19, మార్చి 2012, సోమవారం

చిట్టి కథ (పరివర్తన)


కార్తీక్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ, అన్నింటి లోనూ ముందుంటాడని అతనంటే అందరికీ చాలా ఇష్టం. కృష్ణది కూడా అదే తరగతి. బాగా అల్లరి చేస్తాడు. తోటివారిని ఏడిపిస్తుంటాడు. ఇంట్లో ఎవరి మాటా వినడు. దాంతో అతనంటే అందరికీ కోపంగా ఉండేది. కార్తీక్‌ని చూసి కృష్ణ ఎంతో కుళ్లుకునేవాడు.

ఆ రోజు కార్తీక్ బర్త్‌డే. వాళ్ల డాడీ అతనికి ఓ ఖరీదైన కలాన్ని బహుమతిగా ఇచ్చాడు. అసలే చక్కటి దస్తూరీ కార్తీక్‌ది. ఆ పెన్నుతో రాయడంతో అతని చేతి రాత మరింత అందంగా కుదిరేది. కృష్ణ కళ్లు ఆ పెన్నుమీద పడ్డాయి. ఎలాగైనా కాజేయాలనుకున్నాడు.

ఓ రోజు తరగతిలో ఎవరూ లేని సమయం చూసి కార్తీక్ సంచిలోని కలాన్ని తీసి తన సంచిలో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత కార్తీక్ వచ్చి తన పుస్తకాల సంచి చూసుకున్నాడు. కలం లేకపోవడం చూసి ఏడవటం మొదలు పెట్టాడు. టీచరమ్మ ఒక కుర్రాడిని పిలిచి అందరి బ్యాగులూ చెక్ చేయమని చెప్పింది. ఆ కుర్రాడు అందరి బ్యాగ్‌లూ వెదుకుతూ కృష్ణ బ్యాగ్‌లో కలాన్ని చూశాడు. టీచర్ కృష్ణవంక కోపంగా చూసింది. కృష్ణ బిక్కచచ్చిపోయాడు. అతన్నలా చూసేసరికి కార్తీక్‌కి జాలేసింది.
‘‘నా పెన్ను దొరికింది కదా టీచర్, దయచేసి కృష్ణని ఏమీ అనద్దు’’ అని బతిమాలాడు. టీచర్ కృష్ణని వదిలేసింది.

అప్పుడర్థమైంది కృష్ణకు అందరూ కార్తీక్‌ను ఎందుకిష్టపడతారో! దగ్గరికెళ్లి ‘సారీ’ చెప్పాడు. నవ్వుతూ అతని భుజం తట్టి తమ జట్టులో కలుపుకున్నాడు కార్తీక్.
అప్పటినుంచి అల్లరి మానేసి చదువుపై దృష్టిపెట్టి మంచి మార్కులు తెచ్చుకోసాగాడు కృష్ణ. అతనిలో వచ్చిన పరివర్తనకు అందరూ ఎంతో సంతోషించారు.
నీతి: క్షమాగుణం చెడ్డవారిని సైతం మంచివారిగా మారుస్తుంది.
బాచి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి