20, జనవరి 2012, శుక్రవారం

ఖడ్గధారి ధీర నారి


రాలిన మొగ్గలు
'... అప్పుడు ఝాన్సీలక్ష్మీబాయి యుద్ధరంగంలో బ్రిటిష్ సేనలతో భీకరంగా పోరాడుతోంది. అంతలో అకస్మాత్తుగా ఓ ఆంగ్ల సైనికుడు కత్తి ఆమె ఛాతీకింద పొడిచాడు. రక్తం ధార కట్టింది. అయినా పులిలా రాని తిరగబడి అతణ్ణి చంపేసింది. మెరుపువేగంతో మరో బ్రిటిష్ సైనికుణ్ణి హతమార్చింది. అంతలో ఓ బుల్లెట్ ఆమె తొడలో దిగబడింది.

ఎడమచేత్తో ఆ గాయాన్ని అదిమి పట్టుకుని కుడిచేతి కరవాలంతో ఆ తెల్లవాడిని నరికింది. కానీ ఒకేసారి నలుగురు శత్రుసైనికులు ఆమెను చుట్టుముట్టారు. తలపై ఒకడు వేటు వేశాడు. ఆమె కుడికన్ను వెలికి వచ్చింది. అయినా రాణి ఊపిరి బిగపట్టి ఒకడి భుజాన్ని ఛిద్రం చేసింది. చివరకు వారంతా మూకుమ్మడిగా ఆమె దేహాన్ని తునాతునకలు చేశారు. విలవిల్లాడుతూ లక్ష్మీబాయి నేలకొరిగింది’’ఇదీ వీరనారి అంతిమ పోరాట దృశ్యం.


ఆమె బతికింది 23 ఏళ్లే. అయితేనేం... ఆమె జీవితం ఓ ఒరవడి, సాహసం, ఓ ఉదాహరణ. ఆమె ఝాన్సీకి మహారాణి... కానీ సదా అవరోధాలు, అవమానాలు ఆమెను వెంబడించాయి. అయినా ప్రాణం ఉన్నంతవరకు పోరాడిందామె. కష్టాలకు కుంగిపోకుండా రెట్టించిన పట్టుదలతో యుద్ధం చేయడమే జీవితమని నిరూపించిన ధీరనారి లక్ష్మీబాయి.

గాలిపటంలా...
అది వారణాసి. ప్రసిద్ధ శైవక్షేత్రం. అక్కడ రాజశ్రీ మోరోపంత్ తాంబే అనే మరాఠా బ్రాహ్మణుడు నివసిస్తూండేవాడు. అతని భార్య భాగీరథి. వారికి 1835 నవంబర్ 19న ఓ ఆడపిల్ల జన్మించింది. మణికర్ణిక అనే పేరు పెట్టారామెకు. కోలమొహం, కొనదేలిన ముక్కు, కట్టిపడేసే వెడల్పయిన కళ్లు, విశాలమైన నుదురు... చూడముచ్చటగా ఉండేదా పాప. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారంతా!

మనుకి నాలుగేళ్లు నిండకుండానే అమ్మ కన్నుమూసింది. తల్లిలేని పిల్లను ఎలా పెంచాలో తెలీలేదు మోరోపంత్‌కి. ఒంటరిగా కాశీలో ఉండడం కష్టమనిపించింది. కూతురితో కలిసి తమ బంధువులంతా ఉండే బిఠూర్ (ఉత్తరప్రదేశ్)కి మకాం మార్చాడు. పీష్వా రెండో బాజీరావు ఆశ్రయం పొందాడు. అక్కడి యాగశాలకు అధిపతిగా కొత్తజీవితం ప్రారంభించాడు.

మణికర్ణిక బాల్యమంతా గడిచింది బిఠూర్‌లోనే. రోజూ తనతో మనుని యాగశాలకు తీసుకెళ్లేవాడు మోరోపంత్. అక్కడ పదులకొద్దీ యువకులు ఉదయం పూట వేదాలు వల్లెవేసేవారు, సాయంవేళ శారీరక కసరత్తులు చేసేవారు. ఆ యాగశాలే ఆరేళ్ల మనుకి పాఠశాలయ్యింది. ఆ మగపిల్లలే ఆమెకు స్నేహితులు. వారితోనే కలిసి తిరగడం... తినడం.... ఆడడం! ఏ నిర్బంధాలూ లేకుండా గాలిలో గువ్వపిల్లలా ఎదిగింది. ఆ వేదనాదాలు, వ్యాయామాలూ ఆ చిన్నపిల్ల మనసుపై చెరగని ముద్ర వేశాయి.

ఆ చిన్నవయసులోనే తానూ యుద్ధవిద్యలు నేర్చుకోవాలని తహతహలాడిపోయేది మను. పీష్వాబాజీరావు పెంపుడు కొడుకు నానా సాహెబ్, అతడి అన్న కొడుకు రావుసాహెబ్- సాముగరిడీలు చేస్తుంటే- కళ్లు విప్పార్చుకుని చప్పట్లు చరుస్తూ ఎగిరి గంతులేస్తూ- హుషారెక్కి పోయేది మను.

ఓ రోజు రావుసాహెబ్ పట్టపుటేనుగు ఎక్కి దర్జాగా వెళ్తున్నాడు. తననూ ఎక్కించుకోమని బతిమాలింది మను. ‘‘నువ్వు చిన్నపిల్లవు, పైగా ఆడపిల్లవు’’ అంటూ ఎగతాళి చేశాడు రావుసాహెబ్. వెక్కిరింతగా నవ్వాడు పక్కనే ఉన్న నానాసాహెబ్. దాంతో రోషం తన్నుకొచ్చి భళ్లున ఏడ్చేసింది మణికర్ణిక. కానీ ఆ అవమానమే ఆమెలో పౌరుషాన్ని రగిలించింది. ఎప్పటికైనా అంబారీ ఎక్కాలని, గుర్రమెక్కి కరవాలాన్ని థళథళా మెరిపించాలని, సైనికవిద్యలు నేర్చుకోవాలని బలంగా అనుకుంది.

తనకు సామువిద్యలు నేర్పమంటూ ఓసారి ఏకంగా బాజీరావునే అడిగింది. ముద్దుగా ఉండే మణికర్ణిక అంటే ఆయనకు ప్రాణం. ఛబిలి( అందమైనది) అంటూ ప్రేమగా ఆ పాపను పిలుచుకునేవారాయన. అలాంటి మను ముచ్చటను ఆయనెందుకు కాదంటారు? అందుకే ఆమెకు - కర్ర, కత్తిసాము, విలువిద్య, గుర్రపుస్వారీలలో- ఆ వయసుకు తగ్గంత - తర్ఫీదు ఇవ్వడం మొదలెట్టారాయన!

పెళ్లితో కష్టాలు!
ఆరోజుల్లో ఝాన్సీ- ఉత్తరప్రదేశ్‌లోనే కాదు- దేశంలోనే పటిష్ఠమైన కోట. ఝాన్సీ మహారాజు గంగాధరరావుకు భార్య చనిపోయింది. పిల్లలు లేరు. రెండోపెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పండితులకు మణికర్ణిక విషయం తెలిసింది. మంతనాలు చేశారు. జాతకాలు కుదిరాయి. అష్టవర్షాత్ భవేత్ కన్యా అంటూ ఆడపిల్లకు ఎనిమిదేళ్లకే పెళ్లి చేసేసే ఛాందసపు రోజులవి. అందుకే ఏడేళ్ల మనుకి 29 ఏళ్ల గంగాధరరావుతో 1842లో ఝాన్సీలో వివాహమైంది.

అత్తవారు మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మార్చారు. పేరుతోపాటు ఆమె తలరాత కూడా మారింది. అత్తింటి ఆరళ్లు లేవుకానీ పెళ్లంటేనే ఏమిటో తెలీని వయసులో బాధ్యతలు నెత్తిన పడటమే అసలు సమస్య! ఆ పసిపిల్లకు - నోములు, వ్రతాలు, పురాణ కాలక్షేపాలు, అధికారిక లాంఛనప్రాయ సేవలు, పతివ్రతాపూజలు..! రాజభవంతులు విశాలమే అయినా కట్టిపడేసే కట్టుబాట్లు... రాణివాసమే అయినా కారాగారవాసం లాంటి బతుకు...! దానికితోడు భర్త గంగాధరరావుది వింతప్రవృత్తి. మహారాజే అయినా ఒక్కోసారి ఆయన ఆడవారిలా ప్రవర్తించేవాడు. చీర కట్టుకునేవాడు. గాజులు వేసుకునేవాడు. లక్ష్మీబాయిని గదిలో ఉంచి తాళం వేసేవాడు. మహిళా సైనికుల్ని కాపలా పెట్టేవాడు. అన్నింటినీ మౌనంగా భరించింది లక్ష్మీబాయి.

అయితే లక్ష్మీబాయి యుక్తవయసుకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆమె మహారాణి హోదాను అనుభవించడం మొదలైంది. రోజూ ఉదయం పూట రెండుగంటలపాటు సుగంధద్రవ్యాలతో స్నానం... ఆపై తెల్లని చందేరీ పట్టుచీర... నడుముకు బంగారు సరిగంచు వస్త్రం, మెడలో పులుకడిగిన ముత్యాల వరుస, చేతివేళ్లకు వజ్రపుటుంగరాలు... దర్జాగా సాగిందామె జీవితం.

అడుగడుగునా అవమానాలు
అంతలో 16వ ఏట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మీబాయి. గంగాధరరావు తెగసంబరపడిపోయాడు. లేకలేక 38 ఏళ్ల వయసులో పుత్రుడు పుట్టాడన్న సంతోషమది. అంతేకాదు ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో అది మరీ ఉద్వేగం. ఎందుకంటే ఆ రోజుల్లో రాజుకి పుత్రసంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని కైవసం చేసుకునేవారు ఆంగ్లేయులు. రాజ్యసంక్రమణ సిద్ధాంతం అనే సాకుతో సదరు రాజ్యంపై సర్వహక్కుల్నీ బ్రిటిష్‌వారు తమకు తాము ధారాదత్తం చేసేసుకునేవారు. అంతఃపురాల్లోని వెండి, బంగారు సామగ్రిని, చీనీచీనాంబరాల్ని, నగల్ని లాక్కొనేవారు.

కొడుకు పుట్టడంతో ఆ ఆపద కూడా తొలగింది కదా అన్నది గంగాధరరావు సంబరానికి అసలు కారణం! కానీ ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. పుట్టిన మూడు నెలలకే ఆ బిడ్డ కన్నుమూశాడు. లక్ష్మీబాయి ఎంతలా ఏడ్చిందో అంతులేదు. గంగాధరరావు మానసికంగా కుంగిపోయి మంచాన పడ్డాడు. ఆయన బతికి బట్టకట్టాలంటే తగిన కుర్రాడిని దత్తత తీసుకోకతప్పదని అర్థమైంది. 1853 నవంబర్ 20న దామోదరరావు అనే అయిదేళ్ల బాలుడిని దత్తత స్వీకరించారు గంగాధరరావు. ఆ దత్తతను ఆమోదించమని అభ్యర్థిస్తూ బ్రిటిష్‌వారికి అర్జీపెట్టుకున్నారు. కాని వారి కబురు తెలిసేలోపు ఆయన మరణించారు.

భర్త మరణించాక ఝాన్సీలక్ష్మీబాయికి కష్టాల మీద కష్టాలొచ్చాయి. బ్రిటిషర్లు ఆమెను తీవ్రంగా బాధపెట్టారు. దత్తత చెల్లదన్నారు. ఝాన్సీపై ఆమెకు హక్కులేదన్నారు. భర్త వదిలి వెళ్లిన వ్యక్తిగత స్థిరచరాస్తులు ఆమెకు చెందవన్నారు. ఖజానా అప్పుల్ని మాత్రం ఆమే తీర్చాలన్నారు. అయిదు వేల రూపాయల భరణాన్ని బిచ్చంగా వేస్తామన్నారు. పరోలా జాగిర్దారు, ఓర్జా రాణి, దాంతియా రాజుల్ని లక్ష్మీబాయిపై ఉసిగొల్పారు. చివరకు ఝాన్సీనే ఆక్రమించుకుంటున్నట్లు ప్రకటించారు.

మొదట ‘మేరీ ఝాన్సీ దూంగీ నహీ’ అంటూ హూంకరించింది లక్ష్మీబాయి. కానీ బ్రిటిష్‌వారి దౌష్ట్యాలకు తలొగ్గక తప్పలేదు. ఝాన్సీ కోటపై తెల్లవారి కేతనం చూసేసరికి రాణి గుండె తరుక్కుపోయింది. రాజవంశానికి ఇలవేల్పయిన మహాలక్ష్మి దేవాలయాన్ని బ్రిటిషర్లు భ్రష్టుపట్టించారు. ప్రజల్ని హింసించడం మొదలుపెట్టారు. రానురాను ఆంగ్లేయుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తనను తెల్లవారు వెంటాడి, వేటాడి వేధించినా భరించింది కానీ రాజ్యానికి, ప్రజలకు, అంతకుమించి ధర్మానికి, సంఘానికి కష్టాలు దాపురించడంతో ఇక ఆమె ఉపేక్షించదలచుకోలేదు.

ఆఖరిపోరాటం...
అంతవరకూ ఆమెలోని అంతర్గత చైతన్యం, నిద్రాణమైన పౌరుషం, అచేతనంలోని మహాశక్తి మేల్కొన్నాయి. ఆడదాన్నని, వయసు, అనుభవం, ఆస్తి లేవని, నా అన్నవాళ్లు లేరని... ఇలా తనకు తానే వేసుకున్న శృంఖలాన్ని ఆమె ఛేదించింది. అప్పటికే 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశం అతలాకుతలమై పోతోంది. బ్రిటిష్‌వారిపై పోరాడుతున్న నానా సాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే లాంటి వీరులతో చేతులు కలిపింది. ఆ ఉమ్మడిపోరుకి ఆమే సైనిక సలహాదారు, వ్యూహకర్త. చిన్నప్పుడు ఆడపిల్లవు అంటూ గేలి చేసిన అదే రావు సాహెబ్, నానా సాహెబ్ ఇప్పుడు లక్ష్మీబాయినే ఏరికోరి నాయకురాలిగా ఎన్నుకున్నారు. దటీజ్ ఝాన్సీ లక్ష్మీబాయి!

బ్రిటిష్‌వారితో అమీ తుమీ తేల్చుకోవాలని నిశ్చయించుకుంది. గ్వాలియర్ యుద్ధానికి సన్నద్ధమయ్యింది. చాన్నాళ్ల తర్వాత కసరత్తులు, కర్ర, కత్తిసాములు మొదలెట్టింది. ఉదయాన్నే కుస్తీ పట్టేది. బరువులు ఎత్తేది. గుర్రపుస్వారీ చేసేది. సామాన్యుల్ని సంఘటిత పరిచేది. ఫిరంగుల దళంలో మగవారితో పాటు మహిళలకూ శిక్షణనిచ్చేది. యుద్ధంలో మరణించినవారి కుటుంబాల్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చింది.
తుదిపోరుకు తెర లేచింది.

1858, ఏప్రిల్ 4. శుక్లపక్ష ఏకాదశి.. అర్ధరాత్రి. ఎర్ర కుర్తా, తెల్ల చుడీదార్, కుచ్చు తలపాగా, ఒళ్లంతా కవచం, శిరస్త్రాణం, ఒరలో రెండు పిస్టళ్లు, నడుముకు కత్తులు, వీపుకి పదేళ్ల దత్తపుత్రుడు దామోదర్, సంచిలో డబ్బు, కొడుకు పాలు తాగే వెండి లోటా, వెనుక 300మందికి పైగా అఫ్గాన్ రౌతులు, పార సైన్యం... ఇంత పకడ్బందీగా తనకిష్టమైన గుర్రం ‘సారంగి’ని ఎక్కి, సమరానికి బయల్దేరింది లక్ష్మి.
నూటరెండుమైళ్లు ఆగకుండా ఏకబిగిన ప్రయాణం చేసింది. మార్గమధ్యంలో వందలాది మందిని ఎదుర్కొంటూ, నరుక్కుంటూ కదనరంగానికి చే రుకుంది.

రెండు నెలలు భీకరంగా పోరాడింది. బ్రిటిష్‌వారి బలం, బలగం ముందు తాను సరిపోనని ఆమెకు తెలుసు. కొడుకును జాగ్రత్తగా చూసుకోమని తోటివారికి అప్పగించింది. ఇక తనకేమైనా ఫరవాలేదన్న తెగింపుతో యుద్ధం చేసింది. 1858, జూన్ 17న రోజు రోజంతా తెల్లసేనను చీల్చి చెండాడింది. బ్రిటిష్‌వారు కుయుక్తులు పన్నారు. వెన్నుపోటు పొడిచారు. చివరకు- అదేరోజు- చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడి... మరణించింది లక్ష్మీబాయి. విజయం అంటే గెలవడమే కాదు, పోరాడడం!

ఆకెళ్ల రాఘవేంద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి