20, జులై 2011, బుధవారం

పేదరికం (కధ)

- వాణిశ్రీ


శివానందుడు గురుకులంలోని విద్యార్థులకు ద్రుపదుడు, ద్రోణుల కథ చెప్పాడు.
ద్రుపదుడు, ద్రోణులు గురుకులంలో సహాధ్యాయులు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పేదరికంలో కన్నకొడుక్కి పాలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాడు.

ద్రోణుడి భార్య ‘‘మీ సహాధ్యాయి మహారాజయ్యాడు గదా! మీరు వెళ్లి ఒక ఆవును దానంగా ఇవ్వమని అడగండి. పిల్లవాడికి కడుపు నిండా పాలు తాగించవచ్చు’’ అన్నది.
గురుకులంలో ఉన్న విద్యార్థులంతా రాజులు, మంత్రులు, ధనవంతుల పిల్లలు. అందులో విక్రముడు అనే శిష్యుడు లేచి, ‘‘గురువర్యా! పేదరికం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

శివానందుడు వెంటనే సమాధానం చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు. పేదరికం అంటే ఏమిటో గురువు గారికే తెలియదని విక్రముడు సహాధ్యాయులతో అన్నాడు.
ఒకరోజు శివానందుడు బయల్దేరుతూ, ‘‘మీరంతా ఈ రోజు చెప్పులు వేసుకోకుండా నా వెంట నడిచి రండి’’ అన్నాడు.

గురువుగారు తమకి కొత్త చెప్పులు తయారు చేయించడానికి తీసుకెళ్తున్నాడేమోనని అందరూ సంబరపడ్డారు. చెప్పులు లేకుండా నడవడం మొదలుపెట్టారు. కాళ్లకు పలుకురాళ్లు గుచ్చుకుంటున్నాయి. ఎండ ముదిరిన తర్వాత వేడికి కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. కొందరికి ముళ్లు గుచ్చుకున్నాయి. అయినా బాధను ఓర్చుకుంటూ గురువుని అనుసరించారు.

మిట్టమధ్యాహ్నమైంది. అందరికీ ఆకలవుతోంది. ఆశ్రమంలో ఈపాటికి గురుపత్ని అందరికీ ఆహారం వడ్డించేది. గురువు అందరినీ ఒక చెట్టు నీడకు చేర్చాడు.
‘‘తినడానికి ఏమీలేదు. ఆ సెలయేట్లో నీళ్లు తాగి ఆకలి తీర్చుకోండి’’ అన్నాడు.

అందరూ సెలయేట్లోకి వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగారు. తాత్కాలికంగా కడుపు చల్లబడింది. తర్వాత మామూలే. కడుపులో మంట మొదలైంది. ఎలాగో ఓర్చుకున్నారు. కాసేపు చెట్టు కింద విశ్రమించారు.
ఇంతలో మబ్బులు కమ్ముకొన్నాయి. గాలివాన మొదలైంది. తల దాచుకోవడానికి ఎక్కడా ఇల్లు లేదు. చెట్టు కిందనే నిలబడిపోయారు. వర్షం పెద్దదైపోయింది. అందరూ తడిసిపోయారు. మార్చుకోవడానికి మరొక జత దుస్తులు లేవు. చలికి గజగజ వణకసాగారు.

కొంతసేపటికి వర్షం వెలిసింది. బతుకు జీవుడా అంటూ అంతా గురుకులం చేరుకున్నారు.
‘‘గురువర్యా! మమ్మల్ని చెప్పులు లేకుండా అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు?’’ అని విక్రముడు అడిగాడు.
శివానందుడు నవ్వి, ‘‘మీకు పేదరికం అంటే ఏమిటో తెలియజెప్పటానికే’’ అన్నాడు.
శిష్యులు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు.

‘‘చెప్పులు లేకపోవడం వలన బాధ అనుభవించారు. ఆకలైనప్పుడు తినడానికి ఆహారం లేక అలమటించారు. ఎండ, వానల నుంచి తలదాచుకోవడానికి ఇల్లు లేకపోవడం ఏమిటో చెట్టు కింద వర్షంలో తడిసినప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది. వానకి ఒంటిమీద దుస్తులు తడిస్తే, కట్టుకోవడానికి మరొక జత లేక చలికి వణికారు. పేదరికం అంటే అదే. కూడు, గూడు, గుడ్డ లేకపోవడమే పేదరికం’’ అని వివరంగా చెప్పాడు శివానందుడు.

పేదవాళ్లు అవసరాలు తీరక ఎంత బాధపడుతుంటారో అనుభవ పూర్వకంగా తెలియజెప్పడానికే గురువు ఇలా చేశాడని శిష్యులకు అర్థమైంది. ఆయనకు వందనాలు సమర్పించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి