నవ్వులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవ్వులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మార్చి 2012, ఆదివారం

మిక్స్చ్‌ర్ - 03-03

పొరపాట్లో అలవాటు

"అదేమిటే పంకజం, నిన్న ఫంక్షన్‌లో మీ ఆయన నీ కూడా తిరుగుతూ ప్రతి ఐదు నిమిషాలకోసారి నీ నెత్తిన నీళ్లు చిలకరిస్తున్నాడు? అదేం ఆచారమే?
అక్కడ అడిగితే బాగోదని ఇవ్వాళ ఫోన్ చేస్తున్నా'' అడిగింది వనజాక్షి.
"ఆయన చల్లింది నా తలమీద కాదు - నా జడలోని పూలమీద. పూల కొట్లో కదా తను పని చేసేది'' నవ్వుతూ చెప్పింది పంకజాక్షి.

అదీ సంగతి
"నా భార్య రాత్రుళ్లు నిద్ర పోవట్లేదు డాక్టర్, ఏదైనా మందు రాయగలరా?'' అడిగాడు సుబ్బారావు.
"నిద్రపోకుండా ఏం చేస్తుంటుందో కనుక్కున్నారా?'' కూపీ లాగాడు సౖౖెక్రియాటిస్టు.
"నేను బార్‌నుండి వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉంటుంది'' చెప్పేడు సుబ్బారావు.

తేడా!
"పులికీ మేకకీ తేడా చెప్పగలరా?'' అడిగింది టీచర్ అలివేలు.
"పులి క్రూర జంతువు - మేక కూర జంతువు'' ఠపీమని చెప్పేడు టింకూ.

దొంగొచ్చాడు!
రాత్రి సెకండ్ షిఫ్ట్ నుండి వచ్చిన భర్త ఇంట్లో కన్పించిన దృశ్యం చూసి నోరు తెరిచాడు. వెంటనే తేరుకుని "నీకసలు బుద్ధుందా? దొంగని కూర్చోబెట్టి కాఫీ ఇస్తావా?'' కయ్యిమన్నాడు.
"ఆ తొందరపాటే పనికిరాదు మీకు. వీడు దొంగతనానికి వచ్చింది మన పక్కింటికట'' తాపీగా చెప్పింది భార్య.

గుణమే మారునా!
"వాళ్ల ఆఫీసులో పని చేసే టైపిస్టు వెనకాల మీ ఆయన తిరుగుతున్నాడనే అనుమానం అసలు నీకెందుకు వచ్చిందే?'' అడిగింది జలజ.
"గతంలో ఆ పోస్టులో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి'' చెప్పింది వనజ.

తిరగబడ్డ వాదన
"మీ క్లయింట్ తప్పు చేయలేదని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడేంటి అతను ఖచ్చితంగా నేరం చేసి ఉంటాడని అంటున్నారు?'' ఆశ్చర్య పోయాడు జడ్జి జగన్నాథం.
"4 నెలలుగా నా ఫీజు ఇస్తానిస్తానని ఎగ్గొడుతుంటే ఏం చేయమంటారు మరి?'' అసహనంగా బదులిచ్చాడు లాయర్ విశ్వనాథం.

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

మిక్స్చ్‌ర్ - 02-25


ఎలా కుదురుతుంది?

భాస్కర్రావు బస్సు కోసం ఎదురు చూస్తూ బస్టాపులో నిలబడి ఉన్నాడు.
"కళ్లు లేని కబోదిని బాబయ్యా! దానం చెయ్యండి'' భాస్కర్రావు ముందు నిలబడి అరిచాడు ముష్టివాడు.
"ఎలా కుదురుతుంది? నాకున్నవీ రెండు కళ్లే'' అమాయకంగా బదులిచ్చాడు భాస్కర్రావు.

పోటీ పడడం తప్పా?
. "బయట పోటీ ప్రపంచంలో బతకలేక వచ్చినట్టున్నావు'' సానుభూతి ఒలకబోశాడు మొదటి ఖైదీ.
"నిజమే. బాగా కనిపెట్టావు'' అన్నాడు రెండో ఖైదీ.
"ఇంతకీ ఏ విషయంలో పోటీ పడ్డావు?''
"నోట్లు ముద్రించడంలో'' చెప్పేడు రెండో ఖైదీ.

తీరని కోరిక
"మరో 5 నిమిషాల్లో నీకు ఉరిశిక్ష పడబోతోంది. నీ చివరి కోరిక ఏమైనా ఉందా?'' అడిగాడు జైలు అధికారి.
"ఉంది. తాడు మెడకు తగులుతుంటే కితకితగా ఉంటుంది. నా కాళ్లకి కట్టి ఉరి తీయండి'' విన్నవించుకున్నాడు ఖైదీ కన్నయ్య.

పదహారా? ముప్పైరెండా?
"ఏవండీ, మీ కోసం ప్రత్యేకంగా మైసూర్ పాక్ చేశాను'' పళ్లెం అందిస్తూ గోముగా అంది కాంతం.
"వామ్మో! నువ్వు చేసినవా! సగం పళ్లు ఊడిపోతాయి'' కం గారు పడ్డాడు సుబ్బారావు.
"తినకపోతే మొత్తం ఊడిపోతాయి - నిర్ణయించుకోండి'' ఆర్డర్ జారీ చేసింది కాంతం.

ప్లేసు మార్చాను
"డాక్టర్ చెప్పిన తర్వాత హోటల్లో భోంచేయడం మానేశానోయ్.''
"మరెలా? నీకు వంట రాదుగా?''
"హోటల్లో పార్శిల్ కట్టించుకుని ఇంట్లో తింటున్నా.''

బోణీ బేరం!
"అయ్యా! «ధర్మం చేయండి బాబూ!'' అరిచాడు ముష్టివాడు.
"పో!పో! ఇంకా బోణీ అవలేదు'' కసిరాడు కొట్టువాడు.
"ఈ పావలా తీసుకుని బీడి కట్ట ఇవ్వండి'' ముష్టివాడు.
"ఇదిగో!'' కొట్టువాడు.
"బోణీ అయ్యిందిగా - ఇప్పుడు ధర్మం చెయ్యండి'' బొచ్చెను ముందుకు చాపుతూ మళ్లీ అడిగాడు ముష్టివాడు.

తేడా తెలీలేదు
"దోచుకున్న సొమ్ముని పాడుబడ్డ బిల్డింగులో పంచుకుంటుండగా పట్టుబడ్డారా? పోలీసులకి ఎలా తెలిసింది?'' ఆశ్చర్యపోయాడు గంగులు.
"చీకట్లో ఆ పాడు పడ్డ బిల్డింగే పోలీసు స్టేషన్ అని గుర్తించలేకపోయాం'' చెప్పేడు సైదులు.

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మిక్స్చ్‌ర్ - 02-18

పిలక ముడి

"అన్నట్లు మీ ఇంటికి గతంలో చుట్టాల తాకిడి ఎక్కువగా ఉండేది కదా. ఇప్పుడెవరూ రావట్లేదు. ఏం చిట్కా ప్రయోగించావు?'' కుతూహలంగా అడిగాడు రామనాథం.
"ఒకరి నుంచి ఒకరికి అప్పులిప్పించాను. అంతే! అప్పులివాల్సి వస్తుందని కొందరు, అప్పు తీర్చాల్సి వస్తుందని ఇంకొందరు పూర్తిగా రావడం మానేశారోయ్'' దీర్ఘంగా ఊపిరి వదులతూ చెప్పేడు చిదంబరం.

ఐదోవాడేడీ?!
నలుగురు స్టూడెంట్స్ బైక్ మీద వెళ్తుండగా, ఆపి "ముగ్గురు వెళ్లడమే తప్పు. పైగా నలుగురా?'' కోపంగా అన్నాడు పోలీసు వెంకటస్వామి.
"అదేమిటీ నలుగురమే ఉన్నామా? ఐదో వాడు ఎక్కడ పడిపోయాడ్రా?'' వెనక్కి తిరిగి చూస్తూ గొల్లుమన్నాడు డ్రైవర్ స్టూడెంట్.

అదృష్టానికి ఫీజెందుకు?
"మీకున్న జబ్బు తగ్గడం చాలా కష్టం. కానీ, మీ అదృష్టం కొద్ది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. యు ఆర్ లక్కీ!'' భుజం తట్టాడు డాక్టర్ దైవాదీనం.
"థాంక్యూ డాక్టర్ ... వస్తాను'' కృతజ్ఞతగా చెప్పేడు ఏసుపాదం.
"అన్నట్లు నా ఫీజు ఆరు వేలు - కౌంటర్లో చెల్లించి వెళ్లండి'' ప్రిస్కిప్షన్ రాస్తూ అన్నాడు దీనం.
"ఫీజా? ఇప్పుడేగా నా అదృష్టం వల్ల తగ్గిందన్నారు?'' అమాయకంగా నోరు తెరిచాడు పాదం.

తానొవ్వక...ధన్యుడు సుమతీ!
"బస్‌లో నిలుచున్న ఆడవాళ్లని చూసి కూడా లేచి సీట్లివ్వని మగవాళ్లని చూసే ఒళ్లు మంట నాకు'' చెప్పేడు బ్రహ్మానందం.
"నువ్వు లేస్తావా?'' అడిగాడు భజగోవిందం.
"నేను కూర్చోగానే కళ్లు మూసుకుంటా కదా'' చెప్పేడు బ్రహ్మానందం.

రాలని నవ్వులు
"అదేంటోయ్, మీ ఆఫీసులో పనిచేసే సుబ్బారావుకి 'నవ్వుల్రావు' అని పేరు పెట్టారు. అతగాడు అంత బాగా నవ్విస్తాడా?''
"అక్కడే ఉంది తిరకాసు. వాడు జోకేస్తే నవ్వులు రావు కాబట్టే వాడికా పేరు పెట్టాం''

ఆడగాలి
"నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు మాస్టారూ'' చెయ్యి చూస్తూ చెప్పేడు జ్యోతిష్యుడు.
"నిజమా! ఇంద వంద! ఎప్పుడు, ఎలా?'' చెయ్యి మరింత ముందుకు చాస్తూ అడిగాడు మన్మథరావు.
వంద జేబులో పెట్టుకుంటూ "ఒక భార్య, ఐదుగురు కూతుళ్లూ'' చెప్పేడు జ్యోతిష్యుడు.

రెండూ కరక్టే!
"ఒక స్ట్రాంగ్ కాఫీ పట్రావోయ్... అన్నట్టు ఎంత?''
"20 రూపాయలండి.''
"అదేంటోయ్! ఎదురు కొట్టు ముందు 50 పైసలని రాసుంటేనూ?''
"ఇది హోటలండి- అది జిరాక్స్ షాపండి.''

13, ఫిబ్రవరి 2012, సోమవారం

మిక్స్చ్‌ర్ - 02-12

మిక్స్చ్‌ర్

పొరపాటుగా వచ్చారు

గబగబా వచ్చి, ఆయాసపడుతూ "ఈ మధ్య మార్కెట్లోకి 'తెలివి మగాళ్ల సొత్తు' అనే పుస్తకం వచ్చిందిట ... ఎంతండి?'' అడిగాడు వీరబాబు.
"ఇక్కడ జోక్స్ బుక్స్ అమ్మరండి. అదిగో ఆ ఎడమ వైపున్న కొట్లో అడగండి'' సలహా ఇచ్చింది సేల్స్‌గర్ల్ సానియా.

మిస్టర్ తిరకాసు
"నీవు బెడ్రూంలో ఉండగా దొంగలు వెనక తలుపు గుండా ఇంట్లోకి దూరారని తెలిసిందనుకో ... ఏం చేస్తావు?'' అడిగాడు వైకుంఠం.
"సింపుల్, 100 బదులుగా, 001అని డయల్ చేస్తే సరి. పోలీసోళ్లు వెనకనుండి వచ్చి దొంగల్ని పట్టుకుంటారు ' ఠపీమని చెప్పేడు కైలాసం.

లేచిన వేళా విశేషం!
"ఏంటయ్యా కళ్ల కన్పించట్లేదా? సైకిల్‌తో ఇంతలా గుద్దావేంటి?'' సొట్టపడ్డ బిందెను తీసుకుంటూ కయ్యిమంది కాంతమ్మ.
"సంతోషించవమ్మా! నిజానికి నేను లారీ డ్రైవర్ని ... ఈవేళ నీ అదృష్టం బాగుండి సైకిల్ మీద వెళ్తున్నా'' కిందపడ్డ సైకిల్ లేపుతూ అన్నాడు జోగినాథం.

అదే ఆశ్చర్యం?
"ఈ ఎగ్జామ్‌లో నీకు వచ్చింది 5 మార్కులే. అయినా సిగ్గులేకుండా నవ్వుతున్నావేం?'' కోపంగా అరిచింది ఉపాధ్యాయిని ఊర్మిళ.
"ఆ ఐదు మార్కులు కూడా ఎలా వచ్చాయా అని! ఒక జవాబుకు బదులుగా గుర్తున్న ఒక సినిమా పాట చరణం రాశానే'' ఇంకా ఆశ్చర్యపోతూనే చెప్పేడు విద్యార్థి వీరగంధం.

మంద బుద్ధి
"మీరు స్విమ్మింగ్ బాగా చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి?'' అడిగాడు వెంకటేశం.
"నీటిలో '' రెండు నిమిషాల తర్వాత సాలోచనగా చెప్పేడు మాణిక్యం.

మమ్మీ ప్రేమ
"మమ్మీ ఐ లవ్ యూ'' చెప్పేడు 4 ఏళ్ల చింటూ.
"ఐ టూ ... ఎంత క్యూట్‌గా ఉన్నావురా'' ముద్దాడింది మమ్మీ.
"మమ్మీ ఐ లవ్ యూ'' చెప్పేడు 17 ఏళ్ల సుదీప్.
"సారీరా! నా దగ్గర దమ్మిడీ లేదు'' చెప్పింది మమ్మీ.

నాకు తప్పేట్టు లేదు!
"నా జీవితంలో వెయ్యిమంది చేత పేకాట, తాగుడు, వ్యభిచారం మానిపించాలని శపథం చేశాను!'' గర్వంగా చెప్పేడు గరుడాచలం.
"వెరీ గుడ్, మీలాంటి ఆదర్శవంతులు దేశానికి ఎంతో అవసరం'' అభినందించాడు శేషాచలం.
"ఇప్పటిదాకా 999 మంది చేత ఈ దురలవాట్లు మానిపించా!'' కాలరెగరేశాడు గరుడా.
"ఇంకేం ... ఆ ఒక్కడిని కూడా వెతుకు. నీ శపథం పూర్తిగా నెరవేరుతుంది'' శేషా.
"ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ఎవరూ దొరకట్లేదు! చివరికి వెయ్యోవాడిగా నాకు తప్పేట్టు లేదు'' వాపోయాడు గరుడా.

29, జనవరి 2012, ఆదివారం

మిక్స్చ్‌ర్


లిక్కర్ వాంటెడ్

పుట్టన్న గేలం తీసుకుని చెరువుకెళ్లాడు. ఎక్కడ తవ్వినా ఒక్క ఎర కూడా కన్పించలేదు. దగ్గర్లో ఒక పిట్ట ఎరని చీలుస్తూ కన్పించింది. ఒడుపుగా పిట్టని పట్టి, ఎర లాగేసుకుని ప్రతిఫలంగా తన దగ్గరున్న బ్రాందీలోంచి 4 చుక్కలు పిట్ట నోట్లో పోసి గాల్లోకి వదిలేశాడు. తర్వాత గేలమేసి తాపీగా ఒడ్డున మందు కొడుతూ కూర్చున్నాడు.
గంట తర్వాత - ఎవరో వీపుని పొడుస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు .
పిట్ట మరో 3 ఎరలను తీసుకొచ్చింది.

కడదాకా రుణపడి ఉంటా
"డాక్టర్‌గారూ, చాలా పేదవాడిని. మీరు అడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. నాకొచ్చిన జబ్బు నయం చేస్తే జీవితాంతం పైసా తీసుకోకుండా మీ కుటుంబానికి పని చేసి పెడతా'' దీనంగా అన్నాడు ఏడుకొండలు.
"సర్లే! గాలి పీల్చు ... ఇంతకూ ఏం పనిచేస్తుంటావు?'' స్టెతస్కోప్ రోగి గుండెకు ఆనించి, నవ్వుతూ అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండి, శవాలు కాలుస్తుంటాను'' ఊపిరి వదులుతూ చెప్పేడు ఏడుకొండలు.

రాత్రుళ్లు కూడానా!
" ఏంటయ్యా? ఆఫీసుకు ఇంత ఆలస్యంగానా రావటం?'' కోపంగా అడిగాడు ఆఫీసరు.
"నిద్ర లేవడం ఆలస్యం అయింది సార్'' మెలికలు తిరిగేడు దైవాధీనం.
"వ్వాట్? నీవు ఇంటి దగ్గర కూడా నిద్రపోతావా?'' నోరు తెరిచాడు ఆఫీసరు.

నిజాయితీ వెల
"అడుక్కునే వాడికి ఒక్క రూపాయో, రెండు రూపాయలో వేస్తారు గానీ, ఏకంగా 20 రూపాయలు వేశావేం?'' అరిచాడు భర్త భాస్కర్రావు.
"ఉట్టినే వేశాననుకున్నారా? వాడి మాటల్లో నిజాయితీ కన్పించింది'' నెమ్మదిగా అంది కోమలి.
"ఏమిటో ఆ నిజాయితీ?'' వ్యంగ్యంగా అన్నాడు భాస్కర్రావు.
"అచ్చం రంభలా ఉన్నానన్నాడు. అది చాలదా?'' ఎదురు ప్రశ్నించింది కోమలి.

కష్టపడి కొట్టేశా మరి
"అయ్యో! పర్స్ పోయింది. అందులో పది వేలున్నాయి. ఇచ్చినవాళ్లకు వంద రూపాయలు ఇస్తాను'' లబోదిబో అన్నాడు చెంగల్రావు.
"నాకిస్తే ఐదు వందలిస్తా'' చెప్పేడు పక్క పాసింజరు.
"నాకిస్తే వెయ్యి రూపాయలిస్తా'' మరొకడన్నాడు.
"నాకిస్తే అందులో సగం, అంటే అయిదువేలూ ఇచ్చేస్తా'' అరిచేడు మరొకడు.
"అమ్మా? ఆశ, అప్పడం. ఎవరికీ ఇవ్వకపోతే పదివేలూ నావేగా?'' నోరుజారి దొరికిపోయాడు గంగులు.

బతికిపోయావు!
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిందే, మా ఆయనకు నా మీద ప్రేమ పోయిందని'' కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి.
"అందుకు సంతోషించు. ప్రేమ అలాగే ఉండి ఉంటే ఇంకెంతమంది పిల్లల్ని కనాల్సివచ్చేదో ఆలోచించు!'' ఓదార్చింది సుబ్బలక్ష్మి.

20, జులై 2011, బుధవారం

సీరియల్ రైటర్


.................... కాండూరి వెంకట సన్యాసిరావ్ 
నేనెక్కిన ఆటో కాస్త భారంగా పరిగెడుతోంది. డ్రైవరుకి చెరోపక్క రక్షకుల్లా ఇద్దరు, బేబీ సీట్లో పెద్దలు నలుగురు, నేను కూర్చున్న అసలు సీట్లో నాతో పాటు నలిగిపోతూ మరో ముగ్గురు స్త్రీలు, మా వెనుక తొట్టిలాంటి ప్రదేశంలో మూడు నిండు తట్టలు, వాటి యజమానులు. ఇంత బరువు మోస్తున్నా నన్న ఆలోచన ఆటోకి రాకుండా అర్థమవ నివి కొన్ని, అర్థం లేనివి కొన్ని పాటలు!

ఒక ఊరు రాగానే బేబీ సీట్లో కూర్చున్నాయన దిగిపోయాడు. అతగాడు దిగిపోవడం నాకెందుకో నచ్చింది. ఎందు కేంటి? ఆటో రాగానే సీట్లో మొట్ట మొదట కూర్చున్నది నేనే. మూడు ఆడ భారీ కాయా లొచ్చి తటపటాయిస్తుంటే, నన్ను డ్రైవర్ పక్కన కూర్చోమని సలహా ఇచ్చాడు. అందుకే అతగాడంటే చిరాకేసింది.

నేను సీటు మారనని తెగేసి చెప్పడంతో మహిళా మణులు ముగ్గురూ నా పక్కనే కూర్చు న్నారు. ఆటో చక్రం గోతిలో పడ్డప్పుడు కలిగిన కుదుపుకి వాళ్లు నా వైపుగా వచ్చేస్తూ దాదాపు తొంభైశాతం ఆక్రమణ చేసేశారు. నా పక్కనున్న పెద్దావిడ మోచేయి నా పొట్టలో తగులుతుంటే కొంచెం ఇబ్బందిగా చూశానో లేదో, ఆటోలో ఇలాంటివి తప్పవని కళ్లతోటే జవాబిచ్చింది.

ఉచిత సలహాలరాయుడు దిగిపోవడం నచ్చిందనేసరికి డ్రైవరుకి మహోపకారం చేసే చాన్సు తగిలింది. ‘‘ఏయ్ బాబూ! ఇప్పుడు దిగినతను డబ్బు లివ్వకుండా వెళ్లిపోయాడు. చూసుకున్నావా?’’ అన్నాను. ‘‘అతను సీరియల్ రాస్తాడండీ. డబ్బులిమ్మంటే బాగోదు’’ వివరించాడు డ్రైవరు బాబు.
సీరియల్ అనగానే ముగ్గురు స్త్రీల మొహాల్లో మూడు వేల ఓల్టుల బల్బు వెలిగినట్లు కనిపించింది.
నన్ను మోచేత్తో పొడుస్తున్నావిడ- ‘‘ఇప్పుడు దిగి పోయినతను సీరియల్ రాస్తాడటర్రా’’ అంది మిగిలిన ఇద్దరితో.

‘‘నిజమా? ఏం పేరు?’’ అడిగింది రెండో ఆవిడ.
‘‘ఇగో బాబూ! సీరియల్ రాసే అతని పేరేంటి?’’ అడిగేసింది మూడోస్త్రీ.
క్షణం పాటు వెనక్కి తిరిగి చూసి, ‘‘పెద్దప్పడు’’ అని చెప్పి రోడ్డు చూసు కున్నాడు డ్రైవరు.
ఇంతలో డ్రైవరుగారి సెల్ రింగ య్యింది. పాటల సౌండు బాగా తగ్గించి, చెవికి, భుజానికి మధ్య ఫోన్ గట్టిగా నొక్కి పెట్టి, కబుర్లాడేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం తప్పు అని తెలిసీ జాలేసిందో, ప్రాణభయం ముంచు కొచ్చిందో గాని, ‘‘సెల్ నేను పట్టుకుంటాను, నువ్వు మాట్లాడు’’ అని జాగ్రత్తగా డ్రైవర్ చెవికి ఫోన్ ఆనించి పట్టుకున్నాడు కుడిపక్క కూర్చున్న పెద్దమనిషి.

ఇక్కడ మోచేతి పొడుపులావిడ, ‘‘వరం.. పెద్దప్పడు గారి సీరియల్ ఏదై ఉంటదంటావ్? నిత్య సరాగాలేటి?’’ అంది.
‘‘ఛీ! కాదు. ఆ సీరియల్లో అలాటి పేరే కనబడదు’’ చెప్పింది వరం.
‘‘సీరియల్లో సొంత పేర్లుంటాయేటి. వేరే పేర్లు పెడతారు’’ అంది రెండో ఆవిడ.
‘‘తెలుసు. కాని, సీరియల్ రాసినోళ్లు, తీసినోళ్లు, చేసినోళ్లు అందరి పేర్లు ప్రతిరోజూ చూపెడతాడు కదా. వాటిల్లో పెద్దప్పుడు పేరు లేదు’’

‘‘మరైతే ఎదురింటావిడ?’’
‘‘కాదు’’ రిథమ్‌తో చెప్పింది వరం.
‘‘ముళ్ల గులాబీ?’’
‘‘కాదు’’ అదే స్టైల్, అదే టెంపో.
‘‘వెనకటికొకసారి?’’
‘‘కానే కాదు’’ స్టైల్ మార్చినా అందం అగుపించింది.
వాళ్ల సంభాషణ అలా సాగుతుంటే, ‘ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తి దగ్గర బీడీ కంపొచ్చిందేంటా’ అనుకున్నాను నేను.

అవును మరి. కథ అరంగుళమైనా ముందుకు కదలకుండా ఎపిసోడ్ పూర్తవ్వాలి. ఆర్నెల్లకో చిన్న ట్విస్ట్, ఏడాదికో కొత్త పాత్ర. అదీ కథకి ఏమాత్రం సంబంధం లేని పాత్ర సృష్టించగలగాలి. ఎంతో శ్రమ, మరెంతో పరిశ్రమ, అనుభవం... ఎట్సెట్రా మేళవిస్తే గాని అంత సాగతీతకి చెయ్యి తిరగదు. మానసికంగా ఎంత అలసట కలుగుతుందో! రిలాక్సేషన్ కోసం ధూమ పానం తప్పనిసరి. సాధారణంగా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లు సిగరెట్ ఎంచు కుంటారు. ఇతగాడెందుకో బీడీతో రిలాక్సవు తున్నాడు అనుకున్నాను.

నడిచిపోయినవి, నడిచి సగంలో ఆగిపోయినవి, ప్రస్తుతం నడుస్తున్నవి, భవిష్యత్తులో నడవబోయేవి... ఇలా ఎన్ని పేర్లు చెప్పినా పెద్దప్పుడు వారి సీరియల్ మాత్రం ‘ఇదీ’ అని ఓకే చెయ్యలేదు వరం!

మధ్యన కూర్చున్నావిడ మరి ఉండలేక డ్రైవరు భుజం మీద కొట్టి మరీ పిలిచి, ‘‘బాబూ! అతను ఏ సీరియల్ రాశాడూ?’’ అని అడిగింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడబోయి తమా యించుకుని కీచుమంటూ ఆగింది. ఏ చూలు పందో అడ్డొచ్చిందనుకున్నాన్నేను. కానీ నవ్వడం కోసం బండి ఆపాడట! పగలబడి, విరగబడి నవ్వుతున్నాడు డ్రైవరు. మేం నల్గురం మొహాలు చూసుకున్నాం. ఎలాగో అతికష్టం మీద నవ్వు ఆపుకుని చెప్పాడు- ‘‘పెద్దప్పడు స్టాండ్‌లో ఆటోలకి సీరియల్ రాస్తాడు’’ అని.
ఆటో మా గమ్యం చేరేవరకు ఒక్కరం మాట్లాడితే ఒట్టు.