20, జులై 2011, బుధవారం

కిరాయి కన్నీళ్ళు(కధ)


ఈజిప్ట్ మూలం:సమీరా అజ్జామ్ 
అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

పరస్పర విరుద్ధమైన ఆ రెండు కళలు ఖానమ్ రక్తంలో ఎలా ఇమిడాయో నాకైతే తెలియదు. పెళ్లి నిశ్చితార్థాల్లోనూ, పెళ్లి మహోత్సవాల్లోనూ పాటలు పాడటంలో ఆమె ఎంత సమర్థురాలో, శవసంస్కారాల్లో గుండెలు బాదుకుంటూ ఏడ్వడంలోనూ ఆమె అంతే ఉద్దండురాలు. ఆమెను చూడటానికి ముందే ఆమె గురించి ‘అన్ని’ విషయాలూ విన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకే మా ఇంటి సమీపంలో ఎవరో టపా కట్టారు. అప్పుడే నాకు ఆమె ‘శోక కళ’ ప్రావీణ్యపు పరిచయ భాగ్యం కలిగింది.

నేను ఆయేషా చేయి పట్టుకుని గుంపు కట్టిన జనంలోంచి దారి చేసుకుని ఆ ఇంటి ముంగిట్లోకి వచ్చేసరికి అక్కడ మాలాంటి ‘ఏమీ తెలియని’ వారెందరో పాడె కడుతున్న దృష్యాన్ని చూస్తూ నిలబడి ఉన్నారు. మేము దూరంలోనే నుంచున్నాం. నిట్టూర్పులు, వెక్కిళ్లు, రోదనలు, గుసగుసలు మా చెవుల్ని తాకసాగాయి. హఠాత్తుగా అక్కడ భూకంపం వచ్చిన అనుభూతి కలిగింది. దబదబ గుండెలు బాదుకుంటూ, ఫ్యాక్టరీ సైరన్‌లాంటి కంఠంతో కేకలు పెడుతూ అక్కడ ఖానమ్ ప్రత్యక్షమైంది. తలుపుల దగ్గర నుంచున్న వారిని అటూ ఇటూ తోసేస్తూ నేరుగా శవం దగ్గరికి చేరుకుంది. తన బురఖా తీసేసింది. జేబలోంచి నల్లటి కరవస్త్రాన్ని తీసి తలకు చుట్టుకుని ఒక్కసారిగా ఆర్తనాదం చేసింది.

అబ్బా! ఆ అర్తనాదపు తాకిడికి నా గుండె గజ గజ వొణికింది. ఆ తర్వాత ఆడవాళ్లను పక్కకు తోసేసి నీళ్ళు నింపిన కుండ దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్ళు తీసుకుని ముఖం మీద చల్లుకుంది. ఆమె మళ్ళీ శవం దగ్గరికి వచ్చేసరికి ముఖానికి పులుముకున్న సురమా, పౌడర్, రోజ్- అంతా నీళ్ళ వల్ల కరిగిపోయాయి. అవన్నీ ఒకదానిలో ఒకటి కలగలసి ముఖమంతా పరుచుకుని భయం గొలిపే చారలు, చారలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ ఒక్క అబ్రా అనే కాదు, ఊళ్లో ఏ పెద్ద మనిషి గుటుక్కుమన్నా అక్కడ ప్రత్యక్షమవుతుంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది.

చనిపోయిన వ్యక్తి బంధువుల సంబంధ బాంధవ్యాలన్నీ గుర్తుకుతెచ్చుకుని మరణించిన వ్యక్తి వాళ్లను ఎలా అభిమానించేవాడో ఆ సంగతులన్నీ సవివరంగా వర్ణిస్తోంది. ఆమె అలా గొంతు చించుకొని ఏడ్వటం- ఆ తర్వాత ఆమెకు లభించే ‘దక్షిణ’ కోసమేనని అక్కడున్న వారందరికీ తెలిసిన విషయమే. అయితే ఖానమ్ అక్కడి శూన్య వాతావరణంలో ఒక విధమైన దుఃఖాన్ని, శ్మశాన సన్నివేశాన్ని సృష్టించడంలో సఫలీకృతమైంది. ఖననాంతరం అలసిసొలసిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించడానికి కంబళి పరిచారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవటానికి చొక్కా చేతుల్ని పైకి మడిచినవారిలో ఖానమ్ అందరికంటే ముందుంది. ‘బిస్మిల్లా’ అంటూ అన్నం ముద్దను గొంతులోకి దించేవారిలోనూ ఆమెయే తొలివ్యక్తి. అంతటితో ఆగకుండా భోజనం ముగించగానే ఆహారపదార్థాలను పార్శిల్ కట్టుకుంటూ ‘నా బిడ్డ మసూదాకు కాసింత పట్టుకెళతాను. చావు కబురు విన్నాక ఆమెకు స్వయంగా వంట చేసుకోవటానికి మనసెలా ఒప్పుతుందో మీరే చెప్పండి? పైగా తిథి భోజనం చేస్తేనే పుణ్యఫలం లభిస్తుంది. ఎంతైనా ఇది ప్రసాదం’ అంది. అక్కడ ఆమె ఉనికి ఎంత అనివార్యమో అప్పుడే నాకు అర్థమైంది.

కొన్నాళ్ళ తరువాత మేము ఒక పెళ్ళికి అతిథులుగా వెళ్ళాం. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే తలుపు దగ్గర నుంచోని స్వాగతం చెప్పేవాళ్ళల్లో అందరికంటే ముందు నుంచున్న వ్యక్తి ఖానమ్. తన ఒత్తయిన జుత్తును రంగురంగుల క్లిప్పులతో అలంకరించుకుంది. నోటినిండా మిఠాయి కుక్కుకుంటూ, గట్టిగా మాట్లాడుతూ, నవ్వులు చిందిస్తూ, భుజాలు తట్టి అందర్నీ పలకరిస్తూ ఎక్కడ చూసినా తనే అన్నట్టు పాదరసంలా తిరుగతోంది. పెళ్ళి మంటపమైనా, శ్మశానవాటికైనా ఖానమ్ దృష్టిలో రెండూ ఒకటేలా ఉన్నాయని నాకు అప్పుడు అనిపించింది. వంటవాడి దగ్గరికి వెళ్ళి వంటకాల్లో ఉప్పు, కారం సరిగ్గా ఉందో లేదో రుచి చూసింది.

అరబ్బుల శాస్త్ర ప్రకారం ‘ఇస్మత్’ (పాతివత్యం) గురించి పాటలు పాడింది. ‘జోడి సలామత్ రహే’ (వధూవరులు నూరేళ్లు సుఖసంతోషాలతో బతకాలి) అని ఆశీర్వదించింది. అందరి నోళ్ళలోనూ ఖానమ్ పేరే!

అవి వేసవి రోజులు. మండే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎక్కడ చూసినా టైఫాయిడ్ జ్వరం వ్యాపించింది. ఖానమ్‌కు ఆ రోజుల్లో శుక్రదశ పట్టినట్టయింది. ప్రతిరోజూ మూడు, నాలుగు చావులకు హాజరై నిర్విరామంగా ఏడవసాగింది. అదృష్టదేవత తలుపుల్ని బార్లా తెరిచింది. ‘మరణం’ ఆమె చేతికి డబ్బు సంచిని అందించింది.

చివరికి ఒక రోజు చావు చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఖానమ్ ఇంట్లో కూడా జొరబడింది. ఆమెకున్న ఒక్కగానొక్క కూతుర్ని టైఫాయిడ్ క్రిములు ఆక్రమించుకున్నాయి. ఖానమ్ రాత్రీపగలూ ‘మిన్నత్’ (మొక్కుబడులు) కట్టుకుంది. దర్గాలకు తిరిగింది. యమపాశం కన్నీళ్ళకు కరగలేదు. ఆ రాత్రి ఖానమ్ తలుపులు తెరిచింది. మృత్యుదేవత ఖానమ్ కూతురు మసూదాను తీసుకెళ్ళింది. తెల్లవారగానే ఈ వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. ‘ఖానమ్ తన ఒక్కగానొక్క కూతురికి ఎలా ‘సోగ్’ (శ్రద్ధాంజలి) ఘటిస్తుందో చూద్దాం’ అని అనుకుంటూ జనం అక్కడికి చేరుకున్నారు.

ఆమె ఒక్కసారి ఆర్తనాదం చేస్తే చాలు, భూమి బ్రద్దలవుతుంది, ఆకాశం విరిగిపడుతుంది అని జనం అనేవారు. ఆ గదిలో సుమారు ఇరవై అయిదు, ముప్ఫయి మంది కూర్చోగలిగినంత స్థలం ఉంది. ఖానమ్ కంఠం ఎక్కడా వినిపించలేదు. నేను కంగారుగా ఆమె కోసం వెతకసాగాను. చివరికి ఆమె కనిపించింది. గదిలోని ఓ మూలలో మౌనంగా కూర్చుని ఉంది. తలకు నల్లవస్త్రాన్ని చుట్టుకోలేదు. చెంపలపై చారలు లేవు. కళ్ళల్లో నీళ్ళు లేవు. కేకలు లేవు. ఆర్తనాదాలు లేవు.

అంతటా భయాన్ని గొలిపే నిశ్శబ్దం...
మొట్టమొదటిసారిగా అనాధ భావనతో అలసిపోయిన ఖానమ్‌ను చూశాను. ఒట్టి అనుభవాల ముద్ద. కాలిగోటి నుంచి తలముడి వరకు శోకమే రూపుదాల్చిన మూర్తిలా కనిపిస్తోంది. బాధ వల్ల, గర్భశోకం వల్ల మూగదైన, మౌనియైన వ్యక్తిని చూశాను. అణువణువూ మౌనం నింపుకున్న ఆ స్త్రీని చూసి భయం కలిగింది. కొందరు వెక్కి వెక్కి ఏడ్వసాగారు. ఖానమ్ వారి వేపు మెరుపులా తిరిగి గుర్రుగా చూసింది. శవాన్ని ఎత్తటానికి మనుషులు వచ్చారు. ఖానమ్ గుండెలు బాదుకోలేదు. శవవాహకులకు అడ్డుపడలేదు. ఏడవలేదు. ఆర్తనాదాలు చేయలేదు. పెడబొబ్బలు పెట్టలేదు. నిశ్శబ్దంగా నుంచుంది. మౌనంగా వాళ్లను అనుసరించింది. ఈ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నారు.

‘కడుపుకోత వల్ల పిచ్చిదయిపోయింది’, ‘అవును, పిచ్చిదై మూగదైంది’, ‘కూతురి కోసం ఖర్చు పెట్టడానికి ఆమె దగ్గర కన్నీరు ఎక్కడుంది?’
అంతలో ఆయేషా ఇలా అంది-
‘ఖానమ్ దగ్గర కిరాయి కోసం కన్నీళ్లు దొరికేవి. ప్రతి కన్నీటిబొట్టుకూ లెక్కగట్టి కిరాయి వసూలు చేసుకునేది. అయితే ఇప్పుడు చనిపోయింది మసూదా. ఆమె కన్న కూతురు. ఆమె కన్నీళ్లకు కిరాయి ఇవ్వగలరా?’

సమీరా అజ్జామ్
ఈజిప్ట్ కథా క్షేత్రానికి కొత్త మలుపును చూపిన సమీరా అజ్ఞామ్ పాలస్తీనాలోని అక్రెలో 1927లో జన్మించారు. యూనివర్శిటీ విద్య అభ్యసించకపోయినా స్వయంకృషితో విజ్ఞానాన్ని సముపార్జించారు. ‘ఫతల్-ఆల్-సహేల్’ కలం పేరుతో పత్రికలకు రివ్యూలు, కథలు రాయటం మొదలుపెట్టారు. 1948 నుంచి 1967లో కారు ప్రమాదంలో మరణించేదాకా ఆమె రాస్తూనే ఉన్నారు. జీవితాన్ని, జీవితంలోని అనేక కోణాల్ని అత్యంత సూక్ష్మంగా చూడటం వల్ల సహజంగానే ఆమె కథల్లో వ్యంగ్యం తొంగి చూస్తూ ఉంటుంది. రెండు నవలలు, నాలుగు కథాసంపుటలను వెలువరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి