16, మార్చి 2012, శుక్రవారం

బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా!?





God Shiva
శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. 

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. 

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.

1 కామెంట్‌:

  1. బిల్వ వృక్ష వృత్తాంతం గురించి చదివి తెలుసుకున్నాను. సారాంశాన్ని తెలియ చెప్పినందుకు మీకు నా కృతజ్నతలు. శివరామకృష్ణ ఎన్.వి.

    రిప్లయితొలగించండి