19, జనవరి 2012, గురువారం

మీరు ఏడవరా.. ప్లీజ్! మేం ఓదారుస్తాం..!

అపుడెప్పుడో మన సమాజం అంతా కలిసికట్టుగా వున్నప్పుడు మానవ సంబంధాలు మరీ ఇంతగా మట్టికొట్టుకుపోకమునుపు మనందరికీ ఓ అలవాటు వుండేది. ఎవరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ పాలుపంచుకోవాలి. సంతోషంలో పాలు పంచుకోకపోయినా ఫరవాలేదు కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా పాలుపంచుకోవాలి. ఎవరింట్లోనైనా ఎవరైనా పోతే విధిగా వెళ్లి వాళ్ళని పలకరించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పిరావడం అప్పట్లో ఆనవాయితీ. అలా వెళ్లి పలకరించకపోతే చాలా తప్పుగా భావించేవాళ్ళు.
దగ్గరి బంధువులు వెంటనే వెళ్లి వాలిపోయేవాళ్ళు. దూరం బంధువులు ఏ పదో రోజుకో వెళ్ళేవాళ్ళు. ఇంకాస్త దూరపు బంధువులు ఇంకాస్త ఆలస్యంగా ఆరునెలల తరువాత వెళ్ళేవాళ్ళు. ఇంకా మిగిలిపోయినవాళ్ళు ఏడాదికో రెండేళ్ళకో వెళ్ళేవాళ్ళు. ఎన్నాళ్ళకి వచ్చారు అన్నది కాదు కొచ్చను. అసలొచ్చారా లేదా అన్నది పాయంటు. ఆలస్యంగా వచ్చినా పట్టించుకునేవారు కాదు గానీ అసలు వెళ్ళకపోతే మాత్రం వాళ్ళని బ్లాక్ లిస్టులో పడేసేవాళ్ళు.. ఆ తరువాత ఆ పరామర్శించనివాళ్ళు పదిమందికీ సంజాయిషీ ఇచ్చుకోలేక సతమతం అయిపోయేవాళ్ళు.
ఒకవేళ వీలుగాక వెళ్ళలేకపోయిన వారి ఇంట్లో శుభ కార్యం కనక తలపెడితే అప్పుడుండేది అసలు తమాషా. అప్పుడు వాళ్ళకి కష్టం కలిగినప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనింట్లో శుభానికి ఎలా పిలుస్తాం? అనుకుని అప్పుడు వెళ్ళి ఓదార్చి వచ్చి వారం రోజులయ్యాక అప్పుడు మళ్ళీ వెళ్లి శుభకార్యానికి ఆహ్వానించేవారు. అలా ఆలస్యంగా వెళ్లి ఓదార్చేవాళ్ళు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇలా తాము ఓదార్చడానికి వస్తున్నట్లు ముందే కబురు పెట్టేవాళ్ళు. వాళ్ళుకూడా సిద్ధంగా వుండేవాళ్ళు. వీళ్ళని చూడగానే ఎప్పుడో పోయిన మనిషి అప్పుడే పోయినట్టు ఇంట్లోని ఆడవాళ్ళు శోకాలు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఊరుకో అమ్మా గుండె రాయి చేసుకో అని నిజాయితీగా ఓదార్చేవాళ్ళు. అక్కడితో ఒక పని లాంఛనంగా పూర్తి అయ్యేది. ఏడిచిన వాళ్ళూ ఖుష్.. ఓదార్చినవాళ్ళు ఖుష్.. వో పది నిముషాలు మొక్కుబడిగా ఏడుపులు ఓదార్పులు అయ్యాక మామూలుగా నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. ఇవన్నీ పాత పద్ధతులు ఆచారాలున్నూ.
ఎన్నో పాత ఫేషన్లు అలవాట్లు భూమి గుండ్రంగా వుంది అన్నట్లు ఓ రౌండ్ వేసి మళ్ళీ వచ్చాయి. అడ్డిగలు కాసుల పేర్లూ వంటి నగలు మళ్లీ ఫాషనైపోయాయి.
మధ్యలో మానేసిన వేడుకలు మళ్లీ వచ్చాయి. అందులో భాగంగా ఓదార్పులు కూడా యమ ఫాషనైపోయాయి. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ పద్ధతి కాస్త మారింది. కాస్తేం ఖర్మ బాగానే మారింది. పూర్తిగా ఉల్టా అయిపోయింది. అప్పుడు ఎవరికైనా కష్టం కలిగితే వాళ్ళింటికి మిగిలినవారంతా వెళ్లి ఓదార్చేవారు. ఇప్పుడేమో కష్టం వచ్చినవారే అందరినీ ఇంటింటికి వెళ్లి మరీ ఓదారుస్తున్నారు. అదీ ఏ వారమో పది రోజులో కాదు.. ఏళ్ళ తరబడీ ఓదారుస్తూనే ఉన్నారు. వూరూరా తిరుగుతూనే వున్నారు వోపిగ్గా.. కానీ ఏం లాభం?!
ఎక్కదలచుకున్న రైలు జీవితకాలం లేటు అన్నట్టు వుంది ఇదంతా. మహారాజుగారు సింహాసనం మీద వుండగా యువరాజా వారు ఊరూరా తిరిగి జనం కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటే అర్థంవుంది. వాళ్ళ సమస్యలు తండ్రిగారితో చెప్పి పరిష్కరిస్తే జనానికి ప్రయోజనం చేకూరేది. అప్పుడు ఊరుకుని రాజుగారు కాలధర్మం చెందాక సింహాసనం వేరొకరి పాలయ్యాక మాజీ యువరాజు పొజిషనుకి జారిపోయి ఎవరూ లెక్కపెట్టని స్థితికి వచ్చాక అప్పుడు జనంలోకి వెళ్లి వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ తలా చెంపలు వాచిపోయేలా నిమురుతూ ఓదారిస్తే ఏం వొరిగి పడుతుంది? తామే పీకల్లోతు సమస్యలలో కూరుకుపోయి వుంటే ఇక ఎదుటి వారిని ఎందుకు ఓదార్చటం?? అసలిది ఓదార్చటమా?! వోదార్పు పొందే ప్రయత్నమా?
ఇవన్నీ ఏం చెయ్యాలో తోచక చేసే పన్లు తప్పితే ఓదార్పులవల్ల దమ్మిడీ లాభం లేదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి గానీ ఉత్తుత్తి మాటలు చెప్పి ఓదార్చేసాం అని గొప్పలు పోతే ఎట్లా? పోనీ తమ దగ్గర బోలెడంత డబ్బుంది కదా.. అందులోంచి దమ్మిడి బయటికి తియ్యరు ఎవరికీ పొరబాటున అయినా ఓ రూపాయి డబ్బు సాయం చెయ్యరు. మాటలు మాత్రం కోటలు దాటతాయి.. క్రియ శూన్యం.
కరువులో అధికమాసం అన్నట్లు ఆ యువరాజుగారి ఓదార్పు సభలకి బోలెడు మంది జనం వచ్చేస్తున్నారు అని కంగారు పడిపోయి మరో మాజీ గారుకూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్నట్లు మరో పక్కనించీ బయలుదేరారు. వీళ్ళ తాపత్రయం గానీ మంత్రాలకు చింతకాయలు రాలవు. జనం వచ్చినంత మాత్రాన భవిష్యత్తులో వోట్లు రాలవు.
ఇలాటి గొడవలు ఎన్ని చూడలేదు? సభల్లో జన సముద్రాన్నిచూసి ఏమిటో ఊహించేసుకుని తీరా సమయం వచ్చేసరికి అంచనాలన్నీ తారుమారు అయిపోయి శీర్షాసనం వేసినవారిని చూడలేదా? కాబట్టి ఓదార్చిన జనాన్ని ఆకర్షించేస్తున్నాం అని సంబరపడితే మాత్రం భంగపాటు తప్పదు. ఆకర్షణ కాదుకదా ఈ వ్యవహారం అంతా హాస్యాస్పదంగా తయారవుతోంది.
మన నాయకులకు ఏదొచ్చినా పట్టలేం. ఈ బాటలో మరో పదిమంది ఓదార్చడానికి బయలుదేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక అప్పుడు వుంటుంది అసలు తమాషా. అందరూ ఓదారుస్తాం ఓదారుస్తాం అని పోలోమంటూ బయలుదేరితే ఏడిచేవాళ్ళు దొరకద్దూ?
అసలిప్పటికే జనం తెలివిమీరారు. అదివరకులాగా వెర్రి గొర్రెల్లాగా వుండటంలేదు. మీటింగుల్లో ఆగ్రహంతో కుర్చీలు అవీ విసిరేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళినా అప్పుడెప్పుడో వచ్చి బోలెడన్ని మాటలు చెప్పావు వరాలు గుప్పించావు.. వాటి సంగతి తేల్చు అని నిలదీస్తున్నారు.
జనాలకి నాయకులకీ మధ్యన పాపం కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఏదో ఓ చోట సభ అయితే జనాన్ని పోగెయ్యటం వేరు ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగుతూ జనాన్ని ఓదారుస్తాం అంటే అందుకు రంగం సిద్ధం చెయ్యటం అంటే మాటలు కాదు. ఇంటింటికీ తిరిగి మేము ఫలానా రోజున వచ్చి మిమ్మల్ని ఓదారుస్తాం. ఇంటికొచ్చి ఓదారుస్తామా లేక వూళ్ళో కూడలి దగ్గర ఓదారుస్తామా అన్నది ఇంకా డిసైడు కాలేదు. ఎన్నింటికి వస్తామో కూడా డిసైడుకాలేదు. కానీ వస్తాం.. ఓదారుస్తాం.. మీరు ఆ వేల్టికి కాస్త ఏడిచి మా ఆబోరు దక్కించరా దయచేసి అని కాళ్ళా వేళ్ళా పడే రోజులొస్తాయి. తప్పదు గాక తప్పదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి