11, జులై 2011, సోమవారం

నిత్య 'అనుమాన్'

నిత్య 'అనుమాన్'

ఆయన పేరు బ్రహ్మానందం. యాభయ్యారేళ్లు. రెవెన్యూలో మంచి ఉద్యోగం. రిటైరయ్యే టైము కూడా దగ్గర పడుతోంది. ఉన్నట్టుండి ఒక రోజున గప్‌చుప్‌గా హైదరాబాదొచ్చి 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' చేయించుకున్నాడు. కుర్రాడిలా తయారయ్యాడు. అంతే!
వాళ్ళావిడ బిత్తరపోయింది. 'ఈ వయస్సులో నీకు ఇదేం పోయే కాలం' అంటూ విరుచుకుపడిపోయింది. అనుమానంతో ఎగాదిగా చూడడం మొదలెట్టింది. ఏదో దుర్బుద్ధి లేకపోతే, ఇప్పుడు నెత్తిమీద జుట్టుతో నీకు పనేంటంటూ సాధింపు మొదలెట్టింది.
'లేదే బాబూ! మరీ రోశయ్యగారి లాగా ఉంటే, ఆఫీసులో బాగుండడం లేదం'టూ నెత్తీనోరూ కొట్టుకున్నా, వాళ్ళావిడ ఒక పట్టాన నమ్మలేదు. ఆరు నెలలు బ్రహ్మానందం మీద నిఘా పెట్టింది. అందులోంచి బయటపడడానికి చచ్చేంత పనయింది ఆయనకు. అనుమానానికి అంత పవరుంది.


మనం నిద్ర లేచింది మొదలు, తిరిగి మంచం మీదకు చేరే దాకా బతుకంతా అనుమానాలే. మనతో పాటే అనుమానం కూడా నిద్రలేస్తుంది కాబోలు. అది ఎలా...ఎందుకు పుడుతుందో కనిపెట్టిన వాడు ఇంతవరకు లేడు. కొన్ని అనుమానాలకు మన 'ఇగో' కారణమైతే కొన్ని మన జీవితానుభవంలో నుంచి పుట్టుకు వస్తాయి. మరి కొన్నిటికి మనం జీవించే పరిస్థితులు, పరిసరాలు కారణమవుతాయి. 'ప్రేమ'లాగే అనుమానానికి కూడా కారణం-నివారణ ఉండవు. పాలప్యాకెట్లు వేసేవాడు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే మనకు డౌటు వచ్చేస్తుంది. 'వస్తాడో... రాడో? ఏ యాక్సిడెంటన్నా అయిందేమో... పాల ప్యాకెట్లలో నుంచి ఇంజెక్షన్‌తో పాలు లాగేసి నీళ్లెక్కిస్తున్నారని మొన్న పేపర్లో రాశారు. మన వెధవాయి కూడా ఆ పని చేస్తున్నాడేమో... అందుకే లేటయిందేమో..' ఇలాంటి ఆలోచనలెన్నో వచ్చేస్తాయి. పేపర్‌బాయ్ రావడం ఆలస్యమైనా అంతే. 'వాడు పేపర్ వేసి వెళ్లాక ఎదురు ఫ్లాట్‌లో వాళ్లు తీసుకున్నారో యేమో' లాంటి అనుమానాలన్నీ మన మనసుల్లో అప్పటికప్పుడే పుడతాయి.

స్కూలుకని వెళ్లిన పిల్లాడు స్కూలుకు వెళ్లాడోలేదో అని తల్లికి అనుమానం. సరుకుల కోసం బజారుకెడితే తూకంలో టోపీ వేస్తాడేమోనన్న అనుమానం. స్నానానికి వెళితే ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడతారేమోనన్న అనుమానం. పక్కింటి పాపాయమ్మ వచ్చి మంచిగా మాట్లాడుతుంటే అప్పు అడుగుతుందేమోనన్న అనుమానం.

కూతురైనా..కొడుకైనా
కాలేజీకెళ్లే కూతురి సెల్‌ఫోన్ మోగిందంటే చాలుఅమ్మకి, నాన్నకి, అన్నకి, తమ్ముడికి.. అందరికీ అనుమానమే. ఆ అమ్మాయి కాని ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుకుంటూ వరండాలోకి అలా నడిచి వెళ్తేనో.. లేదా కొత్త నెంబర్‌నుంచి ఫోన్ వస్తేనో.. మరీ అనుమానం. 'వీడేంటి.. ఇంకా లేవలేదు. ఆఫీసు ఐదింటికే అయిపోతుందిగదా! రాత్రి ఒంటిగంటదాకా ఏం చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు..' అని ప్రతి కొడుకు మీద తండ్రులకుచచ్చేంత అనుమానం. కరెక్టో కాదో తేల్చుకోవడం ఎలా... పాపం అనవసరంగా అనుమానపడుతున్నామేమో... మళ్లీ ఇదో అనుమానం.

అక్కడికీ తోడొస్తుంది
ఆఫీసుకి బయలుదేరితే... మనతో పాటే అనుమానమూ బయలుదేరుతుంది. 'ఆఫీసరు ఏం వేధిస్తాడో... ఏం పాడో... మాటమాటకూ బెల్లుకొట్టి పిలుస్తుంటాడు. ఆ ఫైలు అలా ఉందేమిటి? నీ ఇంగ్లీషు ఇలా ఉందేమిటి అంటుంటాడు. పిలిచినప్పుడల్లా మొహం అదోలా పెట్టి మాట్లాడుతుంటాడు. అసలు కారణం వేరే ఏదైనా ఉందా..' అని దిగువ ఉద్యోగుల అనుమానం. స్టాఫ్ సరిగ్గా పని చేస్తున్నారో లేదో, కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారేమోనని బాస్‌కి అనుమానం.

సిటీబస్సెక్కిన దగ్గర్నించి కిచెన్‌లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశామో లేదో, ఇంటి తాళం సరిగ్గా వేశామో లేదో... అని ఇల్లాళ్లకు అనుమానం. బస్కెక్కి టిక్కెట్ తీసుకోవడానికి వంద కాయితమో... యాభై కాయితమో ఇస్తాం. కండక్టరు వెంటనే చిల్లరివ్వడు. టిక్కెట్టుకు వెనక పక్క కెలుకుతాడు. దిగేటప్పుడు మర్చిపోతామేమోనన్న అనుమానం. వెంటనే చిల్లరివ్వకుండా వెనక రాయడంలో కండక్టరుద్దేశం కూడా అదేనేమోనన్నది మరో డౌటు.
ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు డబ్బులు అవసరమై ఏటీఎంకి వెళ్లి డ్రా చేస్తుంటే.. వెనక నిల్చున్నాయన పిన్ నెంబర్ చూస్తున్నాడేమోనన్న అనుమానం. డబ్బులు డ్రా చేసి లెక్కపెట్టుకునేటప్పుడు ఎవరైన్నా వచ్చి లాక్కెళ్తారేమోనని మరో అనుమానం. జేబులో డబ్బుంటే చుట్టూ ఉన్నవాళ్లందరి మీద ప్రతిక్షణం అనుమానమే.

అనుమానపు ఉద్యోగాలు

కొన్ని ఉద్యోగాలైతే అసలు అనుమానం మీదే నడుస్తాయి. ఈ ఉద్యోగులకు అనుమానాలు రాకపోతే వాళ్లకు ఉద్యోగం చేయడం రానట్టే. మాట వరుసకు పోలీసున్నాడు. ఎవరు చెప్పేదాన్నయినా ఒక పట్టాన నమ్మడు. అనుమానంతో పై నుంచి కింది దాకా చూస్తాడు. ఎక్కడలేని ప్రశ్నలూ వేస్తాడు. వాటికి సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఈలోగా మనం చెప్పేది ఆ పోలీసు నమ్ముతున్నాడో లేదోనన్న అనుమానంతో మనం చస్తుంటాం.

షాపింగ్‌మాల్లో అయినా, సినిమాహాల్ వద్దయినా.. ఎక్కడకెళ్లినా సెక్యూరిటీ అనుమానపు కళ్లు మన మీద పడకుండా ఉండవు. చివరికి మనం పనిచేసే ఆఫీసు మెట్లవద్ద మనకి సుపరిచితులైన సెక్యూరిటీ వాళ్లు కూడా మనల్ని అనుమానంగానే చూస్తారు. అవసరమనుకుంటే తనిఖీలు కూడా చేసేస్తారు. ఇకనల్ల కోటేసుకుని తీర్పులు చెప్పేవారి పరిస్థితి మరీ అన్యాయం. ఎవరు ఏది చెప్పినా వినాలి. కాని చెప్పిందంతా గుడ్డిగా నమ్మేయడానికి లేదు. నిజం తెలుసుకోవడం వారికి పాలల్లోంచి నీటిని విడదీసినంత కష్టం. ఇలాంటి 'అనుమానపు ఉద్యోగాలు' చేసే వాళ్లెందరో.

మొగుడు పెళ్లాల మధ్య అనుమానాల గురించి చెప్పాల్సి వస్తే రామాయణం కంటే పెద్ద గ్రంథమవుతుంది. రామాయణం అంటే గూర్తొచ్చింది అందులోని మెయిన్ పాయింటు అదే కదా. లేకపోతే సీత ఎందుకు అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది?
ఏ ఇంట్లోనూ మొగుడు పెళ్ళాన్ని నమ్మడు. తనాఫీసుకు వెళ్లిపోయాక ఆవిడ సినిమాకు చెక్కేస్తుందేమోనని డౌటు. బజారుకు వెళ్లి అక్కరలేనివన్నీ కొనేస్తుందని మరో డౌటు. అమ్మగారింటికి వెళ్లి తన మీద అయినవీ కానివీ చెప్పేస్తుందని ఇంకో డౌటు. అలాగే పెళ్ళామూ మొగుడ్ని నమ్మదు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి రావడం కాస్త లేటయితే చాలు.. ఏ అమ్మడితో ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడో.. ఏ బారులో కూర్చుని మందులో మునిగిపోతున్నాడో లాంటి సవాలక్ష అనుమానాలు భార్యను నిత్యం కాలుస్తూనే ఉంటాయి.

అనుమానపు బతుకులు
ప్రతిరోజూ రోడ్డుమీద రకరకాల మనుషులు తారసపడుతుంటారు. ఎవరిలో ఏ దొంగ దాగున్నాడో, ఎక్కడొచ్చి బ్యాగో, సెల్‌ఫోనో లాక్కొని చెక్కేస్తాడో అని అనుమానం. ఎదుటి వ్యక్తి మనవైపు నవ్వుతూ చూసినా 'అదోలా చూస్తున్నాడేంటి?' అని అనుమానం. ఎలాగో పనులు ముగించుకుని కొంపకు చేరితే, 'హమ్మయ్య! ఇవాల్టికి బతికాం...' అంటూ ఓ నిట్టూర్పు విడిచి రాత్రికి కరెంటు ఉంటుందో... పోతుందోనన్న అనుమానంతో నిద్రలోకి జారుకుంటాం.

యజమానులు పనివాళ్ళను నమ్మరు.. ఎంత నమ్మకంగా పనిచేసినా సరే ఎప్పుడేది పట్టుకుపోతారేమోననుకుంటూ డౌటు పడుతూనే ఉంటారు. ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా యజమానుల కళ్లు ఆనుమానంగా పనమ్మాయి వైపే చూస్తాయి. నేను దొంగతనం చేయలేదు దేవుడో అని ఎంత వేడుకున్నా వారిమీద అనుమానం పోదు. అదేదో అనుమానించడం యజమానుల హక్కు అయినట్టు, వాటిని తట్టుకోవడం పనోళ్ల వృత్తిధర్మమైనట్టు ఉంటుంది.

విదేశీసంబంధాలు.. వింత అనుమానాలు
ఇక పెళ్లి సంబంధాల విషయంలో అయితే ఈ అనుమానాల పాత్ర అంతా ఇంతా కాదు. పెళ్ళిళ్ళ పేరయ్యలు చెప్పే వాటిని అటువారు గాని, ఇటువారు గాని ఒక పట్టాన నమ్మరు. అబ్బాయో... అమ్మాయో... అమెరికాలోనో, ఇంగ్లాండ్‌లోనో సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నారు అని చెపితే నమ్మరే! 'అమెరాకా వెళ్లినవారు ఖాళీగా ఎందుకుంటారు? ఈ పాటికి దుకాణం తెరిచే ఉంటారు. చూస్తూ చూస్తూ వాళ్లతో ఎక్కడ వేగుతాం..?' ఈ అనుమానాలు ఒక్కొక్కసారి నిజమూ కావచ్చు. ఒక్కొక్కసారి ఉత్తివే కావచ్చు. 'అనవసరంగా అనుమానపడి మంచి సంబంధం వదులుకున్నాం' అంటూ నాలుక్కొరుక్కున్న వారు బోలెడంతమంది, 'మన అనుమానం నిజమైందిరా బాబూ బతికిపోయాం' అంటూ ఊపిరి పీల్చుకున్న వారు కూడా బోలెడంత మంది.

డాక్టర్ మీదా డౌటే
ఇలా చిన్న చిన్న విషయాలకే కాదు. ప్రాణం మీదకు వచ్చే సందర్భాలలో కూడా 'అనుమానాల'దే ప్రధానపాత్ర. ఒంట్లో బావుండకపోతే, ఆస్పత్రికి వెడదామనుకుంటే డాక్టరు 'మనోడే'నా అని అనుమానం. 'మనోడు' కాకపోతే సరిగ్గా చూడడేమోనని డౌటు. డబ్బులు గుంజడానికి అనవసరమైన పరీక్షలన్నీ రాస్తాడేమోనన్న అనుమానం. రోగం నయం కాకపోతే ఆ డాక్టరు అసలు డాక్టరు చదువు చదివాడో లేడోనని మరోసారి అనుమానం.

అనుమానం నిజమైనపుడు.. దొరికిపోయిన దొంగ ప్రవర్తన కూడా హాస్యాస్పదమవుతుంది. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన అప్పారావు కూడా, ప్రతి పైసాకు లెక్కలున్నాయని, వాళ్ళావిడకు పుట్టింటోళ్ళు ఇచ్చినదే ఆ సొమ్మంతా అని బుకాయించడం చూస్తే నవ్వొస్తుంది. రాజకీయాల్లో అయితే ఈ అనుమానపు హాస్యానికి అంతూ పొంతూ ఉండదు. ఏ ఒక్క నాయకుడు చెప్పేదానినీ మరో నాయకుడు చచ్చినా నమ్మడు. స్వంత పార్టీ నాయకులు అసలు నమ్మరు. దాంతో, ఒకరిపై ఒకరు ప్రకటనలు. ఫలితంగా చదవడానికే చిరాకేసేంత మీడియా కాలుష్యం. చివరికి అందరూ ఒకటేనన్న తత్వం బోధపడుతుంది.

అనుమానపు రాజకీయాలు
రాజకీయాల్లో అనుమానానికి ఉన్నంత ప్రాధాన్యత మరి దేనికీ లేదేమోననిపిస్తుంది. మాటవరసకు, కె.వి.పి.రామచంద్రరావు ఇప్పటికీ వెనకనుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారేమోనని గాలి ముద్దుకృష్ణమనాయుడికి చచ్చేంత అనుమానం. బొత్స సత్యనారాయణ ఎటునుంచి నరుక్కొస్తునారోనని సి.ఎం. గారికి వీరడౌటు. ఇప్పుడే ఫ్రిజ్‌లోనుంచి తీసిన ఐస్‌క్రీమ్ లాగా నిగనిగలాడిపోతున్న జగన్ వెంట కమ్యూనిస్టులు వెళ్లిపోతారేమోనని తెలుగుదేశం వారికి డౌటు. కుర్రాడు కత్తి, చాకు, సెవన్-ఒ-క్లాక్ బ్లేడులాగున్నాడని సురవరం సుధాకరరెడ్డి, రాఘవులు స్టేట్‌మెంట్లివ్వడం ఇందుకు కారణమట. ఇక మిగిలినవన్నీ మన అనుమానాలే.

***

ఇలా బతుకంతా అనుమానాల పుట్టే. మరి అనుమానాలు లేకుండా బతకలేమా? తెలియదు. అదీ డౌటే. అనుమానాలతో బతికేదెట్టా? తెలియదు. అదీ డౌటే. ఒక్క విషయంలో మాత్రం డౌటక్కర లేదు. అనుమానం అన్నదానికి వాస్తవంతో పని లేదు. మనకు తారసపడ్డ ప్రతి మనిషినీ, ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్నీ, ప్రతి సంఘటననూ అనుమానించకపోవచ్చు కాని రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎక్కువే. చాలా సందర్భాలలో మనవి ఉత్త అనుమానాలేనని తేలిపోతుంది. పాలవాడు పాలల్లో నీళ్ళు కలపకపోవచ్చు. కూరగాయలు అమ్మేవాడి తూకం నిఖార్సుగా ఉండవచ్చు. బస్సులో కండక్టరు మనం దిగేలోపే, మనకు రావలసిన చిల్లర డబ్బులు ఇచ్చేయవచ్చు. ఇంట్లో పనిమనిషి ఏ దొంగతనమూ చేయకపోవచ్చు. డాక్టరు సరైన ట్రీట్‌మెంటే ఇచ్చి ఉండవచ్చు. ఆఫీసుల్లో బాసులు మన మేలు కోరే తిడుతుండవచ్చు. కాని అనుమానం అనుమానమే. మనల్ని స్థిమితంగా ఉండనివ్వదు. లోలోపల పీకేస్తుంటుంది. లోపల దాచుకోలేం. బయటపడి అడగలేం. అడిగితే ఏమనుకుంటారోనన్న డౌటు. 'మర్యాద'లు అడ్డొస్తాయి. అడక్కపోతే దెబ్బయి పోతాయేమోనన్న బెంగ.

ఏ విషయంలోనైనా అనుమానం మొదలైతే చాలు, మన చూపులో తేడా వస్తుంది. మాటతీరులో తేడా వస్తుంది. వ్యవహారశైలి మారిపోతుంది. ఇదంతా మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది చూసి మనం ఎందుకు ఇంతగా ఇదైపోతున్నామోనని ఎదుటివారు అనుమాన పడుతుంటారు. ఈ విషయాన్ని మనమూ ప్రస్తావించం. ఎదుటివారూ ప్రస్తావించరు. అంతా సైలెంట్‌గానే జరిగిపోతుంటుంది.

ఎందుకింత అనుమానం...?
నిత్య జీవనంలో 'అనుమానం' అనేది ఇంతగా తొంగి చూడడానికి బోలెడన్ని కారణాలు. జనాభా పెరిగిపోయింది. జీవనంలో వేగం పెరిగిపోయింది. ఎలాగోలా బతకాలి. బతుకే ఒక పోరాటమైపోయింది. ఆస్తులు, హోదాలతో సంబంధం లేకుండా అందరిదీ బతుకు పోరాటమే. మరో మార్గం లేదు. పైగా పుట్టిన చోట బతకడం లేదు మనమెవ్వరమూ. అంటే చిన్నప్పటినుంచి తెలిసినవాళ్ల మధ్య బతకడం లేదు. జీవితం ఎక్కడికి తీసికెళితే అక్కడికి వెళుతుంటాం. అంటే మనవాళ్లు, మన సంస్కృతి, మన భాష కనబడని, వినబడని చోట బతకాల్సొస్తుంటుంది చాలాసార్లు. ఈ పరాయితనం వల్ల కూడా అనుమానం పెనుభూతంలా మనను వెంటాడుతుంటుంది. సమాజంలో నిజాయితీ తగ్గడంతో వాతావరణ కాలుష్యం లాగానే మానసిక కాలుష్యం ఎక్కువైపోయింది. అందువల్లనే కావచ్చు, ఎదుటివారి చూపులో... మాటలో... ఆలోచనలో... నడకలో ప్రతిదీ అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఎవరి మీదా మనకి ఒక పట్టాన నమ్మకం కుదరదు. వారు చెప్పే మాటల్ని నమ్మబుద్ధి కాదు.

రాజుగారి పాల బిందెలో ఎవరికి వారు చెంబుడు నీళ్ళు పోసినట్టయిపోయింది జీవితం. పేపర్లు తిరగేస్తుంటే, సగం వార్తలు ఈ అనుమానం మీద జరిగిన సంఘటనలే తారసపడుతుంటాయి. అనుమానంతో పెళ్ళాన్ని చంపేసిన ప్రబుద్ధుడో... ప్రియురాలి మీద దాడి చేసిన ప్రేమికుడో... పిల్లల్ని చంపేసిన తండ్రో... పౌరుడ్ని చంపేసిన పోలీసో మనకు దర్శనం ఇస్తుంటారు.
మనిషికీ... మనిషికీ మధ్య సంబంధాలు ఇంతగా క్షీణించడానికి ఈ అపనమ్మకమే ప్రధాన కారణం అని కూడా అంటుంటారు. అభద్రతా భావం కూడా ఒక కారణమే.

అంత అనుమానం అవసరమా..?
'అనుమానం' తెచ్చే చిరాకులెన్ని ఉన్నా, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోకుండా ఉంటేనే మేలు అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే, అనుమానంతో పొద్దున్నే పాలవాడితో తగాదాపడితే నష్టం ఎవరికి? కూరగాయల కొట్టోడితో యుద్ధం చేస్తే ఇబ్బంది పడేది ఎవరు? బస్సులో కండక్టరును అనుమానిస్తే రెండు కాళ్ల నడకే. అనుమానాలతో మనుషుల్ని దూరం చేసుకోవడం తగదు. కాబట్టి షుగర్ వ్యాధిలాగా అనుమానాల్ని కూడా అదుపులో... పరిమితుల్లో ఉంచుకోవడం మనకీ, ఎదుటివారికి కూడా క్షేమం. ప్రతిదానినీ, ప్రతివారినీ అనుమానిస్తూ క్షణక్షణానికీ జుట్టు పీక్కుంటూ బతికే కంటే, చిన్న చిన్న విషయాలలో మోసాలకు గురైనా నష్టముండదు అనుకుని బతికేయండి. ఇంతకీ వీడు ఇదంతా ఎందుకు రాశాడే అనుమానం రాకపోతే మీరు మనిషి కానట్టే. మీకేమైనా డౌటా?!

- భోగాది వెంకటరాయుడు
99495 47374 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి