16, మార్చి 2012, శుక్రవారం

మన్యాల నుండి వచ్చిన మనిషి (కధ)--శ్రీశ్రీ



అప్పుడు నాకు బాగా చిన్నతనం. ఇంకా ఆరోయేడు రాలేదు. ఆ రోజుల్లో ఒక ముసలి అబ్బి తంబూరా పాడుతూ వచ్చి మా ఇంటిముందు నిలబడ్డాడు. ఇంట్లోంచి నేను పరుగెత్తుకుని వచ్చి మళ్లీ పాడుతాడేమో అని నిల్చున్నాను. పాడలేదు. 'మానేశావేం? పాడవూ?' అన్నాను. 'అబ్బాయీ! కాసిన్ని మంచినీళ్లిప్పిస్తావా? నీకు పుణ్యం వుంటుంది. అలసిపోయిన ఈ ముసిలిప్రాణిని కాపాడు. మన్యాలనుంచి వొస్తున్నాను' అన్నాడు ముసిలి.

'మన్యాలా? ఏం మన్యాలు?' అన్నాను. 'గుణుపురం మన్యాలనుంచి' అన్నాడు ముసలాయన.
'గుణుపురం మన్యాల నుంచి ఎందుకొస్తున్నావ్‌?'
'అక్కడే నేను పుట్టాను. నా మనస్సును అక్కడే దిగవిడిచాను'
'అయితే నీ మనస్సు మన్యాల్లో ఏం చేస్తోంది?'
'విచారంతో ఏడుస్తోంది. అబ్బాయీ కొంచెం మంచి తీర్థం తీసుకొద్దూ. నాలిక ఆర్చుకుపోతోంది'
'మీ అమ్మ ఎక్కడుంది?'
'ఈ వూళ్లోనే. కానీ ఆవిడ మనస్సు మాత్రం ఇక్కడ లేదు'
'మరైతే ఎక్కడుంది?'
'గుణుపురం మన్యాల్లో. మంచి నీళ్లు తీసుకురావా చిట్టీ?'
'మీ వాళ్లంతా మన్యాల్లో మనస్సు వదిలిపెట్టేస్తారేం?'
'అది మా కుటుంబం ఆనవాయితీ. ఇవాళ ఇక్కడ, రేపు ఎక్కడో'
'అంటే?'
'ఇవాళ బతుకు, రేపు చావు'
'మీ అమ్మమ్మ ఎక్కడుంది?'
'యలమంచిలిలో'
'ఆవిడ మనస్సు కూడా మన్యాల్లోనే ఉండిపోయింది కదూ?'
'తప్పకుండా. కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి.
ఇంతట్లో మా నాన్న వచ్చి గడపమీద నిలబడ్డాడు. పడుకుని మేలుకున్న సింహంలాగ బొబ్బరించాడు. 'ఒరే, నీకు బుద్ధిలేదూ? పెద్ద మనిషి మంచినీళ్లు కావాలంటూవుంటే పెత్తనాలు చేస్తున్నావ్‌? వెళ్లి చెంబెడు నీళ్లు పట్రా, పాపం సొమ్మసిల్లి పడిపోకముందే. ఏమయిందిరా నీ మర్యాదా, మప్పితం?'
'ఎట్టకేలకెవరైనా మనింటికొస్తే లోకం భోగట్టా కనుక్కుంటాను. అదీ తప్పేనా?'
'వెళ్లి ముందు నీళ్లు తీసుకురారా. బెల్లం కొట్టిన రాయిలా కదలవేం? చస్తాడు బ్రాహ్మడు. వెళ్లరా వేగం'
'నువ్వెందుకు వెళ్లకూడదూ! వొచ్చేటప్పుడు మంచినీళ్లు తీసుకురాలేక పోయావూ? నువ్వేం పని చేస్తున్నావు నాన్నా?'
'మరేం? నేనేపనీ చెయ్యలేదట? నీకు తెలియదూ గొప్ప ప్రబంధం రాస్తున్నానని? పద్యాలు మనస్సులో ఆలోచిస్తున్నాను'
'అది నాకేం తెలుసు? తల చేత్తో పట్టుకుని నిలబడతావు? పద్యాలు రాస్తున్నట్లు నాకెలా తెలుస్తుంది?' తెలియకపోతే తెలుసుకోవాలి అన్నాడు మా నాన్న.
'నమస్కారం బాబూ' అన్నాడు ముసిలాయన.
'మీ కుర్రాడూ నేనూ మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతాల్లో వానలు పడ్డాయనీ, ఈ యేడు చక్కగా పంటలు పండుతాయనీ చెబుతున్నాడు మీ వాడు'
(శ్రీరామ రామ! ఈ ముసిలాడితో ఇవన్నీ చెప్పలేదే నేను. పంటల మాట ఎప్పుడొచ్చిందసలు?)
'నమస్కారం' అన్నాడు మా నాన్న. 'లోపలికి దయ చెయ్యరూ. కాళ్లు కడుక్కుంటారా? వంట అయిపోవచ్చింది'
'ఆకలితో కడుపు దహించుకుపోతోంది. ఈ క్షణమే వస్తున్నాను'
'నేరంగ మెల్లిపోతానే' అన్న పాట వొచ్చునా?' అని ముసిలాయన్ని అడిగాను. తంబురా మీద పలికిస్తావ్‌ ఆ పాట. అదంటే నాకెంతో ఇష్టం. ఏమో మరి. ప్రపంచంలో అన్ని పాటలకన్నా అదే నాకు చాలా ఇష్టం'
'నా తండ్రే' అన్నాడు ముసిలాయన, నీ క్కూడా నాకొచ్చినన్నేళ్లు వస్తే ఈ ప్రపంచంలో పాటలు ప్రధానం కావని నీకు తెలుస్తుంది. అన్నమే ముఖ్యమని బోధపడుతుంది'
'ఏమైనా ఆ పాట నువ్వు పాడితే వినాలనుంది'
గుమ్మం ఎక్కి ముసిలాయన మా నాన్న చేతులు పట్టుకుని అన్నాడు 'నా పేరు తిరుచూర్ణం చంద్రకాంతయ్య. నాటకాల్లో వేషాలు వేస్తాను'
'మీ దర్శన భాగ్యం వల్ల మా ఇల్లు పావనమయింది' అన్నాడు మా నాన్న. 'అబ్బీ అబ్బీ ఈయన తాగడానికి మంచినీళ్లు తీసుకురా'
వెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చాను. అన్ని నీళ్లూ గుక్క విడవకుండా తాగేశాడు ముసిలాడు. కాస్త సేదతీరి వీధంతా పరకాయించి చూశాడు. దూరంలో పొలాలు, ఇంకా దూరంలో ఆకాశం చూశాడు. సాయంత్రపు సూర్యుడు అస్తమించుతుండడం చూశాడు.
ఇక్కడికి అయిదు వందల మైళ్ల దూరంలో వుంటుందనుకుంటాను మా దేశం అన్నాడు ముసిలాయన. 'ఇవాళ ఏం కూర చేశారు ఈ జీవి ప్రాణం నిలవడానికి?'
'అబ్బీ నువ్వు కోమటికొట్టుకు వెళ్లవలసి వుంటుంది. రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పు తేవాలి' అన్నాడు మా నాన్న.
'డబ్బులు తే'
'అరువిమ్మని అడుగు సెట్టిగారిని. నా దగ్గర దమ్మిడీ కూడా లేదు'
'సెట్టి మనకిక అరువివ్వనన్నాడు. ఇచ్చీ ఇచ్చీ ప్రాణం చాలొచ్చిందన్నాడు. మనమీద కారాలూ మిరియాలూ నూరుతున్నాడు. నీకేమో ఉద్యోగం లేదట. ఎన్నాళ్లయినా అప్పు తీర్చవట. ఇప్పటికే ఇరవై రూపాయలు బాకీ'
'వెళ్లి ఆ మాటా ఈ మాటా చెప్పి సాధించుకురా. ఇది నీ వొంతు పని. నా మాట వినడు. ఓ మంచీ చెడ్డా అఖ్ఖర్లేదు వాడికి. అదంతా నాకేటెరిక అనేస్తాడు'
'ఇరవై రూపాయలూ ఇచ్చాక మాట్లాడమంటాడు'
'వెళ్లరా అట్టే మాట్లాడక. వెళ్లి రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ తీసుకురా, నువ్వు తీసుకురాగలవు. నాకు తెలుసు'
'వెళ్లమ్మా, వెళ్లు... రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ ఇమ్మను సెట్టిగారిని' అన్నాడు ముసిలాయన.
'వెళ్లు మరి ఆలస్యం చెయ్యక. కొట్టుకెళ్లి నువ్వెప్పుడూ ఉత్తచేతుల్తో రాలేదు. నువ్వొచ్చేలోగా అవ్వని పొయ్యిలో నిప్పు రాజెయ్యమంటాను. మహారాజుల్లాగ భోంచేద్దాం' అన్నాడు మా నాన్న.
'నాకేం తెలియదు బాబూ! మనం డబ్బెగెయ్యాలని చూస్తున్నామన్నాడు సెట్టి. నువ్వే ఉద్యోగం చేస్తున్నావో చెప్పమంటాడు'
'అంతేనా? సరే వెళ్లి చెప్పు. ఇందులో దాపరికం ఏముంది? నేను కవిత్వం రాస్తానని చెప్పు. మా నాన్న పగలూ రాత్రీ కవిత్వం అల్లుతూ ఉంటాడని చెప్పు'
'అలాగే చెబుతాను గాని అది సెట్టి మీద పని చేస్తుందని అనుకోను. మీ నాన్న కవిత్వం చెబితే ఎవరికి గొప్ప అంటాడు. అందరు నిరుద్యోగుల్లాగా నువ్వు ఎక్కడకైనా వెళ్లడం, ఎవర్నైనా చూడడం అదేమీ లేదట, ఏ పని చెయ్యవట. ఎందుకూ పనికిరావట'
'సెట్టీ నీకు పిచ్చెత్తి పోయిందని నేనన్నానని అను. నీకు తెలియదేమోగానీ నా అంత గొప్ప కవి లేడని చెప్పు. ప్రపంచంలో ఎవరికీ తెలియని మహా కవుల్లో మొదటివాణ్ణని చెప్పు'
'చెప్పినా సెట్టికి నచ్చుతుందని తోచదు. అయినా చూస్తాను. ఏమో నాకు చేతనైంది చేస్తాను. ఇంట్లో ప్రస్తుతం ఏమీ లేదూ?'
'ఏ కొంచెమో అటుకులు మాత్రం ఉన్నాయి. నాల్గు రోజుల్నుంచీ వరుసగా అటుకులే తిని బతుకుతున్నామని నీకు తెలియదూ? ఇవాళైనా ఇన్ని బియ్యం తెచ్చి ఇంట్లో పడెయ్యకపోతే నేను రాస్తున్న ప్రంబంధం పూర్తికాదు'
'ఏమో నా చేత నైనదంతా చేసే చూస్తాను'
'మరి ఆలస్యం చెయ్యకు తండ్రీ. మా దేశం అయిదువందల మైళ్ల దూరం అని మరిచిపోకు నాయనా?' అన్నాడు ముసిలాయన.
'పరుగెత్తుకెళ్లి పరుగెత్తుకొస్తాను'
సెట్టి దుకాణం దాకా పరుగెత్తుకు వెళ్లాను. కునికిపాట్లు పడుతున్న సెట్టి కళ్లు తెరిచాడు.
'చూశారా సెట్టిగారూ' అన్నాను నేను. 'మీరు చీనా దేశంలో ఉన్నారనుకోండి. నా అనుకునేవాళ్లెవరూ లేరనుకోండి. ఎర్రని ఏగాణియేనా లేదనుకోండి. అప్పుడెవరైనా గృహస్థు మీకింత బియ్యం వేస్తే బాగుంటుందంటారా లేదా?'
'ఎందుకొచ్చావ్‌' అన్నాడు సెట్టిగారు.
'అబ్బే ఊరికే మాట్లాడిపోదామని. ఎవరైనా సంసారి మీకు సాయం చేస్తే బాగుంటుంది కదూ? ఏమంటారు సెట్టిగారూ?'
'ఎంత డబ్బు తెచ్చావ్‌?'
'డబ్బు గొడవ కాదండీ. చీనాలో చిక్కుకుపోతే ఎవరు సాయం చేస్తారని?'
'అదంతా నాకేటెరిక'
'చీనాలో మీరే అలాంటి అవస్థపడుతున్నారనుకోండి. అప్పుడు మీకెలా వుంటుంది?'
'నాకేటెరిక చీనాలో నాకేం పనుంది?'
'కాదు సెట్టిగారూ? ఏదైనా పనిమీద అలా వెళ్లారనుకోండి. తెలిసిన స్నేహితులెవ్వరూ ఉండరనుకోండి. అంత దేశంలో ఒక్కడూ మీకింత బియ్యం వెయ్యకుండా తరిమేస్తాడంటారా?'
'అబ్బారు మనకి ఆళ్ల సంగతంతా ఎందుకు? మనది చీనాదేశం కాదు. నువ్వో మీ నాన్నో ఎప్పుడో ఒకప్పుడు పాటుపడి డబ్బు సంపాదించాల. ఆ పని ఇప్పుడే మొదలెట్టకూడదూ? మీకరువిస్తే మరి సచ్చినా డబ్బు తిరిగిరాదు'
'సెట్టిగారూ నా మాట మీకు తిన్నగా అర్థం కాలేదు. వెధవ అరువు. అరువు సంగతే నేను మాట్లాడలేదు. చీనాలో కోట్లకొద్దీ జనం. వాళ్ల మధ్య ఒంటిగా మీరు, కడుపు దహించుకుపోయే ఆకలి. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న అవస్థ'
'సీనా వూసు నాకెందుకు. ఇక్కడ ఈ రాజ్యంలో పాటుపడి పని సెయ్యకపోతే కూడు పుట్టదు. అందరూ ఏదో వుద్యోగం సెయ్యాల'
'సెట్టిగారూ ఒకసేరు బియ్యం దొరికితే మీ ప్రాణాలు నిలుస్తాయనుకోండి. ఆ స్థితిలో మీరు నోరు తెరిచి ఎవర్నైనా అడుగుతారా?'
'అడగను. నేనెవర్నీ ముస్టెయ్యండని అడగను. సచ్చినా అడగను'
'తర్వాత సేరుకి రెండు సేర్లబియ్యం తీర్చేస్తానని తెలిసినా అడగరూ? అప్పటికీ అడగరూ? అదుగో. అదే కూడదండీ సెట్టిగారూ. అంత నిరుత్సాహమా? ఇలాంటి మాటలవల్లనే యుద్ధాల్లో ఓడిపోతాం. మరేంవుంది? ఇలా బిగిసి కూర్చుంటే ఏమవుతుంది. చచ్చి ఊరుకుంటాం. చీనాలో ముష్టెత్తుకోకపోతే చచ్చిపోతారు సుమండీ సెట్టిగారూ!'
'ఇదెక్కడ సావొచ్చింది? ఆ ఇరవై రూపాయలూ ఇక్కడ తెచ్చిపెట్టు. మీ నాన్ననేదేనా ఉద్యోగం సెయ్యమను'
'పోనీండి గాని సెట్టిగారూ మీ వొంట్లో ఎలా వుంది?'
'నింపాదిగానే ఉంది. నీ కెలావుంది?'
'దివ్యంగా వుంది. మీ పిల్లలంతా క్షేమమా సెట్టిగారూ?'
'ఓ సేమంగా ఉన్నారు. సిన్నోడు నడుస్తున్నాడు కూడా'
'ప్రశస్తంగా వుంది. మరి మీ అమ్మాయి?'
'సంగీతం నేర్చుకుంటోంది. సిన్న సిన్న పాటలు పాడుతుంది. మీ అవ్వ నింపాదిగా వుందా?'
'భేషుగ్గా ఉంది. ఆవిడా చిన్న చిన్న పాటలు ఇప్పుడిప్పుడే పాడుతోంది. సినిమాలో పాడాలని చూస్తోంది. మీ ఇంటావిడ బాగున్నారా?'
'దానికేం? సుఖంగా ఉంది'
'మీ ఇంటిల్లిపాదీ హాయిగా ఉన్నారంటే నాకెంత సంతోషమో చెప్పలేను సెట్టిగారూ. మీ చిన్నబ్బాయి పెద్దయితే డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటయిపోతాడని నా నమ్మకం'
'నాకూ అదే ఆశ. నాకంటే సదువురాలేదుగానీ అబ్బాయిని సెన్నపట్నం పంపించాలనుకుంటున్నాను. ఆడుకూడా కిరాణా కొట్లో కూసోవడం నాకిష్టం లేదు'
'మీ చిన్నబ్బాయిని చూస్తేనేచాలు ప్రెసిడెంటుగిరీ చలాయిస్తాడని తెలుస్తుంది'
'ఏటికావాలి పంతులూ' అన్నాడు సెట్టిగారు. డబ్బేమైనా తెచ్చావా?
'చూడండి సెట్టిగారూ! ఇక్కడకు నేను రావడం ఏదీ కొందామని కాదు. దారింట పోతూ కాలక్షేపం కోసమని మీ దగ్గరకొచ్చాను. ఏవైనా తత్వాలు మీతో మాట్లాడడం నాకూ సరదా. పోనీ ఏదో మీరే అడిగారు కాబట్టి ఓ రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ కొలిపించండి'
'రొక్కం చెల్లించాల'
'మీ అమ్మాయి రోజమ్మ, అన్నట్లు మరిచిపోయాను. మీ రోజమ్మ బాగుందా? అంత అందమైన పిల్లని నేనెక్కడా చూడలేదు'
'రోజమ్మా... కులాసాగానే ఉంది. పంతులూ ఇక్కడ రొక్కం సెల్లించి తీరాల. నువ్వూ మీ నాన్నా వూరంతట్లోకి ఎందుకూ పనికిరాని యెర్రిమొగాలు'
'రోజమ్మ బాగుంది కదా! సంతోషమైన మాట చెవిన వేశారు. సెట్టిగారూ ఇవాళ మా ఇంటికి మహారాజశ్రీ తిరుచూర్ణం చంద్రకాంతయ్యగారు వచ్చారు. రాజు వేషం వేస్తారు. ఆయన పేరు పేపర్లో పడింది'
'అతగాడిపేరు నేనినలేదు'
'ఓ సేరు నెయ్యికూడా ఇవ్వాలి'
'చంద్రకాంతయ్యగారికి సేరు నెయ్యి నేనియ్యలేను'
'తప్పకుండా ఇవ్వగలరు'
'ఇయ్యలేను. కావలిస్తే బియ్యం పెసరపప్పు తీసికెళ్లు అంతే. మీ నాన్న ఎప్పుడేనా పనిసేస్తే యేం పని సేస్తాడు పంతులూ?'
'మా నాన్న కవిత్వం చెబుతాడు. అదొక్కటే మా నాన్నకి చేతనైనపని. ఈ ప్రపంచంలో అతనికన్న గొప్ప కవిలేడు'
'డబ్బేమైనా పెగుల్తుందా? మీ నాన్న దమ్మిడీ అయినా ఆర్జిస్తాడా?'
'మా నాన్న డబ్బుకోసం ఏ పనీ చెయ్యడు'
'అవ్వా కావాలి బువ్వా కవాలంటే ఎలాగ?'
'అలాంటి వుద్యోగాలంటే మా నాన్నకసయ్యం.
'అందర్లాగా మీ నాన్న పని సెయ్యడేం పంతులూ?'
'అందరికన్నా కష్టపడి పనిచేస్తాడు మానాన్న. మా నాన్న మామూలు మనిషికన్న రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తాడు'
'సరే. సరుకు తీసికెళ్లు. ఇరవైరెండు రూపాయలపై సిల్లరయింది. ఇప్పుడంటే అరువిచ్చాను గాని ఇంకెప్పుడూ ఇయ్యను'
'రోజమ్మ నడిగానని చెప్పండి'
'అలాగే'
'వెళ్లొస్తాను'
'సరే వెళ్లు'
బియ్యం, పెసరపప్పు తీసుకుని పరుగెత్తుకుంటూ ఇల్లు చేరాను. తెస్తానో లేదో అని ఇంటిముందే కనిపెట్టుకు కూచున్నారు మా నాన్న, చంద్రకాంతయ్య. అల్లంతదూరాన ఉండగానే ఇద్దరూ నా దగ్గరకు తోసుకొచ్చారు. చేతిలో సరుకు చూడగానే. అవ్వకి చెయ్యి వూపాను. అవ్వ అది చూశాక ఇంట్లోకి వెళ్లింది.
'సాధించుకొస్తావని నాకు తెలుసు' అన్నాడు మానాన్న.
'నేనూ అలాగే అనుకున్నాను' అన్నాడు చంద్రకాంతయ్య గారు.
'ఇరవైరెండు రూపాయలపై చిల్లర అయిందని సెట్టిగారన్నారు నాన్నా. ఈ మాటుకి పోనిచ్చాను గాని ఇక మీద అరువుబేరం పనికిరాదన్నాడు' అన్నాను నేను.
'సరే. అది అతని అభిప్రాయం. అయితే అతగాడితో ఏం మాట్లాడావురా?'
'మొట్టమొదట చీనాదేశం, ఆకలి, చావడానికి సిద్ధంగా ఉండడం లాంటివన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ల కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నాను'
'అంతా బాగున్నారా?'
'దేదీప్యమానంగా ఉన్నారు'
తర్వాత ముగ్గురం ఇంట్లోకి వెళ్లాం. అవ్వ నిమిషాల మీద వంట పూర్తిచేసి వడ్డించింది. పప్పూ, మజ్జిగతో అన్నం తిని రెండేసి చెంబులనీళ్లు తాగాం. ఒక్క మెతుక్కూడా లేకుండా విస్తరి ఖాళీచేసి, ముసిలాయన వంటింట్లో గూటివేపు చూశాడు. ఇంకేమైనా తినడానికుంటుందేమో అని.
'అదుగో ఆ సీసా, అందులో ఏవో ఉండలున్నాయే' అన్నాడు ముసిలాయన.
'అవి నా గొట్టికాయలు' అన్నాను నేను.
'ఆ గూట్లో డబ్బీ. అందులో తినబడు సామాగ్రి ఓ పిసరు లేదూ?'
'మిడతల్ని దాచుకున్నాను'
'ఆ మూలని జాడీ చూశావ్‌. దాంట్లోనో?'
'కప్పలు'
'ఇకనేం. కప్పల్ని ఉడకబెట్టుకు తింటే బాగానే ఉంటుంది. నాకలాంటి పట్టింపులు లేవు' అన్నాడు ముసిలాయన.
'కప్పల్ని తింటారా ఎవరేనా?' అన్నాను.
'ఎందుకు తినరూ? మహారాజులాగా తింటారు. చీనావాళ్లు కప్పల్నీ, మిడతల్నీ తింటారు. మనం తింటేనేమో తప్పొచ్చింది? రానియ్యి. ఓ అరడజను కప్పల్ని, మిడతలనెన్ని జాగ్రత్త చేశావ్‌?'
'నాలుగో, అయిదో'
'దించవేం. తియ్యి జాడీలు, డబ్బాలు. కడుపునిండా తిన్నతర్వాత పదవే భద్రాద్రికి అనే పాట పాడుతాను. కావలిస్తే నువ్వడిగిన 'రంగమెల్లి పోతానే' అనే పాటకూడా పాడుతాను. ఇప్పుడు మాత్రం ఇంకా ఆకలి దహించేస్తోంది'
'నాకూ ఆకలిగానే ఉంది. అయినా నా కప్పల్ని చంపేస్తే ఒప్పుకోను'
మా నాన్న చేతులు కడుక్కుని తల రెండు చేతుల్తో పట్టుకుని పగటి కలలు కంటున్నాడు. అవ్వ ఒకచోట నిలవకుండా నడుస్తూ పాడుకుంటోంది. త్యాగరాజు కృతులు ఆవిడకు చాలా ఇష్టమట. తొలినే చేసిన పూజాఫలం అని అరుస్తోంది.
'మీరేదేనా పాడరూ? మా అబ్బాయికి పాటలంటే సరదా' అన్నాడు మా నాన్న.
'ఔనండీ నాకు పాటలంటే ఇష్టం. పాడరూ' అన్నాను నేను.
చంద్రకాంతయ్య లేచి చెయ్యి కడుక్కుని తాంబూలం తీసుకుని ఉరుములాంటి గొంతుతో ఊరంతా దద్దరిల్లిపోయేటట్లు పాట లంకించుకున్నాడు. ఇరుగు పొరుగు వారందరూ మా యింటిముందు పోగయి పాట వింటూ తన్మయులైపోయారు. మా నాన్న చంద్రకాంతయ్యని లోనికి తీసుకొచ్చి వారు ఫలానా అని అందరికీ చెప్పాడు. మైలవరం కంపెనీలో యాక్టు చేశారని, విద్యాధీకులనీ పరిచయం చేశాడు. జనం ఏమీ అనలేదు. చంద్రకాంతయ్యగారు నాటకాల్లో తమ అనుభవాలను గురించి ఉపన్యసించారు. కలకత్తాలో తనకి సువర్ణపతాకం ఇచ్చారనీ, అదంతా నిన్నగాక మొన్న జరిగినట్లు కళ్లకి కనబడుతోందని అన్నాడు.
వీరాచారి మరో పాట సెలవియ్యండని అడిగాడు. ఇంట్లో ఏమైనా బియ్యం వుందా అని చంద్రకాంతయ్య అడిగాడు.
'ఓ ఉన్నది. కావలసినంత ఉన్నది' అన్నాడు వీరాచారి.
'రావడానికి వీలవుతుందా? తిరిగి రాగానే నీ గుండె కరిగించగల పాట పాడతాను' అన్నాడు ముసిలాయన.
'ఇక్కడున్నట్లు వస్తాను' అని వెళ్లాడు వీరాచారి.
అలాగే చంద్రకాంతయ్య రంగశాయిని మీ ఇంట్లో పొట్లపాదు ఉందా అని అడిగి, రంగశాయి 'మా ఇంట్లో పాదు ఉండకేం అంటే, ఇబ్బంది అనుకోక ఇంటికి ఒకటి రెండు పొట్లకాయలు తీసుకురావడానికి వీలవుతుందా? రాగానే నీకళ్లంట నీళ్లు తెప్పించే పాట పాడతానని అనడంతో, రంగశాయి అలాగే ఇంటికి బయలుదేరాడు. చంద్రకాంతయ్య ఇరుగు పొరుగువాళ్లు నొక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరింట్లోనూ ఏదైనా ఓ పిసరు తినగల, రుచిగల పదార్థం ఉన్నదేమో అని వాకబుచేశాడు. వాళ్లంతా ఉన్నట్లు చెప్పగానే ఇబ్బంది అనుకోక ఇళ్లకి వెళ్లి ఆ తినగల, రుచిగల పదార్థాలు తీసుకురావడానికి వీలవుతుందా అని అడిగాడు. వాళ్లంతా వెళ్లి ఎవరింట్లో కలిగినది వాళ్లు తీసుకొచ్చారు. చంద్రకాంతయ్య పాడే, కళ్లంట నీళ్లు తెప్పించే, జీవితాన్నే అట్నుంచి ఇటు మార్చివేసే పాట వినడానికి కూర్చున్నారు. తంబురానీ, గొంతుకనీ సవరించి 'ఇది మాయా సంసారం' అనే పాటని విజృంభించి పాడగా ఇరుగు పొరుగువాళ్లు పరవశులై కళ్లు తుడుచుకుంటూ వెళ్లి పోయారు. చంద్రకాంతయ్యగారు ఇరుగు పొరుగువాళ్లు తెచ్చిన మంచి మంచి పదార్థాలన్నీ వంటింట్లో చేరవేసి ఆ వంకాయలూ, పొట్లకాయలూ, బియ్యం, పంచదార, సెనగపప్పు... అవన్నీ వండుకున్నాక మేమందరమూ హాయిగా భోజనం చేసి ఆకలి తీర్చుకున్న పిమ్మట చంద్రకాంతయ్యగారు మీ అభ్యంతరం లేకపోతే ఇలాగే మరికొన్నాళ్లు మీ ఇంట్లోనే ఉంటానన్నారు. దీన్ని స్వగృహంగా భావించుకొండని మా నాన్న అనగా, అలాగే అని చంద్రకాంతయ్యగారు మా ఇంట్లో పదిహేడు పగళ్లూ పదిహేడు రాత్రుళ్లూ గడిపారు. మీదట పద్దెనిమిదో రోజు మధ్యాహ్నం చంద్రకాంతయ్యగారున్నారా అని ఎవరో వచ్చి అడిగితే మా నాన్న 'ఎవరు నువ్వు' అని అడిగారు.
'మాది మైలవరం, మళ్లీ నాటకాలు వేస్తున్నాం. చంద్రకాతయ్యగారికి తెలుసు. రెండు వారాల్లో నాటకం' అని ఆ వచ్చిన మనిషి అనగానే పరధ్యానంగా కూర్చున్న చంద్రకాంతయ్యగారు దిగ్గున లేచి అతనితో కలిసి వెళ్లిపోయాడు.
ఆ మర్నాడు మధ్యాహ్నం మళ్లీ మాకు ఆకలి మండుకొస్తే మా నాన్న నన్ను పిలిచి సెట్టిగారి దగ్గరకు ఎళ్లి ఏమిస్తే అది తీసుకురా, ఎలాగైనా తీసుకురావాలన్నాడు.
'ఇరవై రెండు రూపాయలపై చిల్లరబాకీ తీర్చనిదే ఏమీ ఇవ్వడతను' అన్నాను నేను.
'వెళ్లరా మరిన్నీ. నంగిరితనం వోడకు. అతనెంత యోగ్యుడు. నువ్వడిగితే లేదంటాడా?'
చచ్చినట్టు సెట్టి కొట్టుకు వెళ్లి ఇదివరకు చీనా సమస్యను వదలి పెట్టిన చోట మళ్లీ ఎత్తుకుని ఎలాగైతేనేం ఒక సేరు అటుకులు సంపాదించేసరికి నాకు తలప్రాణం తోకకొచ్చింది. అటుకులు తీసుకుని మా నాన్న ఇవి తింటే ముసిల్దానికి తంటా వొస్తుందని అన్నాడు. అలాగే అవ్వ మర్నాడు పాడుతూ దగ్గుతూ, దగ్గుతూ పాడింది.
ఇలా అటుకులమీద బతికితే ఎంతకాలానికి నా మహాకావ్యం పూర్తి అవుతుందన్నాడు మా నాన్న.
(విలియమ్‌ సారోయన్‌ కథకు అనుకరణ)
ముద్రణ : రూపవాణి మాసపత్రిక, జనవరి 1945. 

2 కామెంట్‌లు:

  1. మిత్రమా.. కథ చక్కగా ఉంది. నేను ఇదే మొదటిసారి ఈ బ్లాగు చూడడం.. ఇప్పటికే కదలకుండా అయిదారు కథలు చదివాను. ఈ కథ చాలా ముచ్చటగా అతి లేని భాషలో.. బాగుంది. హాయిగా ఉంది.
    కె.ఎ. మునిసురేష్ పిళ్లె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురేష్ గారు, ధన్యవాధాలండి. మరి కొన్ని మంచి టపాలు జత చెయగలను అని ఆశిస్థూ....రామ్..

      తొలగించండి