7, జులై 2011, గురువారం

నంబి(కధ)

నంబి

మూలం: అండర్ ది బన్‌యన్ ట్రీ 
- ఆర్‌కె నారాయణ్ 

మూడు వందల ఇళ్లు ఉన్న చిన్న ఊరు అది. ఆ ఊళ్లో నంబి అనే పెద్దాయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతని వయసు అరవై లేదా డెబ్బై ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ‘‘నీ వయసు ఎంత?’’ అని అడిగితే ఊళ్లో ఏదో ఒక పాత కట్టడం పేరు చెప్పి, దాని నిర్మాణ సమయంలో తాను పుట్టానని చెబుతాడు. ఇక అతని వయసు గురించి పరిశోధించాల్సిన పని మన మీదే పడుతుంది. నంబికి ఒక్క అక్షరం ముక్క కూడా చదవడం రాదు. నిరక్షరాస్యుడైన నంబి కథలు చెప్పడంలో మాత్రం మొనగాడు. ఒకే కథను నెలరోజులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఊరు చివరన ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర చిన్నగుడి ఉంది. అక్కడే అతని నివాసం. నంబి ఆస్తిపాస్తులు రెండు మూడు చొక్కాలు, కొన్ని ధోవతులు. తన దగ్గర ఉన్న చీపురుతో రోజూ ఆలయ పరిసరాలను విధిగా శుభ్రం చేస్తాడు. రోజులో ఎక్కువ భాగం పెద్ద మర్రిచెట్టు నీడలో గడుపుతాడు. ఆకలైతే ఊళ్లో ఎవరింటికైనా వెళతాడు. ఊళ్లో అతడిని సొంతమనిషిలా చూసుకుంటారు. అతను ఏది అడిగినా కొనివ్వడానికి గ్రామస్థులు సిద్ధంగా ఉంటారు.

గ్రామస్థులకు మర్రిచెట్టు కాలక్షేప స్థలంలాంటిది. మర్రిచెట్టు దగ్గరికి వచ్చిన వాళ్లు నంబితో మాట్లాడడానికి ఆసక్తి చూపేవారు. రకరకాల విషయాలు చెప్పి గ్రామస్థులను నంబి నవ్వించేవాడు. తన చిన్నప్పటి విషయాలను వాళ్లతో పంచుకునేవాడు.

ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామస్థులు గుడిలో పూజలు చేయడానికి వస్తుంటారు. వారు రావడానికి ముందే నంబి ఆలయంలో మట్టి ప్రమిదలు వెలిగించేవాడు. గుడి వెనకాల ఉన్న పూలమొక్కల నుంచి పూలు కోసి దేవుడిని అలంకరించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆలయానికి నంబి అనధికార పూజారి. రాత్రివేళ్లలో మర్రిచెట్టు కింద దీపం వెలిగించి కథలు చెప్పేవాడు. ‘‘త్వరగా వంట చెయ్...నంబి చెప్పే కథ వినాలి’’ అని భర్తలు భార్యలను తొందర చేసేవారు. చంద్రుడు ఆకాశంలో కనిపించడం మొదలు పెట్టాడో లేదో పిల్లాపాప ముసలిముతక నంబి చెప్పే కథ వినడానికి బయలుదేరేవారు. కథ చెప్పే ముందు దేవుడి విగ్రహం ముందు కూర్చుని నంబి ధ్యానం చేసేవాడు. ధ్యానం నుంచి బయటికి వచ్చిన తరువాత ఒక రాయి మీద కూర్చొని కథ చెప్పేవాడు. దశరథుడు, విక్రమాదిత్యుడు, అశోకుడు, కపిల, అయోధ్య ....ఇలా ఏ రాజు గురించి అయినా, రాజధాని గురించి అయినా ఆసక్తికరమైన కథలు చెప్పేవాడు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యం రంగుల దృశ్యంగా కంటికి కట్టేది.

ఎలాంటి విరామం లేకుండా మూడుగంటల పాటు ఏకబిగిన నంబి కథ చెబుతుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులై వినేవారు. తన కథలతో ప్రేక్షకులను నవ్వించేవాడు. ఏడిపించేవాడు. హుషారెత్తించేవాడు. నంబి కథ చెప్పే విధానం పాట పాడుతున్నట్లుగా లయబద్ధంగా ఉండేది.

కథలు చెప్పడం ఏ అర్ధరాత్రో ముగిసిన తరువాత, ప్రేక్షకులు ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయిన తరువాత నంబి నిద్రపోయేవాడు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెప్పడం నంబి ప్రత్యేకత. ఒకే కథను మళ్లీ చెప్పిన దాఖలా ఎప్పుడూ లేదు. అతని కథలు కాలక్షేపం కోసం మాత్రమే అని తీసిపారేయడానికి లేదు. ఆ కథల్లో ఎంతో విజ్ఞానం ఉంటుంది. జీవితానికి సంబంధించి నేర్చుకోవాల్సిన విలువైన విషయాలు ఉంటాయి. నంబిని గ్రామస్థులు ‘కథల బంగారం’ అని ప్రేమగా పిలుచుకునేవాళ్లు. వెన్నెల నీడలో, మర్రిచెట్టు కింద.....ఎందరో రాజులు, ఎందరో రాణులు, ఎందరెందరో ప్రతి నాయకులు, ఎన్నో యుద్ధాలు! నంబి కథ చెబుతున్నప్పుడు చెట్టులో ప్రతి కొమ్మ, ఆకు వింటున్నట్లుగా అనిపించేది. ప్రతి రాత్రి ఒక కొత్త ప్రపంచం మర్రిచెట్టు కింద కనిపించేది.

కాలం గడిచిపోతోంది. నంబిలో వయసు తాలూకు భారం కనిపిస్తోంది. ఒకరోజు ‘‘విక్రమాదిత్యుడు అనే రాజు ఉండేవాడు...’’ అని కథ చెబుతూ అయిదు నిమిషాలైనా పూర్తి కాకుండానే ఆయాసంతో ఆగిపోయాడు నంబి. కథ చెప్పడానికి ప్రయత్నించడం... ఆయాసంతో ఆగిపోవడం మళ్లీ మళ్లీ జరుగుతోంది. ‘‘బాగా అలిసిపోతున్నారు. ముందు విశ్రాంతి తీసుకోండి....కథలదేముంది ఎప్పుడైనా చెప్పొచ్చు’’ అని ప్రేక్షకులలో ఎవరైనా అంటే నంబి అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు. తనను అవమానపరిచినట్లుగా బాధ పడేవాడు. ‘‘నేను అలిసిపోవడం ఏమిటి? ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టు... కథ ఎలా చెబుతానో చూడు’’ అని తగాదాకు దిగేవాడు. వృద్ధాప్యం తాలూకు భావన నంబికి తొలిసారిగా పరిచయం అయింది. అది అతనికి మోయలేని భారంగా తోస్తోంది. తానిక నిరాటంకంగా కథ చెప్పడం సాధ్యం కాదు అనే విషయం మెల్లిగా అర్థమవుతోంది. కథ పూర్తవకుండానే ఒక్కరొక్కరుగా అందరూ వెళ్లడం నంబిని బాధ పెట్టింది. ఎవరో అన్నారు.... ‘‘వయసు పైబడింది. మిమ్మల్ని అలిసిపోయేలా చేయడం వాళ్లకు ఇష్టం లేనట్లుగా ఉంది’’. ‘‘నేను ముసలాడినయ్యానా....వయసు...వయసు’’ తనలో తాను గొణుక్కున్నాడు నంబి. వయసు ఒక రూపు దాల్చి ‘‘ఒరే మూర్ఖుడా నేను నీ బానిసను కాదు. నువ్వే నా బానిసవు.

ఇక ముందు నేను చెప్పినట్లే వినాలి’’ అని అంటున్నట్లుగా అనిపించింది. మరుసటి రోజు నంబి ఎక్కువ భాగం ధ్యానంలో గడిపాడు. ‘‘ఏ ఆటంకాలు లేకుండా నన్ను కథ చెప్పేలా ఆశీర్వదించు’’ అని దేవుడిని వేడుకున్నాడు. సాయంత్రం కాగానే ఎప్పటిలాగే గ్రామస్థులు కథలు వినడానికి చెట్టు దగ్గరికి వచ్చారు. ‘‘సోదరి సోదరుల్లారా... నేనేవో పిచ్చిభయాలు మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వయసు నన్నేమీ చేయదు. దేవుడి ఆశీర్వాదబలం నాకు ఉంది. ఈరోజు ఇబ్బందులు లేకుండా చెబుతాను’’ అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లోనే అలిసిపోయి కూలబడిపోయాడు. ‘‘ఇంతకంటే చావే నయం’’ అనుకున్నాడు బాధగా.

మరుసటి రోజు రాత్రి మర్రిచెట్టు కింద దీపం వెలిగింది. ఆ వెలుగును చూసి గ్రామస్థులు కథ వినడానికి వచ్చారు. వచ్చిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
‘‘మిగిలిన వాళ్లు ఎక్కడ?’’ అని అడిగాడు నంబి.
‘‘వస్తారేమో చూద్దాం’’ అన్నారు ఒకరు. గ్రామస్థులు వచ్చే దారి వైపు చూపులు సారించాడు నంబి. ఆకాశంలోకి చందమామా వచ్చేశాడుగాని అదనంగా ఏ ఒక్క ప్రేక్షకుడు రాలేదు.
‘‘నేను ఇవ్వాళ కథ చెప్పను. ఇవ్వాళ మాత్రమే కాదు రేపు కూడా. గ్రామస్థులంతా వచ్చిన రోజే కథ చెబుతాను. మామూలు కథ కాదు. శక్తివంతమైన కథ చెబుతాను’’ అని ఊరించాడు నంబి. ఈ విషయం తెలిసి గ్రామస్థులంతా గుంపులు గుంపులుగా మర్రిచెట్టు కింద చేరారు.
గ్రామస్థులంతా వచ్చారని నిర్ధారించుకున్న తరువాత నంబి గుడి నుంచి బయటికి వచ్చి కథ చెప్పడం మొదలుపెట్టాడు. అది కథలా లేదు. స్వామిజీ చెప్పే ‘తత్వం’ మాదిరిగా ఉంది. అరమయ్యీ కానట్లు అనిపిస్తోంది.
‘‘సువాసన లేని మల్లెపూవు ఎవరికి ఉపయోగం? ఇంధనం లేనప్పుడు దీపం ఉండి ఏం లాభం?’’ ఇలాంటి వాక్యాలేవో అతను అనర్గళంగా చెబుతూ పోతున్నాడు. నంబి మాట్లాడటం పూర్తయిన తరువాత గ్రామస్థులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొందరికి అతని మాటలు అర్థమయ్యాయి. మరికొందరికి కాలేదు.
ఒకరిద్దరు మాత్రం నంబి దగ్గరకు వెళ్లి ‘‘మీరు మాకు కథ చెప్పాలనుకోవడం లేదా?’’ అని ప్రశ్నించారు. నంబి మెల్లగా కళ్లు తెరిచి వాళ్ల వైపు చూసి ‘ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పేది చెప్పాను’ అనే భావం స్ఫురించేలా సైగలు చేశాడు.

నంబి మరికొన్ని సంవత్సరాల పాటు జీవించవచ్చు. నిన్నటి వరకు అతడికి తోడునీడగా ఉన్న ‘కథ’ ఇప్పుడు తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడానికి తొందరపడుతోంది. మీరే చెప్పండి... ఇదేమన్నా న్యాయమా?

అనుసృజన: యం.డి యాకూబ్ పాషా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి