14, జనవరి 2012, శనివారం

సంస్కృతి సంప్రదాయాల సంక్రాంతి



కాలానికి మూలకేంద్రమయిన సూర్యుడు నిరంతరం ప్రయాణిస్తుంటాడు. నిజానికి సూర్యుడు ఉన్నచోటే ఉన్నా, అతని చుట్టూ భూగోళం, ఖగోళం తిరుగుతూంటాయి. సూర్యుని చుట్టూ ఈ ప్రపంచం తిరుగుతున్నా సూర్యుడే కదులుతున్నట్లనిపిస్తుంది. అలా కదిలే సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతుంటాడు.

సంవత్సరకాలాన్ని రెండు భాగాలుగా లెక్కించి, ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నారు. కర్కాటకరాశిలోకి సూర్యుడు మారినప్పటి నుండి ఆరునెలల కాలాన్ని దక్షిణాయనం, మకరరాశిలోకి మారినది మొదలు ఆరునెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. నెలనెలా సూర్యుడు ఏదో ఒకరాశిలోకి సంక్రమణం చేస్తూనే ఉంటాడు, కనుక ప్రతిమాసం సంక్రాంతి వస్తుంది. అయితే దక్షిణాయన ఆరంభానికి మూలమైన కర్కాటక సంక్రమణానికీ, ఉత్తరాయణ ఆరంభానికి మూలమైన మకరసంక్రమణానికీ అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అందులోనూ మకర సంక్రాంతికి ఉన్నంత విశేష ఆదరణ తెలుగునాట మరే పండుగకూ లేదేమో!

ఏడాదిలో ఎన్నో పండుగలు వస్తుంటాయి. ఏ పండుగైనా ఆ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కాని సంక్రాంతిని మాత్రం నెలరోజులు జరుపుకుంటారు. ముగ్గులు, హరిదాసులు, డూడూ బసవన్నలు, గంగిరెద్దు మేళాలతో పలెల్లలన్నీ కళకళలాడతాయి.

నిజానికి పితృదేవతలను అర్చించడమే ఈ పండుగ ప్రత్యేకత. పెద్దలు తరించే పండుగ కాబట్టి దీనిని పెద్దపండుగ అన్నారు. పితృదేవతలు దక్షిణాయనమంతా ప్రయాణించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తమలోకాలలోకి అడుగు పెడతారని పురాణాలు చెపుతున్నాయి. అందుకనే ఆరోజు వారిని విశేషంగా అర్చించి, వారి అనుగ్రహాన్ని పొందాలి.

ఏ పెద్దలు మనకు ఈ జన్మనిచ్చారో, ఎవరు కష్టపడి మన జీవికను తీర్చిదిద్దారో వారికి కృతజ్ఞతను చూపించేదే సంక్రాంతి. ‘మీరు మాకు ఇచ్చిన బతుకును మేము పవిత్రంగా, ఆనందంగా అనుభవిస్తున్నాము సుమా!’ అని వారికి తెలియజేయడానికే అభ్యంగనస్నానాలు చేసి, పట్టుబట్టలు కట్టుకుని దేవాలయాలకు వెళ్లడం, బంధుమిత్రులతో గడపడం, పిండివంటలతో భోజనాలు చేయడం. .. ఎన్నో సరదాలు కనిపించే గొప్ప పండుగ.

హరిదాసు కీర్తనలతో ఆధ్యాత్మికత పండించేది, తిండి పెట్టే బసవన్నను పూజించి, కృతజ్ఞతను చూపించేది, భారతీయ సంగీతానికి జంతువులు కూడా ఆనందిస్తాయని తెలియజేసేది, తెలుగునాట బావమరదళ్ళ సరస సంభాషణలను చూపేది ఈ పండుగే. గొబ్బెమ్మల పూజ ద్వారా అన్ని పదార్థాలలోనూ దైవాన్ని దర్శించగలిగే హృదయం భారతీయులకు ఉందని చూపించేది, అందాలకు పల్లెలే పట్టుకొమ్మలని చెప్పేది ఒక్క సంక్రాంతి పండుగే. పౌష్యలక్ష్మి , సంక్రాంతి లక్ష్మి, మకరలక్ష్మి పేర్లతో ఈ పండుగను లక్ష్మిగా భావిస్తారు.

ఏ పండుగైనా ఆయా దేవతలపై ఉన్న భక్తిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. కాని సంక్రాంతి మాత్రమే భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పండుగకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.
- డా.కడిమిళ్ల వరప్రసాద్

పిండివంటలు చేయించడం, అల్లుళ్ళు ఇళ్ళకు రావడం, బావమరదళ్ళ మధ్య చిలిపి సరసాలు. అబ్బో! ఇంతకాలం ఇంత పెద్ద హడావుడి కలిగించే పండుగ మరొకటి లేదన్నది వాస్తవం. అందుకేనేమో దీనిని మాత్రమే పెద్దపండుగ అన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి