7, జులై 2011, గురువారం

కోతి(కధ)

కోతి
మూలం: ది ప్రైస్ ఆఫ్ బనానాస్ ముల్క్ రాజ్ ఆనంద్
గత సంవత్సరం మన దేశంలోని ప్రాచీన నగరాలెన్నింటినో చుట్టి ముట్టి వచ్చాను. వాటి గొప్పదనం, అందచందాల గురించి చెప్పడానికి నా దగ్గర ఉన్న ఏకైక భాష: పెన్సిల్, బ్రష్, రకరకాల రంగులు. నేను ఆ నగరాల విశిష్ఠత, సౌందర్యాల గురించి రాయలేకపోవచ్చునేమోగానీ చక్కగా బొమ్మలు గీసి మాత్రం చూపగలను. కానీ నాకు పదేపదే గుర్తుకు వచ్చే ఒక సంఘటనను మాత్రం రాసి తప్ప గీసి చూపలేను. చదవండి మరి.....

ఆ రోజు లక్నోకు వెళ్లడానికి ట్రైన్ రావడానికి అరగంట ముందుగానే ఫైజాబాద్ స్టేషనుకు చేరుకున్నాను. ట్రైన్ రాకకోసం ఎదురుచూస్తూ ప్లాట్‌ఫాం మీద ఉన్న బెంచీపై రెడీగా కూర్చుని ఉన్నాను. దగ్గరల్లో ఉన్న చెట్లపై కోతుల హడావుడి ఇంతాఅంతా కాదు. పిల్లకోతులు తల్లికోతులను కౌగిలించుకుంటున్నాయి. తల్లికోతులు పిల్లకోతుల తలలో వేళ్లు పెట్టి సీరియస్‌గా వెదుకుతున్నాయి. కొన్ని కోతులు చెట్ల ఆకులను తెంపేస్తున్నాయి. మరికొన్ని కోతులు ప్లాట్‌ఫాం మీదికి వచ్చి ప్రయాణికులు తినిపారేసిన పదార్థాలను జాగ్రత్తగా తీసుకెళుతున్నాయి.

టన్...టన్... టన్...టన్...
ట్రైన్ రాబోతున్నట్లు గంట మోగింది.
కొద్దిసేపట్లో ట్రైన్ రానే వచ్చింది...
పెద్ద పెద్ద లగేజీలను తలకు ఎత్తుకొని హడావుడిగా నడుస్తున్నారు ప్రయాణికులు. నాన్ రిజర్వ్‌డ్ బోగీల్లో సీట్ల పొట్లాట మొదలైంది. నాది రిజర్వేషన్ సీటు కావడంతో శ్రమ లేకుండా వెళ్లి నా సీట్లో కూర్చున్నాను.
అదృష్టమేమిటంటే నాకు కిటికీ దగ్గర సీటు దొరికింది. కిటికీలో నుంచి ప్లాట్‌ఫామ్‌పై దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు సిక్కులు, సూటుబూటులో ఉన్న ముగ్గురు అధికారులు ఇతర ప్రయాణికులు నేను కూర్చున్న బోగీలోకి ఎక్కారు.
వేసవి కావడంతో బాగా వేడిగా ఉంది. ట్రైన్ కదలడానికి సమయం ఉంది కాబట్టి చల్లగాలికోసమని ప్లాట్‌ఫామ్ పైకి వచ్చాను. వేపచెట్లు చల్లటి స్వర్గాల్లా కనిపిస్తున్నాయి.

ఇంతలో ఒక శేఠ్‌జీ బోగీ దగ్గరకు వచ్చి రిజర్వేషన్ లిస్ట్‌ను చూస్తున్నాడు. అతను తెల్లని ధోవతి ధరించి ఉన్నాడు. తలపై ఖరీదైన టోపీ ఉంది. లిస్ట్‌లో తన పేరు ఉందని నిర్ధారించుకొని తన లగేజీని మోస్తున్న కూలీ వైపు తిరిగిచూశాడు. అతను శేఠ్‌జీకి కాస్త దూరంలో ఉన్నాడు.
‘‘ఏయ్... త్వరగా రా’’ అని అరిచాడు శేఠ్.
కూలీకి వినిపించినట్లు లేదు.
‘‘త్వరగా రా... ట్రైన్ వెళ్లిపోయేట్లు ఉంది’’ మరింత గట్టిగా అరిచాడు శేఠ్‌జీ.
‘‘వస్తున్నానయ్యా...’’ అంటూ కూలీ తన నడక వేగాన్ని పెంచాడు.
ఈలోపే ఒక సంఘటన జరిగింది. మా బోగీ మీద తిరుగుతున్న ఒక కోతి శేఠ్‌జీ తల మీద ఉన్న టోపీని ఎత్తుకెళ్లి దగ్గర్లో ఉన్న చెట్టెక్కేసింది.

‘‘ఓర్నీ... టోపీ... టోిపీ’’ అని అరిచాడు శేఠ్‌జీ. కూలీ వచ్చి లగేజీ కింద పెట్టి వేరే బేరాల కోసం చూస్తున్నాడు. శేఠ్‌జీ మాత్రం లగేజ్‌ను పట్టించుకోకుండా కోతి కూర్చున్న చెట్టు దగ్గరికి పరుగెత్తుకు వెళ్లాడు. ‘‘ఒసేయ్ కోతీ! పాపిష్ఠిదానా... నీకు నా టోపీనే దొరికిందా? కిందకి విసురు’’ అంటూ రకరకాల భయానక హావభావాలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా కోతి మాత్రం పొరపాటున కూడా భయపడడం లేదు.
‘‘చూడండయ్యా ఈ తమాషా’’ అని ప్రయాణికులను ఉద్దేశించి అరుస్తున్నాడు. తల మీద టోపీని కోల్పోవడం భారతదేశం పరువు పోయినట్లుగా బాధపడుతున్నాడు శేఠ్‌జీ.
ఇంతలో కూలీ వచ్చి-
‘‘లగేజీ ఎక్కడ పెట్టమంటారు?’’ అని అడిగాడు. శేఠ్‌జీ మాత్రం కూలీని పట్టించుకోకుండా కోతిని బెదిరించే పనిలో తలమునకలై ఉన్నాడు. చివరి ప్రయత్నంగా చేతుల్లోకి రాళ్లు తీసుకొని ‘‘ఒసేయ్... ముదనష్టపు కోతీ... టోపీ ఇస్తావా? ఈ రాళ్లతో కొట్టి చంపమంటావా?’’ అని అరిచాడు.
అరటి పండ్లు అమ్ముకునే ఆయన శేఠ్‌జీ దగ్గరకు వచ్చి... ‘‘మీ టోపిని తీసుకువచ్చే పూచీ నాది’’ అని రంగంలోకి దిగాడు.

‘‘రా... రా... కిందికిరా... నా బుజ్జివి కదూ, నా చంటివి కదూ’’ తన చేతిలోని అరటిపండ్లను చూపిస్తూ అరుస్తున్నాడు పండ్లవ్యాపారి.
ప్లాట్‌ఫామ్ మొత్తం నిశ్శబ్దమయమైంది. అప్పటి వరకు కోతిచేష్టలకు నవ్వుకున్న ప్రయాణికులు ఊపిరిబిగపట్టి చూస్తున్నారు. పండ్లవ్యాపారి వైపు చూస్తూ ‘‘ఇది సాధ్యమయ్యే పని కాదు’’ అని తమలో తాము గొణుక్కుంటున్నారు. కానీ అసాధ్యమనుకున్న పని సాధ్యమైంది.
‘‘రా తల్లీ!... మా అమ్మవు కదూ’’ చేతిలో అరటిపండ్లను చూపిస్తూ అరుస్తున్నాడు. పండ్లవ్యాపారి బుజ్జగింపులు ఫలించాయి. టోపీని విసిరేసిన కోతి అందుకు ప్రతిఫలంగా అరటిపండ్లను తీసుకువెళ్లింది.
‘‘శభాష్’’ అని ప్రయాణికులు మూకుమ్మడిగా పండ్లవ్యాపారిని ప్రశంసించారు.
పండ్లు అమ్మే ఆయన శేఠ్‌జీకి టోపీ ఇస్తూ ఇలా అన్నాడు:
‘‘ఆ కోతి వెధవలు బాగా ఆకలితో ఉన్నట్లున్నాయి. అందుకే ప్రయాణికులను అల్లరి చేస్తున్నాయి. వాటికి కావాల్సింది అరటిపండ్లు మాత్రమే... టోపీలు కాదు’’
‘‘అలాగా’’ ముక్తసరిగా అని బోగీలోకి ఎక్కబోయాడు శేఠ్‌జీ.
‘‘శేఠ్‌జీ రెండు అణాలు ఇవ్వండి... మీ టోిపీ కోసం నా అరటిపండ్లను ఇచ్చాను కదా’’ అన్నాడు అరటిపండ్లు అమ్మే ఆయన.
‘‘నీ తెలివి తెల్లారిపోను. రెండణాలు ఇవ్వాలా. అవేమైనా చెట్లకు కాస్తున్నాయా?’’ కోపంగా అని ఒక అణా నేల మీది విసిరి బోగీలోకి ఎక్కాడు శేఠ్‌జీ.

‘‘మీ టోపీ కోసం కష్టపడ్డాడు కదా... ఇవ్వండి పాపం’’ అన్నాడు ఒక ప్రయాణికుడు. ఆయన మాటల్ని శేఠ్‌జీ పట్టించుకోలేదు.
‘‘ఇదిగో తీసుకో’’ అంటూ కూలీకి నాలుగు అణాలు ఇచ్చాడు శేఠ్‌జీ.
‘‘అయ్యా! చాలా బరువైన సామాను మోశాను...’’ అన్నాడు కూలీ మరింత కూలీ ఆశిస్తూ.
‘‘చాలుగానీ... వెళ్లవయ్యా వెళ్లు’’ అని కూలీని బయటికి తోస్తూ అరిచాడు శేఠ్‌జీ. మారుమాట్లాకుండా కూలీ వెళ్లిపోయాడు. పండ్లు అమ్మే ఆయన-

‘‘మీ పెద్దరికానికి గుర్తులాంటి టోపీని మీకు తెచ్చి ఇచ్చాను... ఇంకో అణా’’ అని అంటుండగా...
‘‘మాట్లాడింది చాలుగానీ... వెళ్లు’’ అని అతడిని కూడా బయటకు నెట్టేశాడు శేఠ్‌జీ.
గార్డ్ విజిల్ వేయడంతో రైలు కదిలింది.
పండ్లవ్యాపారి మాత్రం కిటికీ నుంచి శేఠ్‌జీని ‘‘మరో అణా ఇవ్వండి’’ అని బతిమిలాడుతూనే ఉన్నాడు.
నేను ఉండబట్టలేక ‘‘పాపం అతను అప్పటి నుంచి అడుగుతున్నాడు. ఇవ్వండి శేఠ్‌జీ’’ అన్నాను.
‘‘మీకు తెలియదండీ... ఈ పండ్లు అమ్మేవాళ్లు ఉత్తదొంగలు. ఆ కోతులతో మిలాఖాతై పండ్లను అమ్ముకుంటుంటారు. మురిగిపోయిన అరటిపండ్లకు రెండు అణాలా?’’ అన్నాడు శేఠ్‌జీ.

శేఠ్‌జీ వ్యవహరం నాతో సహా అందరికీ కోపం తెప్పించింది. ‘‘ప్రతి పనికి లెక్కలు వేస్తే ఎలా?’’ అని నాలో నేను గొణుక్కున్నాను.
రైలు ఫైజాబాద్ స్టేషన్ దాటగానే తన లగేజీని సరిచూసుకుంటూ శేఠ్‌జీ ఇలా అన్నాడు:
‘‘నా టోపీని తీసుకురావడానికి అరటి పండ్లను ఉపయోగిస్తాడని తెలిస్తే అసలు వాడి సహాయమే అడిగేవాడిని కాదు’’
అరటిపండ్లవాడికి ఒక్క అణా ఇవ్వడాన్ని సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు వినిపిస్తున్నాడు శేఠ్‌జీ.
ఎవరు స్వర్గానికి వెళతారో, ఎవరు నరకానికి వెళతారో చెప్పలేంగానీ ఈ ధనవంతుడు శేఠ్‌జీ మాత్రం ఖచ్చితంగా నరకానికే వెళతాడు అనుకున్నాను నాలో నేను. పేదవాడైన పండ్లవ్యాపారి దీన ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ నా సహప్రయాణికులు శేఠ్‌జీని తిట్టుకోవడం ప్రారంభించారు.

శేఠ్‌జీ మీద నాకు పట్టలేనంత కోపం వస్తోంది. కానీ నేను ఏంచేగయగలను? అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేనొక పనిచేశాను. అదేమిటంటే-
చేతిలోకి తెల్లకాగితాన్ని తీసుకొని శేఠ్‌జీ క్యారికేచర్ గీశాను. ఈ బొమ్మలో శేఠ్‌జీ టోపీని కోతి దొంగిలిస్తున్నట్లు ఉంటుంది. అతనేమో బిక్కముఖం వేసుకొని ఉంటాడు. నేను గీసిన బొమ్మను ఒకరి తరువాత ఒకరికి పాస్ చేశాను. చూసిన వాళ్లందరూ నవ్వడం మొదలుపెట్టారు.
వారి నవ్వులు విని నా కోపం కాస్తయినా తగ్గిపోయింది!

అనుసృజన: యం.డి యాకూబ్ పా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి