17, జులై 2011, ఆదివారం

జగమెరుగని ఝాన్సీరాణి

జగమెరుగని ఝాన్సీరాణి

కొందరు నేతలు ఆకాశంలో ఉల్కల్లా కాంతివంతంగా ప్రకాశించి నేల రాలిపోతారు. వీరు జీవించేది అతి కొద్ది కాలమే అయినా ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోతారు. చరిత్ర కూడా వీరికి ఒక సుస్థిర స్థానం కల్పిస్తుంది. ఇలాంటి వారిలో ఝాన్సీ లక్ష్మిబాయి ఒకరు. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడటం విధి వైచిత్రి అనే చెప్పాలి. 14 ఏళ్లకు పెళ్లి.. 18 ఏళ్లు నిండకుండానే భర్త మరణం.. మధ్యలో అస్వతంత్ర జీవనం.

ఆ తర్వాత బ్రిటిష్‌వారిపై పోరాడుతూ వీరమరణం పొం దటం.. ఇవన్నీ 23 ఏళ్ల జీవితం లోనే ముగిసిపోయాయి. 1857 నాటి పరిస్థితుల గురించి.. లక్ష్మీబాయి జీవితం గురించి విష్ణుభట్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇటీవల ఇంగ్లీషులోకి అనువదించారు. దాని నుంచి- లక్ష్మిబాయి జీవితంలోని ముఖ్య మలుపులు.. ఘట్టాలు మీ కోసం అందిస్తున్నాం..

"ఝాన్సీకి వెళ్లాలనుకున్న తర్వాత నాకు రాము మామ చెప్పిన అనేక విషయాలు గుర్తుకువచ్చాయి. రాము మామ చెప్పిన సమాచారం ప్రకారం- ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పదిహేను లక్షల దాకా ఉంటారు. దేశంలోని అతి పటిష్ఠమైన కోటల్లో ఝాన్సీ కోట కూడా ఒకటి. పూణేలో పేష్వాలు బలహీనపడిన తర్వాత గ్వాలియర్ మాదిరిగానే ఝాన్సీ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఝాన్సీని పాలించిన రాజులలో చాలామందికి పిల్లలు లేరు. హిందూ సమాజంలోని ఉన్నత కులాల వారి మాదిరిగానే వారు కూడా మగపిల్లలను దత్తత తీసుకొనేవారు. మహారాజు మరణించిన వెంటనే అతని దత్తత కుమారుడు పరిపాలన చేపట్టేవాడు.

ఝాన్సీ మహారాజు గంగాధరరావు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాపిల్లలు పుట్టలేదు. మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలనే గంగాధరరావు అభిమతానికి బ్రిటిష్ పాలకులు అడ్డుపుల్ల వేశారు. అతను పెట్టుకున్న దరఖాస్తులకు కలకత్తాలోని గవర్నర్ జనరల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు లేరనే బాధతో గంగాధరరావు మరణించాడు. అతని భార్య లక్ష్మీ బాయి ఒక పన్నెండేళ్ల కుర్రాడిని దత్తత తీసుకుంది. బ్రిటిష్ పాలకులు ఆ దత్తతను కూడా చట్టబద్ధం చేయటానికి అంగీకరించలేదు. ఈ లోపులో సిపాయి తిరుగుబాటు జరిగింది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ బాయే పగ్గాలు చేపట్టింది...అసలేం జరిగిందంటే..''

పెరిగింది ఇలా..
రాము మామకు లక్ష్మీబాయి వాళ్ల నాన్న రాజశ్రీ మోరోపంత్ తాంబే బాగా తెలుసు. బిత్‌పూర్‌లో ఒక పెద్ద యాగశాల ఉంది. పిల్లలకు వేదం కూడా నేర్పుతూ ఉంటారు. రాము మామ ఈ యాగశాలకు అధిపతిగా ఉండేవాడు. ఆయన వచ్చేసిన తర్వాత మోరోపంత్ అధిపతి అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. దీనితో ఒకే ఒక బిడ్డ అయిన ఛాబిలీని అల్లారుముద్దుగా పెంచుతూ ఉండేవాడు. ఛాబిలీ చూడటానికి చాలా అందంగా ఉండేది.

తల్లి బతికి ఉంటే- ఛాబిలీని అసలు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదేమో! ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల - ఛాబిలీ కూడా తండ్రిలాగానే ఉదయాన్నే యాగశాలకు వచ్చేసేది. అక్కడే ఆడుకునేది. అక్కడే తినేది. మధ్యాహ్నం నిద్ర వస్తే అక్కడే పడుకొనేది. చుట్టూ ఉన్నది మగపిల్లలే కావటంతో, వారితోనే ఆడేది. చదవటం, రాయటంతో పాటు ఆమె విలువిద్య, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చుకుంది. అలా చూస్తుండగానే- ఛాబిలీకి పన్నెండేళ్లు వచ్చేశాయి. మోరోపంత్ ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఛాబిలీ జాతకం ఎవరికీ నప్పేది కాదు. దీనితో అనేక మంది వెనక్కి వెళ్లిపోయారు. అంతే కాకుండా- బాగా చదువుకున్న తన కూతురును పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి ఇష్టం లేదు.
సరిగ్గా అదే సమయంలో గంగాధర రావు భార్య చనిపోయింది. అతను మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరి జాతకం అతనికి నప్పలేదు. మరి కొందరు అతని గురించి వచ్చిన వదంతులకు భయపడ్డారు. ఈ వదంతుల ప్రకారం-

కొన్ని సార్లు గంగాధరరావు తన దర్బారు నుంచి నేరుగా రాణివాసానికి వెళ్తాడు. అక్కడ మగ దుస్తులను వదిలేసి, పట్టుచీర, పావడా కట్టుకుంటాడు. చేతికి గాజులు వేసుకుంటాడు. ముక్కుకు పుడక పెట్టుకుంటాడు. కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో కేవలం ఆడవాళ్లతోనే మాట్లాడతాడు. మగవారితో మాట్లాడడు. అంతే కాకుండా నెలలో నాలుగు రోజులు మైల ఉందని- విడిగా ఒక గదిలోకి వెళ్లిపోతాడు. (మహిళలకు రుతుస్రావం అయినట్లు). ఆ సమయంలో దర్బారుకు రాడు. నాలుగవ రోజు స్నానం చేసి..పూజలు చేసిన తర్వాతే తిరిగి దర్బారుకు వస్తాడు. ఈ సమయంలో గోర్డన్ సాహెబ్ అనే అధికారి బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండేవాడు. గంగాధరరావు గురించి వచ్చిన వదంతులు ఆయనకు కూడా చేరాయి. గోర్డన్ సాహెబ్ ఒకసారి గంగాధరరావును కలిసాడు. "నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. మీరు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.

మీ తాతలు, తండ్రులు చాలా గొప్పవారు. అలాంటి వంశంలో పుట్టిన మీరు సంప్రదాయాలన్నింటిని వదిలేసి- ఆడవాళ్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? నెలకు నాలుగు రోజులు మైలను ఎందుకు పాటిస్తున్నారు. మీకు ఒక అమ్మాయిగా మసలటం ఇష్టమయి ఇలాంటి పని చేస్తున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా?'' అని అడిగాడు. "నేనో చిన్న రాజ్యానికి రాజును కావచ్చు. కాని పెద్ద పెద్ద రాజ్యాలను పాలించే నా సోదర రాజులు సైతం ఏడు సముద్రాల అవతల నుంచి వచ్చిన మ్లేచ్ఛుల నియంత్రణలోకి వెళ్లిపోయారు. వారి రాజ్యంపైన వారికి అధికారం లేదు. ప్రజల దగ్గర నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించే అధికారం లేదు. మేమందరం స్వేచ్ఛను పోగొట్టుకొన్నాం. నిస్సహాయులుగా జీవిస్తున్నాం.

ఒక మహిళ ఎంత భయం భయంగా బతుకుతుందో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. అందుకే నేను కూడా ఒక మహిళలా గాజులు వేసుకుంటున్నా..నాలుగు రోజులు విడిగా కూర్చుంటున్నా..'' అని సమాధానమిచ్చాడు. మోరోపంత్ ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట విన్నాడు. గంగాధరరావు తొలి భార్యకు ఒక బిడ్డ పుట్టి చిన్నప్పుడే చనిపోయాడు. అందువల్ల గంగాధరరావు మగవాడు కాకపోయే అవకాశం లేదని మోరోపంత్ భావించాడు. గంగాధరరావు ప్రవర్తన ఎలా ఉన్నా రాజ్యపాలన మాత్రం బావుండేది. దీనితో గంగాధరరావుకు ఛాబిలీని ఇచ్చి పెళ్లి చేయటానికి మోరోపంత్‌కు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. గంగాధరరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారితో ఈ విషయం చెప్పాడు.

అనుమానపు మొగుడు..
మోరోపంత్ అనే పురోహితుడి కుమార్తె చాలా అందంగా ఉంటుందని..ఆమెకు పెళ్లి చేయటానికి సంబంధాలు వెతుకుతున్నారని కొందరు మధ్యవర్తులు గంగాధరరావుకు చెప్పారు. వెంటనే గంగాధరరావు తన మనుషులను మోరోపంత్ దగ్గరకు పంపాడు. తనకు కన్యాశుల్కం అక్కరలేదని.. అయితే పెళ్లి ఖర్చులన్నీ గంగాధరరావే పెట్టుకోవాలని మోరోపంత్ షరతు విధించాడు. దీనికి గంగాధరరావు అంగీకరించాడు. గంగాధరరావు, ఛాబిలీల పెళ్లి ఝాన్సీలో ఘనంగా జరిగింది. అప్పుడే ఛాబిలీలి పేరు లక్ష్మిబాయిగా మారింది.

లక్ష్మిబాయి సంసారం మొదటి నుంచి అంత ఆనందంగా గడవలేదు. గంగాధరరావుకు తన కన్నా చాలా చిన్నదైన లక్ష్మిబాయిపై అనుమానం ఎక్కువ. దీనితో ఆమెను రాణివాసం నుంచి కూడా బయటకు రానిచ్చేవాడు కాడు. పడకగదిలోనే ఉంచి తాళం పెట్టేవాడు. మగవాళ్లు ఎవరూ ఆమె మహలు వైపు కూడా చూడటానికి వీలులేకుండా కొందరు మహిళా సైనికులను కాపలా పెట్టాడు. ఇంత కట్టుదిట్టం చేయటం వల్ల లక్ష్మిబాయి మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిగా ఉండటం కన్నా అబ్బాయిగా పుడితేనే మేలని భావించేది. చిన్నప్పుడు స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగిన రోజులు ఆమెకు గుర్తుకువస్తూ ఉండేవి. దీనితో ఆమె కొన్ని సార్లు మగవాళ్ల బట్టలు వేసుకుంటూ ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే గంగాధరరావు అనారోగ్యం పాలయ్యాడు. మరణశయ్యపై నుంచి గోర్డన్ సాహెబ్‌కు కబురుపెట్టాడు. "నా భార్య ఇంకా యుక్తవయస్సులో ఉంది. పిల్లలు లేరు.

అందువల్ల మా బంధువుల పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటానికి అంగీకరించండి..'' అని అడిగాడు. గంగాధరరావు అంటే గోర్డన్ సాహెబ్‌కు కొంత సానుభూతి ఉంది. దీనితో అతను కలకత్తాలో ఉన్న తనపై అధికారులకు విషయాన్ని వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. కానీ కలకత్తాలో అధికారుల వ్యూహం మరోలా ఉంది. "గంగాధరరావుకు పిల్లలు లేరు. అందువల్ల ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధ్యతలు చేపట్టండి'' అని కలకత్తా నుంచి సమాధానమొచ్చింది. ఇక చేసేదేమీ లేక- గోర్డన్ సాహెబ్ ఝాన్సీ సామ్రాజ్యాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలో గంగాధరరావు మరణించాడు. గోర్డన్ సాహెబ్ మాత్రం లక్ష్మిబాయి పట్ల సానుభూతితోనే వ్యవహరించాడు. కోటలో కొద్ది భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. గంగాధరరావు వదిలి వెళ్లిన సంపదను కూడా ఆమెకే వదిలేసాడు.

అన్నీ అడ్డంకులే..
భర్త చనిపోయిన కొద్ది కాలానికి లక్ష్మిబాయి-తాను ఒక బ్రాహ్మణ వితంతువులా జీవితాన్ని సాగించాలనుకుంది. గుండు చేయించుకొని వితంతువుగా మారటానికి కాశీ, ప్రయాగ పుణ్యక్షేత్రాలకు వెళ్లటానికి అనుమతి ఇవ్వమని గోర్డన్ సాహెబ్‌కు అర్జీ పెట్టుకుంది. దీనిని కూడా బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. స్వతహాగా లక్ష్మిబాయి చాలా తెలివైంది. బ్రిటిష్‌వారి నుంచి తనకు వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలంటే మగపిల్లవాడిని దత్తత చేసుకోవటం తప్పనిసరని గ్రహించింది. ఒక పిల్లవాడిని దత్తత తీసుకొనే విషయమై బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. 1857 మే నాటికి దేశ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి.

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తారనే వార్తలు దావానలంలా వ్యాపించటం మొదలుపెట్టాయి. దీనితో బ్రిటిష్ పాలకులు- సంస్థానాధీశులపై పట్టుబిగించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్ష్మిబాయి పెట్టుకున్న దత్తత అర్జీలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆమెకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా నిలుపుచేశారు. ఈ పరిస్థితుల్లో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కొందరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీనితో ఝాన్సీ కంటోన్మెంట్‌లో నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారులకు వణుకుపుట్టింది. ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని బ్రిటిష్ అధికారులు గమనించారు. తమకు సాయం చేయమని లక్ష్మిబాయిని కోరారు.

జూన్ 8, 1857..
ఝాన్సీ కంటోన్మెంట్ అంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. అప్పటికే మీరట్‌కు చెందిన సైనికులు క్రమంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల అభిమానాన్ని పొందటానికి బ్రిటిష్ వారికున్న ఏకైక మార్గం సంస్థానాధీశులను మంచి చేసుకోవటం. ఝాన్సీ సంస్థానంలో ఉన్న ప్రాంతాలన్నిటి పరిపాలనను లక్ష్మిబాయికి అప్పచెబుతున్నామని.. ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వచ్చే 25 లక్షల రూపాయల ఆదాయాన్ని ఇకనుంచి ఆమే అనుభవించవచ్చంటూ గోర్డన్ సాహెబ్ లక్ష్మిబాయికి ఒక వర్తమానాన్ని పంపాడు.

రాజ్యంలో ప్రశాంతత ఏర్పడేవరకూ ఆమే సర్వాధికారిణి అని..అయితే బ్రిటిష్‌వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆమె గోర్డన్ సాహెబ్, ఇతర బ్రిటిష్ అధికారులకు రక్షణ కల్పించాలనే షరతు కూడా ఆ వర్తమానంలో ఉన్నాయి. దాన్ని చదివిన లక్ష్మిబాయికి విపరీతమైన కోపం వచ్చింది. "నన్ను ఒక రాణిగానే మీరు గుర్తించలేదు. కలకత్తాలో జరిగిన రాజ్యాధీశుల సమావేశానికి పిలవలేదు. నా భర్త చివరి కోరికగా- ఒక బిడ్డను దత్తత తీసుకుంటానంటే అంగీకరించలేదు. నేను కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి, ఇవన్నీ ఇస్తున్నారా? మిమల్ని దయతో మా దగ్గర ఉంచుకోవాలా? బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన సైనికులు దీనికి అంగీకరిస్తారా? మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారని తెలిసిన తర్వాత వాళ్లు మమ్మల్ని వదులుతారా? '' అని అవేశంగా మధ్యవర్తిని ప్రశ్నించింది. బ్రిటిష్ వారి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది..

అర్థరాత్రి అయింది. అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు. చీకటి మాటున గోర్డన్ సాహెబ్ ఒంటరిగా రాణిమహల్‌కు వచ్చాడు. "నా భార్యకు ఏడోనెల. బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. బ్రిటిష్ ప్రజలు కనిపిస్తే చంపేస్తున్నారు. కంటోన్మెంట్‌లో సిపాయిలు రేపు తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మీరు రక్షణ ఇవ్వకపోతే- మా ప్రాణాలకు ముప్పు తప్పదు. నా భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడండి..'' అని లక్ష్మిబాయిని వేడుకున్నాడు. లక్ష్మిబాయి మనసు కరిగింది. మహిళలకు, పిల్లలకు రక్షణ ఇవ్వటానికి అంగీకరించింది. మర్నాడు ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ అధికారుల భార్యలు, పిల్లలు రాణివాసానికి రహస్యంగా వచ్చేశారు.

జూన్ 9, 1857..
ఉదయం పది అయింది. ఒక్క సారి పెద్ద అల వచ్చినట్లు.. సైనికులందరూ రోడ్ల మీదకు వచ్చారు. సైనిక క్యాంపును కాపలా కాస్తున్న బ్రిటిష్ అధికారులను విచక్షణారహితంగా చంపేశారు. క్యాంపుకు నిప్పు అంటించారు. ఆ తర్వాత సైనికులందరూ రాణివాసం దగ్గరకు వచ్చారు. "మీరే మాకు సర్వ సైన్యా«ధ్యక్షురాలు. మీ ఆదేశాలు మేం పాటిస్తాం..'' అని పెద్దగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సైనిక దుస్తుల్లో రాణి లక్ష్మిబాయి వారి ముందుకు వచ్చింది. "పెద్ద యుద్ధం ఇంకా ముందు ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే శత్రువును తరిమి తరిమి కొట్టగలుగుతాం..'' అంటూ ప్రసంగించింది లక్ష్మీబాయి. ఝాన్సీ ప్రాంతానికి తాను రాణిగా పాలనాబాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయుధాల కర్మాగాలన్నింటిలోను ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికులకు బ్రిటిష్‌వారు తగ్గించిన వేతనాలను తిరిగి పెంచుతున్నట్లు ప్రకటించింది.

పరిపాలన షురూ..
రాణి లక్ష్మిబాయి చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేది. వ్యాయామం పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. పెళ్లి అయిన తర్వాత భర్త పెట్టిన నిబంధనల వల్ల వ్యాయామం మానేసినా భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వ్యాయామం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి కొద్ది సేపు కుస్తీ పట్టేది. ఆ తర్వాత బరువులు ఎత్తేది. ఈ రెండూ పూర్తయిన తర్వాత గుర్రపు స్వారీ చేసేది. గుర్రపు స్వారీలో అనేక రకాల విన్యాసాలు ప్రదర్శించేది. వేగంగా వెళ్తున్న గుర్రం మీద నుంచి గోడల మీదకు దూకేది. అక్కడ నుంచి కందకం సైతం దాటి బయటకు దూకేది. ఒక్కోసారి సుగంధద్రవ్యాలతో రెండు మూడు గంటలు స్నానం చేసేది.

ఆమె స్నానం కోసం పదిహేను నుంచి ఇరవై పెద్ద పెద్ద గుండిగలతో నీళ్లను కాచేవారు. స్నానం తర్వాత తెల్లని చందేరీ పట్టు చీరను కట్టుకొనేది. కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు బ్రిటిష్ పాలకులు అంగీకరించకపోవటంతో- లక్ష్మిబాయి తన శిరోజాలు తీయించుకోలేదు. శాస్త్ర ప్రకారం- శిరోజాలు తీయించుకోని విధవరాలు - కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్ప భగవంతుడిని పూజించకూడదు. అందువల్ల ప్రతి రోజు లక్ష్మిబాయి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ తర్వాత శివప్రార్థనకు ఉపక్రమించేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఆమె కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనేది. కొన్నిసార్లు ఆమె దర్బారుకు మగదుస్తులలో వచ్చేది. పంచె, పైన కోటు, కుచ్చుతలపాగా పెట్టుకొనేది. నడుముకు బంగారు ఎంబ్రైడరీ చేసిన గుడ్డ కట్టుకొనేది. దానికే కత్తి వేళ్లాడుతూ ఉండేది. కొన్ని సార్లు ఆమె ఆడవేషంలో కూడా దర్భారుకు వచ్చేది. భర్త మరణం తర్వాత లక్ష్మిబాయి ముక్కుపుడక పెట్టుకోవటం మానేసింది.

మట్టి గాజులు వేసుకోవటం మానేసి- బంగారు గాజులు మాత్రమే ధరించేది. మెడచుట్టూ ఒకే వరస ఉన్న ముత్యాలు, చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకొనేది. నాకు తెలుసున్నంత వరకూ ఆమె ఎప్పుడూ ఇతర ఆభరణాలు ఏమీ ధరించలేదు. ఆమె జుట్టును గుండ్రంగా చుట్టుకొనేది. కొన్ని సార్లు జడ కూడా వేసుకొనేది. ఆమె దర్బార్ హాలులో కూర్చున్నప్పుడు తెల్ల శాలువాను నెత్తి మీద నుంచి కప్పుకొనేది. రాజ ప్రధాని లక్ష్మణ రావు ఆమె ముందు నిలబడి ఉండేవాడు. ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఆమె జారీ చేసిన ఆదేశాలను నమోదు చేస్తూ ఉండేవారు. లక్ష్మిబాయి ఏ వివాదాన్నయినా చాలా సులువుగా పరిష్కరించేది. కొన్నిసార్లు నేరస్తులను ఆమే స్వయంగా కర్రతో కొట్టేది.

చూడటమే వేడుక..
లక్ష్మిబాయి గుర్రపు స్వారీని గాని, రథయాత్రను గాని చూడడం ఒక వేడుక. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆమె ర«థాన్ని రెండు వైపులా బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ కర్టెన్లతో మూసేసేవారు. మెరిసిపోయే ముత్యాల సెట్‌తో పాటు అందమైన పట్టుచీర కట్టుకొనేది. మగబట్టలు కట్టుకున్నప్పుడు తలపాగ తప్పనిసరిగా ఉండేది. ఆమె రథంతో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు పక్కన పరిగెడుతూ ఉండేవారు. వీరికి చిన్నతనం నుంచి రాణి పక్కన రథంతో పాటు పరిగెత్తటాన్ని శిక్షణ ఇచ్చేవారు. సాధారణంగా వీరు దక్షిణభారతదేశానికి చెందినవారై ఉండేవారు.

అందమైన ఈ అమ్మాయిలు ఒక చేతిలో బంగారపు కర్రలు, మరో చేతిలో బంగారపు విసనకర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే- వారిని చూడటానికి వందలమంది గుమిగూడుతూ ఉండేవారు. రథం ముందు కొందరు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉండేవారు. వెనక దాదాపు రెండు వందల మంది సైనికులు నడుస్తూ ఉండేవారు. వీరందరితో పాటు - రథం వెనక ప్రధానితో సహా అనేక మంది ముఖ్యాధికారులు కూడా ఉండేవారు. లక్ష్మిబాయి గుర్రం స్వారీ చేసేటపుడు ఇంత ఆర్భాటం ఉండేది కాదు. కొద్దిమంది అధికారులు, సైనికులు మాత్రమే ఆమె వెంట ఉండేవారు. రాత్రి అయితే ఆమెకు దారి చూపించటానికి కాగడాలను మోసేవారు కూడా ఉండేవారు. కాని చాలాసార్లు లక్ష్మిబాయి వారిని దాటి చీకట్లోనే కోటలోకి వెళ్లిపోయేది.

వందేళ్లకు ఇంగ్లీషులోకి...
విష్ణుభట్ గాడ్సే అనే చిత్‌పవన్ బ్రాహ్మణుడు బొంబాయి సమీపంలోని వార్సాయ్‌లో నివసిస్తూ ఉండేవాడు. కడు పేదవాడు. ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద యాగం జరుగుతోందని తెలిసి కొంతమందితో కలిసి అక్కడికి బయలుదేరి వెళతాడు. ఇంతలో సిపాయి తిరుగుబాటు మొదలవుతుంది. విష్ణుభట్ బృందం ఆ జ్వాలల్లో చిక్కుకుపోతుంది. ఒక పక్క బ్రిటిష్ సేనలు మరోపక్క భారతీయ సైనికులు వాళ్లందరిని తప్పించుకుంటూ ఆయన మో నుంచి ఢిల్లీ దాకా అనేక ప్రాంతాలు తిరిగాడు. 1857-58 మధ్య కొన్ని నెలల పాటు ఝాన్సీ కోటలో పురోహితుడిగా ఉన్నాడు.

లక్ష్మీబాయిని బ్రిటిష్ వాళ్లు చంపేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా బతుకుతెరువు కోసం ప్రయత్నించి చివరికి నిరాశతో స్వగ్రామం చేరుకున్నాడు. తాను ఉత్తరభారత దేశంలో చూసిన సంఘటనలన్నిటితోను మరాఠీలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మజాప్రవాస్: 1857 చా బండాసి హకీకత్ (నా ప్రయాణాలు: 1857 తిరుగుబాటు కథ). ఈ పుస్తకాన్ని ఆయన దాదాపు 30 ఏళ్ల తర్వాత రాస్తే అది అచ్చయి బయటికి వచ్చింది. 1907లో దానిలో ఝాన్సీ సంస్థానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు- విష్ణుభట్ స్వయంగా చూసినవి. మరికొన్ని వాళ్లు వీళ్లు చెప్పగా విన్నవి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇంగ్లీషులోకి అనువదించారు.

అనువాదం : సివిఎల్ఎన్ ప్రసాద్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి