వేప... గుడి పూజారి చిట్కా వైద్యం మొదలుకొని ఆయుర్వేద నిపుణుల వరకు చాలా
రకాల చికిత్సలకు వేపపైనే ఆధారపడతారంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన వేదకాలం
నుంచి నేటి వరకు సమాజసేవకు ఉపకరిస్తున్న ఈ మహత్తర వృక్షం మీద నేటి ఆధునిక
వైద్య శాస్త్రజ్ఞులు అపారమైన పరిశోధన చేస్తున్నారు. అమోఘమైన ఫలితాలను
చూస్తున్నారు. ఇంతటి విశిష్టత గల చెట్టు కాబట్టే భారతీయ సంప్రదాయంలో దీనికి
దైవత్వం ఆపాదించి పూజలు కూడా చేస్తుంటారు. ఉగాది సందర్భంగా వేప
గొప్పదనాన్ని, దాని ఔషధ గుణాలను తెలుసుకుందాం. ప్రతి మనిషికీ అందుబాటులో
ఉండే ఈ వేపచెట్టు గురించి ఆయుర్వేద శాస్త్రకారులు చెప్పిన వివరాలు
పరికిద్దాం.
వేపని
సంస్కృతంలో ‘నింబ’ అంటారు. పిచుమర్ద, తిక్తక, అరిష్టం, హింగునిరాస్య
లాంటివి వేపకు మరికొన్ని పర్యాయపదాలు. ఈ వృక్షం అనేక శాఖలతో 20 నుంచి 40
అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని లేత ఆకులు (పల్లవాలు), ముదురాకులు, కాయలు,
పండ్లు, విత్తులు, పువ్వు, బెరడు, బంక, వేళ్లు (మూలాలు)... అన్నింటికీ
ఔషధగుణాలు ఉంటాయి. శిశిర రుతువులో ఇది ఆకులు రాలుస్తుంది. వసంత రుతువులో
(ఇంచుమించుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో) ఇది చిగురిస్తుంది. దీని
లేతపల్లవాలు రాగివర్ణంలో కనిపిస్తాయి. చెట్టు పూత పూస్తుంది. తెల్లటి
రంగుతో చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. గ్రీష్మరుతువు
చివరన లేదా వర్షరుతువులో పువ్వుల నుంచి పెరిగిన కాయలు పండ్లుగా మారతాయి.
ఇవి పసుపుపచ్చరంగులో ఉంటాయి. బాగా పండిన పండ్లు తప్ప మిగతా అన్ని భాగాలూ
చేదుగానూ, వగరుగానూ ఉంటాయి. అంటే తిక్కషాయ రసాలన్న మాట.
వేప గుణాలు:
త్రిదోషాలకు
సంబంధించి కఫాన్ని, పిత్తాన్ని శమింపజేస్తుంది. వాతాన్ని వృద్ధి
చేస్తుంది. శరీరానికి చలవ చేసి తేలిక పరుస్తుంది. శరీర ద్రవాంశాలను బయటకు
పోకుండా పదిలపరుస్తుంది.
(నింబ శీతో లఘుర్గ్రాహీ... వాతకృత్).
పళ్లుతోము పుల్లగా ప్రాముఖ్యత:
సరిమైన
మందంలో ఉన్న పుల్లల్ని, ఆకులు తుంచేసి, చివరి భాగాన్ని కుంచెకట్టేట్టు
మెత్తగా నమిలి పళ్లు తోముకునే సంప్రదాయం అనాదిగా వస్తోంది. నోటిలోని
దుష్టక్రిముల్ని హరించి, దుర్గంధం పోగొట్టి, దంతశుద్ధి చేస్తుంది. ఆ విధంగా
ముఖప్రక్షాళనానికి ఇది పెట్టింది పేరు. కనుకనే ఇవ్వాళ కూడా వేప నుంచి
తయారు చేసిన టూత్‌పేస్టులు, చర్మసౌందర్య క్రీములు ఎంతో ప్రాచుర్యం
సంతరించుకున్నాయి. వ్యాపారస్తులకు వరంగా మారాయి.
వేప కషాయం:
ప్రధానంగా
ఆకుల్ని, బెరడును దంచి కషాయం తయారుచేస్తారు. ఈ కషాయాన్ని 30 మిల్లీలీటర్ల
(సుమారు ఆరు చెంచాల) పరగడపున తాగితే ఎన్నో రకాల చర్మవ్యాధులు నయమవుతాయి.
(దురదలు, ఎగ్జిమా, సోరియాసిస్, గజ్జి, తామర మొదలైనవి).
ఎన్నో రకాల జ్వరాలు (వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగేవి, మలేరియా వంటివి) తగ్గుతాయి.
లేత ఆకులు (పల్లవాలు) దగ్గుని, ఉబ్బసాన్ని (కాస, శ్వాస) నియంత్రిస్తాయి.
మూల వ్యాధి (అర్మో రోగ- పైల్స్)ని తగ్గిస్తాయి.
మధుమేహాన్ని, ఇతర మూత్రవ్యాధుల్ని అదుపు చేస్తాయి.
{వణశోధనలకు
(అల్సర్స్ ఇన్‌ఫెక్ట్ కాకుండా మానడానికి), గాయాలు, చర్మవ్యాధులు త్వరగా
తగ్గడానికి కషాయంతో గాయమైన ప్రాంతంలో (లోకల్‌గా) కడగవచ్చు.
కషాయం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు కూడా తగ్గుతాయి.
విషహరంగా కూడా పనిచేస్తుంది. దప్పికను, శరీరంలోని మంటను (తృష్ణ, దాహం) తగ్గిస్తుంది.
అలసటను తగ్గిస్తుంది.
విరేచనాలను (అతిసారవ్యాధిని) అరికడుతుంది.
వేపచూర్ణం:
ఆకుల్ని,
బెరడును ఎండబెట్టి, దంచి పొడి చేస్తారు. 3 నుంచి 5 గ్రాముల మోతాదులో ఈ
చూర్ణాన్ని నీళ్లతో గాని, తేనెతోగాని కడుపులోకి సేవిస్తే, కషాయ సేవన వల్ల
లభించే ప్రయోజనాలన్నీ సమకూరుతాయి. ఈ చూర్ణాన్ని జల్లిన ప్రదేశంలో
క్రిమికీటకాదులు నశిస్తాయి. కాబట్టి వ్యవసాయదారులు కొంతమంది దీన్ని
వాడుతుంటారు.
వేప తెలకపిండి:
ఇది
నూనెను తీసిన తర్వాత మిగిలే పిండి. దీన్ని పొడిగా గాని, ముద్దగా గాని చేసి
వ్యవసాయ దారులు, పంటపొలాల్లో వాడుతారు. క్రిమి కిటకాదులను సంహరించడం
ద్వారా ప్రయోజనం సమకూరుతుంది.
ధూపం:
ఎండిన
వేప ఆకులు, ఈనెలు, బెరడు, వేళ్లు... వీటికి కొంత నెయ్యి కలిపి మంటపెడితే
దట్టమైన పొగ వస్తుంది. ఈ విధంగా పొగతెప్పించడాన్ని ధూపన కర్మ అంటారు. ఇది
దోమలు, ఇతర క్రిమికీటకాదులను నాశనం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని
తగ్గిస్తుంది. ఈ ధూపాన్ని ఇళ్లల్లో కూడా వేసే సంప్రదాయం ఇప్పటికీ
నడుస్తోంది. చికెన్‌పాక్స్, మీజిల్స్ (లఘుమసూరిక, రోమంతిక) సోకిన ఇళ్లల్లో
వేపకొమ్మల తోరణాల్ని కట్టడం మనం చూస్తుంటాం. దీనివల్ల సోకే గాలి కూడా ఆ
వ్యాధులను తగ్గిస్తుంది. ఆ వైరస్‌లు బయటికి వ్యాపించి వేరొకరికి
సంక్రమించకుండా నివారణ జరుగుతుంది.
వేపబంక:
ఇది బెరడు నుంచి వచ్చే నిర్యాసం. దీన్ని పలుచని ముద్దగా చేసి బయట పూస్తే చర్మరోగాలు తగ్గడానికి, గాయాలు మానడానికి ఉపకరిస్తుంది.
చరక, సుశ్రుత, వాగ్భట సంహితల్లో, భావప్రకాశ, బసవ రాజీయం వంటి గ్రంథాల్లో, చాలా ఇరత పుస్తకాల్లో ‘వేప’ ఔషధగుణాలు ఇలా వివరించారు.
జ్వరాలకు కషాయం
అంతర్గత రక్తస్రావాలు: వేపతో పాటు పటోల (చేదుపొట్ల), వట (మర్రి) ద్రవ్యాలు కలిపి కషాయం తయారు చేసుకోవాలి.
రక్తం కారే అర్మరోగం: (పైల్స్ : వేప పిండి ముద్దను ముల్లంగితో ఉడికించి నీడలో ఆరబెట్టి మాత్రలు చేసుకుని వాడాలి.
గాయాలు మానడానికి: వేపాకులు, ఉమ్మెత్త ఆకులు కలిపి, రసం తీసి తేనెతో కడుపులోకి సేవించాలి.
వాపులకు (శోధ): ఆముదం, కొడిశపాల, క్రానుగ, వేప ఆకుల కషాయం చేసి తొట్టెస్నానానికి వాడాలి.
దద్దుర్ము (శీతపిత్త): ఉసిరికాయ, వేపాకుల రసాన్ని, నెయ్యితో కలిపి రెండుమూడు వారాలు సేవించాలి.
కీళ్లనొప్పులకు, వాపులకు: పరగడుపున రోజూ 80 గ్రాముల నింబకల్కం మేపముద్దను సేవించాలి (తేనెతో)
సకల చర్మరోగాలకు:
వేపతో చేదుపొట్ల (పటోల) కలిపి కషాయం చేసుకొని వాడాలి. (తాగడానికి,
స్థానికంగా కడగడానికి). కరక్కాయ, ఉసిరికాయలను కూడా వేపతో కలిసి సేవించాలి.
కడుపులో మంట, నొప్పి (అమ్లపిత్త, ఉదరశూల): వేపతో బాటు వృద్ధదారక ద్రవ్యాన్ని కలిపి శర్కరతో, చల్లటినీటితో సేవించాలి.
దప్పిక, మంట, మానసిక అశాంతి: రేగుపళ్ల గుజ్జు, వేప పళ్ల గుజ్జు కలిసి తల మీద పట్టువేయాలి.
తలనెరవడం (అకాలపాలిత్యం):
ఒక నెలరోజుల పాటు వేపనూనెను (రెండు చుక్కలు) ముక్కు రంధ్రాల్లో వేసుకుంటూ,
ఆహారంలో కేవలం పాలు, దానికి సంబంధించిన ఆహారంపైనే ఉండాలి. (ఇది
వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి).
తెల్లబట్ట (శ్వేతప్రదర): ఇది స్త్రీలకు సంబంధించిన వ్యాధి. నింబ, గడూచి (వేప, తిప్పతీగె) రసాన్ని కొంచెం సుర (పులిసిన ద్రాక్షరసం) కలిపి సేవించాలి.
విషాలకు: వేపవిత్తుల చూర్ణాన్ని (2 గ్రాములు) వేడినీటితో తాగాలి.
పచ్చకామెర్లు (కామల-జాండిస్): వేపకషాయంతో త్రిఫలా కషాయం కలిపి (5 చెంచాలు), రెండు పూటలా, పరగడుపున, 10 రోజులు తాగాలి. కేవలం పెరుగన్నం, బార్లీ నీళ్లు సేవించాలి.
పంటి జబ్బులకు: వేప వేరు ఈమద పట్ట (మూలత్వక్)తో చేసిన కషాయంతో రెండు పూటలా పుక్కిలిపట్టి, నోటిని శుభ్రం చేసుకోవాలి.
కొన్ని యోనికి సబంధించిన వ్యాధుల్లో కూడా వేపను ఉపయోగిస్తారు.
వ్యాధి
స్వభావాన్ని బట్టి ఈ వేప చెట్టు ఔషధాన్ని ఏ రూపంలో, ఎంత మోతాదులో, ఎంతకాలం
వాడాలి, పథ్యాపథ్యాలు, ఇతర ఓషధులను ఎలా కలపాలన్న అంశాలు కేవలం ఆయుర్వేద
నిపుణులు మాత్రమే నిర్ధారణ చేయాలి. కాబట్టి చూడటానికి సునాయాసంగా
కనిపించినా, సొంతవైద్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు.
క్యాన్సర్లలో కూడా మంచి ప్రభావం:
ప్రస్తుతం
కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులలో కూడా నింబ తైల ప్రభావంపై పరిశోధనలు
జరుగుతున్నాయి. అశాస్త్రీయ మోతాదుల్లో చాలా దుష్ఫలితాలు ఉన్నాయి
శాస్త్రజ్ఞుల పరిశీలనలో తేలింది కాబట్టి వైప ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలలో
చాలా జాగ్రత్త అవసరం.
వేపనూనె
దీన్ని
వేపవిత్తులనుంచి తయారు చేస్తారు. ఇది ఎర్రని రంగులో తీక్షణమైన వాసన కలిగి
ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది. ఈ నూనెను వంటల్లోకి వాడరు. కేవలం ఔషధంగా
మాత్రమే ఉపయోగిస్తారు. తక్కువ మోతాదులో (3 నుంచి 10 చుక్కలు) కడుపులోకి
తీసుకోవచ్చు. స్థానికంగా పైపూతకు చాలా రకాల చర్మవ్యాధుల్లోనూ వాడతారు.
చర్మంపై కలిగే నల్లని మచ్చలు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దీనికి
పురుష వీర్యకణాలను తాత్కాలికంగా నాశనం చేసే గుణం ఉంటుంది. కాబట్టి
సంభోగానికి ముందుగా మహిళల జనేంద్రియం లోపల 10-15 చుక్కల తైలాన్ని ఉంచితే
గర్భం కలగదన్నది ఒక పరిశీలన. దీని ఖచ్చితమైన ఫలితాల కోసం ఇంకా వైద్యపరమైన
పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రభావం ఆశాజనకంగానే ఉన్నాయి.
అదేవిధంగా ఈ నూనె గర్భాశయం లోపల కూడా ప్రభావం చూపి, గర్భం నిలవకుండా
చేస్తుందని కూడా గమనించారు. అయితే ఈ విషయంపై కూడా ఇంకా ఖచ్చితమైన ఫలితాల
కోసం పరిశోధనలు జరగుతున్నాయి. అందువల్ల గర్భిణులు, సంతాన ప్రయత్నం
చేస్తున్నవారు ఈ నూనెనే కాకుండా వేపకు సంబంధించిన ఏ ఔషధాన్ని కూడా బాహ్య,
ఆభ్యంతర సేవన చేయకపోవడం మంచిది. శిశువులపై వాడాలన్నా చాలా జాగ్రత్త
వహించాల్సి ఉంటుంది. అయితే గర్భవిచ్ఛితి కోసం దీన్ని ఉపయోగించాలను కోవడం
సరికాదు. నిపుణుల సలహా మేరకే వేపనూనె వాడాలి.
వేపపువ్వు ప్రాశస్త్యం
వసంత
రుతువులో చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ వస్తుంది. ఇది కఫ ప్రకోప
కాలం. వేపపువ్వు కఫహరంగా పనిచేస్తుంది. జఠరాగ్ని వర్ధకంగా ఉండి ఆకలిని
పుట్టిస్తుంది. కడుపులోని మంటను తగ్గిస్తుంది. (అమ్లపిత్తహరం). పొట్టలోని
హానికర క్రిములను సంహరిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
కంటిచూపునకు పదును పెట్టి కళ్లను తేజోవంతంగా ఉంచుతుంది. కనుకనే
ఉగాదిపచ్చడిలో ఇది ప్రధాన ద్రవ్యంగా చోటుచేసుకుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి