21, జనవరి 2012, శనివారం

చలి ఒకటి కాదు...


అనునాదం/ resonance
తెల్లవారుజామున ఇంటి ముందర పూసిన పసుపు మందార రేకులను నగ్నంగా వొణికించే చలి ఒకటి కాదు. ముగ్గు వేయడానికి వొంగి, నేల చెంపను నిమిరి, మునివేళ్ల కొసలతో ముత్యాలను కూర్చే గృహిణి చెంపలను కోసే చలి ఒకటి కాదు. మేజోళ్లు లేని పాదాలను గట్టిగా అదిమి పట్టి, పాఠాలకు కదిలిపోయే తలస్నానపు అమ్మాయి పెదాలను పిండే చలి ఒకటి కాదు. పేపరూ టీని అల్లాగే ఉంచి రగ్గు కప్పుకొని నిదురించే మొద్దుమనిషికి ఎడమై ఏం చేయాలో తోచక, ఎగాదిగా చూసే చలి ఒకటి కాదు. రాత్రంతా మేలుకొని అప్పుడే కునుకుపట్టి చెట్టు మొదలుకు చేరి కాళ్లు ముడుచుకుంటున్న కుక్క ప్రేవులలో దూరి కరుకుగా నమిలే చలి ఒకటి కాదు. మరికాసింతలో మొదలుకానున్న రొదలో చిల్లర

ఏరుకునేందుకు జోలె సర్దుకుంటున్న బిచ్చగాని పాత్రలో చిత్రంగా చుట్టలు చుట్టే చలి ఒకటి కాదు. ఆ రాత్రి ఏమవుతుందోనని తెల్లవార్లూ నలిగి ఆస్పత్రి బయట కన్నతండ్రి ఒకడు భయం భయంగా తాగే టీనీళ్ల పొగలను తేలిగ్గా తుంచే చలి ఒకటి కాదు. ఏ తల్లి బిడ్డో ఏ తండ్రి గుండెల మీద పెరిగిన కొడుకో నగరానికి చేరి అగచాట్లకు సోలి దారిపక్క పడుకుంటే కనికరం మరిచి ఛాతీ మీద చరిచి గజగజమని లేపే చలి ఒకటి కాదు. గూర్ఖాలు కాసే శ్రీమంతుల ప్రహరీ పక్కన విధిలేక ఓడించలేక లోనికి పోలేక నిస్సహాయంగా జారి బొరోమని ఏడ్చే చలి ఒకటి కాదు. మొగుడి ఆలింగనంలో మరోసారి కరుగుతున్న ముదిత కొనగోటిపై ముసిముసిగా నవ్వుతూ దుప్పటి సరిగా లాగే చలి ఒకటి కాదు.

కొనప్రాణాల పంట కళ్లు తెరిచిందేమోనని ఆశగా పరిగెత్తే రైతు కండువను- అయితే మంచుతో, కాకుంటే కన్నీళ్లతో- తడిపే చలి ఒకటి కాదు. అమ్మానాన్నలను ఒదిలి, ఆవలి దేశాలలో ఉండి, అప్పుడప్పుడు పలికే ఒక్కగానొక్క నలుసు ఇష్టమైన జ్ఞాపకాన్ని కష్టంగా మోసుకొచ్చే చలి ఒకటి కాదు. గిరిజనుడి గుడిసెలో దౌర్జన్యంగా దూరి తినడానికి దొరక్క పసిబిడ్డను కొరికే చలి ఒకటి కాదు. కాన్వెంటుకు వెళుతూ పిల్లలు చేతులు చాస్తే బస్సు పక్కన నుంచి జిల్లున పట్టుకు ఊపే చలి ఒకటి కాదు. తడిసిన ఇసుక వొడ్డుని, పచ్చగడ్డికి కూడా నోచని బీడు మైదానాన్ని, దట్టమైన అడవి మధ్యన గుట్టుచప్పుడు కాకుండా పారే సెలయేటి మువ్వల పాదాలని తాకి- తడిమి- నిమిత్తం లేనట్టుగా తరలిపోయే చలి ఒకటి కాదు.

ధ్వజస్తంభపు కలశాన్ని, ప్రాణం కొట్టకలాడే మసీదు పావురపు కంఠాన్ని, చర్చి గంట సృష్టించే కరుణాతరంగాల మృదు లయని చూసే- చూపే- చలి ఒకటి కాదు. ఒక పేట పెరడులోని జామచెట్టు ఆకుని, మరో అగ్రహారంలోని తులసిమొక్క గూటిని, ఇంకో వీధిలోని మర్యాదస్తుల నందివర్థనపు గేటుని పరామర్శించే చలి ఒకటి కాదు. నిన్నటి వరకూ బాగున్న మిత్రుడు ఈ పూట పోయాడని తెలిస్తే ఊరికూరికే ఉబికి వచ్చే కన్నీటి బిందువుల పై పోనీలెమ్మని మూగే చలి ఒకటి కాదు. వీధుల చివర, చీకటి మాటున, హొటేళ్లలో, నట్టింటికి కూడా పిలిస్తే వచ్చే పక్క మీదకు వచ్చే పైసల కోసం వచ్చే ఆడదొకత్తి ఎవరైనా చూసే లోపల నిద్రకళ్లతో హడావిడిగా వీధిలోకి అడుగుపెడుతుంటే వీపున సిగ్గుగా భయంగా అసహ్యంగా జుగుప్సగా హేళన చేస్తూ చరిచే చలి ఒకటి కాదు.

అవును కాదు.
చలి ఒకటి కాదు.
ఏ మనిషీ ఒకటి కానట్టే, ఏ మనిషి చెవి ముక్కు నోరూ నుదురు ఒకటి కానట్టే, ఏ మనిషి కులమూ మతము ప్రాంతమూ భాష యాస తినే తిండి అలంకరించుకునే గడప ఒకటి కానట్టే, ఏ మనిషి చదువు ఒకటి కానట్టే, ఏ మనిషి మోసే మోతల బరువు ఒకటి కానట్టే, ఏ మనిషి దాచుకున్న సంపద ఒకటి కానట్టే, ఏ మనిషి సంస్కారం ఒకటి కానట్టే, ఏ మనిషి రాక్షసత్వం ఒకటి కానట్టే, ఏ మనిషి నిదురించే మరుభూమి ఒకటి కానట్టే, ఏ మనిషి జోడించే చేతులు ఒకటి కానట్టే, మనుషులంతా ఒకటి కానట్టే, మనుషులంతా ఎప్పటికీ ఒకటి కానట్టే-
చలి ఒకటి కాదు.
కానే కాదు.

- ఖదీర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి