7, జులై 2011, గురువారం

గుడ్డి కుక్క(కధ)

గుడ్డి కుక్క
మూలం: ది బ్లైండ్ డాగ్
ఆర్‌కె నారాయణ్

అది సంపన్నుల ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతున్న మేలు జాతి కుక్క కాదు. వీధికుక్క. ఎప్పుడూ ఒండినిండా ధూళితో కనిపించే ఈ కుక్క ఎక్కువగా మార్కెట్ దగ్గర ఉన్న చెత్త కుప్పల దగ్గర సంచరిస్తుంది. దాని శరీరంపై చాలా గాట్లు కనబడతాయి. ఆహారం కోసం మిగతా కుక్కలతో కలబడినప్పుడు దాని ఒంటి మీద పడిన గాట్లు అవి. పొద్దంతా వీధులు, సందుగొందులు తెగ తిరుగుతుంది. రాత్రి అయ్యాక మాత్రం మార్కెట్‌గేట్ దగ్గరకు వచ్చి నిద్రపోతుంది.
రెండు కళ్లూ లేని ఒక గుడ్డి భిక్షగాడు రోజూ మార్కెట్ గేట్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. ఒక ముసలావిడ పొద్దుటే భిక్షగాడిని తీసుకువచ్చి జాగ్రత్తగా కూర్చోపెడుతుంది. మధ్యాహ్నం అతడి కోసం తిండి పట్టుకొస్తుంది. మళ్లీ రాత్రి సమయంలో వచ్చి ఇంటికి తీసుకువెళుతుంది.

ఒకరోజు భిక్షగాడి చిప్ప నుంచి వచ్చే తిండివాసన గేటు సమీపంలో పడుకున్న కుక్క ముక్కుపుటాలకు సోకింది. అది భిక్షగాడి దగ్గరికి వెళ్లి తోకను ఊపుతూ అతని ముందున్న చిప్పలోని తిండిని తినడం మొదలుపెట్టింది. భిక్షగాడు ‘ఎవరది?’ అన్నాడు గట్టిగా. కుక్క వెళ్లి అతని చేతిని నాకడం మొదలుపెట్టింది. ‘‘ఓహో! నువ్వా! కడుపు నిండా తిను. తిని నాతోరా’’ అన్నాడు. అలా వారి మధ్య ఆరోజు నుంచి స్నేహం మొదలైంది. రోజూ కుక్క ఆ భిక్షగాడి దగ్గరికి వచ్చిపోయేది. దారిన పోయేవాళ్లు ఎవరైనా అతనికి డబ్బులు ధర్మం చేయకుండా వెళితే కుక్క పరుగెత్తుకు వెళ్లి చొక్కా పట్టుకొని సున్నితంగా లాక్కొచ్చేది. పైసో పరకో వేసే వరకు వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేది. కుక్క వల్ల భిక్షగాడి ఆదాయం కూడా పెరగడం ప్రారంభమైంది. కుక్క కనిపించకుండా పోయినప్పుడు భిక్షగాడు చాలా ఇబ్బంది పడేవాడు. ‘ఎక్కడికి వెళ్లావు టైగర్?’ అని రోజంతా అసహనంతో అరుస్తుండేవాడు. భిక్షగాడికి ఇరువైపులా రకరకాల చిన్న చిన్న వ్యాపారులు ఉండేవాళ్లు.

ఆరోజు భిక్షగాడిని తీసుకువెళ్లడానికి ముసలావిడ రాలేదు. చీకటి పడుతోంది. అతనిలో ఆందోళన మొదలైంది. ఎవరో వచ్చి....
‘‘ముసలమ్మ ఈ మధ్యాహ్నమే చనిపోయింది’’ అని చావువార్త చల్లగా చెప్పాడు.
ఈ ప్రపంచంలో తనకున్న ఏకైక ఆధారాన్ని, దిక్కును గుడ్డిభిక్షగాడు కోల్పోయాడు. ఇప్పుడు తనని ఎవరు పట్టించుకుంటారు?
రిబ్బన్లు అమ్మే వ్యాపారి భిక్షగాడి దగ్గరకు వచ్చి ‘‘నువ్వేమీ బాధ పడకు... ఇది తీసుకో’’ అని పొడవాటి తెల్లటి రిబ్బను చేతిలో పెట్టాడు. ‘‘దీన్ని కుక్క మెడకు కడితే అదిక నిన్ను విడిచే సమస్యే ఉండదు’’ అని సలహా ఇచ్చాడు. ఎప్పుడైతే కుక్క మెడలో రిబ్బన్ చేరిందో ఇక ఆనాటి నుంచి అది తన స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయింది. దాని విశాలప్రపంచం గుడ్డివాడి జీవితం చుట్టూ కుదించుకుపోయింది. స్వేచ్ఛగా తిరిగే కుక్కలను చూసినప్పుడల్లా దాని మనసును దుఃఖం ఆవరించేది. అది తరచుగా యజమాని చేతుల్లో దెబ్బలు తినేది. పోను పోనూ కుక్క తన సహజమైన శైలిని కోల్పోవడం ప్రారంభించింది. భిక్షగాడికి బానిసలా మారిపోయింది. నెలలు గడుస్తున్న కొద్దీ కుక్క శారీరకస్థితిలో మార్పు రావడం మొదలైంది. అదొక బొక్కలగూడుగా తయారైంది.

గేట్ దగ్గర ఉండే వ్యాపారులు కుక్క గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు:
‘‘ఆ కుక్కను చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఏదో ఒకటి చేసి స్వేచ్ఛ కలిగించకపోతే అది ప్రాణాలు కోల్పోవడం ఖాయం. భిక్షగాడికి డబ్బు పిచ్చి పట్టుకుంది. అడుకున్నదాంతో తృప్తి పడక డబ్బును వడ్డీలకు ఇవ్వడం మొదలెట్టాడు. తనకు అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదించడానికి కుక్కకు నరకం చూపెడుతున్నాడు. ఏదో ఒకటి చేయాలి’’ అనుకున్నారు వాళ్లు.
అప్పుడు వాళ్ల దృష్టి రిబ్బన్‌లు అమ్మే దుకాణంలో వేలాడుతున్న కత్తెర మీద పడింది. ‘‘అది ఇలా ఇవ్వు’’ అని ఆ కత్తెరను చేతిలోకి తీసుకున్నాడు ఒకడు. మెల్లగా వెళ్లి కుక్క మెడలోని తెల్ల రిబ్బన్‌ను కత్తిరించాడు. ఇదే అదనుగా కుక్క వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసింది. కుక్క తప్పించుకున్న విషయాన్ని భిక్షగాడు పసిగట్టి ‘టైగర్...టైగర్ ’ అని పిలవడం మొదలుపెట్టాడు. ఇక టైగర్ తన దగ్గరికి రాదని నిర్ధారించుకున్న గుడ్డి భిక్షగాడు ఏడ్వడం మొదలు పెట్టాడు. అతని ఏడుపుకు అక్కడి వాళ్లు ఎవరూ చలించలేదు.
‘‘రాక్షసుడా! ఈ జన్మలో ఆ కుక్కను పట్టుకోలేవు. కుక్కకు ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వచ్చాయి’’ అన్నాడు ఒక వ్యాపారి.

* * *
ప్రపంచంలోని సంతోషమంతా కుక్క కళ్లలో కనిపిస్తోంది. టీ-స్టాల్, బేకరీ, మటన్‌కొట్టు...కుక్క తనకు ఇష్టమైన చోట్లకు మళ్లీ మళ్లీ తిరగడం మొదలెట్టింది.
‘‘నా కుక్క నన్ను విడిచి పారిపోయిందయ్యో...ఎవరైనా ధర్మప్రభువులు దాన్ని వెదికి పట్టిస్తే జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటున్నాడు దీనంగా. కుక్క లేకపోవడంతో అతనికి దారి తోచడం లేదు. భిక్షగాడి దుఃఖం నుంచి కోపం పొంగుకొస్తోంది. కసిగా ఇలా అరిచాడు:
‘దానమ్మ...నా చేతికి ఒక్కసారి చిక్కితే, చావ చితగ్గొట్టి చంపి పాతరేస్తాను’
డజన్ల సంఖ్యలో పరుగెడుతున్న వాహనాల మధ్య అతను రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. అయితే ఇదేమీ వ్యాపారులకు జాలి కలిగించడం లేదు. పైగా ‘తిక్క కుదిరింది’ అన్నారు. ఎవరినో ఒకరిని పట్టుకొని బతిమిలాడి రోడ్డు దాటి తానుండే చోటుకు అతికష్టం మీద వెళ్లగలిగాడు భిక్షగాడు.
పదిరోజులు, పదిహేను రోజులు...రోజులు గడుస్తున్నాయి. కుక్క జాడలేదు.
‘‘సంతోషంతో టైగర్ ఈ భూగోళమంతా తిరుగుతూ ఉండొచ్చు. భిక్షగాడికి అదిక చచ్చినా దొరకదు’’ అనుకున్నారు వ్యాపారులు.

కాని ఒకరోజు ఆశ్చర్యపరిచే దృశ్యం కనిపించింది.
‘‘అటు చూడండి.... భిక్షగాడు మళ్లీ కుక్కతో పాటు వస్తున్నాడు’’ అని ఎవరో అరిచారు. అందరూ నమ్మలేనట్లు అటు వైపు చూశారు. కానీ అది నిజంగా నిజమే!
రిబ్బన్ల వ్యాపారి భిక్షగాడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి-
‘‘ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? కనబడలేదు?’’ అని అడిగాడు.
‘‘వోర్నీ...నీకు విషయం తెలియదా ఏమిటి? ఈ పాడు కుక్క నన్ను మోసం చేసి పారిపోయింది. ఇది నా దగ్గరికి రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ఆకలిదప్పులతో చచ్చి ఉండేవాడిని, చేతిలో చిల్లిగవ్వ లేదు’’ అన్నాడు గుడ్డివాడు.
‘‘మరి కుక్కను ఎక్కడ దొరకపట్టావు?’’ అని అడిగాడు రిబ్బన్ల వ్యాపారి.

‘‘దొరకపట్టలేదు. నిన్న అర్ధరాత్రి అదే నా దగ్గరకు వచ్చింది. నా మూతిని నాకడం మొదలెట్టింది. లేచి చూసేసరికి టైగర్... చంపేద్దామన్నంత కోపం వచ్చింది. గట్టిగా తన్నాను. చేతికి దొరికిన వస్తువుతో కొట్టాను. అయినా అది నన్ను విడిచి పోలేదు. అప్పుడిక దాన్ని క్షమించాను. చూశారా... టైగర్‌ను గొలుసుతో కట్టేశాను. ఇక తప్పించుకొని పారిపోవడం దీని అబ్బతరం కూడా కాదు’’ అన్నాడు భిక్షగాడు గర్వంగా.
కుక్క కళ్లలో మరోసారి దీనస్థితి, చావుకళ కనిపించింది.
‘పద వెధవ...’ అని గొలుసును గట్టిగా లాగాడు భిక్షగాడు.
కుక్క భారంగా అడుగులో అడుగు వేస్తోంది.
‘‘చావు మాత్రమే ఆ కుక్కకు విముక్తి కలిగించగలదు’’ బాధతో గట్టిగా అన్నారు ఎవరో.
యజమాని మీద విశ్వాసంతో వచ్చిన మూగజీవికి నరకం ప్రతిఫలంగా లభించింది. భిక్షగాడు కాదు కుక్కే గుడ్డిది. విశ్వాసం, ప్రేమతో దాని కళ్లు మూసుకుపోయాయి. పాపం టైగర్!

అనుసృజన: యం.డి.యాకూబ్ పాషా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి