17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సహచరుడు (కధ) -మల్లాది వెంకట కృష్ణమూర్తి



బస్‌స్టేషన్ వెయిటింగ్ రూంలోని టెలిఫోన్ బూత్‌లలో ఓ దాంట్లో జెఫ్ క్రేన్‌స్టన్ మోకాళ్ల మీద కూర్చుని, దానికి ఉన్న మట్టి పట్టిన అద్దంలోంచి బయటికి భయంగా చూస్తున్నాడు. కిరాయి హంతకుడు తనని హతమారుస్తాడనే భయం జెఫ్ క్రేన్‌స్టన్‌లో లేదు. ఇప్పుడు విల్లీ ది ఫింగర్‌ని చూశాక తొలిసారిగా అది కలిగింది.
విల్లీని తను చూసేలోగా అతను తనని చూసి ఉండకపోతే తను బతికిపోయినట్లే. వెయిటింగ్ రూంలో కూర్చుని బస్ కోసం వేచి ఉన్నవాళ్లని చూస్తున్న విల్లీ తన కంట పడగానే క్రేన్‌స్టన్ తక్షణం లేచి టెలిఫోన్ బూత్‌లోకి వచ్చి దాక్కున్నాడు. అదృష్టం! లేదా విల్లీ అక్కడికక్కడే తనని కాల్చేసినా ఆశ్చర్యం లేదు. నిజంగా ఆ పని మీదే వస్తే మాత్రం విల్లీ తనని ఒకటి, రెండు రోజుల్లో చంపుతాడు. అసలు తను ఈ ఊళ్లో ఉన్నట్లు ఎలా గ్రహించాడు? విల్లీ అక్కడ ఉన్న ఆరు బెంచీల్లో కూర్చున్న వారిని పరిశీలించి చూడటం క్రేన్‌స్టన్ గమనించాడు.
నిక్ ఫోలే ఎవర్ని చంపాలన్నా విల్లీని నియమిస్తాడని క్రేన్‌స్టన్‌కి తెలుసు. విల్లీ తనకి అప్పజెప్పిన పనిని చేసి తీరతాడని కూడా క్రేన్‌స్టన్‌కి తెలుసు. తనేం తప్పు చేయకుండానే తను ఇలా వేటాడబడటం అతనికి బాధగా ఉంది.
నిక్ ఫోలే చేసే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి క్రేన్‌స్టన్ కొంత మొత్తానికి ధన సహాయాన్ని అందిస్తాడు. నెల క్రితం క్రేన్‌స్టన్‌ని పిలిచి దాదాపు పాతిక కిలోల బరువుగల ఓ పెద్ద సూట్‌కేస్‌ని ఇచ్చి దాన్ని మిడ్ వెస్ట్‌లో ఓ ఊళ్లోని ఒకరికి డెలివరీ చేయమని నిక్ కోరాడు. అందుకు ఐదు వందల డాలర్లు ఇచ్చాడు. అందులో ఏం ఉందని జెఫ్ అడగలేదు. ఊహించాడు. డ్రగ్స్ కాదు. అది అంత బరువు ఉండదు. ఆయుధాలు కాని, బంగారం లాంటి ఖరీదైన లోహం కాని అయి ఉంటుందని అనుకున్నాడు. చిన్నపిల్లల శవం ఉండచ్చని కూడా జెఫ్ ఊహించాడు. తన కార్లో రెండు పగళ్లు ప్రయాణించి దాన్ని షార్లెట్‌లోని నిక్ చెప్పిన వ్యక్తికి డెలివరీ చేసి, అతనికి అందినట్లుగా నిక్‌కి ఫోన్ చేయించాడు.
ఆ తర్వాత నిక్ అమెరికాలోని దాదాపు పాతిక ఊళ్లకి జెఫ్ క్రేన్‌స్టన్‌ని పంపి అలాంటి పెట్టెలని డెలివరీ చేయించాడు. నెల తర్వాత ఓ రోజు జెఫ్ దినపత్రిక లన్నింటిలో ప్రముఖంగా వచ్చిన ఓ వార్తని చూశాడు. ఇరవై డాలర్ల నోట్లని ముద్రించిన ఓ దొంగల ముఠా కోసం పోలీసులు వెతుకుతున్నారన్న హెడ్డింగ్‌ని చూసి దాన్ని ఆసక్తిగా చదివాడు. గత నాలుగు వారాలుగా అమెరికాలోని అనేక బేంకులకి కొత్త ఇరవై డాలర్ల నోట్లు వచ్చాయని, అవన్నీ ఒకే సీరియల్ నంబర్ని కలిగి ఉండటం సిబ్బంది గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేశారని, ట్రెషరీ డిపార్ట్‌మెంట్ ఆ నోట్లన్నిటినీ పరిశీలించి, అవి సర్క్యులేషన్‌లో ఉన్న ఓ నోటు సీరియల్ నంబర్ అని గుర్తించారని, దాని ప్రింటింగ్‌లో వాడిన కాగితం, అచ్చు పని అత్యంత క్వాలిటీతో ఉన్నదని, ఆ నంబర్ గల నోట్లని తీసుకోవద్దని ట్రెషరీ శాఖ మీడియా ద్వారా ప్రచారం ఆరంభించిందని ఆ వార్తలో ఉంది. ఆ నోట్లన్నీ మిడ్ వెస్ట్ నించి సరఫరా చేయబడ్డాయని పట్టుబడ్డ ఇద్దరు నిందితులు చెప్పారని, వాటిని డెలివరీ చేసిన వ్యక్తిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని, విచారణ కొనసాగుతోందని ఆ వార్తలో ఉంది.
ఆ వార్త చదివాక జెఫ్ క్రేన్‌స్టన్ క్షణం ఆలస్యం చేయలేదు. తను పోలీసులకి పట్టుబడక మునుపే నిక్ ఫోలే తనని మట్టుపెడతాడని అతనికి తెలుసు. అవసరం వస్తే నిక్ నిర్దయగా తన తల్లినైనా చంపే కరకు వ్యక్తి అని జెఫ్‌కి తెలుసు. వెంటనే చెక్‌బుక్, కొద్ది దుస్తులు, ఇతర అవసరాలు సర్ది ఎప్పుడూ సిద్ధంగా ఉంచే చిన్న సూట్‌కేస్‌ని తీసుకుని కార్లో ఆ ఊరి నించి బయలుదేరాడు. అప్పట్నించి జెఫ్ ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు.
పారిపోయాక జెఫ్ రెండు వందల మైళ్ల దూరంలోని ఓ ఊళ్లో తన బేంకులోని డబ్బంతా డ్రా చేశాడు. ఆ రాత్రి మరో రెండు వందల మైళ్ల దూరంలోని ఇంకో ఊళ్లో తన స్పోర్ట్స్ కారుని అమ్మేశాడు. అది తన వెంట ఉంటే తనని పట్టిస్తుందని తెలుసు.
నెవేడాలోని ఓ చిన్న ఊరికి జెఫ్ రెండు రోజుల క్రితం చేరుకున్నాడు. నిజానికి అతను తర్వాతి ఊరుకి ఎక్కడికి వెళ్తాడో అతనికే తెలీదు. తను ఇంకో కారు కొని దాంట్లో వెళ్తాడని విల్లీ భావిస్తాడని, తను దొరక్కుండా ఉండటానికి జెఫ్ బస్‌లలో ప్రయాణిస్తున్నాడు. గత పదేళ్లుగా నిక్‌కి కిరాయి హంతకుడిగా పనిచేసే విల్లీ ది ఫింగర్‌కి ఇంతదాకా తనని చంపమని చెప్పిన ఏ ఒక్కర్ని విడకుండా చంపిన రికార్డ్ ఉంది అని జెఫ్‌కి తెలుసు. విల్లీకి చంపడమే కాక, పారిపోయే మనుషుల్ని వేటాడి పట్టుకునే నేర్పు కూడా ఉంది.
అన్ని సందర్భాల్లో అతను పాయింట్ 45 కేలిబర్ హేండ్ గన్‌నే వాడాడు. కొన్ని సందర్భాల్లో అతను చంపే పనిని పేరు గోప్యంగా ఉన్న ఓ సహచరుడికి ఇచ్చాడనే వదంతి కూడా ఉంది. అతనెవరో నిక్‌కి కూడా తెలీదు. నిక్ హత్య చేయమని విల్లీని కోరితే ఒకోసారి అంగీకరించేవాడు. ఒకోసారి తిరస్కరించేవాడు. అంగీకరిస్తే ఎంతటి గాఢ మిత్రుడ్ని అయినా తుద ముట్టిస్తాడని హతుల జాబితాని చూసిన వారికి అర్థమవుతుంది.
తను ఈ ఊరికి వచ్చినట్లు అసలు విల్లీ ఎలా కనుక్కోగలిగాడు? తను ప్రయాణించిన పద్ధతిని అతను ఎలా ఊహించి ఉంటాడు?
అతను తన కోసం కాక మరొకరి కోసం వెదుకుతున్నాడనే ఆశ జెఫ్‌లో ఓ మూల మిణుకు మిణుకుమంటోంది.
విల్లీ అకస్మాత్తుగా టెలిఫోన్ బూత్‌ల వైపు చూసి, జెఫ్ దాక్కున్న బూత్ వైపే రాసాగాడు. వెంటనే జెఫ్ తన హోల్‌స్టర్ లోంచి గొట్టం కోసేసిన పిస్తోలుని తీసి సిద్ధంగా పట్టుకున్నాడు. ఆ ఫోన్ బూత్‌లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే విల్లీ వచ్చి చూడచ్చని జెఫ్ అప్పటికే దాని తలుపుని కొద్దిగా తెరచి ఉంచాడు. విల్లీ ఒకవేళ తన బూత్ తలుపు తెరిస్తే అతని తలకి గురి పెట్టి కాల్చాలని జెఫ్ నిర్ణయించుకున్నాడు. కాని విల్లీ జెఫ్ పక్క బూత్ తలుపు తెరుచుకుని వెళ్లాడు. నాణెం వేసిన శబ్దం, డయల్ చేస్తున్న శబ్దం వినిపించింది.
‘నేను, విల్లీని. బస్ స్టాండ్‌లో ఉన్నాను. మొత్తం వెదికాను కాని వాడు ఎక్కడా కనపడలేదు.. నిజమే. నా లెక్క ప్రకారం వాడి దగ్గర డబ్బుతో ఈ రోజుకి ఇక్కడికి చేరుకోవాలి. లేదా వాడికి ఎలాగో డబ్బు దొరికి విమానంలో ఏ సేన్ ఫ్రాన్సిస్కోకో వెళ్లాడేమో? ఇక్కడ నా అసోసియేట్‌కి కూడా ప్రస్తుతం ఇదే పని. వాడ్ని వర్ణించాను. ఒంటరి. ఫ్రెంచ్ కట్ మీసం. ఒత్తు క్రాఫ్. ఐదడుగుల ఆరంగుళాలు. ఎనభై కిలోల బరువు.. కళ్లజోడు...’
క్రేన్‌స్టన్ తన తలని తడుముకున్నాడు. బోడిగుండు. మీసం లేదు. కాని మిగిలిన విషయాల్లో తనలో మార్పు లేదు.
‘నేను వెనక్కి తిరిగి వస్తున్నాను. వాడు ఇక్కడే కనుక ఉంటే నా సహచరుడు వాడి సంగతి చూస్తాడని గేరంటీ, బై..’
విల్లీ వెళ్లిపోవడం చూశాడు. విల్లి సహచరుడు ఎవరైనా ఉండచ్చు? అక్కడ కూర్చున్న వాళ్లందర్నీ చూశాడు. అతను ఎవరైనా సరే, తనెవరో బయట పడకుండా వాళ్లల్లో ఒకడిగా కలిసిపోయాడు.
అకస్మాత్తుగా ఓ పోలీస్ లోపలికి వచ్చి అందరి టిక్కెట్లని చెక్ చేయసాగాడు. టిక్కెట్స్ లేకుండా ఆ ఏసి గది సుఖాన్ని అనుభవించడానికి వచ్చిన కొందరు పోలీసులను చూసి బయటికి వెళ్లిపోయారు. ఫోన్ బూత్ ఎదురుగా ఉన్న బెంచీలో కూర్చున్న ఒకామె పోలీస్‌ని చూసి కంగారు పడటం జెఫ్ గమనించాడు. ఆమె పక్కన చిన్న సూట్‌కేస్, ఓ పెద్ద హేండ్‌బేగ్. ఆమె ప్రవర్తనని బట్టి ఆమె దగ్గర టిక్కెట్ లేదని జెఫ్ గమనించాడు. పోలీస్ వంక భయంగా చూసి, అటు ఇటు దిక్కు తోచనట్లు చూడసాగింది. ఆ పోలీస్ ఆమె దగ్గరికి వచ్చేసరికి జెఫ్ బూత్‌లోంచి బయటికి వచ్చి, తన చేతిని ఆమె భుజం మీద వేసి చెప్పాడు.
‘సారీ హానీ! ఆలస్యం అయింది పద. వెళదాం’
ఆమె అతని వంక, పోలీస్ వంక, మళ్లీ అతని వంకా చూసి లేచింది. ఆమె సూట్‌కేస్‌ని అందుకుని జెఫ్ బయటికి నడిచాడు. ఇప్పుడు తన వర్ణనలో అతనికి క్రాఫ్, మీసాలతోపాటు ‘ఒంటరి’ కూడా రద్దయింది. తన ఎత్తు ఇప్పుడు విల్లీ సహచరుడికి పట్టించదు.
‘ఆకలిగా ఉందా?’ ఆమెని అడిగాడు.
* * *
ఆమె చాలా ఆకలిగా ఉందని ఆమె తిన్నదాన్ని బట్టి జెఫ్ గ్రహించాడు.
‘టిక్కెట్ లేకుండా అక్కడ ఉన్నందుకు ఆ పోలీస్ నన్ను అరెస్ట్ చేశాడని భయపడ్డాను. నన్ను కాపాడినందుకు థాంక్స్. నన్ను మీతో తీసుకెళ్లండి’ కోరింది.
‘కాని నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు’
‘ఎక్కడికైనా సరే. నా దగ్గర అయిదు డాలర్లు మించి లేదు. ఇంటి అద్దె చెల్లించనందుకు నా ఇంటి తలుపు తాళం వేసేశారు. రెండు రోజుల నించి తిండి లేదు. ఉద్యోగం లేదు. మీ పేరు నాకు తెలీకపోయినా ఫర్వాలేదు. మీతో నన్ను తీసుకెళ్లండి’ అర్థించింది.
‘అలాగే. ఇద్దరం ఓ గదిని అద్దెకి తీసుకుందాం. నా దగ్గర కూడా ఉన్నవి రెండు వందల డాలర్లే. కాని నీకన్నా ధనవంతుణ్ణి’ నవ్వాడు.
విల్లీ సహచరుడు తనని అక్కడ కనుక్కోలేకపోతే ఇక ఆ ఊళ్లో ఉండడు. ఇంకో ఊరుకి తనని వెదుకుతూ వెళ్తాడు. ఆమెతో ఆ ఊళ్లోనే ఉండటం శ్రేయస్కరం. ఓ నెల తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. యూరప్‌కి వెళ్తే ఇక తనని ఎవరూ పట్టుకోలేరు. అందుకు పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉంది. టిక్కెట్‌కి డబ్బే కావాలి. క్రెడిట్ కార్డుతో కొంటే నిక్‌కి తెలుస్తుంది. కాబట్టి దాన్ని వాడకూడదు. అందుకే ఇంత దాకా తను నగదే వాడుతున్నాడు. ఐనా విల్లీ తను ఈ ఊరికి వచ్చినట్లు ఎలా కనుక్కోగలిగాడో ఆశ్చర్యం!
ఇద్దరూ లేచి రోడ్ మీద నడవసాగారు. కొద్ది దూరం వెళ్లాక ఆమె చెప్పింది.
‘నీరసంగా ఉంది. కొద్దిసేపు అలా కూర్చుందాం’
ఇద్దరూ ఓ చిన్న సందులోని ఓపెన్ మార్కెట్ వారు వదిలి వెళ్లిన చెక్క కార్టన్స్ మీద కూర్చున్నారు. ఆమె కొద్దిసేపు కళ్లు మూసుకుని కూర్చుంది. తర్వాత చెప్పింది.
‘నా పేరు మెరోని. నేను డయాబెటిక్. అన్నం తినగానే మాత్ర వేసుకోవాలి’
తన హేండ్ బేగ్ జిప్‌ని లాగింది. తక్షణం జెఫ్ చేతిలోకి అతని పిస్తోలు ప్రత్యక్షం అయింది.
‘నువ్వు, విల్లీ పార్ట్‌నర్స్ అని నాకు తెలుసు’ ఆమెకి చెప్పాడు.
ఆమె అతని వంక చూడకుండానే ‘ఏమిటి మీరనేది?’ అంటూ జిప్‌ని పూర్తిగా తెరచి వేళ్లని బేగ్ లోపలికి జొప్పించింది. తక్షణం జెఫ్ పిస్తోలు బారెల్‌ని ఆమె తలకి ఆనించి ట్రిగ్గర్ నొక్కాడు. గొట్టం కోయడంతో అది పేలినా పెద్ద శబ్దం రాలేదు. ఆమె గొంతులోంచి వింత ధ్వని వెలువడి తలని పక్కకి వాల్చేసింది.
జెఫ్ ఆలోచిస్తున్నాడు. ఆమె విల్లీ సహచరుడు అయి ఉండచ్చు. అంత పెద్ద హేండ్‌బేగ్‌లో పాయింట్ 45 కోల్ట్ హేండ్‌గన్ పడుతుంది. బహుశా ఆ తుపాకీని తీసి తనని ఇక్కడ కాల్చి చంపచ్చు. ఇక్కడ కాల్చినా మెయిన్ రోడ్‌లోని ఎవరికీ కనపడదు. అందుకే ఇక్కడ కూర్చుందామని అడిగి ఉంటుంది.
జెఫ్ తన ఊహ నిజమో, తప్పో తెలుసుకోవడానికి ఆమె హేండ్ బేగ్‌లోని వస్తువులని బోర్లించి చూశాడు.
*
(అల్‌నుస్ బౌమ్ కథకి స్వేచ్ఛానువాదం)

2 కామెంట్‌లు:

  1. "ఆమె విల్లీ సహచరుడు అయి ఉండవచ్చు"

    ఎంత గొప్ప తెలుగు వాక్యం వ్రాసాడు పేరొందిన తెలుగు రచయిత!

    తెలుగును ఎలాగయినా రాసి పడెయ్య వచ్చునని ఆనందించాలా?
    తెలుగుభాషకు పట్టిన దుర్గతికి విచారించాలా?

    మీరే చెప్పండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు,
      మీ స్ఫూర్తి దాయకమైన వాక్యాలకు ధన్యవాదాలు ......
      మీరు అడిగినట్లు ఆనందించాలా? విచారించాలా? అంటే !...
      విచారిస్తూ ఆనందించడమే సరి అనుకుంటున్నాను. ఎందుకంటే అనువాదం లో ఎవరికీ తోచించ విధంగా వారు రాస్తారు, అలా అని ప్రతీ ఒక్కరు ఒకే లా ఆలోచించలేరు గా !!
      నిజంగా ఏదో రాసి, జనాలను మెప్పించడం అంత సులువు కాదు అనుకుటున్నాను. అందుకె నా లాంటి వాడికి రచయిత కి చాలా తేడా వుంది.

      తొలగించండి