7, జులై 2011, గురువారం

మంగమ్మ(కధ)


ఈ కధ నాకు చాలా బాగా నచ్చింది ... మీకూ నచ్చుతుంది అనుకుంటున్నాను.....
చాలా రోజులకు తెలుగు లో ఒకటి రెండు వ్యాక్యాలు వ్రాయడం ఆనందంగా వుంది........
ఇక కధ లోకి వెళ్తే ...
....రామ కృష్ణ ......

మంగమ్మ
కన్నడమూలం: మస్తి వెంకటేశ అయ్యంగార్
ఇదే కథ... పెరుగు అమ్మిన మంగమ్మ ఇంట్లో జరుగుతుంది. పెరుగు కొన్న చెంగమ్మ ఇంట్లోనూ జరుగుతుంది. పాతిక సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. పది సంవత్సరాల తరువాత కూడా జరగబోతుంది. ఇది అంతులేని కథ. భూమండలం మీద అత్తాకోడళ్లు ఉన్నంత కాలం... కాలంతో పాటు విధిగా సాగే వింత కథ!!

మా కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా మంగమ్మ పెరుగు అమ్ముతోంది. తన సొంతగ్రామం అవలూరు నుంచి ప్రతిరోజూ బెంగుళూరు నగరానికి పెరుగు అమ్ముకోవడానికి వస్తుంది. పెరుగు అమ్ముతూ... అమ్ముతూ మధ్యలో కాసేపు విశ్రాంతిగా కూర్చుని కిళ్లీ నములుతూ మాతో ఏదో ఒక విషయం మాట్లాడేది. తన సంతోషం, దుఃఖం... మొదలైనవన్నీ పంచుకునేది.

నెలరోజుల క్రితం మంగమ్మ పొద్దున్నే మా ఇంటి దగ్గరకు వచ్చి ‘‘పెరుగు కావాలా?’’ అని అడిగింది. ఇంట్లో ఉన్న నేను మా అబ్బాయిని పెరుగు కోసం బయటికి పంపాను. ‘‘బంగారంలాంటి కొడుకును కన్నావమ్మా. పిల్లాడు ఎంత ఒద్దికగా ఉన్నాడో చూడు. ఏదైనా, పెంపకాన్ని బట్టే ఉంటుంది. కొందరు కొడుకులు ఉంటారు, చిన్నప్పుడు అమ్మా... అమ్మా... అంటూ కొంగు పట్టుకొని తిరుగుతారు. పెద్దయ్యాక, పెళ్లయ్యాక మాత్రం తల్లి చచ్చిందా? బతికిందా? అనేది కూడా పట్టించుకోరు’’ మా వాడికి పెరుగు ఇస్తూ అంటోంది మంగమ్మ.

‘‘ఏమైంది మంగమ్మా! నీ కొడుకు నీ మాట వినడం లేదా?’’ అని కాస్త సరదాగానే అడిగాను. ‘‘వాడు నా మాట ఎందుకు వినాలమ్మా? అసలు నేను ఎవరిని?’’ కళ్ల నీళ్లతో అన్నది మంగమ్మ.
ఒకరోజు మంగమ్మ చాలా విచారంగా కనిపించింది. ‘‘మంగమ్మా! ఏమిటి అలా ఉన్నావు?’’ అడిగాను నేను.
‘‘ఏమని చెప్పాలి తల్లీ... నేను ఎవరికీ అవసరం లేదు’’ కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ ఏడుపు గొంతుతో చెప్పింది.
‘‘ఏమైంది. నీ కొడుకు ఏమైనా అన్నాడా?’’ అని అడిగాను.

‘‘ఏమని చెప్పాలి అమ్మా... నిన్న మా కోడలు ఏం చేసిందో తెలుసా? నా మనవడిని కుక్కను బాదినట్లు బాదుతోంది. మనిషివా రాక్షసివా? అని అరిచాను. నా కొడుకు ఇంటికొచ్చిన తరువాత ఆమె మీద ఫిర్యాదు చేశాను. పెళ్లాన్ని నాలుగు తిట్లు తిట్టాల్సిందిపోయి నన్నే మందలించాడు. దాని కొడుకు దాని ఇష్టం. మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? అన్నాడు. కన్నతల్లిని పట్టుకొని అలాంటి మాటలు అనొచ్చా అమ్మా? మాట మీద మాట పెరిగి నేను మీతో ఉండలేను అన్నాను. అలా ఎందుకు అంటున్నావు? అనాల్సింది పోయి సరే నీ ఇష్టం అన్నాడు. ఈరోజు నుంచి నేను విడిగా ఉంటాను. నీ భార్యాపిల్లలతో సంతోషంగా ఉండు అని వాళ్లకు దూరంగా ఉంటున్నాను’’ అని మంగమ్మ భోరుమని ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఊరడించడం చాలా కష్టమైపోయింది నాకు.

‘‘నువ్వేమీ బెంగ పడకు మంగమ్మా. అసలు ఇదొక సమస్యే కాదు. జరగబోయేదేమిటో నాకు తెలుసు. నువ్వు మళ్లీ నీ కొడుకు, కోడలు దగ్గరకు వెళతావు. సంతోషంగా ఉండబోతున్నావు’’ అని ఊరడించాను.
ఒకరోజు మంగమ్మ నన్ను చూస్తూ అడిగింది: అమ్మా... నువ్వు వేసుకున్న ముఖ్‌మల్ జాకెట్ కుట్టించుకోవాలంటే ఎంత అవుతుంది?

ఎంతవుతుందో చెప్పాను. ‘‘నా భర్త నాతో ఉన్నప్పుడు ఒక్క మంచి జాకెట్ కొనుక్కునే భాగ్యం కలగలేదు. ఆ తరువాత నా గురించి నేను మరిచిపోయి కొడుకు, మనవడి కోసం పైసాపైసా కూడబెట్టాను. చివరికి ఏమైంది? ఒంటరిగా మిగిలాను. ఇప్పుడు నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. అందుకే నువ్వు వేసుకున్న రవిక లాంటిది కొనుక్కోవాలనుకుంటున్నాను’’ అన్నది మంగమ్మ. రెండు-మూడు రోజుల తరువాత మంగమ్మ కొత్త రవిక వేసుకొని కనబడింది. ఆ రవిక వేసుకోవడం వల్ల ఎవరెవరు ఎలా వెటకారం చేశారో వరుసబెట్టి చెప్పింది.

‘‘అమ్మా... మా ఊళ్లో రంగప్ప అనేవాడు ఉన్నాడు. వాడు నా వెంటబడుతూ ప్రాణాలు తోడేసినంత పని చేస్తున్నాడు’’ కోపంగా అన్నది మంగమ్మ. ‘‘ఏమైంది?’’ అని అడిగాను.

‘‘నాకు డబ్బు అవసరం ఉంది. బాకీ ఇచ్చావంటే పంట చేతికొచ్చిన తరువాత నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అయినా నీకు డబ్బు అవసరం ఏం ఉంది? ఎలాగూ కొడుకు, కోడలికి దూరంగానే ఉంటున్నావాయే...’’ అంటూ ఆ రంగప్ప రోజూ నా వెంట తిరుగుతున్నాడమ్మా... ఎందుకో భయంగా ఉంది... నా దగ్గర కొంత డబ్బు ఉంది. అది మీ ఇంట్లో దాచాలనుకుంటున్నాను. కావాలనుకున్నప్పుడు తీసుకుంటాను’’ అనుమతి అడిగింది మంగమ్మ. ‘‘మా ఆయన్ను అడిగి చెబుతాను. నువ్వేమీ భయపడకు మంగమ్మా’’ అని ధైర్యం చెప్పాను. ‘సరే’ అంటూ వెళ్లింది. వెళ్లిన గంటలోపే తిరగివచ్చింది. ‘‘అమ్మా... నా మనవడికోసమని మిఠాయి తీసుకువెళుతుంటే ఎక్కడి నుంచో కాకివచ్చి ఎత్తుకెళ్లింది. కాకి తాకడం అపశకునమట తల్లీ... చచ్చిపోతానని భయంగా ఉంది’’ వణుకుతున్న గొంతుతో అన్నది మంగమ్మ.

‘‘మీ అబ్బాయి నిన్ను తీసుకెళితే బాగుణ్ణు. నువ్వు వాళ్ల దగ్గర ఉండడమే క్షేమం’’ అన్నాను.
‘‘నేను కూడా అలాగే అనుకుంటున్నానమ్మా. వాడు పిలిచినా ఆ మహాతల్లి ఊరుకుంటుందా? పిలవకూడదని హెచ్చరిస్తుంది. ఈ వయసులో ఏమిటమ్మా నాకు ఈ ఖర్మ...’’ బాధ పడింది మంగమ్మ.
ఆరోజు మంగమ్మ సంతోషంగా కనిపించింది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా అప్పుడప్పుడు తన దగ్గరకు వచ్చి పెరుగు తినిపోయే తన మనవడు ఈసారి మాత్రం తనను విడిచి వెళ్లనంటున్నాడని మురిపెంగా చెప్పింది. ‘‘వెళ్లను అంటుంటే నేనే పిల్లాడిని బలవంతంగా ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాను. దూరం నుంచి కోడల్ని చూశాను. కలిసి ఉన్నప్పుడు తెలియలేదుగానీ పిల్ల ఎంత బాగుంది! అందుకే నా కొడుక్కి అది ఎంత చెబితే అంత’’ అంటూ నవ్వింది మంగమ్మ!

ఒకరోజు కొడుకు, కోడలు వచ్చి మంగమ్మను బతిమిలాడి ఇంటికి తీసుకువెళ్లారు. ఇప్పుడు మంగమ్మ కొడుకు దగ్గరే ఉంటోంది. ఆరోజు మంగమ్మ ఒక అమ్మాయితో మా ఇంటికి వచ్చింది. ‘‘అమ్మా... ఈవిడే నా కోడలు. రేపటి నుంచి ఈ అమ్మాయే పెరుగు తెస్తుంది. ఈ వయసులో ఎండలో పడి తిరగడం ఎందుకు, ఇంట్లో నీడ పట్టున ఉంటే బాగుంటుందని కొడుకు, కోడలు పట్టుబట్టడంతో సరే అన్నాను’’ అని చెప్పింది మంగమ్మ. అత్తాకోడళ్లతో చాలాసేపు మాట్లాడాను. సంతోషంగా కలిసి ఉండాలని సూచించాను. మరుసటి రోజు మంగమ్మ కోడలు పెరుగు తీసుకువచ్చింది. అత్తాకోడళ్ల తగాదాలో నేను ఇప్పటి వరకు అత్త వాదన మాత్రమే విన్నాను. కోడలి వాదన ఎలా ఉంటుందో అనే ఆసక్తి నాలో కలిగింది.

‘‘ఏమ్మా! నువ్వు చూస్తే మంచి అమ్మాయిలా ఉన్నావు. ఎందుకలా ప్రవర్తించావు. ముసలావిడను అలా బాధ పెట్టవచ్చా?’’ అని అడిగాను. ‘‘అమ్మా! మీరనుకున్నట్లు నేను రాక్షసిని కాదు’’ అని చిన్నగా నవ్వుతూ చెప్పడం మొదలుపెట్టింది: ‘‘మా అత్త మంచిదేగానీ ప్రతి విషయంలో తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటుంది. కొడుకును ఇంకా చంటిపిల్లాడిలాగే భావిస్తుంది. ఇలా అయితే నేను ఎలా ఇల్లు నడిపేది? ఆమెకు తన కొడుకు మీద ఎంత హక్కు ఉందో నాకు నా కొడుకు మీద అంతే హక్కు ఉంది’’

‘‘చిన్నపిల్లాడిని కొట్టడం తప్పు కదా’’ అన్నాను నేను.
‘‘అమ్మా... వాడంటే నాకు మాత్రం ప్రేమ లేదా? మాట వినకుండా మొండిగా తయారవుతున్నాడని భయపెట్టడానికి అలా చేశాను. అంతే’’ అని వివరణ ఇచ్చుకుంది కోడలు. ఆ తరువాత ఇలా చెప్పింది: ‘‘మా ఊళ్లో రంగప్ప అనేవాడు ఉన్నాడు. డబ్బు ఇవ్వమని మా అత్తను రోజూ వేధించేవాడు. చివరికి వాడి బాధ తట్టుకోలేక ఇస్తానని ఒప్పుకుంది. ఆ విషయం నాకు తెలిసి పిల్లాడిని కావాలనే అత్త దగ్గరికి పంపాను. ఆమె వెళ్లగొట్టినా రావొద్దని గట్టిగా చెప్పాను. అలా మేము మళ్లీ ఒకటయ్యాం’’

ఇదే కథ... పెరుగు అమ్మిన మంగమ్మ ఇంట్లో జరుగుతుంది. పెరుగు కొన్న చెంగమ్మ ఇంట్లోనూ జరుగుతుంది. పాతిక సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. పది సంవత్సరాల తరువాత కూడా జరగబోతుంది. ఇది అంతులేని కథ. కాలంతో పాటు విధిగా సాగే వింత కథ!!

అనుసృజన: యం.డి యాకూబ్ పాషా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి