21, జనవరి 2012, శనివారం

ఎవరు గొప్ప? ( చిట్టి కథ)


అనగనగా రెండు కాకులు. బోలు, గోలు వాటి పేర్లు. రెండూ మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై, ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది.చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి. రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట!

ఈ రెంటిలోనూ బోలు కొంచెం గడుసైనది. గోలు కాస్తంత అమాయకురాలు. బోలు ఏం చేసిందంటే - ఒక సంచిలో కొన్ని దూది ఉండలు, మరో సంచిలో ఉప్పురాళ్లు పెట్టి, వాటిని మూటల్లా కట్టింది. దూది సంచినేమో తను తీసుకుంది, ఉప్పుమూట కట్టిన సంచిని గోలు కిచ్చింది. 
సరే, రెండూ ఎగరడం ప్రారంభించాయి. బోలు ముక్కుకున్న సంచి తేలికగా ఉండటంతో అది సునాయాసంగా ఎగరసాగింది. చూస్తుండగానే గోలును మించిపోయింది. దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది. 

ఇంతలో వర్షం కురవడం మొదలైంది. బోలు ముక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది. గోలు ముక్కుకున్నది ఉప్పుమూట కావడాన వానకు ఆ ఉప్పంతా కరిగి, తేలిగ్గా మారిపోయింది.

దాంతో బోలు ఆయాసంతో వెనకపడిపోతే, గోలు మాత్రం సులువుగా ఎగిరి పైపైకి వెళ్లిపోయింది. విజేతగా నిలిచింది. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయింది బోలు పరిస్థితి!
నీతి: మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని, అంతిమ విజయం మాత్రం న్యాయానిదే!

బాచి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి