9, జులై 2011, శనివారం

బిడ్డలు సల్లగుండాల

నగర వాతావరణంలో ఎన్నో హంగులు, ఆర్భాటాలు, మరెన్నో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల జీవన సరళి ఎంతగానో మారిపోయింది. కానీ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో గ్రామదేవతలకు సమర్పించే బోనాల పండుగలో మాత్రం ఏమార్పూ రాలేదు. దాదాపు 800 ఏళ్లకు పైగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ప్రజలంతా ఇంచుమించు ఒకేవిధంగా జరుపుకుంటున్న పండుగ బహుశ ఇదొక్కటేనేమో! ఆషాఢ మాసంలో ఎంతో వేడుకగా తెలంగాణ ప్రజలు జరుపుకునే బోనాల పండుగ విశేషాలను అవలోకిద్దాం...

భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, ఆరె మైసమ్మ, కట్టమైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా సాగనంపుతారు. ఈ పండుగకే బోనాలపండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. కొన్నిచోట్ల కొలుపులంటారు, మరికొన్ని చోట్ల సంబరాలనీ, ఇంకొన్ని చోట్ల జాతరలనీ, వేరొకచోట్ల తిరునాళ్ల అనీ... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ పేర్లకులాగే ప్రాంతాలవారీగా ఈ పండుగలు జరుపుకోవడంలో కూడా రకరకాలైన ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. 

ఎందుకు సమర్పిస్తారు?
ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్ట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు.

బోనంలో ఏముంటుంది?
బోనమంటే మరేమిటో కాదు, గ్రామదేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారు చేసే నైవేద్యమన్నమాట. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో ఉంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. (అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలంటారు). దీనిని తయారు చేయడమే కాదు, సమర్పించడం కూడా ఎంతో విశిష్టమైనదే! మట్టి కుండ లేదా రాగి, ఇత్తడి, స్టీలు పాత్ర లేదా బిందెలను సున్నం పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అందులో అన్నం, పెరుగు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఉంచుతారు. దానిపై వేపమండలు వేసి దానిపై చేయి పెట్టి అందులో చింతపండు నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు కలుపుతారు. దాని మీద మూత పెట్టి ఆ మూత మీద దీపం వెలిగిస్తారు. దీనినే గండదీపం అంటారు. ముఖంపై పసుపు రాసుకుని, కుంకుమ దిద్దుకుని, ముందుగా సిద్ధంచేసుకుని ఉంచిన బోనాన్ని భక్తిశ్రద్ధలతో తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. కొందరు భక్తులు తమ మొక్కుబడిని బట్టి, శక్తిని బట్టి ఇతర కానుకలు కూడా సమర్పిస్తారు. 

పోతురాజుల వీరంగం
పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లను కాపలా కాసేందుకు వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి, కాళ్లకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మకాయలు పెట్టుకుని, కంటినిండా కాటుక, నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, పేనిన కొబ్బరి లేదా నూలు తాళ్లకు పసుపు రాసి, దానిని కొరడాలా ఝుళిపిస్తూ, పాటలకు అనుగుణంగా చిందులేస్తూ సందడి చేస్తారు. పోతురాజుల కొరడా దెబ్బ తగిలితే పిశాచ భయం పోతుందని, దుష్టశక్తులు దూరమవుతాయని, కీడు తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఆలయం చేరగానే పోతురాజులు గావుపడతారు. అంటే సొరకాయ లేదా గుమ్మడికాయను కొరికి, అమ్మవారికి దిగతుడిచి నేలమీద ఒకేదెబ్బతో పగిలేటట్లు బలంగా కొడతారు. ఒకప్పుడు వీటిస్థానంలో మేకలు, గొర్రెపోతులు లేదా కోళ్ల మెడను ఒక దెబ్బతో కొరికేవారు. ఇప్పుడు జంతుబలులను నిషేధించడంతో వాటిబదులు సొరకాయలు, గుమ్మడికాయలతో దిష్టితీస్తున్నారు. 

ఫలహారం బళ్లు...
అమ్మవారికి సమర్పించే ఫలహారాలను బళ్లమీద అలంకరించి, వాటిని ఊరేగింపుగా ఆలయాలకు తీసుకెళ్లడం ఆచారం. ఇలా అలంకరించిన పలారపు బళ్లను మేకలు లాగుతాయి. 

అంగ‘రంగై’వెభవం
బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పడం. రంగం చెప్పడమంటే భవిష్యవాణిని వినిపించడమే. అంటే రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి... వంటి వివరాలు చెప్పడమన్నమాట. ఒక కుటుంబానికి చెందిన అవివాహిత మహిళ మాత్రమే తరతరాలుగా ఇలా రంగం చెప్పే సంప్రదాయముంది.

సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా.... కిక్కిరిసిన భక్తుల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటీలు పడ తారు. గర్భగుడిలోని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆ అమ్మ అంశను తనలో ఇముడ్చుకుందా అన్నట్లు పచ్చికుండపై పాదంమోపి భక్తి పూనకంతో ఊగిపోతూ భవిష్యద్వాణిని వినిపిస్తుందీమె. 

తెలంగాణ పల్లెపదాలు
ఆడ, మగ, చిన్న, పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణలో ‘‘గండిపేట గండెమ్మా దండం బెడ త ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., బోనాలెత్తుకుని రావమ్మో, బోనాలోళ్ల చిన్నమ్మా... అమ్మా బెలైల్లినాదే తల్లీ బెలైల్లినాదే.... అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా, కోడిబాయ లచ్చమ్మదీ ... వంటిపాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి.

తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే!
మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు ఇప్పటికే అమ్మ తొలిబోనం అందుకుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్‌దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు. 

పరమాత్మలో చేరే జీవాత్మ
బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్మాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్ర పరంగా చూస్తే వేపాకు, పసుపు, బోనాల పాటలు నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్యవిన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరికీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఇప్పటికాలంలో ఎంతో అవసరం. అమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం.

- డి .వి.ఆర్. భాస్కర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి