7, జనవరి 2012, శనివారం

చిట్టి కథ


అపాయంలో ఉపాయం
పులి, నక్క, గాడిద మంచిమిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి.
ఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటుకి చేరింది.

ఆ రోజు పులి మాంచి ఆకలిమీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలెయ్యమని అడిగింది.
‘‘వయస్సులో పెద్దది గాడిద. కనుక ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది...’’ అని నక్క తెలివిగా తప్పుకుంది.

నక్క మాటలతో గాడిద ‘‘అబ్బో మనకింత పెద్దరికం ఇస్తున్నారే...’’ అనుకుని ఉప్పొంగిపోయింది.
జింక మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది.

‘‘ఏంటీ గాడిదా, నీకూ నాకూ సమానా వాటానా?’’ అని పులి అమాంతం గాడిదమీద పడి చంపేసింది.
తర్వాత నక్క వంక చూసింది పులి.
‘‘నక్కా నక్కా ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి?’’ అడిగింది పులి.

అప్పుడు నక్కేమందో తెలుసా?
‘‘మిత్రమా, నువ్వు నీక్కావలసిందంతా తినగా మిగిలినదేమైనా ఉంటే అది చాల్లే నాకు. అదే నా భాగ్యమనుకుంటాను’’ అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. ‘‘అన్నట్టు స్నేహితుడా...నీకింతటి తెలివి ఎలా వచ్చింది?’’ అని పులి అడిగింది.

‘‘ఏం చెప్పమంటావు? ఈ గాడిద నుంచే నాకంత తెలివొచ్చింది’’ అని నక్క వినయంగా చెప్పి అటూ ఇటూ చూసింది.
నీతి: అపాయం నుంచి బయటపడటానికి దేహబలం సరిపోదనుకుంటే బుద్ధిబలాన్ని ఉపయోగించాలి!

-యామిజాల జగదీశ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి