11, మార్చి 2012, ఆదివారం

ఈ సైట్ మీకు తెలుసా? --- హెల్త్ అండ్ కిడ్స్


  • -వెంకట్ హేమాద్రిబొట్ల
కొన్నేళ్ల క్రింద తల్లి తండ్రి, బామ్మ, తాతయ్య, అన్నదమ్ములు, పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసి జీవించేవారు. కుటుంబంలోని పనులను అందరూ పంచుకుని సమర్థవంతంగా నిర్వహించేవారు. పిల్లల ఆరోగ్యం, పెంపకం, క్రమశిక్షణ, చదువులు, అలవాట్లు మొదలైన సమస్యలెప్పుడు వచ్చినా పెద్దవాళ్లు చూసుకునేవారు. వాళ్ల దగ్గర ప్రతీ సమస్యకు సమాధానం ఉండేది. కాని ఈనాడు ఉమ్మడి కుటుంబం అన్నది కనపడటం లేదు. ఎవరికి వారు వేర్వేరుగా, వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాంటప్పుడు పిల్లలకు సంబంధించిన ఎటువంటి విషయమైనా తెలుసుకోవడం, పరిష్కరించుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట కంప్యూటర్, నెట్ ఉండటం వల్ల ఈ కొరత కొంత తీరింది అనుకోవచ్చు. ఇంట్లో పెద్దల సాటి రాకున్నా అత్యవసర సమయంలో తగిన సమాచారం దొరుకుతుంది. పిల్లలు, వారి సంరక్షణ, ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం అందించే ఒక వెబ్‌సైట్.
http://kidshealth.org/parent/
ఈ సైట్‌లో ఫిల్లల ఆరోగ్యం గురించి పలు అంశాలను వేర్వేరుగా.. వివరంగా చర్చించారు. మొదట జనరల్ హెల్త్ విభాగంలో పిల్లల శరీరం, ఎదుగుదల గురించి ప్రాథమిక సమాచారం, ఆహారం, నిద్ర, అలవాట్లు, వారికి పళ్లు రావడం ఎప్పుడు మొదలవుతుంది, అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అంశాలు ఉన్నాయి. ఇక పిల్లల్లో సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు లాంటి మామూలు నలత వల్ల వంట్లో బాలేకపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తరువాతి సెక్షన్లో చెప్పారు. ఇంకా అప్పుడప్పుడు వచ్చే ఇన్‌ఫెక్షన్లు కూడా పిల్లలను, పెద్దలను కంగారు పెడుతుంటాయి. అప్పుడు చేయించవలసిన పరీక్షలేమిటి మొదలైన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక పిల్లలన్నప్పుడు అల్లరి చేయకుండా ఉంటారా? వారు చేస్తున్నది మామూలు అల్లరేనా, లేక మీరు ఆ విషయంలో ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందా? పిల్లలు పెంకిగా తయారవుతున్నారా, వారికి ఎలా నచ్చజెప్పాలి వంటి విషయాలు తరువాతి సెక్షన్‌లో చర్చించారు. పిల్లలు సహజంగా అల్లరి చేస్తారు. చేయాలి కూడా. అందుకు విపరీతంగా, ఎక్కువ అల్లరి చేయడం, ఎవరి మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం వంటివి సీరియస్‌గా తీసుకోవాలి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, వాళ్లతో ఎలా ఉండాలి అనే విషయాలు ఇందులో చెప్పారు.
పిల్లల ఎదుగుదల, ఆ ఎదుగుదలలోని దశలు, వీటిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం, వారికి తగిన సూచనలు ఇవ్వడం, వారికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడం వంటి ఎన్నో ఉపయోగకరమైన సమాచారం అందిస్తుంది తరువాతి సెక్షన్.
పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం, ఆటలు ఎక్సర్‌సైజ్‌తో శరీరం ఫిట్‌గా ఉంచుకోవడం, బరువు ఎక్కువ/ తక్కువ ఉన్నారా గమనిస్తూ అప్పుడు చేయవలసిన దేమిటి వంటి విషయాలు తరువాతి అంశం. పెరిగే వయసులో పిల్లలు తగిన వ్యాయామం చేయడం, ఆటలతో యాక్టివ్‌గా ఉండడం, అలాగే వారికి మంచి ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యమైన విషయం కదా. అందుకు కావలసిన సమాచారం అంతా ఈ వర్గం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక పిల్లలతో ఎలా మెలగడం, వారితోపాటు ఒక పాజిటివ్ పేరెంట్‌గా వారికి ఒక ఫ్రెండ్‌గా ఉంటూ వారికి అన్నీ విషయాలు ఎలా చెప్పొచ్చు అని తరువాతి అంశాలుగా పేరెంట్స్‌కి ఉపయోగపడే విధంగా చెప్పుకొచ్చారు. పేరెంట్స్‌కి సాధారణంగా వచ్చే డౌట్స్ తీర్చడానికి, ‘మీ ప్రశ్నలు - వాటికి సమాధానాలు’ అనే సెక్షన్ కూడా ఉంది.                        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి