
ఏ వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా ఎవరైనా కోరుకునేది ఏమిటి? అనుభవించేది ఏమిటి? అని ఎవరికి వారు తమను తాము ఆత్మవిమర్శ చేసుకుంటే ఏమీ లేదనే సమాధానమే గంటాపథంగా వినపిస్తుంది. అలా లేదనే సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎంత సంపన్నుడైనా అతడు వాస్తవిక సంపన్నుడు అయినట్లేనా అనే ప్రశ్న కచ్ఛితంగా ఉద్భవిస్తుంది. సుసంపన్నమా లేదా దుర్భర దారిద్య్రమా అనేది ఎలా వర్గీకరించాల్సి ఉన్నదంటే... ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సుఖ సంతోషాలను అనుభవించే దక్షత లేక ఏ సమయంలో ఐటీ దాడులు జరుగుతాయో, ఎక్కడి నుండి దొంగలు ఊడిపడతారో, ఇంతకాలం అహర్నిశలూ కష్టపడి సంపాదించినదంతా ఏమవుతుందో, ఇప్పటి వరకు నేను సంపాదించిన క్రెడిట్ అంతా పోటీదార్లు గద్దలా తన్నుకుపోతారేమో అనే సందేహాలతో అనునిత్యం మానసిక ప్రశాంతత లేని జీవితాన్ని అనుభవించేవాడు నిస్సందేహంగా దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నట్లే అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.
ఈ సమాజపు రేసులో వేగంగా పరుగులు తీస్తున్న అధిక సంపన్నుడు అప్పటి వరకు అహర్నిశలూ శ్రమించి కూడబెట్టిన ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ అవి చాలవనే అత్యాశతో మరో కొన్ని వేల కోట్ల సంపాదన కోసం తల్లడిల్లుతాడు. అందుకోసం అనేక అవినీతి చర్యలకు పాల్పడతాడు. అప్పులు చేస్తాడు. చేసిన అప్పుల్ని అప్పులుగా భావించకుండా ఆస్తులుగా భావిస్తూ తానే అధిక సంపన్నుడినని అనుకుంటూ వేలాది కోట్ల రూపాయల్ని తన ఆడిట్ నివేదికల్లో ప్రకటిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు అధిక సంపన్నులని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది ఎలా అంటే అప్పటి వరకు తనకు ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ అవన్నీ తన చేజారిన క్రమంలోనే వ్యాపారాభివృద్ధికైనా అప్పులు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ తాను అధిక సంపన్నుడనే భ్రమలో జీవితాన్ని గడుపుతుంటాడు. అదే ఆడంబరాన్ని, భోగ లాలసత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. అలా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలను కూడబెట్టినప్పటికీ ఏనాటికైనా ప్రశాంతత పొందగలుగుతాడా అంటే అదీ లేదు. చివరికి పరిస్థితి ప్రతికూలించి తనకు ఉన్న అప్పులను తీర్చే క్రమంలో ఉన్న ఆస్తులు జప్తు అయినప్పుడు తన యొక్క నిజ స్థితిని గ్రహించి వాపోతాడు.
ఎవరు ఏ విధమైన వృత్తిని స్వీకరించినా సంపాదించిన దానితో తాను, తన కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలనే కోరుకుం టారు. అలా కోరుకునే సామాన్యమైన వారు కానీ అధిక సంపన్నులుగా ఎవరికి వారు భావించే వారు ఎవరైనప్పటికీ కోరుకునేది తన భార్యా బిడ్డలతో ప్రశాంతమైన జీవితం, నిద్రావస్త కలిగినపుడు ప్రశాంతమైన నిద్ర, సహజసిద్ధమైన ఆకలికి తినేది గుప్పెడు మెతుకులు అంతకు మించి ఏముం టుం ది. అలాంటి ప్రశాంత మైన జీవితాన్ని అనుభవించాలంటే ఏ మని షికైనా ఆత్మ సంతృప్తి అవసరం. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న స్థితిగతుల దృష్ట్యా అది సాధ్యమేనా అని సందేహానికి అనేక మంది లోనవుతుంటారు. కానీ అది తప్పక సాధ్యమే. వ్యాపారాభివృద్ధి కొరకు అహర్నిశలూ కృషి చేయడం సమంజసమే కానీ వ్యాపారాభివృద్ధి కోసమే అప్పులు చేయడం, అప్పులతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం, అలా అభివృద్ధి చెందిన వ్యాపారం స్థిరత్వం పొందేందుకు మరింత మనో వ్యాకులత చెందడం అనేవి సుసంపన్నుడైన వ్యాపారికి సైతం దారిద్య్రాన్నే తెచ్చిపెడతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి