2, మార్చి 2012, శుక్రవారం

విలువలకు ఐకన్ ఆమ్లా!


ఆదర్శం
జనాలు క్రికెట్ చుట్టూ తిరుగుతుంటే, క్రికెట్ డబ్బు చుట్టూ తిరుగుతుంది! ఇది ప్రస్తుతం క్రికెట్ మార్కెట్. ఇప్పుడది వ్యాపారంతో అంటకాగుతోంది. క్రికెటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇందులో తడవని ఒకే ఒక క్రీడాకారుడు దక్షిణాఫ్రికా జట్టు సభ్యుడు ‘హషీం ఆమ్లా. సహచరులందరూ కళ్ల ముందే కోట్ల రూపాయల పారితోషికాలు అందుకొంటున్నా డబ్బును తృణప్రాయంగా భావిస్తూ విలువలు, విశ్వాసాలకు కట్టుబడ్డారాయన.

ప్రస్తుతం క్రికెట్ కు సంబంధించి ఏం జరిగినా ప్రత్యక్షంగా, పరోక్షంగా అది కోట్ల రూపాయల వ్యవహారాలతో ముడిపడి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి క్రికెట్ పునాదిపై ఎదిగిన వ్యక్తి అంటే అతనికి ఉండే గ్లామర్, క్రేజ్ వీటికి మంచి డబ్బు... వ్యాపార ఒప్పందాలు, బహుళ జాతి సంస్థల వ్యాపార ప్రకటనలు, మ్యాచ్ ఫీజులు, వివిధ లీగుల రూపంలో వ్యక్తిగతంగాను, టీమ్‌తో కలిసి కోట్ల రూపాయల కొద్దీ డబ్బు సంపాదించగలడు.

ఇక ఐపీఎల్ వంటి లీగులు అందుబాటులోకి వచ్చాక, అంతవరకూ ఊరూ పేరూ తెలీని క్రికెటర్‌లు ఓవర్‌నైట్‌లోనే స్టార్లయిపోతున్న సంఘటనలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ క్రికెటర్ జర్సీ చూసినా క్యాప్ నుంచి షూ వరకూ ప్రతిదీ ఒక్కో సంస్థ స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. అతడి స్థాయిని బట్టి సొమ్ము చెల్లిస్తుంటుంది. తమ ప్రచారం కోసం వ్యాపార సంస్థలు పెడుతున్న ఆ ఖర్చు క్రికెటర్‌లకు ఆదాయ వనరు... అది వ్యాపార సంస్థలకు అవసరం, క్రికెటర్లకు వరం. ప్రతి క్రికెట్ టీమ్‌కూ అఫీషియల్‌గా స్పాన్సర్ చేసే సంస్థ ఒకటుంటుంది.

అలా దక్షిణాఫ్రికా టీమ్‌కు బీర్ కంపెనీ ‘క్యాస్టల్’ స్పాన్సర్. ఈ సంస్థ తమ ప్రచారం కోసం దక్షిణాఫ్రికా బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తోంది. బోర్డు ద్వారా ఆ డబ్బు మ్యాచ్ ఫీజు కింద క్రికెటర్లకు చేరుతుంది. దానికి ప్రతిగా ఒప్పందం ప్రకారం మ్యాచ్ ఆడేటప్పుడు క్రికెటర్లు క్యాస్టల్ లోగో ఉన్న దుస్తులనే ధరించాలి. ఆ షరతును మన్నించని క్రికెటర్లకు బోర్డు ఒక్క రూపాయి కూడా చెల్లించదు! హషీమ్ ఆమ్లా మ్యాచ్ ఆడుతున్నప్పుడెప్పుడైనా మీరు టీవీ చూడండి.. అతడి షర్ట్‌పై ‘కాస్టల్’ లోగో ఉండదు! ఎందుకో తెలుసా... ‘లిక్కర్‌ను ప్రమోట్ చేయడం ఇస్లామ్ బోధనకు విరుద్ధం.

అందుకే బోర్డు అనుమతితో లోగో లేని జర్సీ ధరించి బరిలోకి దిగుతాను’ అంటారు ఆమ్లా. ప్రపంచం మొత్తం మీద ఇలా షర్ట్ మీద జట్టు స్పాన్సర్ లోగో లేకుండా మైదానంలోకి దిగే ఏకైక క్రికెటర్ ఆమ్లానే. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఇందుకు ప్రతిగా అతడు నష్టపోతోంది ఏమిటో తెలుసా? దేశం తరఫున ఎన్ని మ్యాచులు ఆడినా బోర్డు అతనికి ఒక్క రూపాయి కూడా మ్యాచ్ ఫీజు చెల్లించదు. అయినా ఆమ్లా ఏ మాత్రం వెనకాడకుండా నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. పరోక్షంగానైనా మద్యపానాన్ని ప్రోత్సహించడం లేదు.

ఆమ్లా పూర్వీకులు భారతీయులే. గుజరాత్‌లోని సూరత్ నుంచి వీరి కుటుంబం కొన్ని తరాల ముందు ఆఫ్రికా వలస వెళ్లింది. భారత్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా ఆమ్లా దూరంగా ఉంటున్నాడు. అతడు 20-20లు ఆడటానికి ముందుకొస్తే ఏ ప్రాంచైజీనైనా కోట్ల రూపాయలు చెల్లించి మరీ కొనుక్కొంటుంది. కానీ అన్ని ఐపీఎల్ టీమ్‌లూ మద్యం కంపెనీల స్పాన్సర్‌షిప్‌తోనే నడుస్తున్నాయి. అందుకే గ్లామర్‌ను, డబ్బును తెచ్చిపెట్టే ఐపీఎల్‌కు కూడా ఆమ్లా దూరంగా ఉంటున్నాడు. పైగా అంతకుమునుపు కంటే ఎక్కువ సొమ్ము వస్తున్నా అతడు విలువలకు వదులుకోలేదు.

అధికారికంగా ముస్లిం నేషన్స్‌గా ప్రకటించుకొన్న దేశాలు కూడా తమ క్రికెట్ టీమ్‌ల విషయానికి వచ్చేసరికి కాసులకు కక్కుర్తి పడుతూ అన్ని విషయాలూ మరచిపోతున్నాయి. కానీ ఆమ్లా ఎవరి ప్రోత్సాహం లేకున్నా విలువలకు కట్టుబడి ఉంటూ నిజమైన మతారాధకుడిగా, దుర లవాటును ప్రోత్సహించని వ్యక్తిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గొప్ప వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలిచే ఆమ్లా లాంటి క్రికెటర్ మాత్రం నా భూతో న భవిష్యతి ! అంటే ఏకీభవించకుండా ఉండగలమా?!

బి.జీవన్‌రెడ్డి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి