23, మార్చి 2012, శుక్రవారం

వేప... కరివేప... ఒక కథ

అహంకారం నెత్తికెక్కితే నాలుక చిమచిమమంటుంది. మాటలు జర్రున జారుతాయి. గొప్పకు పోతే తిక్క కుదురుతుంది.
అనగనగా ఒక వేపచెట్టు.
దాని పక్కనే ఒక కరివేపాకు చెట్టు.
రెండూ ఫ్రెండ్సు.
కాని కాలం కలకాలం ఎవర్నీ ఒకలా ఉంచదు.
రాను రాను కరివేపాకుకు అహంకారం పెరిగింది. పొగరు చిటారుకొమ్మకు ఎగబాకింది.
ఒకరోజు అది వేపచెట్టుతో ఇలా అంది- గురువా వేపచెట్టూ. నీకు నా సంగతి తెలుసునా? నేను నీకంటే గొప్ప. ఎలా అంటావేమో.... నా పేరు ముందు కరి ఉంది. కరి అంటే ఏనుగు. జంతువుల్లోకెల్లా ఏనుగు ఎలా గొప్పో అలా చెట్లలోకెల్లా నేనే గొప్ప. వేప కంటే కరివేపాకు గొప్ప. అందుకే నా కోసం అందరూ ఆత్రపడతారు. కూరల్లో వేయడానికి తహతహలాడతారు. నీదగ్గర ఏముంది... మొత్తం చేదు... యాక్ అంది.
ఆ మాటలకు వేప చిన్నబుచ్చుకుంది.
చల్లటి నీడనిచ్చే నన్ను ఇంతలేసి మాట అంటుందా అని వనదేవతను ప్రార్థించింది.
రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. తపస్సు వీడని వేప పట్టుదలను చూసి వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలి నీకు అని వేపను అడిగింది. ‘తల్లీ... నా కంటే తనే గొప్పనని కరివేపాకు అంటోంది. దాని పొగరు అణుచు’ అంది. వనదేవత అందుకు సమ్మతించింది.

‘‘మూడొందల అరవై రోజులూ కరివేపను వాడినా... అన్ని రోజులకూ ప్రారంభదినం లాంటి ఉగాది రోజున అందరూ నీకోసం వెతుక్కుంటారు. నీ ప్రమేయం లేకుండా ఉగాదిని జరుపుకోరు. అంతేకాదు ఇన్నాళ్లూ కూరతోపాటు కరివేపను కూడా తినేవారు. ఇకమీదట కరివేపను వాడినా దాన్ని తీసిపారేస్తారు. ఇక మీదట అది వాడుకుని పారేయడానికి అది ఒక గుర్తుగా మారుతుంది... దాని పొగరు అలా అణుగుతుంది’’ అని వనదేవత మాయమైంది.
అప్పట్నించి కరివేపాకు బతుకు అలా అయ్యింది.
వేప ఇలా వెలుగుతోంది.
 
- కల్పన

2 కామెంట్‌లు: