14, జనవరి 2012, శనివారం

ప్రేమపూర్వకంగా ‘కనుమ’


ఇంక బొమ్మలనోమును కూడా పూర్వం ఇంటింటా చేసేవారు. ఈ విశ్వం అంతా దేవతామయంగా చూడడమూ, దానికి ప్రతిరూపంగా మన ఇంటిలోవారికి కొలువు చెయ్యడమూ, అందర్నీ చూడమని చెప్పి వారికి ప్రసాదాలు పంచిపెట్టడమూ చేసేవారు.

మన సంప్రదాయం... మనుష్యజాతినే కాక పశుపక్ష్యాదుల్ని కూడా ప్రేమించి, వాటికి కూడా ఉత్సవం చెయ్యమని చెబుతుంది. దాన్నే ‘కనుము’ పండుగగా సంక్రాంతి పండుగలో మూడవరోజును పేర్కొన్నారు మన పెద్దలు. నిజానికి ‘కనుము’ అన్నది ఒక పండుగను అనుసరించి వచ్చే పండుగ వంటి రోజు. మకరసంక్రాంతికీ, గ్రహణాలకీ, అమ్మవారి ఉత్సవానికీ, శవదహనానికీ మరుసటి రోజును కనుముగా పెద్దలు వ్యవహరించారు. కనుము అంటే ‘జాగ్రత్తగా చూడు’ అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన రోజులు అని అర్థం. కానీ ఇందులో మార్పులు జరిగి, కేవలం మకరసంక్రాంతి జరిగిన మరునాడు వచ్చే పండుగను మాత్రమే ఈ పేరుతో ఉచ్చరించడం వాడుకలోకి వచ్చింది.

‘సంక్రాంతికి పంటలు చేతికి వచ్చి మానవుడు భాగ్యవంతుడు కావటానికి మూలమయిన వారిని జాగ్రత్తగా చూసుకో! వారికి పండగచెయ్యి’ అన్న అర్థంతో కనుము పండుగ ఏర్పడింది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశ సౌభాగ్యానికి మూలం పశువుల మీదే పూర్వం వ్యవసాయం అంతా ఆధారపడి ఉండేది. అరక దున్నడం, పట్టి లాగడం, ధాన్యాన్ని ఎడ్లబండ్ల మీద ఇంటికి తేవడం... ఇవన్నీ ఎద్దులవల్లే జరిగేవి. మనకు రైతన్న ప్రాణం అయితే ఆ రైతన్నకి పశువులు ప్రాణం. అందుకే కనుమునాడు పశువుల్ని అలంకరించి, కొత్తబియ్యంతో పొంగలి వండి వాటికి నివేదనగా పెట్టేవారు రైతులు. పశువుల ద్వారా లభించిన ధాన్యసంపదను, మొదటి నైవేద్యంగా పశువులకి పెట్టి, కృతజ్ఞతను ప్రకటించడంగా కనుము పండుగ చెబుతోంది.

ఈ కనుమును తమిళులు ‘మాట్టు పొంగలి’ అంటారు. ‘మాట్టు’ అంటే ‘పశువు.’ కనుక కనుము... పశువులకి చేసే ముఖ్యమైన పండుగ. అంతేకాదు వరిధాన్యం వెన్నులు పక్షుల ఆహారంగా ఇంటిచూరుకు కడతారు. కొంత ధాన్యాన్ని పిచ్చుకల వంటి పక్షులు తినడానికి వీలుగా కళ్లంలోనే వదిలేస్తారు. అందువల్ల కనుమును పశుపక్ష్యాదుల పండుగగా చెప్పాలి.

వేదంలో... వృషభోత్సవం, అనడోత్సవం అన్న పేరుతో వ్యవహరించబడి ఉంది. కనుమునాడు గోపూజ చెయ్యడం ఆచారం. ఇప్పటికీ ఇది తమిళనాడులో కనిపిస్తోంది. అలంకరించిన పశువుల్ని సాయంకాలం మేళతాళాలతో ఊరేగిస్తారు.

తెలుగువారు ఈ పండుగల చివర... తమ రూపం తీసేసుకుని మంచిరూపం ఇవ్వమని కాకిని ప్రార్థించడం ఉంది. కనుక పశువులకీ, పక్షులకీ కూడా చేసే పండుగే ఈ కనుము. అందుకే అన్ని జీవులపట్ల ప్రేమను ‘కనుము.’ అప్పుడు నిన్ను నేను ప్రేమగా చూస్తానని చెప్పడమే అన్ని మతాల సారమూ, అందరి భగవత్తత్వమూ. అదే కనుమూ! కనుమూ! కనుమూ! అన్న శబ్దానికి అంతరార్థం.
- డా.ధూళిపాళ మహాదేవమణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి