7, జనవరి 2012, శనివారం

రెండు హత్యలు


వెస్ట్ వర్జీనియా రోడ్‌లో కారు నడిపే సేమీకి అకస్మాత్తుగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తే కుందేలు కనిపించడంతో, అనాలోచితంగా కారు బ్రేక్‌ని వేశాడు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. కారు దాని మీదికి ఎక్కిందని చప్పుడుని బట్టి సేమీ గ్రహించాడు. అప్పటికే అతని కారు వంద అడుగుల దూరం ప్రయాణించింది.
‘బావుంది. ఈ రోజు నేను చేసిన రెండో హత్య ఇది’ మనసులో అనుకున్నాడు.
సేమీ షికాగోలోని ఓ బ్యాంక్‌లో శని ఆదివారాలు మధ్యాహ్నం పనె్నండు నించి రాత్రి పనె్నండు గంటల దాకా పని చేస్తున్నాడు. రిపోర్టులని ప్రింటర్లలో ప్రింట్ చేసి, వాటిని అనేక బ్రాంచీలకి పోస్ట్ చేయడానికి కవర్లలో ఉంచి అతికించడం సేమీ పని. సేమీకి ఆ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వ్యక్తిగత కంప్యూటర్ పాస్‌వర్డ్ తెలిసి ఉండకపోతే, ఈ రాత్రి ఆ బ్యాంక్‌లోనే ఉండి పని చేస్తూండేవాడు.
పదిహేను రోజుల క్రితం ఓ రిపోర్ట్ మీద అతను తాగే డైట్ డ్రింక్ వొలికింది. దాన్ని శుభ్రం చేస్తూంటే ఆ పాస్‌వర్డ్ కనిపించింది. ఆ వైస్ ప్రెసిడెంట్ చాలా నిర్లక్ష్యంగా తన పాస్‌వర్డ్‌ని ఆ రిపోర్టులో రాశాడు.
సేమీ ఆ తర్వాత తన పనంతా ఎంతో తేలికగా చేయగలిగాడు. డెసిమల్ పాయింట్‌ని రెండు స్థానాలకి మారిస్తే వంద కాస్తా పది వేలుగా మారింది. చిరునామాని కూడా మారిస్తే అతని అడ్రస్‌కి చెక్కులు రాసాగాయి. దొంగ కంపెనీ లెటర్ హెడ్‌లని ఇందుకోసం ముద్రించి లోన్ అప్లికేషన్‌ని పెట్టాడు. వాటిని తనే ఆ వైస్ ప్రెసిడెంట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి శాంక్షన్ చేసి చెక్కులని సంపాదించాడు. బ్యాంక్‌కి వచ్చిన ఆ ఆదాయాన్ని తన అకౌంట్‌లో జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు. ప్రతీ రాత్రి ఓ గంటన్నర పనిచేస్తే చాలు. అనేక మంది అకౌంట్ల నించి తన అక్కౌంట్‌కి బదిలీనో లేదా తన అడ్రస్‌కి బ్యాంక్ నించి చెక్కు రాసాగింది. రెండు వారాల తర్వాత సేమీ లక్షాధికారి అయ్యాడు.
ఈ ఆటని మరో రెండు వారాలు కొనసాగించి ఆ తర్వాత మధ్యధరా సముద్రంలోని ఏదో ఓ దీవికి వెళ్లి కొన్నాళ్లు అక్కడ గడిపి, పోలీసులు తన కోసం వెదకడం ఆగిపోయాక తిరిగి వద్దామని అనుకున్నాడు. ఐతే బ్యాంక్‌కి కళ్లు, చెవులు అధికం అని సేమీకి తెలీదు. మేటిజ్ అనే అకౌంట్ హోల్డర్ తన అకౌంట్‌కి రావాల్సిన అద్దె ఆ నెల తన అకౌంట్‌లో పడలేదని, అద్దెని వారు కట్టారని ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌లో లోపం ఉండదు. దాంతో ఓ రాత్రంతా ఇద్దరు ఆడిటర్స్ తనిఖీలు చేస్తే జరిగేది వారు చూచాయగా అర్థం అయ్యింది.
ఆ రాత్రి వైస్ ప్రెసిడెంట్ సేమీ దగ్గరకు వచ్చాడు. కంప్యూటర్ నించి ప్రింట్ అవుట్స్ తీసే సామాన్య పార్ట్‌టైం ఉద్యోగి దగ్గర పిస్తోలు ఉండచ్చని వైస్ ప్రెసిడెంట్ భావిస్తే పోలీసులతో వచ్చి ఉండేవాడు.
ఆలోచనల్లో ఉన్న సేమీ కారుకి ఓ హైవే పోలీస్ పెట్రోల్ కారు ఎదురొచ్చింది. డిక్కీలో శవంతో పోలీసులకి పట్టుబడటం మూర్ఖత్వం కాబట్టి సేమీ పరిమితిని మించిన వేగంతో కారుని నడపడం లేదు. దాంతో వారు అతని కారుని ఆపలేదు.
సేమీ వెస్ట్ వర్జీనియాలోని తన ఇంటికి వెళ్తున్నాడు. అతనికి తన ఇంటి ప్రాంతం అంటే రోత. ముఖ్యంగా ఏడాదిన్నరగా షికాగో లాంటి మెట్రోపాలిటన్ నగరంలో గడిపాక, చుట్టూ ఖాళీ అయిన గనులు, పర్వతాలు, లోయలు గల చిన్న గ్రామంలోని తన ఇంట్లో తనకి ఏం తోస్తుంది? కాలక్షేపానికి అక్కడ ఏం ఉండదు. ఐతే తను దాక్కోడానికి అదే భద్రమైన చోటని సేమీకి తెలుసు. తన స్వగ్రామం గురించి ఎక్కడా రికార్డుల్లో లేదు. ఇలాంటిదేదో చేసే ఉద్దేశంతోనే షికాగోకి చేరుకున్న సేమీ తన స్వగ్రామంగా కాలిఫోర్నియాలోని సేక్రిమెంటోని అన్ని చోట్లా పేర్కొన్నాడు. షికాగోలో తల పూర్తిగా పైకెత్తితే తప్ప ఆఖరి అంతస్థు కనపడని ఎతె్తైన బిల్డింగ్‌లోని తన అపార్ట్‌మెంట్ ఎక్కడ? తన స్వగ్రామంలోని చెక్కలతో నిర్మించబడ్డ, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఎక్కడ?
వైస్ ప్రెసిడెంట్ మాయం అయ్యాడని తెలీగానే పోలీసులు తన కోసం వెదుకుతారు కాబట్టి అంతర్జాతీయ విమాన ప్రయాణం మంచిది కాదు. అంటే మధ్యధరా సముద్రంలోని దీవులకి తను ఇప్పుడు వెళ్లలేడు. తన తల్లితో తన ఇంట్లో ఎటూ గడపలేడు. అక్కడ పని పూర్తి చేసుకొని పోలీసులు తను వెళ్తాడని ఊహించని ఊటా లేదా నెబ్రెస్కా రాష్ట్రాలకి వెళ్లాలి. వాళ్లు తన కోసం ఫ్లోరిడా, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలలోని లగ్జరీ స్పాట్‌లలో వెదుకుతారు.
ప్రతీ సోమవారం తను అన్యాయంగా సంపాదించిన సొమ్ముని తన బ్యాంక్ అకౌంట్‌లోంచి డ్రా చేయడం మంచిదైంది. ఆ సొమ్మంతా కారు డిక్కీలోని ఓ సంచీలో ఆ వైస్‌ప్రెసిడెంట్ శవం పక్కనే ఉంది. ఇంక తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం ఆ రాత్రి బదిలీ చేసిన సొమ్ము మాత్రమే ఉంది. ఏటియంలోంచి ఐదు వందల డాలర్లు మాత్రమే తను ఐదుచోట్ల షికాగోలో డ్రా చేయగలిగాడు. ఇరవై నాలుగు గంటలలోగా డ్రా చేసే పరిమితి అది.
* * *
క్రమేపీ దూరంగా కొండలు కనిపించాయి. మర్నాడు ఉదయం దాకా వైస్ ప్రెసిడెంట్ మాయం అయ్యాడని ఎవరికీ తెలీకపోవచ్చు. అది తెలిసేసరికి తను అతని శవాన్ని ఇంకెవరూ తెలుసుకోలేని చోట దాస్తాడు. నిజానికి ఇంత దూరం రావడానికి గల కారణాల్లో అదొకటి.
క్రమేపి కారు కొండ పైకి ఎక్కసాగింది. సేమీ మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉండసాగాడు. అతను మలుపుల్లో లెక్కలేనన్నిసార్లు కారుని డ్రైవ్ చేశాడు. కొత్త వాళ్లయితే భయపడచ్చు. సేమీ తన కారుని షార్ప్‌గా ఉన్న మలుపుల్లో లాఘవంగా తిప్పుతూ పోనిస్తున్నాడు. ‘ఈ రోడ్డు ఎక్కాక ఇంక పోలీసుల భయం ఉండదు’ అనుకున్నాడు. తన గ్రామానికి దారి తీసే ఈ చిన్న రోడ్డు మీద పెట్రోలింగ్ ఉండదు. కేవలం హైవే మీదే పెట్రోలింగ్ ఉంటుంది. ఈ రోడ్డు మీంచి కారు లోయలో పడటం గురించి సేమీ ఎన్నోసార్లు విన్నాడు. ఆ కారు డ్రైవర్లంతా ఆ రోడ్డు మీదకి మొదటిసారి వచ్చినవారే. తన గ్రామానికి చెందిన ఇద్దరు మాత్రమే ఈ రోడ్డు మీద మరణించారు. వారు తాగి ఉన్నారు. ఒకరు తన తండ్రి.. మరొకరు ఓ టీనేజ్ యువకుడు. వాళ్లని నిజానికి చంపింది ఆల్కహాల్ తప్ప ఆ రోడ్డు కాదు.
తన రాష్ట్రం మోటో ‘ఆల్మోస్ట్ హెవెన్’. తను ఆల్మోస్ట్ హెల్‌కి - అంటే తన ఇంటికి వచ్చేసినట్లే. ఇంకో పావుగంటే. మర్నాడు తన గ్రామం నించి ఎక్కడికి వెళ్లాలి? ఊటానా? నెబ్రెస్కానా? చెరకు, మొక్కజొన్నల పంట పొలాలు సేమీకి వెనె్నల్లో కొండ మీంచి కింద కనపడ్డాయి. ఆ రెండూ పండే పొలాలు పిల్లల్ని ఆకర్షిస్తాయి. కారణం గోధుమ, ఇతర ధాన్యాల్లా కావవి. వాటిని కోసుకుని తక్షణ తినచ్చు. చిన్నతనం గుర్తుకి రావడంతో మర్నాడు ఏదైనా పొలానికి వెళ్లాలనుకున్నాడు. తన ఊరిలోని సగం మంది టీనేజర్స్ తనలా దొంగలు అవడానికి కారణం బహుశా చిన్నతనం నించే పొలాల్లో దొంగతనం చేయడానికి అలవాటు పడటం కావచ్చు. తన గ్రామానికి చెందిన ఎంతోమంది యువకులు జైళ్లల్లో గడుపుతున్నారు.
రోడ్డుకి అటు ఇటు గల మట్టి రోడ్లలోకి వెళ్తే, కొద్ది దూరంలో ఖాళీ గనులు కనిపిస్తాయి. షికాగోలోనే
తను పార, గునపాలు కొని ఉండాల్సింది. రోడ్డు కిందకి దిగసాగింది. సేమీ అప్రమత్తంగా కాలుని బ్రేక్‌కి ఆనించి డ్రైవ్ చేయసాగాడు. మరో అరగంటలో కారుకి అటు, ఇటు ఇళ్లు కనిపించాయి. చిట్టచివరికి తను ఎక్కడ్నించి షికాగోకి బయలుదేరాడో అక్కడకి తిరిగి వచ్చాడు - ధనవంతుడిగా.
సేమీ కారుని ఇంటి ముందు డ్రైవ్ వేలో ఆపి కారు దిగి వెళ్లి తలుపు తోశాడు. లోపల బోల్ట్ పెట్టి ఉంది. అర్ధరాత్రి ఒకటిన్నరకి ఎందుకు తీసి ఉంటుంది? డోర్ బెల్ నొక్కాడు. కళ్లు నులుముకుంటూ తలుపు తీసిన సేమీ తల్లి అతన్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది.
‘్ఫన్ అయినా చేయకుండా వచ్చావే?’
‘అనుకోకుండా రావల్సి వచ్చింది. ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉందా?’
‘ఓ అరగంటలో డిన్నర్ సిద్ధం చేస్తాను’
‘మంచిది. ఈలోగా నేను స్నానం చేస్తాను’
తల్లి వంట గదిలోకి వెళ్లగానే ఇంటి బేస్‌మెంట్‌లోని పార, పలుగులని రహస్యంగా బయటకి తెచ్చి, డికీ తెరచి శవం పక్కన పెట్టాడు. తల్లి కంఠం విని, డిక్కీ తలుపు మూసి ఇంటి గుమ్మం దాకా వచ్చాక డబ్బు సంచీని లోపలకి తేవడం మరిచానని గుర్తుకు వచ్చింది.
‘నీ ఉద్యోగం పోయిందా?’ అడిగింది సేమీ తల్లి.
‘పోలేదు. నాకు ఇంకో ఉద్యోగం వచ్చింది. ఎక్కువ జీతం. రెండు రోజుల తర్వాత చేరాలి. నిన్ను చూసి చాలా రోజులైంది కాబట్టి అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాను. ఎల్లుండి మళ్లీ వెళ్లిపోవాలి’
‘మంచిది’
ఏభై వేల డాలర్లు తీసుకుని మిగిలింది తను వెళ్లేలోగా తల్లికి తెలీకుండా బేస్‌మెంట్‌లో ఎక్కడైనా దాచాలి. మర్నాడు ఉదయం ఆవిడ చర్చికి వెళ్లినప్పుడు ఆ పని చేయాలి అనుకున్నాడు. స్నానం చేస్తూ ఈలపాట పాడాడు.
‘డిన్నర్ టేబుల్ మీద సిద్ధం. నేను పడుకుంటాను. రేపు మాట్లాడుదాం’ తల్లి అరిచి చెప్పింది.
‘సరే’
స్నానం చేసి వేరే దుస్తులు ధరించి ఇంటి తాళం చెవి తీసుకుని, బయటకి వచ్చి తలుపు మూశాడు. అటూ ఇటూ చూసి తల్లికి ఆ కారు స్టార్టయిన శబ్దం వినపడకూడదని దాన్ని స్టార్ట్ చేయకుండా కొంత దూరం తీసుకెళ్లాడు. తర్వాత దాన్ని స్టార్ట్ చేసి గనుల వైపు పోనించాడు. కారుని రోడ్డు మీంచి ఓ మట్టి రోడ్డు మీదకి తిప్పాడు. ఓ గని ముందు కారుని ఆపి కారు దిగి డిక్కీ తెరిచాక వైస్ ప్రెసిడెంట్ శరీరం ఇంకా ఎక్స్‌పైరీ డేట్‌కి దగ్గరగా రాలేదనుకున్నాడు. వాసన మొదలవలేదు.
‘హలో మిత్రమా?’
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు సేమీ.
‘ఏం చేస్తున్నావ్?’ తన పక్కింటి మిత్రుడు గోల్డ్‌బెర్గ్!
‘ఎవరి శవం అది?’ అడిగాడు.
‘నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ?’
అతను పిస్తోలుని సేమీకి గురి పెట్టి చెప్పాడు.
‘నీ కారు శబ్దానికి మెలకువ వచ్చింది. నువ్వు పార, గునపం డిక్కీలో పెట్టడం చూసి ఏదో విశేషం ఉందనుకున్నాను. నీ కారు వెనక సీట్లో దాక్కున్నాను. నేను ఊహించినట్లుగానే నువ్వు కొద్దిసేపట్లో వచ్చి కారు స్టార్ట్ చేశావు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలని ఆసక్తితో వచ్చాను. అది ఏదైనా సరే. నేరమే అయి ఉంటుందని నాకు తెలుసు’
‘షికాగోలో ఒకర్ని చంపాను. ఆ శవం పూడ్చడానికి వచ్చాను. కాస్త నాకు సాయం చేయి’
‘ఆ డబ్బు సంచీ గురించి చెప్పవే?’ నవ్వుతూ అడిగాడు గోల్డ్‌బెర్గ్.
‘చూశావా?’ సేమీ మొహం పాలిపోయింది.
‘ఆహా! నువ్వు పని చేసే బ్యాంకులో కొట్టేశావా?’
‘అవును’
‘నా కోసం ఆ సాహసం చేసినందుకు థాంక్స్’
మరుక్షణం గోల్డ్‌బెర్గ్ చేతిలోని పిస్తోలు రెండుసార్లు పేలింది. రెండు గుళ్లు సేమీ ఛాతిలో దిగాయి. అచేతనంగా నేల మీద పడ్డ అతని తలకి గురి పెట్టి మూడోసారి కాల్చాడు గోల్డ్‌బెర్గ్. అతను మరణించడానికి అది ఇన్‌సూరెన్స్ బుల్లెట్.
తర్వాత పార, పలుగు అందుకున్నాడు. రెండు శవాలని ఓ ఖాళీ గని అంతర్భాగంలో పుడ్చాక ఆ కారు డిక్కీలోంచి డబ్బు సంచీని తీసి తెరచి తృప్తిగా చూసి వాటిని కారు వెనుక సీట్లో పడేశాడు. తర్వాత సేమీ కారుని ఓ గని అంతర్భాగంలోకి డ్రైవ్ చేసి తీసుకెళ్లి దాచాడు. తర్వాత బయటకి వచ్చి తన ఇంటికి కాలి నడకన బయలుదేరాడు.
మర్నాడు ఉదయం గోల్డ్‌బెర్గ్ సేమీ తల్లికి అబద్ధం చెప్పాడు.
‘మెలకువ వచ్చి నిన్న రాత్రి నేను సిగరెట్ తాగడానికి బయటకు వస్తే సేమీ హడావిడిగా కనిపించాడు. అర్జెంట్ ఫోన్ వచ్చిందని, తను షికాగోకి వెళ్లిపోతున్నానని మీకు చెప్పమని సేమీ నాకు చెప్పాడు.’ *
(్ఫ్లప్ జారెట్ కథకి స్వేచ్ఛానువాదం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి