20, జులై 2011, బుధవారం

హ.... కథవిధీ


--నాయుని కృష్ణమూర్తి

అన్వేషి కథలు రాయడానికి నిర్ణయించుకొన్నాడు. అతడెప్పుడూ కథలు చదవలేదు. తెలివైనవాడు కాబట్టి మొదట వీలైనన్ని కథలు చదివి, ఆ తర్వాత కథాగర్భం తెచ్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు.

మార్కెట్లో దొరికే అన్ని పత్రికలూ కొన్నాడు, దినపత్రికల్లో సహా. అన్నీ ముందు పెట్టుకొని దీక్షగా చదివాడు. చాలా కథలు అర్థంకాలేదు అన్వేషికి. కొన్నింటిలో భాష అసలు అర్థం కాకపోవడం వల్ల చదవడం చాలా ఆలస్యమైంది. మొత్తం మీద మొదటి మారుగా కొన్న పత్రికల్లోని అన్ని కథలు పూర్తయ్యాయి. ఈ లోపల మార్కెట్లో కొత్త పత్రికలు వచ్చాయి. వాటినీ కొన్నాడు. ఆ కథలూ చదివే లోపల మళ్లీ కొత్తవి.

తొమ్మిది నెలలు గడిచిపోయాయి.
ఈ కథలు చదివే కాలంలో అన్వేషికి చాలామార్లు కడుపు ఉబ్బరించింది. కథాగర్భం రావడం వల్ల కడుపు పెద్దదయింది అని పొరబాటు పడ్డాడు. తర్వాత విరేచనాలు, వాంతులు అయ్యాయి. కథాగర్భం కాదని అన్వేషికి అర్థమయింది.

అన్వేషిలో మానసికంగా కూడా చాలా మార్పు వచ్చింది. స్పష్టమైన ఆలోచన ఏదీ రావడం లేదు. మనసంతా గజిబిజి, గందరగోళం. ప్రపంచమంతా దీనమైన, హీనమైన, విషాదభరితమైన పాత్రలతో నిండిపోయిందా అనిపించింది అన్వేషికి.

ఇది కథ రాయాలి -
కథకు ఒక నీచమైన, నికృష్టమైన, సమాజం ఇనుప పిడికిళ్లలో నలిగిపోతున్న, వ్యథాభరితమైన ఒక పాత్ర కావాలి!
ఎంత ఆలోచించినా అన్వేషికి రాయాల్సిన కథ స్ఫురించలేదు. వీధులు తిరిగాడు, ఊళ్లు తిరిగాడు.
హఠాత్తుగా ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి ముష్టి వాళ్ల మీద మొదటి కథ రాయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇక, ఆ దృష్టితో ముష్టివాళ్లను వెదకి ఎవర్నైనా ఒకర్ని ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత కథ రాద్దామనుకొన్నాడు. అలా చేస్తే కథలో వాస్తవికత ప్రతిబింబిస్తుంది అని బలంగా అనిపించింది.
మూడు రోజుల ప్రయత్నం తర్వాత ఒక ముష్టివాడు ఒంటరిగా ఒక చెట్టు కింద దొరికాడు అన్వేషికి.
ధైర్యం చేసి అతడి దగ్గరికి వెళ్లి, పక్కనే ఒక చిన్న తిన్నెలాంటి రాయి కనిపిస్తే కూర్చున్నాడు.
అన్వేషి వంక ఆ వ్యక్తి అనుమానంగా, చిరాగ్గా, ఇబ్బందిగా, భయంగా, ప్రశ్నార్థకంగా, కోపంగా చూశాడు.

బలవంతాన ముఖం మీద నవ్వు పులుముకొని, ‘‘నీ పేరు?’’ అని మొదటి ప్రశ్న వేశాడు అన్వేషి.
అతడు సమాధానం చెప్పలేదు. అయోమయంగా చూశాడు ప్రశ్నించిన వ్యక్తి వంక.
మాటలు పెగలడం లేదు అన్వేషికి. దగ్గి గొంతు సవరించుకొన్నాడు. జుబ్బాను పెకైత్తి ముఖం మీద పట్టిన చెమటలు తుడుచుకొన్నాడు. జేబులు తడుముకొన్నాడు. తల సవరించుకొన్నాడు.
చెట్టు కింది వ్యక్తి పైకి లేచి అక్కణ్ణుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని అతని శరీర కదలికల్ని బట్టి అన్వేషి గ్రహించాడు.

దొరికిన అవకాశం చేజారిపోతున్నట్టు అనిపించింది అన్వేషికి. ‘‘ఆగాగు. యెల్లిపోకు. నేను కద రాద్దామని..’’ నసిగాడు.
‘నేను కద రాద్దామని...’ మళ్లీ మొదలుపెట్టాడు అన్వేషి.
వీడెవడో పిచ్చిమాలోకమని అర్థమయింది అవతలి వ్యక్తికి. కాస్సేపు కాలక్షేపం అవుతుంది కదా అనుకొన్నాడేమో, సర్దుకొని కూర్చుని బీడీ ముట్టించాడు. రెండు దమ్ములు లాగి అడిగాడు. ‘‘ఏందీ... కద రాద్దామనుకొంటున్నావా?’’ ఆ అడగడంలో కొంత ఎగతాళి కూడా ధ్వనించింది.
నేరం చేస్తున్నవాడిలా తల ఊపాడు అన్వేషి.

‘‘కదంటే...’’ నింపాదిగా అడిగాడు బీడీ దమ్ము లాగుతూనే.
‘‘కదంటే...’’ అని ఆగి, సమాధానం చెప్పడానికి బదులు, భుజానికి తగిలించుకొన్న సంచీలో నుండి ఒక పత్రిక ఇవతలికి లాగి, ఏదైనా కథ కనిపిస్తుందేమోనని గబగబా పేజీలు అటూ యిటూ తిప్పుతూ, ‘‘నీ పేరు...’’ అన్నాడు.
‘‘నర్సిమ్ములు.’’
పత్రికలో ఒక పేజీ దగ్గర ఆగాడు అన్వేషి. ఆ పేజీని నర్సిమ్ములుకు చూపిస్తూ, ‘‘కదంటే ఇది’’ అన్నాడు.

నర్సిమ్ములు అన్వేషి వంక జాలిగా చూస్తూ, ‘‘తమదే ఊరు?’’ అడిగాడు.
‘‘యీ వూరే.’’
‘‘వంట్లో బాగుండ్లేదా?’’
అన్వేషి సమాధానం చెప్పకుండా నర్సిమ్ములు వంక సూటిగా చూశాడు.
నర్సిమ్ములు సర్దుకొన్నాడు. ‘‘కదంటే నాకు తెల్దయ్యా. నువ్వేదో ఆ బుక్కులో సూపిస్తా ఉండావు. కదంటే అదేనా?’’

ఔను అన్నట్టు తల ఊపాడు అన్వేషి.
‘‘మీరు పెద్దోళ్లు. మీరు కదల్రాస్తారో, ఏం రాస్తారో నాకు తెల్దు. ఇదంతా నాకెందుకు సెప్తా ఉండావో అసలు తెల్దు. గంగమ్మ తల్లి మీద ఒట్టు.’’
నర్సిమ్ములు ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో అన్వేషికి కూడా తెలీలేదు. అయినా ప్రయత్నం చేస్తూ, ‘‘నువ్వుండావు నర్సిమ్ములూ. జీవితంలో యెన్నో అగసాట్లు పడుంటావు కదా. అవన్నీ నేను తెల్సుకోని రాస్తే కదవుతుంది. యిలాంటి బుక్కులో యేస్తారు’’ అన్నాడు.

నర్సిమ్ములు నోరు తెరిచేశాడు. ‘‘నా ఇవరాలన్నీ దాంట్లోకి ఎక్కిస్తారా? వద్దులే సామీ. నా మానాన నన్ను ఇట్టుండనీ. అయినా ఆ కద రాస్తే నాకేం ఉపయోగం?’’ లాయర్లా అడిగాడు.
‘‘ప్రపంచమంతా నీ గురించి తెలుసుకుంటుంది. అయ్యో పాపం అనుకుంటుంది. అంతేకాదు. ప్రపంచం ముష్టివాళ్ల పట్ల తన దురుష్టి కోనమే మార్చేసుకుంటుంది నర్సిమ్ములూ...’’
‘‘దాంతో నాకేమొస్తుంది?’’
చప్పున సమాధానం చెప్పాడు అన్వేషి. ‘‘నీ కద అందరికీ తెలిస్తే, సదివినోళ్లంతా నీమీద సానుబూతి సూపిస్తారు.’’
‘‘దాంతో నాకేమొస్తుంది?’’ మళ్లీ అదే ప్రశ్న వేశాడు నర్సిమ్ములు.

‘‘అదేనయ్యా. నిన్నిప్పుడు అందరూ కసురుకొంటారు కదా. అట్లా సెయ్యరు. అయ్యో పాపం అని సాయం సేస్తారు.’’
‘‘నాకయితే నమ్మకం కుదర్లేదు’’ ఆరిపోయిన బీడీ ముక్కను నోటితోనే తుపుక్కున ఉమ్మేశాడు నర్సిమ్ములు.
‘‘పాటకుల్లో వొకరో యిద్దరో అయినా మారిపోతారు నర్సిమ్ములూ’’ - నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, లేకుంటే ఇన్ని వందల కథలు ముష్టివాళ్ల మీద ఎందుకొస్తాయి? అనే పద్ధతిలో సమాధానమిచ్చాడు అన్వేషి.
నర్సిమ్ములు తల అడ్డంగా రెండు మూడు మార్లు ఊపాడు.

అన్వేషి మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘యిలాంటి పుస్తకాల్లో ముష్టోళ్ల మీదే కాదు... అప్పులు తీర్చలేక పానాలు తీసుకునేవాళ్లమీదా, బూములు అమ్ముకొని యేడ్చేవాళ్ల మీదా, పేదోల్ల రగతం తాగే భూకామందుల మీదా, బిడ్డలికి యింత అన్నం పెట్టాలని యబిచారం సేసేవాళ్లమీదా... అందరి మీదా కదలు రాస్తారు.’’

ఆశ్చర్యంగా తల పంకించాడు నర్సిమ్ములు. ఇక వినే ఓపిక లేనట్లు భుజం పైనున్న తుండుగుడ్డను విదిలించుకొంటూ పైకి లేచి, ‘‘ఏమో సార్! నువు సెప్పినోల్లందరి మీద కదల్రాసి రాసీ, మీ రాసేవోళ్లు గ్యానం పెంచుకుంటా ఉండారేమో. నాకయితే ఏమీ బుర్రకెక్కడం లేదు. నువ్వు ఎవురిమీదయితే కద రాస్తావో ఆల్లెవురూ నీకదల్జదవరు. నువ్వే రాసుకోవల్ల. నువ్వే సదువుకోవల్ల!’’ అని తను చెప్పదలచుకొన్నది తేల్చి చెప్పినట్లు, అన్వేషితో సంబంధం లేనట్లు ఆ దృశ్యం నుండి నిష్ర్కమించాడు.

దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిన అన్వేషి, ఒక నిశ్చయానికి వచ్చినవాడివలే లేచి నేరుగా పత్రికా కార్యాలయం వైపు అడుగులు వేయసాగాడు. ఎలాంటి కథ రాయాలన్న ఆలోచన అతడి మనసులో సుళ్లు తిరుగుతూనే ఉంది. తెలుగుపత్రిక సంపాదకుడితో మాట్లాడితే మరికొంత స్పష్టత వస్తుంది అని బలంగా అనిపించింది.

పత్రికా కార్యాలయంలో మొదటి మారుగా అడుగుపెట్టిన అన్వేషి ఒకమారు తల విదిలించుకోవడమే కాదు, తన ఒంటిని తనే గిచ్చుకొని, మేలుకొనే ఉన్నానని ధ్రువపరచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.

అతడు నేరుగా లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా కొన్ని బల్లలు అడ్డంగా కనిపించాయి. ఒక్కో బల్ల వెనుక ఒక స్త్రీ మూర్తో, పురుష మూర్తో నిలబడి లోపలికి వస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు.
మొదటి అడుగుపెట్టిన అన్వేషిని, మొదటి బల్ల ఆధిపత్యం వహిస్తున్న స్త్రీమూర్తి ఆపి, ‘‘మీ పేరు, చిరునామా, మిగిలిన వివరాలు ఈ కాగితంలో రాయండి’’ అంది.
అన్వేషి రాశాడు.
రెండో బల్ల దగ్గరున్న వ్యక్తి, ‘‘మీరెవరో రుజువు చేయగలిగిన గుర్తింపు కార్డు చూపెట్టండి’’ అన్నాడు.
అన్వేషి చూపెట్టాడు.

మూడో బల్ల వెనుకనున్న వ్యక్తి, ‘‘మీకు తెలిసి, మీకు ఏవైనా జబ్బులు ఉన్నాయా?’’ అని అడిగాడు.
‘‘లేవ్!’’ కచ్చితంగా చెబుతున్నట్టు చెప్పాడు అన్వేషి.
‘‘మీ బీపీ చూడాలి’’ అన్వేషి చెయ్యి ముందుకు చాపాడు.
బీపీ పరీక్ష అయింది.
‘‘గతంలో ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా?’’ ఆ వ్యక్తే అడిగాడు.
‘‘ర్యాలా!’’

‘‘మంచిది. వస్తే వెంటనే ఈ మూడు టాబ్లెట్లు వేసుకోండి. పరీక్షల ఖర్చు నిమిత్తం అయిదు వందల రూపాయలు ఆ కౌంటర్లో కట్టి రసీదు తీసుకోండి. ఇక్కడ ఈ రిజిస్టర్లో మీ వేలి ముద్ర వేసి వెళ్లండి.’’
‘‘సమించండి. యిన్ని పరీస్సలు, యీ తతంగం అంతా యెందుకో తెల్సుకోవచ్చా? అసలు యిది తెల్గుపత్రిక కార్యాలయమే కదా!’’

ఆ వ్యక్తి అన్వేషి ముఖం వంక ఎగాదిగా చూసి అన్నాడు. ‘‘మీరెవరు? మీ ముఖం చూస్తుంటే ఇంతవరకూ తెలుగు పత్రిక కార్యాలయంలో అడుగుపెట్టిన పాపాన పోయినట్లు లేదు.’’
‘‘నిజమేనండి! నాకెప్పుడూ లోపలికి అడుగుపెట్టాల్సిన అవసరం యేర్పడలేదు. నేన్లోపలికెల్లొచ్చా?’’
‘‘అది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.’’

అన్వేషికి అయోమయంగా ఉంది. విసుగ్గా ఉంది. కోపంగా ఉంది. ఉక్రోషంగా ఉంది. తన పరిస్థితికి తనమీద తనకే జాలిగా కూడా ఉంది. గందరగోళంగా ఉన్న మనసును అదుపులో పెట్టుకొంటూ, ‘సంపాదకుడు’ అని బోర్డు ఉన్న గది తలుపుని విసురుగా తోశాడు. కీచుమని శబ్దం చేస్తూ తలుపయితే తెరచుకొంది గాని, ఎదురుగా కనిపిస్తున్నది సంపాదకుని గది కాదేమో అని అనుమానం కూడా కలిగింది.

ఆ గది జన సమూహంతో కిక్కిరిసి ఉంది. ఎవరు ఎవరో ఏమీ అంతుబట్టడం లేదు. సంపాదకుడు ఎక్కడున్నాడో అన్వేషి కనిపెట్టలేకపోయాడు. మధ్యలో ఏడెనిమిది మంది ఒకేచోట గుమిగూడి ఉండడంతో అన్వేషి అక్కడికి దోవచేసుకొని వెళ్లాడు.

అక్కడ, సింహాసనం లాంటి ఒక కుర్చీమీద ఒకతను కూర్చొని ఉన్నాడు. మనిషి ఆజానుబాహువులాగా ఉన్నాడు. ఎత్తు ఏడెనిమిది అడుగులు ఉంటాడేమో! అతడి మెడలో ‘తెల్గు కథాకుమార్’ అనే బోర్డు వేలాడుతూ ఉంది.

చుట్టూ గుమిగూడినవాళ్లు ఆ కథాకుమార్‌ను తమ శక్తివంచన లేకుండా బాధిస్తున్నారు. పైగా ఒక దెబ్బకొట్టడం - వీపు మీద ఒక చరుపు చరిచి ‘సెహబాష్! కలికితురాయి లాంటి ఒక కథ నీ ఖాతాలో జమయింది’ అనడం.

అన్వేషి కథాకుమార్‌ను కొడుతున్న వాళ్లెవరో తెలుసుకోవాలనిపించి మరింత పరీక్షగా చూశాడు. అందరి మెడల్లోనూ అట్టముక్కలు వేలాడుతూ కనిపిస్తూనే ఉన్నాయి. అట్టముక్క పైభాగంలో పెద్ద అక్షరాలతో దళిత రచయిత, విప్లవ రచయిత, స్త్రీవాద రచయిత, బ్రాహ్మణ రచయిత, శూద్ర రచయిత, జాలరి రచయిత, వడ్రంగి రచయిత, మాల రచయిత, మాదిగ రచయిత, తెలంగాణ రచయిత, సర్కార్ రచయిత, కృష్ణా రచయిత, ఒంగోలు రచయిత, చిత్తూరు రచయిత, తిరుపతి రచయిత... అని రాసి ఉంది. కింద ట్యాగ్‌లైన్ - మరియు కవి, సమీక్షకుడు, విమర్శకుడు, ఎత్తిపోతల పథకం శ్రామికుడు మరియు ముఠామేస్త్రి. లెక్కలేనంత మంది, దాదాపు ప్రతి జిల్లాకు ఒకరు ఉన్నట్టున్నారు.

తలపట్టుకొన్నాడు అన్వేషి.
అందరూ అలసిపోయినట్టు కాస్సేపు విశ్రాంతికని పక్కకు జరుగుతూ అన్వేషికి అవకాశం ఇచ్చారు.
అన్వేషి రెండడుగులు ముందుకు వేశాడు.

అన్ని వాదాల కవులు, అన్ని ప్రాంతాల కవులు కోరస్‌గా, ‘‘నీదేజిల్లా? నీదేవాదం?’’ అని ఆ గది ప్రతిధ్వనించేలా ప్రశ్నించారు.
అన్వేషి పాపం జవాబు చెప్పలేకపోయాడు. ఏ జిల్లా అంటే చెప్పగలడేమో గాని, ఏ వాదం అంటే చెప్పడానికి సమాధానం సిద్ధంగా లేదు. బిక్క ముకం వేశాడు.

కుర్చీలో మహారాజులా కూర్చొని, దీనాతిదీనమైన చూపుల్తో అందరి దెబ్బల్నీ భరిస్తున్న తెల్గు కథాకుమార్ అనునయంగా, ‘‘రా! నాయనా! రా! ఏ వాదం మీద కథ తీసుకొచ్చావు? నన్నెక్కడ కొడతావు?’’ అని అడిగాడు.

అన్వేషి కథాకుమార్ వైపు పరీక్షగా చూశాడు. అతడికి ఒక కాలు పొట్టి, ఇంకో కాలు పొడవు. చేతి వేళ్లన్నీ రకరకాల సైజులో ఉన్నాయి. చేతులు ఒక్కోచోట బలంగా, ఇంకోచోట ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. పొట్ట బాగా ఉబ్బినట్లుంది.

అన్వేషికి ముఖంలో ఆవేశం పొంగుకొచ్చింది. కళ్లలో నీళ్లు నిండుకొన్నాయి.
కథాకుమార్ ఓదార్పుగా అన్నాడు. ‘‘బాధపడకు నాయనా! ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. ఒక్కోపూట ఒక్కోరకం తిండి అధికంగా పెట్టేస్తున్నారు. దాంతో శరీరంలో ఒక పార్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకో రకం తిండి పెట్టి ఇంకో పార్ట్ పెంచేస్తున్నారు. మొత్తం పైన సమతులాహారం లభించక పోవడం వల్ల నా శరీరం అస్తవ్యస్తమైపోతోంది. నువ్వే పార్ట్ పెంచుతావో ఏమో... కానీ నాయనా..!’’

నోరు తెరవలేకపోయాడు అన్వేషి.
ఇంతకూ సంపాదకుడు ఎక్కడున్నాడా అని గదంతా చూపుల్ని కలియతిప్పాడు.
ఒక మూల ఒక చిన్న కుర్చీ మీద ఒక వ్యక్తి ముఖం వేలాడేసుకొని కూర్చుని ఉన్నాడు. అతడి మెళ్లో ‘సంపాదకుడు’ అనే బలహీనమైన అట్టముక్క వేలాడుతూ ఉంది. ఇంకా పరీక్షగా చూసిన అన్వేషికి అతడి నోటికి వేసిన ‘ప్లాస్టర్’ కనిపించింది.

అన్వేషి తన కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలు ఉపయోగించి అతి జాగ్రత్తగా సంపాదకుడి నోటికి వేసిన ప్లాస్టర్‌ను తొలగించబోయాడు. మరుక్షణం అతడి మీద నలభై చేతులు పడ్డాయి. పిడిగుద్దులతో ఆ గది మార్మోగిపోయింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి