అహమద్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. కొంచెం గట్టిగా చూస్తే కానీ, అంత వయసు కనిపించదు.
పొట్టితనంలో వయసు దాక్కునింది.
ఈ సువిశాలమైన కడప నగరంలోని నివాస జనాభా మూడు లక్షల మందిలో అతనూ ఒకడు. ఇంటర్ వరకు చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకునే తెలివితేటలు అబ్బకపోవడంతో, అన్ని రకాల పనులు నేర్చి, అవసరమైనప్పుడు ఒక్కోపని చేసి బతికేస్తున్నాడు.
భార్య చనిపోయింది. ఇంకొకామెను చిత్తూరు జిల్లా ‘మహల్’ పోయి చేసుకొచ్చినాడు. పేరు ఆస్మా. ఆమె ఇంట్లోనే ఉన్నా, చేతులు ముడుచుకుని కూర్చోదు. ఏ సంఘం బీడీలో, ఏ లింగం బీడీలో, ఏ తులసి బీడీలో చకాచకా చుట్టి రోజుకింత సంపాదిస్తుంది. ఇంక అహమద్ మొదటి భార్య రొఖయాకు పుట్టిన కొడుకు ఉన్నాడు. పేరు ఫకర్‌దీన్. వాడు ఎనిమిదో తరగతి రెండేళ్లు చదివి, చేతికి, నోటికి అందిరాని చదువు జోలికి ఎందుకులే అనుకుని, ఎంచక్కా ఇంజినీరింగ్ వర్క్‌షాపులో టర్నర్‌గా ట్రైనింగ్ అవుతున్నాడు.
అహమద్ గురించి సరాసరి చెప్పకుండా అతని కుటుంబ సభ్యుల గురించి చెప్పాల్సి వచ్చిందంటే, అహమద్ జోలికిపోతే ఇక అటు ఇటు చూసే తీరిక కళ్లకు దక్కదు. సరే, అది అహమద్ కుటుంబం.
అహమద్ ఏ పని చేసినప్పటికీ ఇంట్లో రోజుకింత జేబులో ఉన్నప్పుడు ఇచ్చేస్తాడు రెండో భార్య ఆస్మాకు. ఉన్న కొడుకూ బుద్ధిగా ఆమె చేతికిచ్చేస్తాడు. మారుతల్లి అని ఆమె కానీ, ఆ పిల్లోడు కానీ యేనాడూ అనుకోలేదు. అనుకునేలా ప్రవర్తించలేదు కాబట్టి ఆ కుటుంబం అట్ల సాగిపోతోంది.
ఇక అహమద్ జోలికొస్తే, గొప్ప మ్యూజికల్ ఆర్టిస్ట్. అతనికి ఏడు తరాలపైన కానీ ఇక రాబోయే ఏడు తరాలకు కానీ అంత కళాకారుడు రాడు అని తానే గ్యారంటీ చెప్తాడు.
కడపలో ఎవరు ఏ పాట రాసినా, గేయం రాసినా హార్మోనీ పెట్టె ముందు పెట్టుకుని, అయిదే అంటే అయిదు నిమిషాల్లో రెండు మూడు రకాల బాణీలు కట్టి వినిపిస్తాడు. అయితే అహమద్ గొంతు వింటే, కక్కుకుని కక్కుకుని నీళ్లు వచ్చే వీధి కొళాయి గొంతుకలా ఉంటుంది. బాణీ మాత్రం అదిరిపోయేటట్లు కట్టడం అతనికి వరించి వచ్చిన విద్య.
అహమద్ శిష్యుడు పర్వేజ్ ఉన్నాడు. ‘నాకు అంతా గురువులే. శిష్యులు లే’రని చెప్తాడు అహమద్ చమత్కారంగా. చిలకల బావి వీధిలో షెడ్డు పెట్టుకుని ఆటోలకు బాడీ బిల్డింగ్ చేస్తుంటాడు పర్వేజ్. పైగా ఒక కాలు కుంటి. అవన్నీ ఎట్లుంటే ఏం కానీ, పర్వేజ్ గొంతు విప్పినాడంటే చాలు, మహమ్మద్ రఫీ, ఘంటసాల మించినోడు అనిపిస్తాడు. పర్వేజ్ భూమి మీద పుట్టిన సంగతి తెల్సుకునే ఆ ఇద్దరు చనిపోయారని అహమద్ వేళాకోళంగా అంటుంటాడు.
మ్యూజికల్ నైట్స్ కళాక్షేత్రంలో ఏర్పాటైనప్పుడు సంగీతం అహమద్ అనీ, సింగర్ పర్వేజ్ అనీ ఉంటే చాలు! ఆ రోజు రాత్రి కడప టౌన్లో అంగళ్లు చాలా తొందరగా మూత పడాల్సిందే. మ్యూజికల్ నైట్‌కి వాళ్లంతా రావాల్సిందే.
అహమద్‌ది కాకి గొంతు అయితే, అతని శిష్యుడు పర్వేజ్‌ది కోయిల గొంతు. అన్నట్లూ ఆ ఇద్దరూ నలుపు కూడా.
అటువంటి అహమద్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కనిపించడం లేదు. ఎటు పోయాడో ఎవరికీ దిక్కుతోచడం లేదు.
రాత్రి తొమ్మిది గంటలైనా అహమద్ జాడ లేదు. తప్పిపోవడానికేమైనా చిన్నపిల్లోడేమి కాదు. మట్టంగా యాభై ఏళ్లు.
కనిపించకపోతే, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఎవరికి? అంటే, అతన్ని రెండు నెలల కింద ఉద్యోగంలో పెట్టుకున్న అన్నమయ్య రియల్ ఎస్టేట్ శివారెడ్డి ఉన్నాడే, అతనికి ఇబ్బంది వచ్చిపడింది. నెలనెలా హౌసింగ్ ప్లాట్ల డిప్పు తీసినాక, కస్టమర్ల దగ్గరకు పోయి, రసీదు రాసిచ్చి, డబ్బులు రాబట్టుకుని, ఆఫీసులో కట్టడం అహమద్ పని. ఆ పని చేసిందానికి నెలకు అయిదు వేలు జీతం ఇస్తారు. బయట తిరగడానికి ఆఫీసు టూ వీలర్ ఉపయోగించుకోవచ్చు.
ఈ రోజు అన్నమయ్య రియల్ ఎస్టేట్ ఆసామి అయిన శివారెడ్డి, ఆలంఖాన్‌పల్లె దగ్గర పన్నెండు సారల బ్రిడ్జీ పక్కనే అయిదెకరాల స్థలం కొత్త వెంచర్ కోసం రైతులతో బేరం కుదుర్చుకున్నాడు. అగ్రిమెంటు రాసుకోవడానికి ముందు మాట ఒప్పందం కోసం సంచకారం అడ్వాన్సు లక్ష రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది.
లక్ష రూపాయలు ఆఫీసులో తీసుకుని ఆలంఖాన్ పల్లెకు ఉన్నపళంగా బయల్దేరి రమ్మని శివారెడ్డి అహమద్‌కు పని పురమాయించాడు. నమ్మినబంటులా ఆఫీసు మేనేజర్ జమాల్‌సాబ్ దగ్గర లక్ష డబ్బు లెక్కపెట్టి ఎంచుకుని, తీసుకుని హ్యాండ్‌బ్యాగులో భద్రంగా పెట్టుకుని, సరిగా సాయంత్రం 6 గంటలకు ఆఫీసు టూ వీలర్‌లో బయల్దేరినాడు అహమద్.
అంతే! రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నా అయిపు జాడ లేకుండా ఎట్లో ఎల్లబారిపోయినాడు. అతని దగ్గర మొబయిల్ ఫోన్ కూడా ఉంది. ఫోన్ చేసినారు. రింగ్ అవుతున్నదే కానీ ఎత్తడం లేదు. సెలైన్స్ మోడ్‌లో పెట్టుకున్నాడో ఏమో!
అల్మాసుపేటలోని వాళ్ల ఇంటికి అర్జెంటు పని పడి ఏమైనా పోయి ఉంటాడేమోనని, అక్కడికి పోయి చూసినాడు ఆఫీసు మేనేజరు జమాల్‌సాబ్.
‘‘ఇంత తొందరగా మా ఇంటాయన ఎప్పుడొచ్చినాడన్నా! వస్తే ఏమైనా చెప్పాల్నా అన్నా’’ అని అడిగింది అహమద్ రెండో భార్య ఆస్మా.
‘‘వస్తే, అర్జెంటుగా ఫోన్ చేయమని చెప్పమ్మ చాలు’’ అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చి అడిగాడు మేనేజరు.
‘‘టౌన్లో అహమద్ యాడ యాడ ఉంటాడో నీకేమైనా తెల్సి ఉంటే చెప్తావా అమ్మా? ఆయన్తో అర్జెంటు పని ఉంది’’ అన్నాడు.
‘‘మీకు తెలియంది ఏముంది? యాడన్న పాట కచేరీ ఉందేమో చూడండి. అది ఉందంటే మా ఆయనకు ఇంకేం కాబట్టదు కదా’’ అంది జవాబుగా ఆస్మా.
మేనేజరుకు తలలో మెరుపు మెరిసినట్లయ్యింది. పాట కచేరీలు కానీ, నాటకాలు కానీ, సన్మాన సభలు కానీ కడప కళాక్షేత్రంలోనే కదా జరిగేది. అక్కడికి పోయి చూస్తే సరి, అనుకుని బయల్దేరాడు మేనేజర్ జమాల్‌సాబ్.
అయినా ఒక బాధ్యత అప్పచెప్పి, పైగా లక్ష రూపాయలు నగదు ఇచ్చి, అర్జెంటుగా ఇచ్చి రమ్మంటే ఆ పనిని గాలికొదిలేసి, పాట కచేరీలో పోయి కూర్చుంటాడా ఎవరైనా బుద్ధి ఉండే మనిషి! అలా అయి ఉండకపోవచ్చు!!
మరి అట్ల కాకుండా, లక్ష రూపాయలు తీసుకుని జంప్ జిలానీ అంటూ ఊరు విడ్సి పారిపోయి ఉంటాడా?
లక్ష రూపాయలకే ఊరు విడిచిపోతాడా? పైగా ఊర్లో భార్యని, కొడుకుని విడ్సిబెట్టి. ఆ విధంగా పారిపోయే మనిషి కాదు అహమద్. ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది?
ఏదైనా జరగరానిది జరిగి ఉంటుందా? జరగరానిదంటే, ఏదైనా రోడ్ ఆక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరిగి, ఆసుపత్రిలో చేరినాడా ఏమి? ఇలా రకరకాలుగా మేనేజర్ జమాల్‌సాబ్‌కు ఆలోచనలు తలలో చకచకా వచ్చాయ్.
కానీ, తాను ఇప్పుడు తమ ఆఫీసు ఉండే ఏడు రోడ్ల కూడలి దగ్గర్నుంచే కదా ఈ అల్మాసుపేటకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే దోవలోనే కదా తిరిగి వస్తుండేది. దార్లో ఆక్సిడెంట్ జరిగిన వాతావరణమే కనబడలేదే అనుకున్నాడు మేనేజరు.
ఒకవేళ రోడ్ ఆక్సిడెంట్ జరిగి ఉన్నా, సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పుడు 9 గంటలు అవుతుంటే, ఈ మూడు గంటల కాలంలో ఆక్సిడెంటు సీను అట్నే ఉంటుందా? పైగా అహమద్‌ది టీవీఎస్ చిన్న బండి. ఏమో? ఏదైనా జరిగి ఉండవచ్చు. ఏమైతేనేం, కనీసం ఈ పెద్ద మనిషి అహమద్ తన దగ్గర ఉన్న, మెబయిల్ ఫోనెత్తి ఏం జరిగిందో చెప్పి ఉంటే బాగుండేది. పోనీ నిజంగానే ఆక్సిడెంటు అయినా, పక్కన వాళ్లతో ఫోన్ చేయించి తెలిపి ఉండవచ్చు కదా. ఇలా ఆలోచిస్తూ దారెంట ఏదైన ఆక్సిడెంటు ఆనవాళ్లు కనిపిస్తాయేమోనని చూడసాగాడు మేనేజర్ జమాల్‌సాబ్.
మొత్తానికి ఏదో జరిగే ఉంటుంది. అది ఏం జరిగిందో ఇక తెలియాల్సి ఉంది.
ఆ ఆలోచనలతో రాత్రి తొమ్మిదిన్నరకి కడప కళాక్షేత్రం దగ్గరకొచ్చాడు మేనేజరు.
అహమద్ రెండో భార్య ఆస్మా చెప్పినట్లు ఈ కళాక్షేత్రంలో ఉంటాడేమోనని, అటుకేసి తన బండి తిప్పాడు మేనేజరు, అసహనం పెరిగిపోతుండగా.
అర్జెంటుగా ఆలంఖానుపల్లెకు పోతున్న అహమద్ ఎప్పుడూ అలవాటుగా పోయే మద్రాసు రోడ్డులో కాకుండా, కలెక్టర్ ఆఫీసు దారిలో పోతున్నాడు.
జేబులో మొబయిల్ ఫోన్ కదిలినట్లు అయి, కళాక్షేత్రం పక్కన టీ హోటల్ సలామ్ అంగడి దగ్గర ఆపి, ఫోన్ తీసి చూశాడు. రెండు మిస్డ్ కాల్స్ కనిపించాయ్. ఆ మిస్డ్‌కాల్స్ ఎవరివో కావు. తమ అన్నమయ్య రియల్ ఎస్టేట్ ఆసామి శివారెడ్డివే! తొందరగా రమ్మని చెప్పడానికే చేసి ఉంటాడనుకున్నాడు అహమద్.
సరే ఎటూ పోతూనే ఉన్నాడు కదా తను - ఇక మళ్లీ ఫోన్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేయడం అనుకున్నాడు.
బండి కిక్కరుపై కాలు పెట్టబోయి, టీ హోటల్ సలామ్ పలకరింపుతో ఆగిపోయాడు. మాటల్లోనే సలామ్ స్ట్రాంగ్‌గా టీ చేసి గ్లాసు అహమద్ చేతికందించాడు.
టీ తాగడానికెంత సేపు అవుతుంది అని తాగుతూ, కళాక్షేత్రం ద్వారంపై రంగురంగుల సీరియల్ లైట్ల మధ్య వెలిగిపోతున్న ఫ్లెక్సీ బ్యానర్‌ని గమనించాడు.
పర్వేజ్ అండ్ పార్టీచే మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రాం అని రాసుంది. ‘‘ఒరే వెధవా! నన్ను గురువు గురువు అని కదా అంటుంటావ్. కనీసం ఈ గురువుగాడికి ఇలా ఈ ప్రోగ్రాం ఉందని చెప్పి ఉంటే, ఏం పోయేది. నేనే యాంకర్‌గా పనిచేసి ప్రోగ్రాం రక్తి కట్టించి ఉందును కదా’’ అనుకున్నాడు అహమద్.
‘‘ఏమోలే! ఎవరో అర్జెంటు ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఉంటారు. తొందరగా అరేంజ్ చేసుకుని ఉంటాడు. ఎంతకాలం నాపైన ఆధారపడతాడు. వాడూ ఇప్పుడు ఓ మోస్తారు ఆర్టిస్టు అయిపోయినాడు. వానికీ ఇప్పుడు శిష్యులు ఏర్పడినారు. సొంత కాళ్లపై నిలబడటం మంచిదే’’ అని తనకు తానే జవాబు చెప్పుకున్నాడు.
‘అవతల శివారెడ్డి డబ్బుకోసం ఎదురు చూస్తుంటాడు. పదా వెళ్లిపోదామ్’ అని మనసు అహమద్‌ని తొందరించింది. అంతలోని కళాకారుడు ‘లోపలికి కొంచెం తొంగి చూసి పోతే పోలా? ఎంతసేపో వద్దు. ఓ అయిదే అయిదు నిమిషాలు’ అని లోపలి కళాకారుడు ఊరించాడు.
స్ప్రింగు మింగిన కోతి అయిపోయింది అహమద్ శరీరం. అదే అతని బలహీనత. అదే అతని బలం. బలహీనతే అతన్ని బతికిస్తోంది. ఆ బలహీనత మరో పేరే కళాత్మక భావన. ఆ భావన వస్తే చాలు అహమద్ సాధారణ మనిషి నుంచి క్షణాల్లో అసాధారణ మనిషైపోతాడు. ఇప్పుడు అదే జరిగింది అహమద్ విషయంలో.
ముందు వరుస కుర్చీల్లో పోయి కూర్చుంటే, తన శిష్యుడు పిలిచి స్టేజీ ఎక్కించి, చేతికి మైకు ఇచ్చి యాంకరింగ్ చేసి పెట్టమని కోరనే కోరుతాడు. ఆ ఆహ్వానమే చాలని తాను ఒప్పుకోక తప్పదు. ఇన్ని బాదరబంధులు ఎందుకు? మర్యాదగా మూడో వరుస కుర్చీల్లో సాధారణ ప్రేక్షకుల్లో తానూ ఒకనిగా కూర్చొని, రెండు పాటలు విని, తన దారి పట్టుకోని తాను వెళ్లిపోతే మంచిదనుకున్నాడు అహమద్.
మూడో వరుసలో వేసి ఉన్న కుర్చీల్లో ఎక్కడైనా ఖాళీ కుర్చీ ఉందేమోనని దృష్టి సారించాడు.
ఒక విరిగిన కుర్చీ, ఇంకొకటి కాలు బయటికి సాగిన కుర్చీ కంటపడింది. ఎందుకైనా మంచిది వెళ్లి ముందు వరుసలోకే పోదామా అని మనసు చెప్పగా అటుగా చూశాడు. అక్కడ ఒరుసుకొని కూర్చొని ఉన్నారు. ఖాళీ లేదు. ఇక ఆలస్యం చేస్తే, ఆ వికలాంగ కుర్చీలూ దొరకవు అనుకుని, వాటిలో కాస్త గట్టిగా బరువు మోసే నమ్మకం కలిగించిన కాలు సాగిన కుర్చీలో కళ్లు విప్పార్చుకుని స్టేజీకేసి చూస్తూ కూర్చునేశాడు అహమద్.
‘హై దునియా కే రఖ్ వాలే’ రఫీ పాట ఎత్తుకున్నాడు అహమద్ శిష్యుడు పర్వేజ్.
ఈ పాట ఎంత గొప్పగా పర్వేజ్ గొంతులో పలుకుతోందో కదా.
ఈ ఒక్క పాటను తాను ఎన్ని తెల్లవారుజాములు పర్వేజ్‌తో పాడించినాడో కదా అనుకున్నాడు అహమద్.
అప్పుడు బరువు పడిన అహమద్... ఈ రోజు చూడు ఎలా ఎంత నీలాజాలంగా పాడేస్తున్నాడో. ఆరోహణంలో ఎలా గాలిపటంలా పైపైకి పోతున్నాడో. ఏమైనా నా శిష్యుడు కదా! అరే! చూడు చూడు అవరోహణంలో కూడా ఎంత హాయిగా గగనం నుండి భువనానికి గాల్లోంచి దిగుతున్న దైవదూతలా దిగుతున్నాడో అని తనలో తానే మురిసిపోసాగాడు అహమద్.
తాను ఇచ్చిన శిక్షణ వృథా పోలేదు. వీడ్ని ఆ సినిమావాళ్లు చూస్తే, లడ్డు నోటికి ఎత్తుకున్నట్లు ఎత్తుకెళ్తారు. కానీ ఈ కడపలో అంత మొగోళ్లు ఎవరు ఉన్నారు అనుకుంటూ తన శిష్యుని పాట ఆస్వాదించడంలో లీనమైపోయాడు అహమద్.
ముందు వరుసలో కూర్చున్నవాళ్లు, ప్రోగ్రాంకు స్పాన్సర్ల మాదిరి ఉన్నారు. మహ్మద్ రఫీ పాటలు కొసరి కొసరి అడిగి మరీ వినాలనుకుంటున్నట్లుంది.
ఈసారి పర్వేజ్, ‘బహారో ఫూల్ బర్‌సావో - మెర మెహబూబ్ ఆయాహై’ పాటను పాడబోయి, ప్రేక్షక శ్రోతలను ఉద్దేశించి, ‘‘ఈ పాట ఇంత వినసొంపుగా నేను పాడగలుగుతున్నానంటే, దీనికంతా కారణం మా గురువు అహమదే! ఈ పాటను మా గురువు ఎక్కడున్నా ఆయనకిది అంకితం’’ అని పాట ఎత్తుకున్నాడు.
ఆ మాటలు విన్న అహమద్‌కు కన్నీళ్లు వచ్చేశాయ్. తన శిష్యుడు తన పరోక్షంలో కూడా ఎంత గురుభక్తి ప్రదర్శించాడో అని పొంగిపోయాడు.
‘‘రేయ్ బేటా పర్వేజ్! నేను ఇక్కడే ప్రేక్షకుల్లో ఉన్నానురా. నీ మాటలు, నీ పాటలు వింటున్నానురా’’ అని చెప్పాలనిపించింది అహమద్‌కు. ఎందుకో సంస్కారం అడ్డు వచ్చి, ఆ మాటలు పదేపదే మనసులోనే అనుకున్నాడు.
తన ముందుకంటే, తన పరోక్షంలోనే శిష్యుడు మరింత విజృంభించి పాడటం గమనించాడు అహమద్. తను స్టేజీపై యాంకరింగ్ చేస్తూ, పర్వేజ్‌తో పాడించి ఉంటే, కొంత బెరుకు, కొంత భయంతోనే పాడేవాడు. ఎంతైనా గురువు ముందు పాడాలంటే శిష్యునికి ఇబ్బందే మరి. ఇప్పుడు చూడు ఎంతో సహజంగా, యావత్తు తన స్వర సామ్రాజ్యాన్ని ఎలా ప్రకటించుకుంటున్నాడో అనిపించింది అహమద్‌కు.
పరోక్షంగా శిష్యుని ఎదుగుదల చూస్తుంటే, సొంత కొడుకు తన పరోక్షంలో ఆకాశమంత ఎత్తు ఎదిగాడని మరొకరు చెప్తుంటే విన్నట్లు ఉందనుకొన్నాడు తన్మయత్వంలో.
ఆ మధుర స్వర డోలికల్లో తూగి తూగి తూలి తూలి సోలిపోతున్నప్పుడు ఎవరో అపరిచిత అరసికుడు భుజంపై బరువు చెయ్యి వేసినట్లు అనిపించింది.
తదేకంగా స్టేజీపైనే పర్వేజ్‌ని చూస్తున్న అహమద్, భుజంపై ఉన్న ఎవరిదో ఆ చెయ్యిని, అటు చూడనన్న చూడకుండ తొలగించేశాడు. ఆ పరిస్థితిలో మిన్ను భుజంపై వాలినా అలవోకగా గడ్డిపోచని తీసేసేలా ఉన్నాడతను. తిరిగి మళ్లీ అదే స్పర్శ! అదే చెయ్యి బరువు! మళ్లీ తోసేశాడు ఆ చెయ్యిని అహమద్.
ఈసారి ‘అహమద్’ అని ఎవరో గంభీరంగా, కాస్త కోపంతో పిలిచినట్లు అయ్యింది.
మంచి పాటల ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఈ అనవసర అంతరాయం కలిగిస్తున్న ‘బద్మాష్’ ఎవడని, నుదుటిపై ముడతలతో చూశాడు- పిలుపు వచ్చినవైపు అహమద్.
‘‘ఏందయ్య ఇది. నీ పని ఏమైన మర్యాదగా ఉందా? అవతల ముఖ్యమైన పని చూడమని పంపిస్తే, ఆ పని సంగతి చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటావా?’’ అని గుడ్లు ఉరిమి చూశాడు ఆఫీసు మేనేజరు జమాల్‌సాబ్.
జవాబు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అహమద్ ఆలోచించే లోగానే మళ్లీ ఆఫీసు మేనేజరే గొంతు విప్పాడు.
‘‘ఆ డబ్బు ఏది?’’ చాలా ఆత్రంగా అడిగాడు. అప్పటికి అహమద్‌కు కూడా గుర్తులేదు. తన సంకలో మినీ బ్యాగు ఒకటి ఉందని. జవాబు ఏమని చెప్పాలో అర్థంకాక, ‘‘ఏం డబ్బు?’’ అనేశాడు అహమద్.
‘‘అదేనయ్యా! లక్ష రూపాయలు. ఏది?’’ దాదాపు గద్దించినట్లు అడిగాడు మేనేజరు.
‘‘ఇదో. తీసుకుని ఫో’’ అని ఇచ్చేసి లేచి, కొంత దూరంలో మరోచోట మంచి కుర్చీ ఖాళీ అయి ఉంటే, అక్కడికి వెళ్లి కూర్చున్నాడు అహమద్ జరిగింది ఏమాత్రం పట్టించుకోకుండా.
అతని దృష్టి శిష్యుడు పర్వేజ్ ఆలపించే పాటలపైనే ఉంది. అహమద్ ప్రవర్తన అర్థంకాని మేనేజర్ జమాల్‌సాబ్ లక్ష రూపాయల నగదు పోకుండా చేతికి మళ్లీ వచ్చిందే చాలన్నట్లు అక్కడి నుండి బయటికి నడిచాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి