29, జనవరి 2012, ఆదివారం

మిక్స్చ్‌ర్


లిక్కర్ వాంటెడ్

పుట్టన్న గేలం తీసుకుని చెరువుకెళ్లాడు. ఎక్కడ తవ్వినా ఒక్క ఎర కూడా కన్పించలేదు. దగ్గర్లో ఒక పిట్ట ఎరని చీలుస్తూ కన్పించింది. ఒడుపుగా పిట్టని పట్టి, ఎర లాగేసుకుని ప్రతిఫలంగా తన దగ్గరున్న బ్రాందీలోంచి 4 చుక్కలు పిట్ట నోట్లో పోసి గాల్లోకి వదిలేశాడు. తర్వాత గేలమేసి తాపీగా ఒడ్డున మందు కొడుతూ కూర్చున్నాడు.
గంట తర్వాత - ఎవరో వీపుని పొడుస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు .
పిట్ట మరో 3 ఎరలను తీసుకొచ్చింది.

కడదాకా రుణపడి ఉంటా
"డాక్టర్‌గారూ, చాలా పేదవాడిని. మీరు అడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. నాకొచ్చిన జబ్బు నయం చేస్తే జీవితాంతం పైసా తీసుకోకుండా మీ కుటుంబానికి పని చేసి పెడతా'' దీనంగా అన్నాడు ఏడుకొండలు.
"సర్లే! గాలి పీల్చు ... ఇంతకూ ఏం పనిచేస్తుంటావు?'' స్టెతస్కోప్ రోగి గుండెకు ఆనించి, నవ్వుతూ అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండి, శవాలు కాలుస్తుంటాను'' ఊపిరి వదులుతూ చెప్పేడు ఏడుకొండలు.

రాత్రుళ్లు కూడానా!
" ఏంటయ్యా? ఆఫీసుకు ఇంత ఆలస్యంగానా రావటం?'' కోపంగా అడిగాడు ఆఫీసరు.
"నిద్ర లేవడం ఆలస్యం అయింది సార్'' మెలికలు తిరిగేడు దైవాధీనం.
"వ్వాట్? నీవు ఇంటి దగ్గర కూడా నిద్రపోతావా?'' నోరు తెరిచాడు ఆఫీసరు.

నిజాయితీ వెల
"అడుక్కునే వాడికి ఒక్క రూపాయో, రెండు రూపాయలో వేస్తారు గానీ, ఏకంగా 20 రూపాయలు వేశావేం?'' అరిచాడు భర్త భాస్కర్రావు.
"ఉట్టినే వేశాననుకున్నారా? వాడి మాటల్లో నిజాయితీ కన్పించింది'' నెమ్మదిగా అంది కోమలి.
"ఏమిటో ఆ నిజాయితీ?'' వ్యంగ్యంగా అన్నాడు భాస్కర్రావు.
"అచ్చం రంభలా ఉన్నానన్నాడు. అది చాలదా?'' ఎదురు ప్రశ్నించింది కోమలి.

కష్టపడి కొట్టేశా మరి
"అయ్యో! పర్స్ పోయింది. అందులో పది వేలున్నాయి. ఇచ్చినవాళ్లకు వంద రూపాయలు ఇస్తాను'' లబోదిబో అన్నాడు చెంగల్రావు.
"నాకిస్తే ఐదు వందలిస్తా'' చెప్పేడు పక్క పాసింజరు.
"నాకిస్తే వెయ్యి రూపాయలిస్తా'' మరొకడన్నాడు.
"నాకిస్తే అందులో సగం, అంటే అయిదువేలూ ఇచ్చేస్తా'' అరిచేడు మరొకడు.
"అమ్మా? ఆశ, అప్పడం. ఎవరికీ ఇవ్వకపోతే పదివేలూ నావేగా?'' నోరుజారి దొరికిపోయాడు గంగులు.

బతికిపోయావు!
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిందే, మా ఆయనకు నా మీద ప్రేమ పోయిందని'' కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి.
"అందుకు సంతోషించు. ప్రేమ అలాగే ఉండి ఉంటే ఇంకెంతమంది పిల్లల్ని కనాల్సివచ్చేదో ఆలోచించు!'' ఓదార్చింది సుబ్బలక్ష్మి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి