10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఈమెయలొస్తోంది పారిపోండి!


మన ఫ్రెండ్స్ నుంచీ, గాళ్స్ నుంచీ, బాయ్స్ నుంచీ, బంధువుల నుంచీ ఈమెయిల్స్ వస్తూంటే హాపీగా చదువుకుంటాం.

కానీ రాన్రాను ఈమెయిల్ అన్నా ఎస్సెమ్మెస్ అన్నా కంగారుగా వికావికలయి పారిపోయే రోజులొస్తున్నాయ్.
మెయిల్ ఓపెన్ చేయగానే ‘హాయ్’ అంటూ పలుకరిస్తుందో మెయిల్ - ఎవరో ఫ్రెండనుకుని ఓపెన్ చేస్తాం.
‘హాయ్ - మీరు హాపీగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాం! ఇలాగే పది కాలాలు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం!
కానీ ఏ రోజెలాంటిదో ఎవరికి తెలుసు?
మా పాలసీ హోల్డర్ ఆర్‌కే శే్వత ఏమంటోందో చూడండి-
దాని కిందే అందంగా సెక్సీగా ఉన్న శే్వత బొమ్మ కనపడుతుంది. ఆ బొమ్మ పక్కనే మేటర్-
‘హాయ్ - అయామ్ శే్వత - 21 సం.లు. - ఎంబిఏ చేశాను. హైదరాబాద్‌లో ఉంటాను.
నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్లందరితో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయటం నాకిష్టం!
లైఫంతా ఇలాగే మాంఛి ఎంజాయ్‌మెంట్‌తో గడిచిపోతుందని అనుకున్నాను.
అమ్మా, నాన్నా, అక్కా, తమ్ముడూ అందరూ నన్ను లైక్ చేస్తారు.
నాకూ వాళ్లంటే ప్రాణం!
కానీ ఏం జరిగింది?
హారిబుల్ - సడెన్‌గా యాక్సిడెంట్‌లో మా ఫాదర్ చనిపోయారు. అంతే మా లైఫ్ దారుణం అయిపోయింది - నాన్నలేరన్న దుఃఖం ఒకవేపు - బాంక్‌లో ఒక్క పైసా లేదు - భవిష్యత్తు ఎలా గడుస్తుందో అని తల్లడిల్లి పోతూంటే క్షేమం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు మా ఇంటికొచ్చి కోటి రూపాయలకు చెక్ ఇచ్చారు.
మా నాన్నగారు దూరదృష్ట్టితో చేసిన ఆ పని ఎంత గొప్పదో, మమ్మల్నందరినీ ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఆదుకుందో తల్చుకుంటే ఇప్పటికీ ఆ క్షేమ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంతో రుణపడి ఉన్నట్లనిపిస్తుంది - కనుక మీరూ ఇవాళే క్షేమ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి! యాక్సిడెంట్‌లో ఛావండి..
మీ ఫామిలీకి కోటి గారంటీ-
దానికిందే-
ఇంకో రకం మెయిల్ కనపడుతుంది మీకు-
‘కంగ్రాచ్యులేషన్స్ - మీ లాండ్ లైన్ ఫోన్ నంబర్‌కి బంపర్ లాటరీ తగిలింది - మీరు ఎంతో అద్భుతంగా ఆల్ అమెరికా లక్ డ్రీమర్స్ వారి 10 మిలియన్ డాలర్స్ లాటరీని గెల్చుకున్నారు - మొదటిసారిగా మా సంస్థ నిర్వహించే లాటరీ భారతదేశంలోని మిమ్మల్ని వరించింది.
ఈ బహుమతి మొత్తాన్ని మీకు అందజేయడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది.
వెంటనే మీ బాంక్ ఎకౌంట్ నెంబర్‌తోపాటు, మీ ఫొటో, మీ బయోడేటా - మాకు మెయిల్ చేయండి -
29 రోజుల్లో 10 మిలియన్ల డాలర్లు మీ బేంక్ ఎకౌంట్‌లోకి వస్తాయ్-
అన్నట్లు ఆ మెయిల్ పంపే ముందు - మా సంస్థకు నాలుగు లక్షల - ఇరవై ఆరు వేల - తొమ్మిది వందల పధ్నాలుగు రూపాయలకు డి.డి. పంపండి!
ఆ డబ్బు కేవలం మీ బహుమతి మొత్తానికి టాక్స్ కట్టడానికి వినియోగించబడుతుంది-
ఇక జీవితమంతా అమెరికన్ డాలర్లతో దున్నుకోండి-
మీరు నిజమేనని నమ్మి డబ్బు పంపుతే - ఇంతే సంగతులు-
ఇంకో రకం ఎస్సెమెస్ తరచుగా అందరికీ వస్తూంటుంది-
‘హలో - చాలా లోన్లీగా ఉన్నారా? మాంఛి కంపెనీ కావాలా? వెంటనే ఈ నెంబర్‌కి ఎస్‌ఎంఎస్ చేయండి ‘అవును’ అని రాస్తే చాలు! వెంటనే ఎంతో అందంగా, సెక్సీగా ఉన్న ఇద్దరు గాళ్స్‌తో అద్భుతంగా టైమ్‌పాస్ చేయండి-
ఒకమ్మాయి - పగలు - ఒకమ్మాయి రాత్రి-
మీరు టెంప్టయి జవాబిచ్చారనుకోండి! వెంటనే ఫోన్ల పర్వం మొదలవుతుంది ‘రా! కదలిరా! శిల్పారామం పిలుస్తోంది! గ్రీన్ కలర్ చుడీదార్, బ్లూ దుపట్టా -లో ఉంటా. సాయంత్రం ఆరు గంటలకల్లా’
వెళ్తారు - ఆ గ్రీన్ డ్రస్ మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లో లవ్ చేస్తూండగా - ఒకడు కత్తి తీసుకొస్తాడు. ‘నేను దీని మొగుడ్నిరా’ అని అరుస్తాడు.
‘అయ్యో - వాడికి పాతిక వేలు అర్జంటుగా ఇవ్వండి - లేకపోతే మనిద్దర్నీ మర్డర్ చేస్తాడు’ అంటుందా గ్రీన్ డ్రస్. వెంటనే ఎటిఎం లో నుంచి పాతిక వేలు డ్రా చేసి వాడికిస్తారు - అంతే! ఆ తరువాత మీకు మెయిల్ చూడాలంటే వణుకు మొదలవుతుంది.

1 కామెంట్‌: