వాళ్లు ఇస్లాం వ్యాప్తి కోసం పనిచేసినోళ్లు. వాళ్ల మంచితనం, నిర్మలత్వం, గరీబోళ్లకు, సమాజంల అణచబడ్డ మాల-మాదిగోళ్లకు, సూదరోళ్లకు, పేదోళ్లకు ఆత్మీయులుగా ఉన్న వాళ్ల తీరు... వాళ్లని దేవుళ్లను చేసింది. వాళ్లు చనిపోయిం తర్వాత ఏర్పడ్డ దర్గాలే ఇవి. వీటి దగ్గరికి ముస్లింలతో సమానంగా ముస్లిమేతరులు గూడ వస్తుంటరు. ఇట్ల ముస్లింలు, హిందువులు కలగలిసిపోవడం ఒక మంచి సంస్కృతి..''
"అందుకోసమే మా అన్నయ్య ప్రతి ఏడాది ఉర్సుకు అందరం కలుద్దామని ఈ సారి ఇట్ల మొదలుపెట్టించిండు'' అన్నది మా రెండో చెల్లె. తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లో ...

అందరం ఇక వెనక్కు మళ్లినం. ఈసారి మా చెల్లెళ్లు, తమ్ముడోళ్లే ముందు నడుస్తుంటె నేను, రుక్సానా కొంచెం వెనగ్గా మెట్లు దిగుతున్నం. రుక్సానా కొడుకును నేనే ఎత్తుకున్న. నా గురించి, మా బేగం గురించి ఇంట్రస్టుగ అదొ ఇదో అడుగుతున్నది రుక్సానా. నేను ఆ అందమైన మొఖం చూడ్డంలోనే తన్మయత్వం పొందుకుంట మెట్లు దిగుతున్న.
గుట్ట ముప్పావు వంతు దిగంగనె బ్యాగుల్నుంచి సెల్ తీసి ఎవరికో ఫోన్ చేసింది రుక్సానా.
అరె, ఫోన్ నెంబర్ తీసుకోనే లేదు, గుట్ట దిగంగనె తీసుకోవాలనుకున్న.
షానా తొందర్గ గుట్ట దిగేసినట్లు తోచింది. యాప చెట్ల కిందికొచ్చినం. పొద్దు గూకెసరికి జనం పెరిగిన్రు. గోల గోలగుంది. కొద్దిసేపట్ల రుక్సానా ఎల్లిపోతది కదా.. ఎట్ల? అని దిగులుగ అనిపిస్తున్నది. ఫోన్ నెంబర్ అడిగిన. ఏదో మాట్లాడుకుంట నెంబర్ ఇవ్వనే లేదు. మళ్ల అడిగిన. మళ్ల మాట మార్చింది గని నెంబర్ ఇవ్వనె లేదు. కొంచెం బాదేసింది.
"మీ ఆయన మంచిగ సూసుకుంటడా నిన్ను?'' అని అడిగిన.
"మా ఆయన మొదట్లో షానా మొండిగా ఉండేటోడు. కొన్నాళ్లు కష్టాలు పడ్డ. ఇప్పుడు కొంచెం మారిండు. హిందీ విద్వాన్ దాకా పరీక్షలు రాసి మొన్ననే డిఎస్‌సి రాసిన. తప్పక పాసైత. టీచర్ జాబ్ చెయ్యాల్నని ఉంది'' అన్నది నిశ్చయంగ. అంతల్నె రుక్సానా సెల్ మోగింది. దాంతో- "మా ఆయన వచ్చిండు'' అని ఆత్రంగ పిలగాన్ని తీసేసుకుంది. మా చెల్లెండ్ల దిక్కు మళ్లి, "ఆపా! నేను పొయ్యొస్త. మళ్ల ఉర్సుల కలుద్దాం'' అని మా చెల్లెండ్లకు బాయ్ చెప్పి, నాకు చేత్తో పాటు చూపులతో గుడ బాయ్ చెప్పి కదిలింది.

వాళ్లాయన ఎట్లున్నడో అనే ఆత్రంతోటి రుక్సానా పొయ్యే దిక్కే చూస్కుంట నిలబడ్డ. రుక్సానా దగ్గరికి వాళ్లాయన వచ్చి ఆమె సంకల్నుంచి కొడుకును తీస్కొంట ఏందో అడుగుతుండు. రుక్సానా సంతోషంగ ఏందో చెప్తున్నది. వాళ్లాయన చూస్తానికి బాగున్నడు. మొత్తానికి ఆళ్లు షానా హుషారుగా పిల్లలతో పాటు ఉర్సుల కలిసిపోయిన్రు.
ఫోన్ నెంబర్ తీసుకోలేదన్న బాధ నాలో ఎగిరిపోయింది. రుక్సానా తన భర్త, పిల్లలతోని ఖుషీగనే ఉన్నది. అది చాలు అనిపించింది. మా చెల్లెండ్ల దిక్కు మల్లిన. ఆళ్లు ఆళ్ల దోస్తులెవరెవరో కలిస్తే మాట్లాడుతున్నరు. మా చుట్టాలు గుడ ఉన్నరు ఆళ్లల్ల. చుట్టు వాతావరణం ఎంత సందడిగ ఉందో.. ఎన్నెన్ని రకాల చలనాలో.. చెట్ల కింద గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకుంట ఎంత మందో.. ఈ ఉర్సు ప్రతి ఏడాది ఇట్ల అందర్నీ కలపడానికే ఉన్నదనిపించింది. రుక్సానాను చూడాలన్నా మళ్ల ఉర్సు కోసం ఎదురు చూడాల్సిందే అనుకుంట కదిలిన.

.............................................
* స్కైబాబ
రచయిత సెల్: 99859 21379 

12, జులై 2011, మంగళవారం

philosophy-సందేశం-13

బానిస కుక్క

గెలుపు ఎవరిది?

కోతి తిక్క కుదిరింది

కందిరీగ సహాయం

గాయత్రి మంత్ర అంతరార్ధం

గాయత్రి మంత్ర అంతరార్ధం
gayatriఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం...భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ న గాయత్య్రాః పరం మంత్రం నమాతు: పరదైవతం అన్నది జగత్ప్రసిద్ధమయిన వచనం ఈ గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లి ని మించిన దైవం లేదు. ఆదిశంకరాచార్యులు తమ భాష్యంలో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ అని పేర్కొన్నారు. గయలు అంటే ప్రాణములు అని అర్ధం. అ లాగే త్రాయతే అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయ త్రి మంత్రమని శంకర భాష్యం.ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్క గా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ.

రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రా క్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వి తమెనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుం ది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

ఓం - భగవంతుడు సర్వ రక్షకుడు.
భూర్‌ - ఉనికి కలిగినవాడు
భువః - జ్ఞాన రూపుడు
స్వః - ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు
తత్‌ - అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు
సవితు - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త
వరేణ్యం - అందరితో ఆరాధింపబడేవాడు
భర్గః - పరిశుద్ధుడు
దేవస్యః - ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు
ధీమహి - ఆత్మలో ఏకమయిన
ధియః - ఆ పరమేశ్వరుడు
‚నః - మా బుద్ధులను
ప్రచోదయాత్‌ -సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.ఓ భగవాన్‌!ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వర్రపదాతవు నువ్వే. మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదా యిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్ర్తీయ ప్రా ధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాల పుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవ యిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్ష త్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడి తో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుం బంలోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్థానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్‌ ల ల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతు న్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలిద్దాం. ఓం భూర్భు వస్వః - భూర్‌ అంటే భూమి, భువః అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రా లతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్‌ ఫాన్‌ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతా యి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతు లేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుం దన్నది ఊహాతీతం.గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః అనే ఈ బీజాక్షరాలు ఈ చరా చర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓం కారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.

సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునుల కు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వా రందరూ కలసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరి గిందని విశ్వాసుల నమ్మకం. అప్పటి దాకా భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.

గీతాకారుడు కూడా అదే చెప్పాడు. ఓం ఏకాక్షరం బ్రహ్మ అం టే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టా రు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట. ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటం టే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరి భ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి కైనెటిక్‌ ఎనర్జీని ఉత్పత్తి చేస్తు న్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వంలోని గ్రహరాసుల న్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతు ల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తి చేసే ఎనర్జీకి స్టోర్‌ హౌస్‌ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం...తత్‌ అంటే ఆ (భగవంతుడు) సవితుర్‌ అంటే సూర్యుడు (న త్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగి వుండడం. ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఫలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలియడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడి ని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వా మిత్ర మహర్షి వాక్రుచ్చాడు.ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్ష త్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయి న భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.ఇది ఎలా అంటే- ఒక గణిత శాస్తజ్ఞ్రుడు 2+2=4; =2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్‌ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రంలోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. భర్గో దేవస్య ధీమహిభర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం. అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారు డయిన భగవంతుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ దేవుడిని పూ జించాలని కూడా ఆయన చెప్పారు.ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పు డూ చంచలంగా వుండే మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు. దియోయోనః ప్రచోదయాత్‌ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్ర చోదయాత్‌ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగ వంతుడా! సరయిన మార్గంలో నడిచే విధంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.భూమి(భుర్‌) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమిత మయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయి న భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్‌) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్‌) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో)ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనా దంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్‌) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః రిగ్వేద(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)