14, జనవరి 2012, శనివారం

అపూర్వం ‘భోగి’పర్వం


ఏడాది పొడుగునా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ప్రతి పండుగకు ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. కాని భోగి అరుదైన స్వతంత్రత ఉన్న పండుగ. భోగి అనే పేరులోనే ఎంతో అంతరార్థం ఉంది. ఇది ఏ దేవుడినీ, దేవతనూ సూచించదు. ఎవరి పుట్టిన రోజూ కాదు. మరి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వంటి విశేషాల సమాహారమే ఈ వ్యాసం.

సౌరమానం ప్రకారం సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించేనాడు జరుపుకునే మకరసంక్రాంతి పండుగలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘భోగి’. దీనిని పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అనుబంధంగా, ఉపగ్రహంగా భావించకూడదు. ‘భోగి’ అరుదైన స్వతంత్ర పండుగ. దాని మరునాడు వచ్చే మరో పండుగే సంక్రాంతి అని తెలుసుకోవాలి. భోగి అనే పేరులోనే ఎంతో అంతరార్థం ఉంది. ఇది ఏ దేవుణ్నీ, దేవతనూ సూచించదు. ఎవరి పుట్టినరోజూ కాదు. మరి ‘భోగి’ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?

రాజభోగాలు... భోగములు అంటే సుఖాలను అనుభవించేవాడు ‘భోగి.’ తెలుగునేల వ్యవసాయ ప్రధానమైనది. ఏడాది పొడవునా కష్టపడిన రైతు, పండిన పంటతో ఆనందంగా ఇంటికి వచ్చి ఆలుబిడ్డలు, బంధుమిత్రులతో రాజభోగాలను అనుభవించే పండుగ కనుక దీనిని భోగి అంటారు.

దక్షిణాయనంలో చివరిరోజు ఇది. ఆనాడు ఐహికమైన, భౌతికమైన సుఖాలను, భోగాలను అందరితో పంచుకోవాలి. పండిన పంటలను పనివారికి, యాచకులకు, హరిదాసులకు, పశుపక్ష్యాదులకు వితరణ చేయటం రాజభోగం. ‘సంపదను పదిమందికీ త్యాగం చేయటం భోగం, తానొక్కడే తినటం రోగం’ అనే సత్యాన్ని తెలిపేదే భోగిపండుగ. మరునాటి ఉత్తరాయణంలో ఆధ్యాత్మిక పారమార్థిక చింతనలో ప్రధానమైన త్యాగగుణాన్ని భోగి అందిస్తుంది. అన్ని లోహాలను, బంగారంగా మార్చే పరుసవేదిని తయారుచెయ్యటానికి వేమన తన స్నేహితులతో చాలా ప్రయోగాలు చేసి, వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. చివరికి విజయం లభించి మేలిమి బంగారం తయారయ్యేసరికి వైరాగ్యం వచ్చి యోగి అయ్యాడు. అదే భోగిపండుగ రహస్యం.

పురుషులకు పండుగ భోగం... పాత బట్టలను పేదలకు పంచాలి. పాడైపోయిన పాతవస్తువులను తగులబెట్టి అందరూ చలికాచుకొంటుంటే ఆనందించాలి. వేడినీళ్లు పెట్టుకొని నువ్వులనూనెతో తలంటిపోసుకోవాలి. బంధాలే దుఃఖానికి కారణం అని తెలుసుకోవాలి. ఎండిపోయిన చెట్టుకొమ్మలను విరిస్తే రాబోయే వసంతానికి కొత్తకొమ్మలు వస్తాయి. గత వర్షకాలంలో మొలిచిన కలుపుమొక్కలను తగులబెడితే నేల శుభ్రం అవుతుంది. చలికి పెరిగిన దోమలు భోగిమంట పొగతో, మంటలతో తగ్గిపోతాయి. ఇలా ఇది పురుషుల భోగి.

గొబ్బెమ్మలను సాగనంపే భోగం... ఆవు విసర్జించిన పేడ మనకు ఎంతో పూజనీయంగా, ఆరోగ్యప్రదంగా ఉపయోగపడుతోంది. దానితో ధనుర్మాసం నెలరోజులు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి పూజిస్తారు. పిడకలపై ఆవుపాలతో, కొత్తబియ్యంతో పొంగళ్లు వండుతారు. భోగిపండుగనాడు సాయంకాలం సందెగొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు. కన్నెపిల్లలు పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైవలకు వాయినాలు ఇస్తారు. గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. తల్లికి ప్రత్యామ్నాయంగా గోమాత చెప్పబడింది. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే దిక్కు. భోగినాడు గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిగింది. ధనుర్మాసం నెలరోజులు ఆమె గోపికా భక్తితో పాటలు పాడింది. ఇల్లు పాడిపంటలతో వర్థిల్లటానికి గోపికల వలె ప్రార్థించి గొబ్బెమ్మలను సాగనంపటమే భోగిపండుగలో స్త్రీల పాత్ర.

పిల్లలకు ఆరోగ్య భోగం... భోగిపళ్లు, బొమ్మలకొలువు కూడా ఈ పండుగకు ప్రధానమైనవి. రేగుపండ్లు చిన్నపిల్లల తలపైపోసి పేరంటం జరుపుతారు. రేగుపండును అర్కఫలం అంటారు. సూర్యునికి ప్రతినిధిగా సౌరశక్తిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి రేగుపళ్లకు ఉంది. ఉత్తరాయణంలో రాబోతున్న మొదటి చాంద్రమాన మాసం మాఘమాసం. అది సూర్యారాధనకాలం. చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోయటం వలన వాటి స్పర్శ వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యుని ఆశీస్సులను అందించినట్లవుతుంది. భోగినాడు బొమ్మలకొలువుకు హారతి ఇస్తారు. పిల్లల్లో సృజనాత్మకతను, పరిసరాల విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నిర్మాణశాస్త్ర దృష్టిని పెంపొందించే బొమ్మలకొలువును ఈనాడే చేస్తారు. ఇది పిల్లల భోగిపండుగ.

దంపతులకు ఇంద్రభోగం... ఇంద్రభోగాలు అన్నిటికంటె గొప్పవి. దేవతల రాజుగా స్వర్గలోకంలోనే కాక యజ్ఞయాగాది కర్మలలోనూ పెద్దభాగాన్ని పొందుతాడు. భోగి అనే పదానికి ఇంద్రుడే సరిపోతాడు. తూర్పుదిక్కుకు, మేఘాలకు అధిపతిగా భూమికి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడే. భోగిపండుగ ఇంద్రపూజ కోసం ఏర్పడింది. ఉత్తరాయణం దేవయానకాలం కనుక ముందురోజు... దేవతల అధిపతియైన ఇంద్రుణ్ని పూజించి ప్రసన్నం చేసుకోవాలి. భోగిమంటలు... మంత్రరహితమైన హోమాలుగా ఇంద్రుణ్ని ఆరాధించి సంతోషపరుస్తాయి. ఆ మంటలతో నీరు, గాలిలో తేమ ఆవిరిగా మారి పొగతో నింగికి చేరి మేఘాలు ఏర్పడి అనుకూల పరిస్థితుల్లో వర్షాలు కురుస్తాయి. గోదాదేవి రంగనాథుని కోసం ధనుర్మాసమంతా చేసిన తపస్సుకు రంగనాథుడు ప్రత్యక్షమై పెండ్లి చేసుకున్నాడు. ఒకరినొకరు ఇష్టపడిన స్త్రీపురుషులు దంపతులైతే అప్పుడే భోగి అవుతారని ఈ పండుగ చెబుతోంది.
- డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్

భోగికి ముందు, తరువాత... చలిమంటలుగా పిలిచేవాటిని, ఈరోజు మాత్రం భోగిమంటలు అంటారు. దక్షిణాయనంలోని వర్షాలకు, చలికి దేహంలో పెరిగిన వాత లక్షణాలు, అనారోగ్యాలు నువ్వులనూనెతో, మూలికాగుణాలు గల క ట్టెలు, కంపలతో కాగిన నీళ్లతో అభ్యంగనస్నానంతో తొలగిపోతాయి. ఆరోగ్యం, నూతనోత్సాహం ఉత్తరాయణం వైపు నడిపిస్తాయి. భోగిమంటల్లో ఇంత అంతరార్థం ఉంది. దానిని బట్టి ఈ పండుగ ప్రాధాన్యాన్ని గ్రహించాలి. కాగిన ఆవుపాలు, కొత్తబెల్లంతో మెత్తగా ఉడికిన కొత్తబియ్యం నిండి పొంగి పొంగలిగా తయారుకావాలి. పొయ్యిలో పడకుండా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి