7, మార్చి 2012, బుధవారం

మన దేశపు మేడమ్ క్యూరీలు


ఉమెన్స్ డే స్పెషల్
ప్రయోగానికి జెండర్ ఉండదు. పరీక్షా నాళికను పట్టుకున్న చేతులకు స్త్రీ, పురుషులన్న తేడా ఉండదు. ఆలోచించగలిగితే, సాధన చేయగలిగితే శాస్త్ర ఆవిష్కరణల్లో పురుషుడితో సమానంగా స్త్రీ రాణించగలదు. స్త్రీకి కూడా మెదడు ఉంటుంది... దానికి అభ్యాసం కావాలి అన్నారు మహారచయిత చలం. కాని ఆ సంగతి గుర్తించడానికి, గుర్తించి చదువును స్త్రీకి దగ్గర చేయడానికి శతాబ్దాలు పట్టింది. ఇంకా ఇప్పటికీ ఆడదానికి చదువు ఎందుకు? అనే మాట వినబడుతూనే ఉంది. ఈ శృంఖలాలను ఛేదించిన ధీర వనితలు ఎందరో నేడు పరిశోధనా రంగంలో రాణిస్తున్నారు. దేశం గర్వపడే ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల అలా గుర్తింపు పొందిన ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేస్తున్నాం... ఎవరెస్ట్ మీద మహిళ కాలు పెట్టడం జరిగిపోయింది. ఇక చంద్రుడి మీదే. పెద్ద దూరం లేదు.

పేరు :ఐశ్వర్య లక్ష్మీ రతన్
సంస్థ :మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా
ఘనత :పొదుపు సంఘాల లెక్కలు, రాతల డిజిటలైజేషన్‌కు పరికరాల రూపకల్పన.
గుర్తింపు :ఎంఐటీ టీఆర్ -35, 2011 అవార్డు

దేశంలో మహిళల స్వావలంబనకు పొదుపు సంఘాలు మార్గం వేశాయనడం అతిశయోక్తి కాదు. పెద్ద చదువులు లేకపోయినా, ఆర్థికంగా వెనుబడినా... ఉన్నదాంట్లోనే కొంత పొదుపు చేసుకుని, ఆ మొత్తమే పెట్టుబడిగా ఇతర మహిళలు స్వయంసమృద్ధి సాధించేలా చూడటం ఈ పొదుపు సంఘాల లక్ష్యం. అయితే వీరు నమోదు చేసుకునే దైనందిన ఆర్థిక వ్యవహారాల జాబితా అంత స్పష్టంగా లేకపోవడం, చాలా సందర్భాల్లో తప్పులు దొర్లడం ఐశ్వర్య లక్ష్మీ రతన్ గమనించారు. ఈ సమస్యను కాలిక్యులేటర్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో అధిగమించవచ్చు. కానీ వాటిని వాడటం ఎలా? ఖరీదు కూడా చాలా ఎక్కువ. అందుకే ఐశ్వర్య వీరి కోసం కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేశారు. కాగితంపై సాధారణ పెన్నుతో రాసిన రాతలను అప్పటికప్పుడు, అక్కడికక్కడే డిజిటలైజ్ చేయడం ఈ పరికరాల ప్రత్యేకత. మార్కెట్‌లో లభ్యమయ్యే ఓ డిజిటల్ పలకపై కాగితాన్ని ఉంచి, దానిపై పొదుపు సంఘాల వారు లెక్కలు రాసుకుంటూ పోతే సరి. వాటి డిజిటల్ రూపం డిజిటల్ పలకలో నిక్షిప్తమవుతూంటుంది. సాధారణ పెన్ను వెనుకభాగంలో ఏర్పాటు చేసిన స్టైలస్ సాయంతో డిజిటల్ పలకలో నిక్షిప్తమైన సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇందుకు అవసరమైన అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను చాలా సరళమైన తీరులో ఐశ్వర్య బృందం రూపొందించింది. లెక్కలన్నీ ఎంట్రీ చేసిన తరువాత ఒకసారి సరిచూసుకునేందుకు కూడా ఏర్పాటు ఉంది ఈ వ్యవస్థలో. స్థానిక భాషలోనే అప్పటివరకూ రాసిన లెక్కలను చదివి వినిపించేలా ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. తప్పులుంటే సరిచేసుకుని... నిర్ధారించిన తరువాతే సమాచారం నిక్షిప్తమవుతుంది. ఐశ్వర్య తయారు చేసిన ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థను పెలైట్ పద్ధతిలో ఇప్పటికే కొన్ని పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చి పరీక్షించారు. మంచి ఫలితాలు సాధించారు. ఈ కృషిని గుర్తించి ఎంఐటీ గత ఏడాది టీఆర్-35 అవార్డుతో సత్కరించింది.

పేరు :డాక్టర్ సంఘమిత్ర బందోపాధ్యాయ
సంస్థ :ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
ఘనత :క్యాన్సర్‌పై పరిశోధనలు
గుర్తింపు :శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు - 2010

మైక్రో ఆర్‌ఎన్‌ఏ పేరెప్పుడైనా మీరు విన్నారా? అతి సంక్లిష్టమైన మానవ జన్యుక్రమంలో కీలకపాత్ర పోషించే సూక్ష్మ రసాయన అణువులివి. మనిషికి వచ్చే అనేకానేక వ్యాధులకు ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏలోని తేడాలే కారణమని శాస్త్రవేత్తల అంచనా. వీటి పనితీరును అర్థం చేసుకుంటే క్యాన్సర్‌తోపాటు చాలా వ్యాధులకు మెరుగైన చికిత్స కల్పించవచ్చునంటారు డాక్టర్ సంఘమిత్ర బందోపాధ్యాయ. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న బందోపాధ్యాయ స్వతహాగా కంప్యూటర్ ఇంజినీర్. ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతికశాస్త్రం నుంచి పట్టభద్రురాలైన ఆమె ఆ తరువాత జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చేశారు.

ఆ తరువాత ఐఎస్‌ఐలో పీహెచ్‌డీ చేస్తూండగా ‘మెషీన్ ఇంటెలిజెన్స్’ పై ఆసక్తి పెంచుకున్నారు. ‘‘జీవశాస్త్రంలో అణువులను వెతకడమంటే గడ్డిమోపులో సూదిని వెతికినట్లే. మెషీన్ ఇంటెలిజెన్స్ సాయంతో గడ్డిమోపు పరిమాణాన్ని తగ్గించవచ్చు’’ అంటారు సంఘమిత్ర. ఈ దిశగానే ఆమె పరిశోధనలు సాగాయి కూడా. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు మైక్రో ఆర్‌ఎన్‌ఏలు కణవ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో తెలుసుకునేందుకు సంఘమిత్ర కంప్యూటర్ అల్గారిథమ్, సాఫ్ట్‌వేర్‌ల సాయంతో విశ్లేషించారు. ఈ పరిశోధనలకుగాను 2010లో సంఘమిత్రకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు దక్కింది. కంప్యూటర్ సైన్స్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తూనే సంఘమిత్ర నేచురల్ కంప్యూటింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితర అంశాల్లో దాదాపు అయిదు పుస్తకాలు రచించారు.

‘‘దేంతోనైనా రాజీపడమని మన మహిళలకు చెప్పేవారు. పరిశోధనల్లో రాజీపడితే అంతే సంగతులు. పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది.’’


పేరు :డాక్టర్ మిథాలీ ముఖర్జీ.
సంస్థ :ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, న్యూఢిల్లీ.
ఘనత :ఆయుర్వేదాన్ని...మానవ జి నోమిక్స్‌తో అనుసంధానించే పరిశోధనలు
గుర్తింపు :శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు,2010

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో భారతీయులు ఎక్కువ.. భారతీయులకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలూ ఎక్కువే! ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలు చెబుతున్న నిష్ఠూర సత్యాలివి. మరి... దీనికి కారణం? మన ఆహారపు అలవాట్లా? లేక మన జన్యుక్రమమే ఇంతా? ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలివి. న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో డాక్టర్ మిథాలీ ముఖర్జీ చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు...భవిష్యత్తులో అనేక ప్రాణాంతక వ్యాధులకు చికిత్సలను కనుక్కోవచ్చు. లేదా అటువంటి వ్యాధులు రాకుండా చర్యలూ తీసుకోవచ్చు.

ఈ ప్రయత్నంలో భాగంగా డాక్టర్ మిథాలీ ముఖర్జీ భారతీయుల జన్యుక్రమాన్ని, ఇతరులతో పోలిస్తే ఉన్న తేడాలను గుర్తించేందుకు చేపట్టిన ప్రాజెక్టులో కీలక భూమిక పోషించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన దాదాపు రెండు వేల మంది జన్యుక్రమాన్ని విశ్లేషించారు. తరువాత భారత జనాభాలో స్థూలంగా నాలుగైదు రకాల జన్యుక్రమాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నాలుగైదు జన్యుక్రమాల మధ్య ఉన్న సంబంధాలను కూడా తాము విశ్లేషించామని, ప్రస్తుతం ఏ వర్గం వారికి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ మిథాలీ తెలిపారు. అంతేకాదు.. భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదాన్ని... ఆధునిక జినోమిక్స్‌తో అనుసంధానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్‌లో శాస్త్ర పరిశోధనలకు నిధుల కొరత ఎక్కువన్నది ఒకప్పటి మాట అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని డాక్టర్ మిథాలీ తెలిపారు.

3- పేరు :పియా సర్కార్
సంస్థ :టీచ్ ఎయిడ్స్
ఘనత :సామాజికంగా సున్నిత అంశాలపై అవగాహన పెంచేందుకు వినూత్న సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణ.
గుర్తింపు :ఎంఐటీ టీఆర్-35 విజేత - 2011

ఎక్కడో అమెరికాలోని కొలరాడోలో పుట్టి పెరిగిన పియా సర్కార్... తల్లిదండ్రుల మాతృదేశమైన భారత్‌కు వచ్చిపోతూండేది. చదివింది ఆర్థికశాస్త్రం. అందుకేనేమో... అమెరికా, భారత్‌లో తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోని సామాజిక, ఆర్థిక వైరుధ్యాలను సమాజంపై దాని ప్రభావాన్ని స్పష్టంగా గుర్తించగలిగింది. ఈ ఆలోచనల నుంచే భారత్‌లో ఎయిడ్స్, హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధుల గురించి, లైంగిక విద్యను అందించడం కష్టమా? అన్న ప్రశ్న ఉదయించింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించే సమయంలో చేపట్టిన ప్రాజెక్టు అప్పటివరకూ పియా సర్కార్ మెదడులో మెదులుతున్న ఆలోచనలకు ఒక తుదిరూపునిచ్చింది. ఎయిడ్స్/హెచ్‌ఐవీ వ్యాధులపై కొంత శిక్షణ పొందిన యువత కూడా సామాజిక కట్టుబాట్ల కారణంగా సున్నితమైన ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని గుర్తించిన పియా సర్కార్ ఈ సమస్యను అధిగమించేందుకు ‘టీచ్ ఎయిడ్స్’ పేరుతో ఓ వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

ఈ ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్... వ్యాధి ఎలా సోకుతుందన్న విషయం మొదలుకొని... వ్యాప్తి మార్గాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిత్రాలు, చిన్నచిన్న ప్రశ్నల సాయంతో అర్థమయ్యేలా చేసింది. స్థానికులు ఉపయోగించే యాసనే వాడటం, మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్దిష్ట అంశాలపై పాఠ్యాంశాలను ఏర్పాటు చేయడం, స్థానిక సెలబ్రిటీలతో సందేశాలు ఇప్పించడం కూడా కలిసొచ్చింది. భారత్‌లో సినీ నటులు అక్కినేని నాగార్జున, అనుష్కా షెట్టి, నవదీప్, స్వాతి, కన్నడ నటులు సుదీప్, శరణ్ షబానా ఆజ్మీ, శృతిహాసన్, జయంతి, బాలీవుడ్ దర్శకులు మహేశ్‌భట్ తదితరులు టీచ్‌ఎయిడ్స్ ప్రాజెక్టుకు తమవంతు సహకారం అందించారు. పియా సర్కార్ కృషి వృథా కాలేదు.. లైంగిక విద్యపై అభ్యంతరాలున్న రాష్ట్రాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫ్రికా దేశం బోట్స్‌వానాలోని ప్రతి పాఠశాలలో పియా సర్కార్ రూపొందించిన టీచ్‌ఎయిడ్స్ సాఫ్ట్‌వేర్ పంపిణీ చేశారు. ప్రపంచంలోని అన్నిదేశాలకూ ఈ సాఫ్ట్‌వేర్‌ను విస్తరించే దిశగా టీచ్‌ఎయిడ్స్ కృషి చేస్తోంది.

పేరు :అలీఫా మర్చెంట్.
సంస్థ :యూనివర్శిటీ ఆఫ్ మాంట్రియాల్, కెనడా
ఘనత :అయిదేళ్లలోపు పిల్లల్లో దృష్టి లోపాలను గుర్తించేందుకు వినూత్న పద్ధతి ఆవిష్కరణ
గుర్తింపు :ఎంఐటీ టీఆర్ -35, 2011 అవార్డు

ప్రపంచవ్యాప్తంగా దృష్టిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు కోటి తొంభై లక్షలు! వీరిలో కనీసం కోటీ 20 లక్షల మంది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. కనీసం 14 లక్షల మంది పూర్తిస్థాయిలో దృష్టి కోల్పోయారు. సరైన సమయంలో గుర్తించగలిగితే వీరి కళ్లల్లోని లోపాలను సరిచేయవచ్చు. భవిష్యత్తులో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడకుండా నివారించవచ్చు. అందమైన భవిష్యత్తుకు పునాదులు వేయవచ్చు. అయితే ఇందుకు ఖరీదైన పరికరాలు, వ్యవస్థల అవసరం ఉంటుంది. అయితే కెనడాలోని మాంట్రియాల్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యనభ్యసిస్తున్న అలీఫా మర్చెంట్ ఈ ఖరీదైన పరికరాల అవసరాన్ని పూర్తిగా తొలగించింది. కేవలం సాధారణ డిజిటల్ కెమెరాల సాయంతోనే అయిదేళ్లలోపు పిల్లల్లోని దృష్టిలోపాలను గుర్తించేందుకు వినూత్న పద్ధతిని ఆవిష్కరించింది. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా అలీఫా 2009 సెప్టెంబరు నుంచి 2010 జూన్ మధ్యకాలంలో నారాయణ నేత్రాలయ (బెంగళూరు) చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంది. పీడియాట్రిక్ ఐ సర్జన్ అశ్విన్ మల్లిపట్నతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించిన అలీఫా... పిల్లల్లోని సమస్యను గుర్తించి పరిష్కార మార్గాల కోసం ఆలోచన మొదలుపెట్టింది.

డిజిటల్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో కొన్నిసార్లు మనకు కళ్లల్లో ఎర్రటి చుక్కలు కనిపిస్తాయి కదా... వాటినే దృష్టిలోపాలను గుర్తించేందుకు సాధనంగా వాడుకుంది అలీఫా. కంటిపై కాంతి పడినప్పుడు అది నేరుగా వెనుకకు ప్రతిఫలిస్తుంది. అదే రెడ్ ఐ ఎఫెక్ట్‌గా మనకు కనిపిస్తుంది. కనుపాప పొరలన్నీ పారదర్శకంగా ఉన్నప్పుడు కన్ను ఒకలా, ఏదైనా తేడా ఉంటే మరోలా ఉంటుంది ఈ రెడ్ ఐ ఎఫెక్ట్. డెరైక్ట్ ఆప్తల్మోస్కోప్ వంటి ఖరీదైన పరికరాల ద్వారా ఈ లోపాలను గుర్తించవచ్చు. అలీఫా మాత్రం డెరైక్ట్ ఆప్తాల్మోస్కోప్ ద్వారా చేయగలిగిన పనిని డిజిటల్ కెమెరాతోనూ సాధించవచ్చునని గుర్తించింది. చీకటి గదిలో నాలుగు మీటర్ల దూరం నుంచి ఫొటోలు తీయడం, వాటిని విశ్లేషించడం మాత్రమే ఈ పద్ధతిలో చేయాల్సిన పనులు. కొద్దిపాటి శిక్షణతో ఎవరైనా ఈ పని చేయగలరని, తద్వారా పిల్లల్లో దృష్టిలోపాలను ముందుగానే గుర్తించి సరిచేయవచ్చునని అలీఫా అంటారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామీణ అసుపత్రుల ద్వారా ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అలీఫా ప్రయత్నాలు చేస్తున్నారు.

పేరు :డాక్టర్ శుభా తోలె.
సంస్థ :టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్,ముంబయి
ఘనత :మనిషి సృజనాత్మక శక్తికి కేంద్రమైన మెదడు ఎదుగుదల, నియంత్రణలపై పరిశోధనలు
గుర్తింపు :శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 2010

మనిషి ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడంటే... మరిన్ని సృష్టించగలడన్న నమ్మకం మనకుందంటే అందుకు మన మెదడే కారణం. ఇలాంటి అతిసున్నితమైన, సంక్లిష్టమైన మెదడు పనితీరుపై డాక్టర్ శుభా తోలె చేసిన రెండు పరిశోధనలు మన అవగాహనను మరింత పెంచడమే కాకుండా, స్క్రిజోఫ్రేనియా, ఆటిజమ్ వంటి మెదడు సంబంధిత రుగ్మతలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఉపకరించాయి. పిండ దశలో మెదడులో జ్ఞాపకాలను భద్రపరిచే హిప్పోకాంపస్ ప్రాంతాన్ని ఉత్తేజపరిచే, నియంత్రించే సంకేతాలను శుభా తోలె గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక సైన్స్ పత్రిక ‘సైన్స్’లో ప్రచురితమైంది. ఇదే పరిశోధన ఆధారంగా ఆటిజమ్, స్క్రిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతలు వచ్చేందుకు గల కారణాలను విశ్లేషించింది. నేచర్ న్యూరోసైన్స్ పత్రికలో ఈ పరిశోధన వ్యాసం ప్రచురితమైంది. ఈ రెండు పరిశోధనలను గుర్తించిన భారత ప్రభుత్వం డాక్టర్ శుభా తోలెకు 2010లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందజేసింది.

ముంబైలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ జేవియర్స్ కాలేజీలో జీవశాస్త్రంలో పట్టభద్రురాలైన డాక్టర్ శుభా తోలె ఆ తరువాత 11 ఏళ్లపాటు అమెరికాలోని కాల్‌టెక్, యూనివర్శిటీ ఆఫ్ షికాగోల్లో స్నాతకోత్తర విద్యనభ్యసించారు. ఆ తరువాత 1999లో భారత్ తిరిగి వచ్చారు. భారతీయ శాస్త్ర రంగానికి తనవంతు సాయం అందించాలన్న లక్ష్యంతో ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లోకి అడుగుపెట్టిన శుభా తోలె తొలినాళ్లలో చాలా కష్టాలే పడ్డారు. మౌలిక సదుపాయాల కొరత, విదేశాల నుంచి పరిశోధనలకు అవసరమైన పరికరాలు, పదార్థాలను దిగుమతి చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని శుభ అంటారు. అయినప్పటికీ బంధుమిత్రుల సహకారం, ప్రోత్సాహంతో పరిశోధనలు కొనసాగించానని, విజయం సాధించానని ‘సాక్షి ఫ్యామిలీ’తో మాట్లాడుతూ తెలిపారు. ఇంకో విషయం... శాస్త్ర రంగంలో వేగంగా అడుగులేస్తున్న డాక్టర్ శుభా తోలె మంచి కథక్ నృత్య కళాకారిణి కూడా. అంతేనా... డ్యాన్స్ కోరియాగ్రాఫర్ కూడా!

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

అవార్డుల గురించి...
టీఆర్ - 35: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏటా ఇచ్చే అవార్డులు ఇవి. ప్రపంచవ్యాప్తంగా బయో మెడిసిన్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, ఎనర్జీ, మెటీరియల్స్, వెబ్ రంగాల వారికి అందజేస్తారు. 1999లో మొదలైన ఈ అవార్డులు మొదట్లో ఏటా వంద మంది శాస్త్రవేత్తల పరిశోధనలను గుర్తించి సత్కరించేది. 2005 నుంచి ఈ సంఖ్యను 35కు తగ్గించారు. ఈ అవార్డు అందుకునే శాస్త్రవేత్తలందరూ 35 ఏళ్ల లోపు వారే కావడం మరో విశేషం. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ అవార్డులను భారత్‌తోపాటు, స్పెయిన్ ఇటలీల్లోనూ అందజేస్తున్నారు.

శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు: కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఐఎస్‌ఆర్) భారతీయ శాస్త్రవేత్తల కృషిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన అవార్డు ఇది. సీఐఎస్‌ఆర్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ పేరుతో ఇచ్చే ఈ అవార్డులను సీఐఎస్‌ఆర్ అవార్డు కమిటీ ఎంపిక చేస్తుంది. భారతీయ సంతతికి చెందిన వారైనా... కనీసం ఐదేళ్లపాటు భారత్‌లో పరిశోధనలు నిర్వహిస్తే ఈ అవార్డుకు ఎంపిక కావచ్చు. 45 ఏళ్ల లోపు వారికి ఇచ్చే ఈ అవార్డు కింద అయిదు లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. అంతేకాకుండా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ప్రతి నెల రూ.15 వేల గౌరవ వేతనం దక్కుతుంది.

శాస్త్ర రంగంలో మహిళల వెనుకబాటుకు కారణాలు...
ఉన్నత విద్యనభ్యసించే మహిళలు తక్కువగా ఉండటం.

సామాజిక వెనుకబాటుతనం.

కుటుంబ బాధ్యతల నిర్వహణ నెపంతో కొందరు ఉద్యోగాలకు దూరంగా ఉండటం.

మాతృత్వం సమయంలో వృత్తికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి.

ఉద్యోగ కల్పన, ప్రమోషన్లు, పరిశోధన వ్యాసాల ప్రచురణల్లో వివక్ష.

సమాన అర్హతలున్నా కొన్ని ప్రాంతాల్లో, దేశాల్లో వేతనాల్లోనూ వివక్ష చూపడం.

2 కామెంట్‌లు: