9, జనవరి 2012, సోమవారం

ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం!!



వేదాల్లోగానీ.. ఉపనిషత్తుల్లో కానీ చతుర్వర్ణాల యొక్క ఆవిర్భావం, వాటి పరమార్థం వివరించడం జరిగింది. చతుర్వర్ణాలు అనగా నాలుగు కులాలు. ఈ కులాలన్నీ భగవత్ప్రసాదితాలు. సృష్టి క్రమం ప్రారంభమయ్యేందుకు ముందుగా సృష్టికర్త విరాట్‌ స్వరూపంలోని ముఖం నుండి బ్రాహ్మణుడు, భుజస్కంధాల నుంచి క్షత్రియుడు, ఉరువుల నుంచి వైశ్యుడు, పాదాల నుండి శూద్రుడు అనే నాలుగు వర్ణాలు ఉద్భవించాయని చెప్పడమే కాక ఆ కులాల ప్రాముఖ్యతను, వాటి విశిష్టతను వివరించడం జరిగింది. 

కులాల వ్యవస్థీకరణ అనేది భగవంతుడిచే సృజించబడిన సృష్టి అంతయూ సమస్థితిలో సజావుగా కొనసాగేందుకే వ్యవస్థీకరించబడింది. ఈ కులాల్లో దేనిది అగ్రస్థానం, దేనిది అథమ స్థానం అనేది వేదాల్లో ఎక్కడా వర్ణించలేదు. ఏ కులానికి ఉన్న పరమార్థం దానిదే అనేది అక్షర సత్యం. 

కానీ నేటి సమాజంలో తీవ్ర స్థాయిలో నెలకొన్న సమస్య కుల వర్గీకరణ సమస్య. కులాలు అనబడేవి ఏ వ్యక్తికీ పుట్టుకతో సంక్రమించినవి కావు. కానీ పుట్టిన బిడ్డ పెరిగే వాతావరణం, సామాజిక స్థితులు, పెద్దల పెంపకం మొదలైన వాటి క్రమంలో మనిషికి కులం అనేది ఏర్పడుతోంది. అశాశ్వతమైన జీవన క్రమంలో ఏ వ్యక్తి అయినా శాశ్వతమని భావించే కులవర్గ పోరాటాలు ఎందుకు. 

నీ కులం, నా కులం ఒక్కటే, మనం ఇద్దరం ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదనే భ్రమలు మనిషికి ఎందుకు. అసలు ఈ కుల వ్యవస్థ ఎప్పుడు ఎందుకు ఏర్పడింది, కులాలను లెక్కించే సంప్రదాయం ఎక్కడ మొదలైంది, ఆ కులాల పరమార్థం ఏమిటి అనేది గ్రహించాలని వేదాలు వల్లిస్తున్నాయి. వాస్తవానికి ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం, అదే మానవత్వమని చతుర్వర్ణాలు వెల్లడిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి