7, జనవరి 2012, శనివారం

పంజగుట్ట శ్మశానంలో ఒక రోజు


రియాలిటీ చెక్
ఒక శ్మశానానికి వెళ్లినప్పుడు ఎవరి మానసిక స్థితైనా ఎలా ఉంటుంది?
గత రాత్రి పక్కింటివాళ్లు కారణమైన ప్రైవసీ భంగపు చిరాకులో-
పొద్దున ఒక ‘ఇష్యూ’ కలిగించిన మానసిక కలవరపాటులో-
తెలియకుండానే ఇరుక్కున్న ఒక ‘చిల్లర’ ఇబ్బందిలో-
ఈ రోజువారీ చేదు లేకుండా జీవిత ఫలం ఎందుకు లభించదన్న ఖేదంలో- నేను పంజగుట్ట హిందూ శ్మశాన వాటికకు వెళ్లాను.

సృష్టి స్థితి లయకారకుడగు పరమశివుడు స్వాగతిస్తున్నట్టుగా ఆర్చి... శంకరుడు అప్పజెప్పిన పనిని పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కాటికాపరి విగ్రహం... పనివేళలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడుగంటల వరకు అని రాసివున్న గేటు... దేనికి వేళలు? చనిపోవడానికా? కాల్చడానికా?

ముందుకు నడుస్తూ ఉంటే ఒకటీ ఒకటీ ఒకటీ... పదులకొద్దీ సమాధులు! తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో; తెలుపు-ఎరుపు, పసుపు-ఆకుపచ్చ, గులాబీ-తెలుపు మిశ్రమ వర్ణాల్లో.

చిన్నవీ పెద్దవీ; దీనంగా కనబడుతున్నవీ తాళం వేసిన గదిలో భద్రంగా ఉన్నవీ; ఒకరాయికి సున్నం పూసి సమాధి అనిపించేట్టు చేసినవీ, అంతస్థులుగా అట్టహాసంగా నిర్మించినవీ; పేద, నిరుపేద, మధ్య, ఎగువ, ధనిక స్థాయులను సూచిస్తూ.

వాటిమీద ఓంకారాలు, స్వస్తిక్‌లు, సాయిబాబా బొమ్మలు, నందీశ్వరుడి ప్రతిమలు, విధిగా దీపపు గూళ్లు. బంతిపూలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, దండలు వేసిన ఆనవాళ్లు. ‘జై శ్రీ సద్గురు నాథా నమో నమః’ లాంటి వాక్యాలు. కొన్ని ఫలకాలు ఊడిపోయి, కొన్నింటిని చీల్చుకుని ఉత్తరేణి మొక్కలు మొలిచి;

ప్రతి సమాధిలోని ‘జీవి’కీ నీడను ఇస్తున్నట్టుగా మర్రి, రావి, వేప లాంటి వృక్షాలు. ‘కాపలా’ కాస్తున్నట్టుగా గ్రామసింహాలు. రెక్కలు టపటపలాడిస్తూ నగర పావురాలు.

‘జనవరి 1, 1991న జన్మించి ఆగస్టు 5, 1999న స్వర్గప్రాప్తి పొందిన’ ఎనిమిదేళ్ల చిట్టితల్లి అనూషకు సహా సుజాతమ్మ, కనకమ్మ, లక్ష్మమ్మ లాంటి ఎందరో మహాతల్లుల స్మారక చిహ్నాలు.

రాములు, గన్నిరాజు, వెంకటేశు, దిలీపు
చల్లా కొండయ్య దంపతులు, నీరుడు వీరయ్య దంపతులు
రాజయ్య, రాజలక్ష్మి, జమున... కూతురితోపాటు తల్లిదండ్రులు
ఏడుగురి సమాధులు ఒకే గూడు కిందవున్న ‘యాకరి’ వంశస్థులు
పుట్టిన తేదీ లేనివాళ్లు
పుట్టుకా మరణమూ రెండూ రాయబడనివాళ్లు
ఒక గౌడ్, ఒక శర్మ, ఒక యాదవ్, ఒక రెడ్డి

60 ఏళ్లకు చనిపోయినవాళ్లు, 76 ఏళ్లు బతికినవాళ్లు, 87 ఏళ్లు జీవించినవాళ్లు, 58 ఏళ్లు ఉండిపోయినవాళ్లు, 17 ఏళ్లకే స్వర్గస్థులైనవాళ్లు, 22 ఏళ్లకే శోకాన్ని మిగిల్చినవాళ్లు, 43 ఏళ్లకు దేహయత్ర చాలించినవాళ్లు;
అర్ధంతరంగా వెళ్లిపోయినవాళ్లు, పరిపూర్ణంగా బతుకుసాగించినవాళ్లు; ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, గుండెపోట్లు, అనారోగ్యాలు, అకాల మరణాలు సకాలధర్మాలు...

తండ్రులు తమ్ముళ్లు అక్కలు అన్నలు
తాతయ్యలు నాయనమ్మలు బావలు బావమరుదులు
రూపాలు పోగొట్టుకుని, గుండెల్లో ప్రతిరూపాలుగా మిగిలిపోయి..!

‘కట్టెలు కిలో 4 రూపాయల చొప్పున 400 కిలోలు=1,600, లేబర్ చార్జీలు=900, మెయింటెనెన్స్=500, మొత్తం= 3,000.....’ లాంటి వివరాలున్న పెయింట్ ఊడిపోయిన దహన సంస్కారాల పట్టిక.
1, 2, 3 నుంచి 8 వరకు అంకెలు వేసిన దహన వాటికలు
వాటి చుట్టూ అంత్యక్రియలను ‘వీక్షించేందుకు’ వీలుగా పలువురు విరాళమిచ్చిన సిమెంటు బెంచీలు
గుంటి రాజలింగం, భారతమ్మ దంపతులు దాతలుగా ఉన్న గంగపుత్ర శాంతి స్థలం
‘17 ఏళ్లకే మరణించిన శ్యామ సుందర్ అగర్వాల్ గారి కుమార్తె సుమాన్ అగర్వాల్ జ్ఞాపకార్థం నిర్మించిన’ సుమన్ శాంతి స్థలం

కార్యం ముగిసింతర్వాత చేయడానికి ఆడ, మగకు విడివిడిగా స్నానఘట్టాలు
‘‘150 ఏళ్ల కింద నిజాం నవాబుల కాలంలో హిందువుల శ్మశానానికి కేటాయించిన భూమి ఇది. నాలుగైదు పాలక మండళ్లు మారి ఇప్పుడు మా చేతిలోకి వచ్చింది. మా కాగితపు లెక్కల ప్రకారం 40 ఎకరాల స్థలం. వాస్తవానికి 17 ఎకరాలే మిగిలింది. చాలామంది స్థలాన్ని ఆక్రమించారు. ప్రభుత్వం కొంత లాక్కుంది’’
అన్నారు 2008 నుంచి ‘పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ’ అధ్యక్షుడిగా ఉన్న పాలడుగు అనిల్‌కుమార్.


‘‘ఒకప్పుడు జలగం వెంగళరావు పార్కు దాకా శ్మశాన స్థలమే. దాన్ని ఏనుగుల కుంట అనేది. ఏనుగులు నీళ్లు తాగడానికి వచ్చేవట. అందుకని ఆ పేరొచ్చింది. అంతిమసంస్కారాలయ్యాక అక్కడ స్నానం చేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు మిగిలిన భూమినైనా కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం ’’ కొనసాగించారాయన.

చుట్టుపక్కల 80 బస్తీల నుంచి ఇక్కడికి శవాలు వస్తాయి. వాటికల్లో అయితే ఒకేసారి ఎనిమిది మందిని కాల్చేవీలుంది. ఎక్కువైపోతే కింద ఇసుక పోసి దహనక్రియలు చేసిన సందర్భాలున్నాయి. ‘‘ఒక్కోరోజు వొర్కుండదు. ఇయ్యాల కాలీగనే ఉన్నం. కానీ మేం ఎవరన్న చచ్చిపోవాల్నని మొక్కుకుంటమా సార్? బగవంతుడు ఎప్పుడు గొంచవోతె అప్పుడు వోవుడేగదా’’ అంటాడు అక్కడ లేబర్‌గా పనిచేసే యాదయ్య. ఈయనది మెదక్ జిల్లా జహీరాబాద్. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు. ఇంకో కూతురు. కొడుకు. ఈయనలాంటి ఐదు కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి.

‘‘గా సినిమా పెద్దాయన ఎం ఎస్ రెడ్డిని ఎక్కడ కాలేసిండ్రే?’’ ఆయనకు దగ్గరయ్యే రీతిలో అడిగేందుకు ప్రయత్నించాను.

‘‘అగో... గా ఐదు నంబర్లనే’’
‘‘ఏమనిపిస్తది... ఇట్ల మనుషుల్ను కాల్సుడు... ఇట్ల శ్మశానంల ఉండుడు?’’
‘‘ఏమనిపిచ్చుడేంది? నువ్వో పని జేత్తు న్నవ్. నేనో పని జేత్తున్న. ఇదో పని తీరుగనే’’
దహనం అయితే ఎంతమందినైనా చేయొచ్చు. మరి సమాధి నిర్మించాలంటే?

‘‘ఇప్పుడు ఎవ్వలకు పర్మీషన్ ఇస్తలేం. బొందలు పెట్టుడానికి కూడా ఒప్పుకుంటలేం’’ కరాఖండీగా చెప్పారు జగదీశ్. వీళ్ల వంశస్థులే కొన్ని తరాలుగా శ్మశానానికి ‘బ్యాగరి’(ఇన్‌చార్జ్)గా ఉంటూ వస్తున్నారు. వంశపారంపర్యంగా ఈ బాధ్యతలు వారికి దఖలు పడుతున్నాయి. ‘‘ఈ పరంపర ఎట్ల మొదలైందో నాకైతే దెల్వది. మా తాత కాలం నుంచే ఈ పనిచేస్తున్నం. మేము ముగ్గురం పాలోళ్లం. యాడాదికి ఒగలం మారుతం. జులై దాక నేనుంటా’’

‘‘ఇప్పుడు ఈ కట్టిన సమాధులన్నింటికీ పర్మిషన్ ఎట్లిచ్చారు?’’
‘‘పాతకాలంల కొందరికి అట్ల దొరికిపోయింది. అప్పుడు స్థలం ఇప్పటిలెక్కకాదుగదా! ఇప్పటికీ కొందరు స్థలం గావాల్నని ఒత్తిడి జేస్తరు. అరే, నీకు జూబ్లీహిల్స్‌ల ప్లాటుందనుకో. నీకు మీ అమ్మ మీదనో మీ నాయిన మీదనో బాగ ప్రేముందనుకో. ఆణ్నే సమాధి గట్టు. దాన్ని ఓ మహల్ తీరుగ తయారుజెయ్యి, ఎవలొద్దన్నరు? అందరికి ఈణ్నే గావాలంటే కాల్సుటానికి ఉండొద్దా జాగ?’

ఇవ్వాళ(13-12-11) ఎవరినీ ఇక్కడికి దహనానికి తేలేదు. ఆ రకంగా ఇది మంచి రోజు. అందుకే ఖాళీగా ఉంది. ‘శ్మశాన ప్రశాంతత’ అనుభవంలోకి వస్తోంది.

శ్మశానాన్ని చీల్చుకుంటూ దేవరకొండ బస్తీలోకి వెళ్తున్న తోవ అప్పుడప్పుడూ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారి
అక్కడక్కడా చెదిరివున్న కుండలపెంకులు

ఏ పొదల పక్కనో పడివున్న ఐబీ, ఎంసీ క్వార్టర్ సీసాలు సైట్‌లో రోడ్డువారగా ఏర్పాటైన తనిష్క్ జువెల్లరీ హోర్డింగ్ చుట్టూ అద్దాల మేడలు, పక్కనే నిర్మాణమవుతున్న అపార్టుమెంట్లు ఈ స్థలానికి నప్పీ నప్పని దృశ్యాలు!

అక్కడెవరిదో వర్ధంతి ఉన్నట్టుంది, కుటుంబం సమాధి దగ్గర మౌనంగా కూర్చుంది.
ఇంకెవరిదో జయంతి వచ్చేట్టుంది, ఆ డౌన్లో సమాధికి రంగులు వేస్తున్నారు.

ఊడలు దిగిన మర్రి వృక్షపు నీడలో కాసేపు కూర్చుంటే మృత్యువు గురించి ఎన్ని లోతైన ఆలోచనలు!
మరణం జీవితంలో అంతర్భాగమా? జీవితానికి కొనసాగింపా?

లేదా బతకు, చావు రెండూ కలిపితేనే జీవితమా?

‘శరీరము ఆత్మ యొక్క వస్త్రము, శరీరము ఆత్మ యెక్క ఇల్లు, శరీరము పంజరము, ఆత్మ పక్షి’ అని ‘శాంతిస్థలం’లో బ్రహ్మకుమారి ఈశ్వరీయులు చిత్రపటాలు తగిలించినట్టుగా వీళ్లందరి ఆత్మలూ ఎక్కడికి వెళ్లివుంటాయి?

బతుకును ప్రేమించగలిగితే మరణాన్ని కూడా ఆహ్వానించగలుగుతామా?
మరణానికి మనిషి ట్యూన్ కావడంకన్నా గొప్పతనం ఇంకేమైనా ఉంటుందా?
ఈ రాలిన మర్రి ఆకులు దేన్ని సూచిస్తున్నట్టు?

మంచివాళ్లూ చెడ్డవాళ్లూ, ఉన్నవాళ్లూ లేనివాళ్లూ, పేరులేనివాళ్లూ పేరొందినవాళ్లూ, చదువుకోనివాళ్లూ ఐఏ్సఎస్లూ ప్రధాన న్యాయమూర్తులూ అందరూ కాలధర్మానికి తలొగ్గాల్సిందే కదా!
చిట్టచివరకు కట్టెల్లో కాలి, బూడిదగా మారి, మట్టిగా మిగిలిపోవాల్సిందే కదా!
అంటే, మా తాతలాగా, తమ్ముడిలాగా నేనూ చచ్చిపోవాల్సిందే కదా!
నా గుండె వేగం హెచ్చినట్టయ్యింది. లోపలెక్కడో తెలియని భయకంపనం.

నేనూ చచ్చిపోవాల్సిందేనన్న నిజం నన్ను దుఃఖితుడిని చేస్తోందేమిటి?
అంటే నేను మరణాన్ని ద్వేషిస్తున్నాను. ఆ లెక్కన బతుకును ప్రేమించాల్సిందే కదా! బతుకును ప్రేమించడమంటే సమస్యలతో సహా సంపూర్ణంగా స్వీకరించడమే కదా!
కాసేపు కళ్లు మూసుకుంటే పెరిగిన గుండె వేగం నెమ్మదించి, అస్పష్ట మనోదృశ్యాలేవో చెదిరిపోయినట్టయింది.

ఏదేమైనా జీవితాన్ని గాఢంగా కౌగిట్లోకి తీసుకోవాలన్న గ్రహింపు తాత్కాలికంగానైనా చిత్తశాంతిని ప్రసాదించింది. వేటిని సమస్యలుగా భావిస్తూ నేను ఈ శ్మశానంలో అడుగుపెట్టానో, అవన్నీ ఆలోచనల మంటల్లో కాలిపోయినై. ‘జ్ఞానస్నానం’ చేసినట్టయి నింపాదిగా, నెమ్మదిగా బయటికొచ్చేశాను.
-పూడూరి రాజిరెడ్డి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి