వివేచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వివేచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2013, ఆదివారం

ఇదేమి ఖర్మ దేవా ......

ఆంధ్రజ్యోతి న్యూస్ లింక్ 

శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు!

వారంతా అతీంద్రియ శక్తులు..
శివారాధన మతపరమైనది కాదు
హిందుత్వం మతం కాదు!..
హిందువులకు దైవపూజ తప్పనిసరి కాదు
పన్ను మినహాయింపుపై ఐటీ ట్రిబ్యునల్ ఆదేశం

ముంబై, మార్చి 16: శివుడు.. గణపతి.. హనుమంతుడు.. దుర్గాదేవి! వీళ్లంతా ఎవరు!? వీళ్లంతా హిందూ దేవుళ్లు, దేవతలు అని చెప్పేరు కనక!! ఈ మాటంటే ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ ఒప్పుకోదు! వాళ్లు ఏ మతానికీ సంబంధించిన వారు కాదని.. ఈ విశ్వంలోని అతీంద్రియ శక్తులని ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది! వారి ఆలయాలకు విరాళం ఇచ్చినా అది 'మతపరమైన' కార్యక్రమాల కిందకు రాదని స్పష్టం చేసింది. హిందూ దేవుళ్ల ఆరాధన, ఆలయాల నిర్వహణ కోసం పెట్టే ఖర్చును మతపరమైనదిగా భావించలేమని తేల్చి చెప్పింది.

అందువల్ల... ఈ ఖర్చుకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని నాగపూర్ ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అంతేకాదు... "హిందూయిజం అంటే ఒక మతమూ కాదు. వర్గమూ కాదు. అందులో వేర్వేరు వర్గాలున్నాయి. వివిధ రూపాల్లో వేర్వేరు దేవుళ్లను పూజిస్తారు. అసలు.. హిందూ జీవన శైలిని ఆచరించే వ్యక్తి దేవుడిని పూజించడం తప్పనిసరి కాదు'' అని తేల్చి చెప్పింది. నాగపూర్‌లో శివ మందిర్ దేవస్థాన్ పంచ్ కమిటీ సంస్థాన్ అనే ఓ సంస్థ ఉంది.

2008లో ఆ సంస్థ భవన నిర్వహణ, అన్నదానం, ప్రార్థనలు, టైలరింగ్‌లో శిక్షణ, యోగా శిక్షణ, ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు రూ.82,977 ఖర్చు చేసింది. ఈ ఖర్చుకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే, భవన నిర్వహణ, అన్నదానం, పండుగ ప్రార్థనలు, రోజువారీ ఖర్చులు 'మతపరమైన ఖర్చుల' కిందకు వస్తాయని, వీటికి పన్ను మినహాయింపు ఇవ్వడం కుదరదని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ తెలిపారు. సంస్థాన్ విన్నపాన్ని తోసిపుచ్చారు. సంస్థాన్ మొత్తం ఖర్చులో ఐదు శాతం కంటే అధికంగా మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేశారని, మతేతర కార్యక్రమాలకు కేవలం రూ.6700 మాత్రమే ఖర్చు చేశారని కమిషనర్ పేర్కొన్నారు.

వీటికి పన్ను మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాన్ని సవాల్ చేస్తూ సంస్థాన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి, నిర్దిష్ట కులం లేదా నిర్దిష్ట మతం ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలకు పన్ను మినహాయింపు వర్తించదని ఆదాయ పన్ను చట్టం చెబుతోంది. అయితే, తమ ఆలయం నిర్దిష్టంగా ఒక్క కులం, లేదా మతానికి పరిమితం కాదని సంస్థాన్ వాదించింది. "కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఎవరైనా మా ఆలయంలోకి రావచ్చు. విగ్రహాలను ఏర్పాటు చేయడం మతపరమైన చర్య కాదు'' అని తెలిపింది. ఈ వాదనలతో ఐటీ ట్రిబ్యునల్ కూడా ఏకీభవించింది.

"శివుడు, హనుమంతుడు, దుర్గాదేవి తదితరులను పూజించడానికి, ఆలయ నిర్వహణకు చేసిన ఖర్చులను మతపరమైనవిగా భావించలేం'' అని తీర్పు చెప్పింది. సాంకేతికంగా చూస్తే... హిందుత్వ అనేది ఒక మతం, ఒక వర్గం కాదని తెలిపింది. "ఇక్కడ 'వర్గం' అంటే, ఒకే చట్టం, ఒకే తరహా నిబంధనలకు లోబడి ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు. వీరందరికీ ఒకే రకమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇది క్రైస్తవానికి, ఇస్లామ్‌కు వర్తిస్తుంది. కానీ, హిందూయిజానికి వర్తించదు. ఎందుకంటే, సాంకేతికంగా హిందూయిజం మతమూ కాదు. వర్గమూ కాదు'' అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. సంస్థాన్ మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవంటూ కమిషనర్ ఆదేశాలను తోసిపుచ్చింది.

15, జనవరి 2012, ఆదివారం

ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్



మామగారు కన్యాదాత. అంటే దానం ఇచ్చే హోదాలో ఉన్నవారు. అల్లుడు దానం పుచ్చుకునే స్థితిలో ఉంటాడు. దాతగా మామగారికి ఆభిజాత్యం ఉండకూడదు. మామగారు తన కుమార్తెను ఆప్యాయంగా దానం చేయాలి. అల్లుడు మామగారిని తండ్రితో సమానంగా గౌరవించాలి. ఇక ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నవి మామా అల్లుళ్లను బట్టి ఉంటుంది. మనుచరిత్రలో స్వరోచి, మనోరమల వివాహ సమయంలో స్వరోచి మామగారు స్వరోచికి విమానాన్ని బహుమానంగా ఇచ్చాడు.

అంటే అతని స్థాయిని బట్టి ఇచ్చాడే కాని, అల్లుడి ఒత్తిళ్లకు తల ఒగ్గి కాదు. అల్లుడు ఎప్పుడూ మామను ఒత్తిడి పెట్టకూడదు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అల్లుళ్లు అడిగిమరీ కట్నకానుకలు తీసుకునే ఆచారం లేదు. ఆంధ్రదేశంలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటాం. మనది వ్యవసాయప్రధానమైన రాష్ట్రం కాబట్టి, పంటలు ఇంటికి వచ్చే సమయం కాబట్టి, అల్లుళ్లు ఈ సమయంలో కానుకలు అడగడానికి, ఇవ్వడానికి ఈ పండుగ ఒక సందర్భం అయ్యింది అంతే తప్ప మరేమీ కాదు. ‘‘ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్’’ అనే నీతి వాక్యం ప్రకారం చూసినా స్త్రీ నుంచి ధనం రావాలని ఆశించకూడదు. స్త్రీనుంచి ధనం ఆశించడం అంటే పరోక్షంగా మామగారిపై ఒత్తిడి తేవడమే. అల్లుడికిది తగని పని.

శివకేశవులంతటి వాళ్లే అడగలేదు!
శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో ఉంటాడు. శివుడు హిమాలయాల మీద నివసిస్తాడు. ఒకరకంగా వీరిరువురూ ఇల్లరికపుటల్లుళ్లే. అయితే శివ కేశవులిద్దరూ మామగారింట్లోనే ఉన్నప్పటికీ, వారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు, వారి నుంచి ఏనాడూ ఏమీ ఆశించలేదు.

పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేయమని అడగడానికి ఋషులంతా కలిసి వెళ్లినప్పుడు మాత్రం, ఋషులలో ఒకరైన అంగీరసుడు, ‘‘శివుడికి ఇవ్వడం వలన కలిగే లాభాలు చెబుతూ... ఇంతవరకు ఈశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన కంటె పెద్దవాళ్లు లేరు. ఇప్పుడు నీకు సమస్కరిస్తాడు. ఈ సృష్టిలో నువ్వొక్కడివే ఈశ్వరుడితో నమస్కరించబడేవాడివి అవుతావు. మామగారు తండ్రితో సమానం అవుతారు. అందువలన పూజనీయుడు. మామగారిని గౌరవించడమనేది మన సంప్రదాయం’’ అని దక్షప్రజాపతికి చెప్పినట్లు ‘కుమారసంభవం’ లో కాళిదాసు వర్ణించాడు.

- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

9, జనవరి 2012, సోమవారం

ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం!!



వేదాల్లోగానీ.. ఉపనిషత్తుల్లో కానీ చతుర్వర్ణాల యొక్క ఆవిర్భావం, వాటి పరమార్థం వివరించడం జరిగింది. చతుర్వర్ణాలు అనగా నాలుగు కులాలు. ఈ కులాలన్నీ భగవత్ప్రసాదితాలు. సృష్టి క్రమం ప్రారంభమయ్యేందుకు ముందుగా సృష్టికర్త విరాట్‌ స్వరూపంలోని ముఖం నుండి బ్రాహ్మణుడు, భుజస్కంధాల నుంచి క్షత్రియుడు, ఉరువుల నుంచి వైశ్యుడు, పాదాల నుండి శూద్రుడు అనే నాలుగు వర్ణాలు ఉద్భవించాయని చెప్పడమే కాక ఆ కులాల ప్రాముఖ్యతను, వాటి విశిష్టతను వివరించడం జరిగింది. 

కులాల వ్యవస్థీకరణ అనేది భగవంతుడిచే సృజించబడిన సృష్టి అంతయూ సమస్థితిలో సజావుగా కొనసాగేందుకే వ్యవస్థీకరించబడింది. ఈ కులాల్లో దేనిది అగ్రస్థానం, దేనిది అథమ స్థానం అనేది వేదాల్లో ఎక్కడా వర్ణించలేదు. ఏ కులానికి ఉన్న పరమార్థం దానిదే అనేది అక్షర సత్యం. 

కానీ నేటి సమాజంలో తీవ్ర స్థాయిలో నెలకొన్న సమస్య కుల వర్గీకరణ సమస్య. కులాలు అనబడేవి ఏ వ్యక్తికీ పుట్టుకతో సంక్రమించినవి కావు. కానీ పుట్టిన బిడ్డ పెరిగే వాతావరణం, సామాజిక స్థితులు, పెద్దల పెంపకం మొదలైన వాటి క్రమంలో మనిషికి కులం అనేది ఏర్పడుతోంది. అశాశ్వతమైన జీవన క్రమంలో ఏ వ్యక్తి అయినా శాశ్వతమని భావించే కులవర్గ పోరాటాలు ఎందుకు. 

నీ కులం, నా కులం ఒక్కటే, మనం ఇద్దరం ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదనే భ్రమలు మనిషికి ఎందుకు. అసలు ఈ కుల వ్యవస్థ ఎప్పుడు ఎందుకు ఏర్పడింది, కులాలను లెక్కించే సంప్రదాయం ఎక్కడ మొదలైంది, ఆ కులాల పరమార్థం ఏమిటి అనేది గ్రహించాలని వేదాలు వల్లిస్తున్నాయి. వాస్తవానికి ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం, అదే మానవత్వమని చతుర్వర్ణాలు వెల్లడిస్తున్నాయి.

7, జనవరి 2012, శనివారం

వివేక జాగ్రదానందుడు


రాలిన మొగ్గలు
భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో
భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న యుగమది.
మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా,
సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే
తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ అవుతున్న
శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన వైతాళికుడు
వివేకానందుడు.

భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద!

1863 జనవరి 12, సోమవారం! ఉదయం 6 గంటల 49 నిమిషాలు. కలకత్తాలో భువనేశ్వరీదేవి పండంటి మగబిడ్డను కన్నది. తండ్రి విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి నరేంద్రనాథ్ అనే పేరు పెట్టారు. నరేన్ అల్లరి గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు, రాళ్లు - అన్నీ ఆ చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే!

పిల్లల్లోని అంతర్గత అనంత శక్తే అల్లరిగా ఎగదన్నుకొస్తుంది. ఆ దివ్యశక్తిని వెలికి తీయడమెలాగో భువనేశ్వరికి తెలుసు. రెచ్చిపోయే నరేన్ నెత్తిపై శివ శివ అంటూ బిందెడు నీళ్లు గుమ్మరించేది. బుద్ధిగా ఆ పిల్లాడిని కూచోబెట్టేది. రామాయణ భారత శ్లోకాల్ని వల్లె వేయించేది. అందుకే ‘‘నాలోని మానసిక అభ్యుదయానికి, ధార్మిక శక్తికి, సంస్కారానికి మా అమ్మే కారణం’’ అనేవారు స్వామి వివేకానంద.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పిన బడిలో 1870లో నరేన్ ఒకటో తరగతిలో చేరాడు. చిన్నప్పుడే వేణీగుప్త, ఉస్తాద్ అహ్మద్‌ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. హార్మోనియం, ఫిడేల్‌పై పట్టు సాధించాడు. న్యాయవాది అయిన విశ్వనాథ్ దత్తా తన కొడుక్కి న్యాయశాస్త్రం, సైన్సు పుస్తకాల్ని ఉద్దేశపూర్వకంగా ఇస్తూండేవారు. ఉపనిషత్తుల్ని, పురాణాల్ని చదివిస్తూండేవారు. ఆయా విషయాలపై కావాలని వాదనపెట్టి చర్చిస్తూండేవారు.

ఏ విషయాన్నయినా తర్కంతో హేతుబద్ధంగా పరిశీలించే శక్తి నరేన్‌కి అలవడింది ఈ శిక్షణ వల్లనే!
చిన్నప్పటినుంచీ నరేంద్రుడికి ధ్యానం ఓ నిత్యక్రీడ. పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోతే సమస్త ప్రపంచాన్నీ మరచిపోయేవాడు. అత్యంత తీక్షణమైన ఏకాగ్రత వివేకానందుడికి అబ్బింది ఈ ధ్యానం వల్లనే.

ఏవేవో ప్రశ్నలు...
1879లో 16 యేళ్ల నరేన్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు. వస్తాదులా ఉండేవాడు. కర్రసాము, గుర్రపుస్వారీ, కుస్తీ, పడవ నడపడం, పరిగెత్తడం, ఈతకొట్టడం... ఒకటా రెండా అన్నింటిలోనూ ప్రవేశించడం, అంతు చూడటం... ఇదీ వరస! చివరకు పాకశాస్త్రంలో కూడా గరిటె తిప్పిన చెయ్యి నరేన్‌ది!

మరోపక్క హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టువర్ట్ మిల్, అగస్టె కామ్టె, అరిస్టాటిల్, డార్విన్ లాంటి పాశ్చాత్యుల గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. దేశ చరిత్రల్ని, ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్రాల్ని, తర్కం, క్రైస్తవ మహ్మదీయ బౌద్ధమత గ్రంథాల్ని ఆకళించుకున్నాడు. వివిధ దేశాల్లో వివిధ పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో అవగతం చేసుకున్నాడు.

అయితే భారతీయ సంస్కృతి, మతం, తత్త్వ చింతనలపై మమకారం ఓ వైపు; ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, హేతువాదం పట్ల మక్కువ మరోవైపు - ఈ రెంటి మధ్య నలిగి మధనపడ్డాడు. భగవంతుడు లేడనీ భౌతిక దృగ్విషయాలే సత్యాలనీ చెప్పే పాశ్చాత్య సైన్సులో లోపం ఉందని హృదయానికి అనిపించేది. సనాతన భారతీయ భావజాలం భౌతిక దృష్టి కొరవడి వక్రీకరణకు గురైందని బుద్ధికి తోచింది.
తత్ఫలితంగా ఏవో ఏవేవో ప్రశ్నలతో వేగిపోయేవాడు. ఏవో ఏవేవో ఘోషలతో ఊగిపోయేవాడు. సమాధానాల కోసం బ్రహ్మ సమాజంలో చేరాడు. అయినా సంతృప్తి లేదు.
నిర్వికల్ప సమాధి...
1881లో స్కాటిష్ చర్చి కాలేజీలో బీఏలో చేరాడు నరేంద్రుడు.

ఓ రోజు క్లాసులో ప్రిన్సిపాల్ విలియం హేస్టీ - వర్డ్స్‌వర్త్ కవిత ‘ది ఎక్స్‌కర్షన్’ గురించి చెబుతున్నారు. ఆ మాటల్లో ‘సమాధి అవస్థ అనే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది తనకు తెలిసి రామకృష్ణ పరమహంస’ అని హేస్టీ అన్నారు. నరేన్‌కి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. వెంటనే కలకత్తాకి దగ్గర్లోని దక్షిణేశ్వరం వెళ్లాడు.

ఉసిరిచెట్టు కింద మాసిన గడ్డంతో ఒంటిపై ఒక్క అంగవస్త్రం తప్ప మరే ఆచ్ఛాదనా లేని అలౌకిక ధ్యానముద్రలో పరమహంస... దివ్యోన్మాదంతో కాళికాదేవి సాక్షాత్కారం కోసం నేలపై దొర్లి ఏడ్చి చివరకు భగవద్దర్శనం పొందిన పరమహంస... ప్రతిరోజూ గంగలో వెండి నాణాల్ని విసిరేసి ధనవ్యామోహం వదిలించుకున్న పరమహంస... బ్రాహ్మణుడే అయినా పంచముల ఇళ్లకు వెళ్లి, వారు చూడని సమయాల్లో వారి పాయిఖానాల్ని వొట్టి చేతులతో శుభ్రం చేసిన పరమహంస... సన్నిధిలోకి అడుగుపెట్టాడు నరేన్.

ఆయన పాడమంటే - కనులు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి తన్మయీభావంతో గాన ధ్యాన సమాధ్యవస్థలో ‘‘మన్ చలో నిజనికేతన్’’ (మనసా! మన చోటుకి వెళ్లిపోదాం) అన్న కీర్తన పాడాడు. పాట వింటూ పరవశులైపోయారు పరమహంస.

హఠాత్తుగా నరేన్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి తలుపులేసేశారు. కళ్లల్లో ఆనంద భాష్పాలతో ‘‘ఇన్నాళ్లకు వచ్చావా?’’ అంటూ నరేన్‌ను స్పృశిస్తూ ఆర్ద్రమైపోయారు. అంతటి తాదాత్మ్యతలోనూ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నరేంద్రుడు సూటిగా వదిలిన ప్రశ్నాబాణం - ‘‘మహాశయా! మీరు దేవుణ్ని చూశారా?’’ ఏమాత్రం తడుముకోకుండా ‘‘చూశాను’’ అన్నారు రామకృష్ణులు.

సంభ్రమాశ్చర్యానందాలతో నరేన్...
ఇన్నాళ్లుగా ఎందరెందరినో ఉన్మత్తుడిలా అడిగిన ప్రశ్న అది.
ఎన్నాళ్లుగానో చకోరంలా ఎదురుచూస్తున్న జవాబది.
మళ్లీ రామకృష్ణులు ‘‘నిన్ను చూస్తున్నట్లే భగవంతుణ్ని చూశాను. నేను నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో అలాగే మనమూ భగవంతుణ్ని చూడొచ్చు’’ అన్నారు.

ఈ సంఘటన నరేన్ మనసులో గొప్ప విప్లవాగ్ని రగిలించింది.
గదులు, తలుపులు, కిటికీలు, చెట్లు, సూర్యచంద్రులు, నక్షత్రాలు - అన్నీ ఎగిరిపోతున్నట్లు, తునాతునకలై అణువులు పరమాణువులుగా విడిపోయి ఆకాశంలో లీనమైనట్లు అనిపించింది. నేను అనే మాయ మాయమై విశ్వ చైతన్యమే నేనుగా భాసించింది.

నరేంద్రుడు వివేకానందుడిగా మారడం మొదలైందప్పుడే! అప్పటినుంచి పరమహంస వద్దకు నిత్యం ఏవో ప్రశ్నలతో వెళ్తుండేవాడు. అప్పుడప్పుడు గురువుతో వాదించేవాడు. ఓ దశలో తానూ నిర్వికల్ప సమాధిని పొందాలన్నంత ఆవేశవశుడయ్యాడు.

కష్టాలెన్నో...
అంతలో 1884లో తండ్రి విశ్వనాథ్ దత్తా మరణించారు. అంతవరకు బాగా బతికిన కుటుంబం వీధినపడింది.
పెద్ద కొడుకుగా నరేన్‌పై ఇంటి భారం పడింది. ఆకలితో ఉత్తకాళ్లతో మండుటెండలో కాళ్లు బొబ్బలెక్కినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దీన స్థితి. ఇంటిలో అన్నం ఉండదని తెలిసి స్నేహితుల ఇళ్లల్లో తినేశానంటూ కన్నతల్లికే అబద్ధం చెప్పాల్సిన హీన స్థితి. డబ్బు సాయం చేస్తామంటూ ఒకరిద్దరు సంపన్న స్త్రీలు అతి జుగుప్సాకర ప్రతిపాదన చేస్తే ఛీకొట్టిన ధీర స్థితి.

చివరకు ఓ న్యాయవాది దగ్గర అనువాదం చేసే ఉద్యోగం దొరికింది - బొటాబొటీ జీతానికి! కానీ తాను జన్మించింది ఇందుకోసం కాదని తెలుసు. అలాగని బాధ్యతల నుంచి తప్పుకోలేననీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో 1885లో రామకృష్ణులు గొంతు క్యాన్సర్‌కి గురయ్యారు. ఆయన నిర్యాణం చెందడానికి ముందురోజు నరేన్‌తో, ‘‘నేను ఇచ్చిన శక్తితో ప్రపంచానికి సేవ చెయ్యి’’ అన్నారు.

22 యేళ్ల లేత వయసులో ఉన్న నరేన్‌కి ఆ మాట రామబాణమైంది. తనవారిని విడిచిపెట్టేశాడు. తోటి శిష్యులతో కలిసి బారానగర్‌లో ఓ పాడుబడిన ఇంటిలో ‘రామకృష్ణమఠం’ స్థాపించారు. జపం, ధ్యానం, వేదాంత చర్చ, ఉంటే తిండి, లేకుంటే పస్తులు, చింపిరి దుస్తులు, కటిక నేలపై నిద్ర, యోగసాధన - రెండేళ్ల పాటు ఇదే జీవితం!

ఆపై సన్యాసం స్వీకరించి స్వామీ వివిదిశానందగా పేరు మార్చుకున్నారు. కాషాయవస్త్రాలు, నడుముకు దిట్టచేల, తలకు పాగా, ఓ చేతిలో కమండలం, మరో చేతిలో భగవద్గీత... ఇంతే! 1888 నుంచి 5 ఏళ్లపాటు భిక్షాటనంతో దేశాటనం. ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో... పట్టణాల్లోని మురికివాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో... ఎక్కడెక్కడ సంచరించారో! వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్లారా చూశారు.

వివేకవాణి...
చివరకు 1892 డిసెంబరు 25న కన్యాకుమారి చేరారు.
అది మూడు సముద్రాల కూడలి. భారతదేశపు చిట్టచివరి కొన... సముద్రంలో దూరంగా కొండ... సాగరాన్ని ఈది ఆ గుట్టను చేరారు స్వామి. అక్కడ విశాల వినీల ఆకాశం కింద ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్ణిద్ర సంగీతం వింటూ మూడు రోజులు గడిపారు.

ఆ కొండపై మాతృభూమికి అభిముఖంగా నిలబడితే ఎదురుగా వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లయిన పునీత భారతదేశం... పారతంత్య్రం, దుర్భర దారిద్య్రం, కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన యువత తనకోసం బతకడమే బతుకు అని భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి... తలచుకుంటే స్వామికి గుండె తరుక్కుపోయింది. నయనాలు రెండూ అశ్రుసాగరాలయ్యాయి.
తన విధ్యుక్త ధర్మం తెలిసొచ్చింది.

‘‘పేదల్లో పీడితుల్లో అంధుల్లో కుష్టురోగుల్లో ప్లేగు బాధితుల్లో... భగవద్దర్శనం అయ్యింది. ప్రాచీన భారతీయంలో దాగిన పటిష్ఠ నైతిక సూత్రాల్ని, ధార్మికతలోని శీల నిర్మాణాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ శిఖరాగ్రాన నిలబడి ఎలుగెత్తి చాటాలి. వేదాంత శంఖం పూరించాలి. ఇదే నా జీవిత కార్యం’’ అని అనుకున్నారు స్వామీజీ.

చికాగో (అమెరికా)లో జరగబోయే విశ్వమత సదస్సును ప్రథమ వేదిక చేసుకున్నారు. వివేకానందుడిగా పేరు మార్చుకుని 1893 మే 31న బొంబాయి తీరంలో బయలుదేరారు. ఆగస్టు 20కి చికాగో చేరుకున్నారు.
1893 సెప్టెంబర్ 11. విశ్వమత మహా సభాప్రాంగణం.

వేదికపై స్వామి వివేకానంద.
అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడగరి. విశాలమైన నుదురు, వెడల్పయిన నేత్రాలు. తీక్షణమైన చూపులు. బలమైన ఛాతి. నిండైన విగ్రహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం. రాజఠీవి. దర్పం. సరస్వతీదేవికి నమస్కరించి, ‘‘అమెరికా సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రసంగం ప్రారంభం. అంతే. ఆ ఒక్క పిలుపుతోనే 7000 మంది ఒక్కసారిగా లేచి నిలబడి రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు.

ఆ క్షణం నుంచి ఏడేళ్ల పాటు వివేకానందుడు అమెరికా, ఇంగ్లండ్, భారత్... ఇంకా అనేకానేక ప్రాంతాల్లో వివేకవాణి వినిపించారు. 1902 జూలై 4 శుక్రవారం రాత్రి 39వ యేట తనువు చాలించారు. ‘కాలక్రమంలో ఎందరో వివేకానందులు ఉద్భవిస్తారు’ అన్నది ఆయన ఆఖరిమాట. స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకులందరి కండరాల్లోని ప్రతికణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పు కణికలై ప్రజ్వరిల్లనీ. అపుడే... నీ స్వప్నం నిజమవుతుంది. ఈ స్వర్గం రుజువవుతుంది.

రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన అన్నారు.

కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్‌దాస్‌లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే బాటలయ్యాయి.

........... ఆకెళ్ల రాఘవేంద్ర

29, డిసెంబర్ 2011, గురువారం

గతం నుండి గుణపాఠం నేర్చుకోవాలి


కాలం ఎంతో విలువైనది, అది నిరంతరం పరుగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే గాని మజిలీలు లేవు. కాలాన్ని మనం ఎన్నో రకాలుగా విభజించుకున్నాం. సెకనులు, నిమిషాలు, గంటలు, ఘడియలు, విఘడియలు, ఝాములు. ప్రకృతి సిద్ధంగా ఈ విభజన ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అమావాస్య, పౌర్ణమి, పగలు, రేయి, రోజు, వారం, మాసం, సంవత్సరం. ఈ ప్రకృతి నియమాన్నే మనిషి అనాదిగా అనుసరిస్తూ వస్తున్నాడు.

కాలగతిలో క్యాలండర్లు మారుతుంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ‘ఉగాది’గా, మహారాష్ట్రలో ‘గుడిపద’గా, అస్సాంలో ‘బిహు’గా, కేరళలో ‘కాలవర్ష’. పారశీలు ‘జష్నెనౌబహార్’ అని, ‘నౌరోజ్’ అని పిలుచుకుంటారు. హి.శ.మొదటిమాసంతో ప్రారంభమయ్యే ‘ముహర్రం’ మాసం ఇస్లామీయ క్యాలండరు ప్రకారం నూతన సంవత్సరం. అలాగే క్రీ.శ. జనవరితో ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది.

గతకాలానికి వీడ్కోలు, కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోనుకావడం సహజమే. అయితే ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ధార్మికంగానే కాకుండా, సామాజికంగా, నైతికంగా కూడా తప్పే. దీనికి దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే, ‘కాలం సాక్షి! మానవుడు ఘోరమైన నష్టంలో ఉన్నాడు. అయితే సత్యాన్ని విశ్వసించి, తదనుగుణంగా సత్కార్యాలు చేసేవారు తప్ప’ అంటున్నాడు దైవం పవిత్ర ఖురాన్‌లో (103 - 1).

గతాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరాన్ని అర్థం పర్థం లేని కార్యకలాపాలతో ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. గతంలో ఏమైనా తప్పులు, పాపాలు జరిగి ఉంటే, ఇక ముందు వాటిని కచ్చితంగా విసర్జిస్తామని ప్రతినబూనాలి. గతంగతః ఇక నుంచి ఓ కొత్త శకానికి ప్రారంభమన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి.

అన్నిరకాల దుర్వ్యసనాలకు, నిషిద్ధాలకు దూరంగా, దేవుని మార్గదర్శకత్వంలో జీవితం గడుపుతామన్న స్థిర నిర్ణయం తీసుకోవాలి. కాలం చాలా కర్కశమైందని, అది ఎవర్నీ వదలదని, ఏదో ఒకనాడు తాము కూడా కాలగర్భంలో కలిసిపోవలసిన వాళ్లమేనన్న నగ్నసత్యాన్ని అనునిత్యం జ్ఞాపకం ఉంచుకుని కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. కనుక పవిత్రఖురాన్‌లో ప్రవచించబడినట్లు, సాధ్యమైనంతమేర సత్కార్యాలు చేస్తూ, గతం నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్ కాలాన్ని ఇహ పర ప్రయోజనకారిగా మలచుకోవడమే వివేకవంతుల లక్షణం.

- ఎం.డి. ఉస్మాన్‌ఖాన్

ఈ విశ్వం లో నీవు ఎక్కడ ?


ఎందుకు ఏడుస్తున్నావ్, ఈ విశ్వం లో నీవు ఎక్కడ....?????



ఒక్కసారి ఆలోచించు...........

12, డిసెంబర్ 2011, సోమవారం

శ్రమలో దాగిన దీవెన


దిశ
జీవితంలో శ్రమలు, బాధలు మనల్ని ఆవహించినపుడు ఆవేదనతో కుంగిపోతాం. ఇబ్బందులలో ఉంటే కలిగే అవమానాన్ని తలచుకుని భయపడుతుంటాం. మనల్ని మనం శపించుకుంటూ దేవుణ్ని దూషిస్తూ, జీవిత ంపై విరక్తిని, వైరాగ్యాన్ని పెంచుకుంటాం. జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు తమ జీవిత కష్టాలకు, శ్రమలకు ఒక కొత్తకోణాన్ని కనుగొనవలసిన అవసరం, కొత్త దృక్పథాన్ని అలవరచుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కష్టాలు, బాధలనుండి మనం పారిపోతే అవే మనల్ని తరుముకువస్తాయి. జీవితంలో కష్టాల నుండి, శ్రమల నుండి పారిపోకుండా సామర్థ్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం వాటిని అధిగమించగలుగుతాం, పరిష్కరించుకోగలుగుతాం.

‘‘శ్రమ దినమున నీవు కుంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు’’ (సామె 24:10) మనం ఎదుర్కొనే జీవిత సవాళ్ళు మనలో దేవుడుంచిన శక్తి సామర్థ్యాలను వెలికితీస్తాయి. ‘‘దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు’’ (తిమోతి 1:7) గనుక పిరికితనంతో ఉండక, దైవమునందలి దృఢమైన విశ్వాసంతో కష్టాలను, ఇబ్బందులను, శ్రమలన్నిటిని ధైర్యంగా ఎదురాడి పోరాడాలి. కష్టానుభవం మనం ప్రభువు వైపునకు మరలుటకు, శ్రమల్లో విశ్వాసంతో ప్రార్థించుటకు తద్వారా దైవసహాయంతో జీవితంలో కష్ట శ్రమలు అధిగమించుటకు శ్రమలే పరోక్షంగా దోహదపడతాయి. కష్టానుభవాలను, జీవిత అధిరోహానికి మెట్లుగా మలుచుకొన్న యోసేపును గూర్చి బైబిల్‌లో ఇలా చెప్పబడింది.

యోసేపు అనునతడిని చిన్న వయసులోనే తన స్వంత అన్నలు అసూయతో కుట్రపూరితంగా ఇస్మాయేలీయులు అను బానిస వర్తకులకు అమ్మివేశారు. అలా ఒక బానిసగా ఐగుప్తు దేశంలోని పొతీఫరు అనునతని ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అక్కడ నిందలపాలై, తాను చేయని నేరానికి శిక్షగా జైలుపాలవుతాడు. అట్లుండగా ఒకనాడు ఆ దేశపు రాజుకు కలిగిన స్వప్నానికి దైవజ్ఞానంతో భావమును వివరించి, ఫలితంగా విడుదలనొంది, ఫారో రాజు దయనొందినవాడై, ఆ రాజు తరువాత అంతటి ప్రముఖ అధిపతిగా, అధికారిగా ఎదిగాడు. యోసేపు తాను ఎదుర్కొన్న శ్రమలలో, ఇబ్బందులలో, అవమానంతో కుంగిపోలేదు. ధైర్యాన్ని, దైవాన్ని వీడలేదు. అందుకే శ్రమలే అతని ముందు ఓడిపోయాయి తప్ప అతని జీవితాన్ని నాశనం చేయలేదు.

శ్రమానుభవం మనల్ని జీవిత వాస్తవాలలోనికి తీసుకువెళ్తుంది. జీవితాన్ని గూర్చిన శ్రద్ధ, బాధ్యత, క్రమశిక్షణ, లక్ష్యం, ఆశయం అన్నవి లేకుండా జీవించే నిర్లక్ష్య నిర్లిప్త జీవిత విధానం నుండి, జీవితానికున్న అర్థం, పరమార్థం తెలుసుకొని, అర్థవంతంగా జీవించుటకు శ్రమలు, కష్టాలు, బాధలు కూడా పరోక్షంగా ఉపకరిస్తాయి. ‘‘శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను’’ (కీర్తన 119:67) కష్టం కలుగక మునుపు జీవితాన్ని గూర్చి మనకున్న అవగాహన వేరు, కష్టాలను ఎదుర్కొన్న తరువాత జీవితం మనకు కనిపించే తీరు వేరు.

దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉన్న వ్యక్తి తన జీవిత శ్రమలను, ఇబ్బందులను దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో, సామర్థ్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులను, అవకాశాలను గూర్చి అన్వేషిస్తాడు. శ్రమల తరువాత కలిగే సత్ఫలితానికై నిరీక్షిస్తాడు. కష్టాలు, శ్రమలు నేర్పే నిజ జీవిత పాఠాన్ని నేర్చుకుంటాడు. తన చుట్టూ అలుముకొన్న కష్టపరిస్థితులకు అతీతంగా విశ్వాసంతో నడవగలుగుతాడు. కాబట్టి శ్రమలకు కుంగక, బెదరక ఓ మంచి దృక్పథంతో చూసి సమర్థవంతంగా ఎదుర్కొందాం. కష్టాలు మనకు నేర్పే జీవితపాఠాలను నేర్చుకుందాం. అప్పుడే జీవితంలో నిజ విజయాన్ని సాధిస్తాం.

- రెవ. పి. ఐజక్ వరప్రసాద్

బియ్యపు గింజలూ భగవంతుడి కటాక్షమే!


బియ్యపు గింజలూ భగవంతుడి కటాక్షమే!
ప్రతి బియ్యపు గింజకూ భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మరచిపోకండి. అందుకే అంటున్నా... మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి...

ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటగదికి వెళ్ళారు. అక్కడ నేల మీద బియ్యపుగింజలు పడి ఉండటం చూశారు. ఆయన వెంటనే కింద కూర్చుని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టారు. కాసేపటికి అక్కడికి ఆయన శిష్యులు వచ్చారు. తమ గురువుగారు నేలమీద కూర్చుని బియ్యం గింజలు ఏరుతుండటం చూసి విస్తుపోయారు.

ఆత్మజ్ఞానం కోసం ఇంటినీ, తల్లినీ, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణమహర్షి ఇలా బియ్యపుగింజల్ని ఏరడం ఏమిటా అని వాళ్లలో వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఉండబట్టలేక వారు ఆయన వద్దకు వెళ్ళి ‘‘స్వామీ, నేలమీద పడిపోయిన కొన్ని బియ్యపుగింజలకి ఇంత ప్రాధాన్యమివ్వాలా? మన ఆశ్రమంలో బియ్యపు బస్తాలకు ఏ మాత్రం కొరత లేదు కదా? ’’ అని ఆయనను మెల్లిగా అడిగారు.

అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి -
‘‘మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా చూడటం సరికాదు. వీటి లోపల ఏమేమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికీ అన్నదాత శ్రమ కనిపించడం లేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? హాయినిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేవీ చూడలేకపోతున్నందువల్లే మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినవన్నీ వీటిలో కనిపించి ఉంటే కింద పడిపోయిన ఈ బియ్యపుగింజల్ని ఏరాలా? అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపుగింజకూ భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మరచిపోకండి. అందుకే అంటున్నా... మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి...ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృథా చేయకండి. నేలమీద పడిన బియ్యపు గింజలను భద్రపరచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి. అవి ఎంతో తృప్తిగా తింటాయి...’’ అని.
ఆయన మాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు.

- యామిజాల జగదీశ్