7, జులై 2011, గురువారం

ఠాగూర్ వారి బావి(కధ)

ఠాగూర్ వారి బావి
గంగితో అన్నాడు, ‘‘ఎలాంటి నీరు ఇది? దుర్గంధం కారణంగా తాగలేకపోతున్నాను. గొంతెండి పోతున్నది. నీవేమో మురికి నీటిని తాగిస్తున్నావు.’’
గంగి ప్రతిరోజూ సాయంత్రం నీళ్లు తీసుకొచ్చేది. బావి దూరంగా ఉంది. మళ్లీ మళ్లీ పోవాలంటే సాధ్యమయ్యేది కాదు. నిన్న ఆమె నీళ్లు తెచ్చింది. కాని, అందులో ఎలాంటి దుర్గంధం లేకున్నది. మరి, నేడు నీటిలో దుర్గంధం ఎట్లొచ్చింది? చెంబును ముక్కు దగ్గరికి తీసుకొని చూసింది. నిజంగానే దుర్గంధం ఉంది. ఏదో పశువు తప్పక బావిలో పడి, చనిపోయి ఉంటుంది. కాని, ఇంకో నీరు ఎక్కడి నుండి తేవాలి?

ఠాగూర్ వారి బావి దగ్గరకి రానిచ్చేదెవరు? దూరం నుండే బెదిరిస్తారు. షాహుకారు వారి బావి ఊరికి ఆ చివరన ఉంది. కాని, అక్కడ కూడా రానిచ్చేదెవరు? నాల్గవ బావి ఊళ్లోనే లేదాయే.
జోఖు చాలా రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడు. కొంతసేపటి వరకైతే దప్పికను ఓర్చుకొని ఉన్నాడు. కాని, ఆ తర్వాత అన్నాడు - ‘‘ఇక దప్పికను తీర్చుకోలేక ఉండలేకపోతున్నాను. కొద్దిగా నీళ్లు ముక్కు మూసుకొని తాగనా?’’
గంగి నీళ్లు ఇవ్వలేదు.

దుర్గంధభరితమైన నీళ్లు తాగితే రోగం ఎక్కువ అవుతుంది - ఈ విషయం అయితే ఆమెకు తెలుసు కాని, నీళ్లను వేడిచేసి తాగితే, కొంత దుర్గంధం తగ్గుతుందన్న విషయం ఆమెకు తెలియదు.
ఆమె అన్నది - ‘‘ఈ నీళ్లు ఎలా తాగుతావు? ఏ పశువు చనిపోయిందో? బావి నుండి నేను వేరే నీళ్లు తెచ్చిస్తాను.’’
జోఖు ఆశ్చర్యంగా ఆమెవైపు చూసినాడు - ‘‘వేరే నీళ్లు ఎక్కడి నుండి తెస్తావు?’’
‘‘ఠాగూర్, షాహుకారు వాళ్ల రెండు బావులైతే ఉన్నాయి కదా. ఏం ఒక చెంబు నీళ్లు పట్టుకోనివ్వరా?’’

‘‘కాళ్లు, చేతులు విరగ్గొట్టుకొని వస్తావు తప్ప, ఇంకేమీ కాదు. ఊరికే కూర్చో. బ్రాహ్మణ దేవతలు ఆశీర్వదిస్తారు. ఠాగూర్లు లాఠీలతో కొడతారు. షాహుకారువాళ్లు ఒకటికి ఐదు తీసుకుంటారు. బీదవాళ్ల బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? మనం చనిపోయినా గుమ్మంలోకి కూడా తొంగిచూడరు. పాడెను మోసేదైతే చాలా గొప్ప విషయం. ఇలాంటివాళ్లు బావి నుండి నీళ్లను తోడనిస్తారా?’’
ఈ మాటల్లో చేదు నిజం దాగుంది. గంగి ఏం జవాబిస్తుంది పాపం! కాని ఆమె ఆ నీళ్లను మాత్రం తాగనివ్వలేదు.

రాత్రి తొమ్మిదయింది.
అలసి సొలసిపోయిన కూలీవాళ్లు నిద్రపోయి ఉన్నారు.
ఠాగూర్ ఇంటి ద్వారం దగ్గర ఏ చింతాలేని ఎనిమిది, పది మంది ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. కుస్తీ పోటీల కాలం కాదు, అవసరమూ లేదు... కుస్తీ వీరుల గాథలు చెప్పుకోవడానికి. వాళ్లు కోర్టు, న్యాయ వ్యవహారాల వీరోచిత గాథలు చెప్పుకుంటున్నారు. ఎంత చాకచక్యంతో ఠాగూర్‌గారు పోలీసు అధికారికి ఒక ప్రత్యేకమైన కేసులో బయటపడ్డాడు...

ఎంత తెలివిగా కేసు నకలు (డూప్లికేట్)ను తీసుకొచ్చాడు... విచారణాధికారి, సంధానకర్త అందరూ అనేవారు, కేసు నకలు దొరకదు అని. దీనికోసం ఒకరు యాభై అడిగితే, ఇంకొకరు నూరు అడిగేవారు. కాని, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా నకలు తీసుకొచ్చాడు... పనిచేసే పద్ధతి తెలిసుండాలి...

ఇదే సమయంలో గంగి బావి నుండి నీళ్లు తీసుకోవడానికి వచ్చింది.
దీపపు బుడ్డి మసక వెలుతురు బావిపై పడుతున్నది. గంగి బావి అరుగు చాటున కూర్చొని అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ బావి నీళ్లు ఊరంతా తాగుతారు. ఎవరికీ అడ్డులేదు. కేవలం ఈ దౌర్భాగ్యులకే అవకాశం లేదు.

గంగి విద్రోహపూరితమైన హృదయం, దురాచారాలైన ప్రతిబంధకాలు మరియు విధిలేని పరిస్థితులపై దాడి చేస్తున్నది - మేం ఎందుకు నిమ్న వర్గానికి చెందినవాళ్లం? వీళ్లెందుకు ఉన్నత వర్గానికి చెందినవాళ్లు? ఎందుకు? వాళ్లు మెడలో దారం వేసుకున్నందుకా? ఇక్కడైతే ఒకరి కన్నా ఒకరు దిగజారిపోయిన వాళ్లున్నారు. దొంగతనం వీళ్లు చేస్తారు. మోసం, దగా వీళ్లు చేస్తారు.

అబద్ధపు కేసులు వీళ్లే చేస్తారు. ఈ ఠాగూర్ పాపం కుర్వాతని (గొర్రెలు మేపేవాడు) ఒక గొర్రెను దొంగతనం చేసి, ఆ తర్వాత దాన్ని కోసుకుని తిన్నాడు. ఇదే పండితుని ఇంట్లో సంవత్సరపు పన్నెండు మాసాలు జూదం ఆడుతూ ఉంటారు. ఈ షాహుకారు అయితే, నెయ్యిలో నూనె కలిపి అమ్ముతూ ఉంటాడు. పనిచేసుకుంటారు గాని, కూలి డబ్బులు ఇచ్చేటప్పుడు అవ్వ గుర్తుకొస్తుంది. ఏ విషయంలో వీళ్లు మా కన్నా ఉన్నతులుగా ఉన్నారు?

అవును. వీళ్ల నోరు మన కన్నా పెద్దది. మేం వీధి వీధిలో తిరిగి అరుస్తూ ఉండం... మేం ఉన్నతులం, మేం ఉన్నతులం అని. ఎప్పుడైనా నేను ఊళ్లోకి వెళితే చాలు, కామంతో నిండిన కళ్లతో చూస్తూ ఉంటారు. లోపల ఈర్ష్య ఉంటుంది కాని, ఉన్నత వర్గం అన్న గర్వం ఒక్కటి పైకి ఉంటుంది.

బావి దగ్గరికి ఎవరో వచ్చే అలికిడి అయ్యింది.
గంగి ఎద ధకధక కొట్టుకుంది. ఎవరూ చూడరు కదా! చూస్తే ఇక అంతే సంగతులు. కాలితో తంతే, ఒక్క తన్ను కూడా మిస్సవదు.

ఆమె బిందె, తాడు తీసుకొని, ఒంగి నడుచుకుంటూ ఒక చెట్టుచాటున మబ్బులో నిలబడింది. ఎప్పుడు వీళ్లకు ఇతరులపై దయ కల్గుతుంది. పాపం మహగుఁ! ఎంత చితక బాదారంటే, అతను కొన్ని నెలల వరకు రక్తం కక్కుతూ ఉన్నాడు. ఎందుకంటే అతను వెట్టి ఇవ్వలేదు కాబట్టి. ఇలాంటి వాళ్లు ఉన్నతులు.

బావిపై ఇద్దరు స్త్రీలు నీళ్లకోసం వచ్చినారు. వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
‘‘భోజనం చేద్దామనుకునే వేళ ఆదేశం అయ్యింది. తాజానీళ్లు తీసుకురండి. బిందెకేమీ డబ్బులు కావు.’’

‘‘మనల్ని ఖాళీగా ఉన్నది చూచి మగాళ్లకు ఈర్ష్య కలుగుతుంది.’’
‘‘అవును. బిందె తీసుకొనివెళ్లి నింపుకొని అయితే రారుగాని ఆదేశమైతే ఇస్తారు. తాజా నీళ్లు తీసుకురండి. మనం బానిసలమే గదా!’’
‘‘బానిస కాకపోతే ఇంకేమిటి నీవు? కూడు, గుడ్డ దొరకదా నీకు? ఐదు, పది రూపాయలు కూడ ఎలాగో తీసుకుంటావు కదా. బానిస ఎలా అవుతావు?’’

‘‘సిగ్గుపడేటట్టు చెయ్యకు అక్క. క్షణమైన తీరికగా కూర్చోవాలని మనసు ఉబలాటపడుతూ ఉంటుంది. కాని తీరిక దొరకదు. ఇంత పని వేరేవాళ్ల ఇంట్లో చేస్తే, దానికన్నా ఎక్కువ తీరికగా ఉండేదాన్ని. పైనుండి నాపై దయ చూపిస్తున్నట్టు భావిస్తాడు. ఈ ఇంట్లో పని చేస్తూ చేస్తూ చచ్చిపోయినా ఎవరిలో ఎలాంటి చలనం ఉండదు.’’
ఇద్దరు నీళ్లు నింపుకొని వెళ్లిపోయినారు.

గంగి చెట్టు నీడ నుండి ముందుకు నడిచింది.
బావి అరుగు దగ్గరికి చేరింది.
ఇప్పటివరకు బాతాఖాని పెట్టినవాళ్లంతా వెళ్లిపోయినారు.

ఠాగూర్‌గారు కూడ తలుపులు మూసి, లోపలి ప్రాంగణంలో పడుకోవడానికి వెళ్లిపోతున్నారు.
గంగి ఒక క్షణం సుఖంగా శ్వాస తీసుకుంది. ఏదో విధంగా అన్నీ అడ్డంకులు అయితే తొలగిపోయినాయి. అమృతం దొంగిలించడానికి రాజకుమారుడు అలనాడు వెళ్లినాడు కాని, అతను ఇంతటి జాగ్రత్తతో, ఇంతటి లౌక్యంతో వెళ్లకపోవచ్చు.

గంగి మెల్లగ బావి అరుగుపైకి ఎక్కింది. ఇలాంటి గెలుపు అనుభవం ఆమెకు ఇంతకుముందు ఎప్పుడూ కలగలేదు.
ఆమె తాడు ఉచ్చును బిందెకు బిగించింది. నలువైపులా దృష్టిని తీక్షణంగా సారించి చూచింది, సైనికుడు రాత్రివేళ శత్రు దుర్గానికి కన్నెం వేసేటప్పుడు చూచినట్టు. ఈ సమయంలో ఆమె ఒకవేళ పట్టుబడితే ఆమెకు కొద్దిగా కూడా క్షమ లేక మాఫి పొందే అవకాశమే లేదు.

చివరగా దేవతలను ప్రార్థించి, ధైర్యంగా బిందెను బావిలోకి విడిచింది.
బిందె నీటిలో కదలాడింది చాలా నెమ్మదిగా. కొద్దిగా కూడ అలజడి కాలేదు.
గంగి తొందర తొందరగా బిందె చేదుతోంది.
బిందె బావిపైకి వచ్చేసింది. భారీ బలవంతుడైన పహీల్వాన్ కూడ ఇంత వేగంగా చేదేవాడు కాదు.

బిందెను పట్టుకోవడానికి గంగి బావి వైపు కొద్దిగా వంగింది. అప్పుడే ఠాగూర్ ఇంటి ద్వారం తెరుచుకుంది. పెద్దపులి ముఖం దీనికన్నా భయంకరంగా ఉండదు.
గంగి చేతుల నుండి తాడు జారింది. తాడుతో పాటు బిందె ‘ధడాం’ అంటూ నీటిలో పడింది.

కొన్ని క్షణాల పాటు నీటి ప్రకంపనల ధ్వనులు వినిపించినాయి.
ఠాగూర్, ‘‘ఎవరక్కడ, ఎవరక్కడ?’’ అంటూ బావివైపు వస్తున్నాడు. గంగి బావి అరుగు పైనుండి దూకి పారిపోయింది.
ఇంటికి వచ్చి చూచింది.
జోఖు చెంబు నోటికి అంటించి అవే మురికి, దుర్గంధభరితమైన నీళ్లు తాగుతున్నాడు.

హిందీ మూలం: ప్రేమ్‌చంద్ ::: అనువాదం: డా॥నరసింహరావు కళ్యాణీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి