నగరంలో బంగారం ఉంటుంది గానీ, బంగారంలో నగరం ఉంటుందా? సరస్సు అడుగున నల్లటి బురద ఉంటుంది గానీ మిలమిల మెరిసే బంగారం ఉంటుందా?
ఇది పొడుపు కథ కాదు. వాస్తవం అని కొలంబియాలో కొట్లాదిమంది నమ్మే పురాతనమైన కథ.
అనగనగా
ఒక అడవి ఉంది. ఆ అడవి మధ్యన ఒక సరస్సు ఉంది. దాని సమీపంలో కనిపించని నగరం
ఒకటి ఉంది. ష్... ఎవరికీ చెప్పకుండా రండి.... బస్తాల కొద్దీ బంగారం
తెచ్చుకుందాం....
కొలంబియా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంభాషణలు తరచుగా వినిపిస్తుంటాయి:
కొడుకు: అమ్మో... కొత్త బట్టలు కొనిపెట్టవే... రోజూ ఇవే బట్టలు వేసుకొని స్కూలుకు వెళ్లలేక ఛస్తున్నా....
తల్లి(వ్యంగ్యంగా):
ఆ... కొనిపెడతా... కొనిపెడతా... నీయబ్బ ఎల్ డొరాడో వెళ్లి మూటల కొద్దీ
బంగారం తీసుకువచ్చి అటక మీద దాచి ఉంచాడు... అది కరిగించగానే నీకు పది జతల
బట్టలు కొనిస్తా...
మరోచోట... ఒకడు ఇంకొకడితో: ‘‘ఈ కష్టాలు భరించడం
నా వల్ల కాదు... చచ్చో బతికో ఎల్ డొరాడోకి పోయి బంగారం తెచ్చుకుంటేగానీ
కష్టాలు తీరేట్లు లేవు’’.
పేదవాళ్లకు కొత్త కష్టాలు వచ్చినప్పుడు తలుచుకునే పేరు... ఎల్ డొరాడో!
మధ్యతరగతి వాళ్లు పాత కష్టాల్లోకి తిరిగి వెళ్లినప్పుడు జపించే పేరు...ఎల్ డొరాడో!
ధనవంతులకు డబ్బు సరిపోనప్పుడు స్మరించుకునే పేరు.... ఎల్ డొరాడో!
రండి.... 1962 వరకు వెళ్లొద్దాం!
వేసవికాలం. కొలంబియా రాజధాని బొగొటకు సమీప గ్రామంలో కొన్ని గుహలు ఉన్నాయి.
ఎప్పుడూ చూసే గుహలే అయినా ఇద్దరు రైతులకు ఒక చిన్న గుహ ఆశ్చర్యంగా
అనిపించింది. తొంగిచూస్తే చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. ‘‘ఈ గుహలో ఏం
ఉండి ఉంటుంది?’’ అనే ఆసక్తితో వారు ఒకింత కష్టంగా లోనికి వెళ్లగలిగారు.
గాలి వీయడం లేదు...వీచినా లాభం లేదు. గాలి వీచినా వేడిగానే ఉంది.
వీయకపోయినా వేడిగానే ఉంది. నిప్పులు ఆత్మీయంగా పలకరించే ఆ వేడిలో ఒక చల్లని
సమీరం మేనును తాకినట్లు అందులో ఒకడు హాయిగా, తీయగా, ప్రపంచాన్ని జయించినంత
ఆనందంగా అరిచాడు....
‘‘బంగారం...బంగారం..ఎల్ డొరాడో’’
అరిచినవాడి చేతిలో ఉన్న విగ్రహాన్ని చూసి పక్కవాడు ఆశ్చర్యపోయాడు. అది
బంగారు విగ్రహం. అంగరక్షకులతో గంభీరంగా నిల్చున్న రాజు విగ్రహం. ఆ నోటా ఈ
నోటా పడి విషయం ఊరంతా తెలిసింది. ఎల్ డొరాడో కోసం మళ్లీ అన్వేషణ
మొదలైంది.
అసలు ఏమిటీ ఎల్ డొరాడో?
కొలంబియా అడవులలో ఒక
నగరం ఉండేదట. అది అల్లా టప్పా నగరం కాదు... బంగారు నగరం. ఎటు చూస్తే అటు
బంగారం కనిపించేదట. ఈ నగరానికి ‘ఎల్ డొరాడో’ అని పేరు. క్రీ.శ వెయ్యో
శతాబ్దం నుంచి పదిహేను వందల మధ్య ఈ నగరాన్ని ఒక గిరిజన తెగ నాయకుడు
పాలించినట్లు సమాచారం.
నగరంలో గౌటవిట అనే ప్రాచీన సరస్సు ఉండేది.
గిరిజన తెగ రాజు రోజూ బంగారం పొడిని ఒంటికి పూసుకొని ఆ సరస్సులో స్నానం
చేసేవాడట. నగరంలో ఏ ఇంట్లో చూసినా బంగారం రాశులుగా కనిపించేదట. ‘‘మా ఆరాధ్య
దేవత సూర్యుడు. ఆయన మాకు ఇచ్చిన వరం ఈ బంగారం’’ అని ఆ గిరిజనులు
చెప్పుకునేవారు.
గౌటవిట సరస్సు అడుగున బోలెడు బంగారం ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
అడవి మింగేసిందా? భూకంపం భూమిలో కలిపేసుకుందా? అగ్నికి ఆహుతి అయిందా?
శత్రువుల చెరలో చిక్కి ఆనవాలు లేకుండా పోయిందా... కారణం ఏమిటో తెలియదుగానీ
ఎల్ డొరాడో నగరం కనిపించకుండా పోయింది.
ఆ నగరం చుట్టూ
అల్లుకున్న కథ మాత్రం కంచికి చేరుకోలేదు. అది శతాబ్దాలుగా ప్రజల నాలుకల
మీదే ఉంది. అది అక్కడి నుంచి వాళ్ల గుండెల్లోకి వెళ్లేది. సాహసాన్ని
రగిలించేది. బంగారు నగరం అన్వేషణకు ఎప్పుడూ పచ్చజెండా ఊపుతుండేది.
19వ శతాబ్దంలో స్పెయిన్, బ్రిటన్‌కు చెందిన సాహసికులకు కొలంబియా అడవుల్లో
ఒక చోట కొంత బంగారం దొరికిందిగానీ బంగారు నగరం ఆచూకీ దొరకలేదు. దాంతో
నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
ఎల్ డొరాడో గురించి మొదట
ఆలోచించిన వ్యక్తి గోంజాలో జిమెనేజ్. 1536లో కొలంబియా ఈశాన్యప్రాంతం సంటా
మార్టా నుంచి తొమ్మిదివందల మందితో బంగారు నగరాన్ని అన్వేషించడానికి
బయలుదేరాడు. ఈ బృందం దారి పొడుగునా ఎన్నో సాహసాలు చేయాల్సి వచ్చింది.
క్రూరమైన జంతువులతో పోరాడవలసి వచ్చింది.
స్థానిక తెగలతో గొడవ
పడాల్సి వచ్చింది. ప్రయాణ క్రమంలో వారికి బంగారు నగరాన్ని గురించి రకరకాల
కథలు వినిపించాయి. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి వారు గౌటవిట
సరస్సును కనుక్కోగలిగారు. అది చాలా లోతుగా ఉంది. కొన్ని గుడిసెలు ఆ
చుట్టుపక్కల కనిపించాయి. కానీ ఒక ముక్క బంగారం కూడా ఎక్కడా దొరకలేదు.
వెదికీ వెదికీ గొంజాలో బృందం నిరాశతో తిరుగుప్రయాణమయ్యింది.
కొంత కాలం తరువాత....
గొంజాలో ముసలివాడు అయ్యాడు. అయినా అతని బంగారం దాహం తీరలేదు. 1568లో
రెండువేల ఎనిమిదివందల మందితో తిరిగి బయలుదేరాడు. మళ్లీ అతడికి నిరాశే
ఎదురైంది!
అమెజాన్, ఒరినొకో నదుల మధ్య ఉండే ఒకానొక రాజ్యానికి గవర్నర్
అయిన ఆంటోనియో డె బెర్రియో 1584లో బంగారునగరం అన్వేషణ కోసం ఏవేవో
ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. 1585 - 1588 మధ్యలో మరోసారి ప్రయత్నం
చేసినా ఫలితం దక్కలేదు.
1591లో మూడోసారి ప్రయత్నించే క్రమంలో,
ప్రయాణంలో అతనికి సర్ వాల్టర్ రాలెగ్ తారసపడ్డాడు. అతను ఇంగ్లండ్ దేశం
నుంచి వచ్చాడు. క్వీన్ ఎలిజబెత్ కోసం సరికొత్త సంపద మార్గాలు వెదికే పనిలో
ఉన్నాడు. ‘ఎల్ డొరాడో’ గురించి తన దగ్గర ఉన్న సమాచారాన్ని గవర్నర్
ఆంటోనియోకి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న సమాచారంతో ‘ద డిస్కవరి ఆఫ్ ది ఎంపైర్
ఆఫ్ గుయానా’ అనే పుస్తకం రాశాడు. బంగారు నగరం గురించి అందులో వివరించాడు.
కానీ అందులో కొన్ని నిజాలే ఉన్నట్లు ఆ తరువాత కాలంలో తెలిసింది.
‘ఎల్ డొరాడో’ ఆచూకీ కనుక్కుని బంగారాన్ని మాయం చేసి దాచేశాడనే ఆరోపణతో
వాల్టర్‌కు ఇంగ్లండ్ ఉరిశిక్షను విధించింది. ఆ తరువాత ఏమైందోగానీ
కొంతకాలానికి ఆ శిక్షను రద్దు చేశారు. 1618లో ‘ఎల్ డొరాడో’ గురించి
వాల్టర్ రెండోసారి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తరువాత కొంత కాలం వరకు ఎవరూ
పెద్దగా ప్రయత్నించలేదు.
1912లో ‘కాంట్రాక్టర్స్ లిమిటెడ్’ అనే
బ్రిటిష్ కంపెనీ కొలంబియాకు వచ్చి లక్షన్నర డాలర్లు ఖర్చు చేసి గౌటవిట
సరస్సులోని నీటిని తోడేసింది. తీరా చూస్తే అడుగున నల్లటి బురద
కనిపించింది. దానిలో కొంచెం బంగారం దొరికింది. నిజానికి వారు చేసిన
ఖర్చుకు ఆ బంగారం ఏ మూలకూ సరిపోదు.
జ్ఞానమో, అజ్ఞానమో, నమ్మకమో,
మూఢనమ్మకమో ‘ఎల్ డొరాడో’ అన్వేషణ ప్రయత్నాలు వృథా పోలేదు. బంగారం కోసం
చేసే అన్వేషణలో బంగారం లాంటి సమాచారం దొరికింది. బంగారం కంటే విలువైన
లోహాలు దొరికాయి.
ఎన్నో దేశాలకు చెందిన ఎందరో వ్యక్తులు తరతరాలుగా
బంగారు నగరం కోసం చేసిన అన్వేషణలో అపరిచిత తెగల ఆచూకీ కనుగొన్నారు.
ప్లాటినమ్, సిల్వర్, బాక్సైట్, మాంగనీస్, ఇంధన నిల్వల జాడను కనుగొన్నారు.
అప్పటికి, ఇప్పటికీ బంగారం కల పదిలంగా ఉంది. దాని మిస్టరీ అంతకంటే పదిలంగా ఉంది!!
‘ఎల్
డొరాడో’ నగరం అనేది ఉందా లేదా అనేది వేరే విషయంగానీ అనేక అర్థాలకు ఆ పేరు
ప్రత్యామ్నాయంగా మారింది. సంతోషం, స్వర్గం, ప్రేమ, విజయాలకు సరి సమాన పదంగా
దీన్ని వాడుతున్నారు. తీరని కోరిక, భ్రమలకు కూడా ‘ఎల్ డొరాడో’ను
ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
{పసిద్ధ కవి ఎడ్గార్ అలన్ పో
1849లో ‘ఎల్ డొరాడ్’ పేరుతో ఒక కవిత రచించారు. దీని ఇతివృత్తం ‘ఎల్ డొరాడో’
అన్వేషణ. కవితలో ‘షాడో’ అనే ఒకే పదాన్ని రకరకాల అర్థాల్లో వాడారు.
‘కాలిఫోర్నియా గోల్డ్ రష్’ గురించి ఉధృతంగా వినిపిస్తున్న కాలంలో ‘ఎల్
డొరాడో’ కవితను అలన్ రాశారు.
‘గౌటవిట’ సరస్సు ఇప్పుడు టూరిస్ట్
స్పాట్‌గా మారింది. కొలంబియా రాజధాని బొగొట నుంచి అక్కడికి 75 కి.మీ దూరం.
రోజూ ఒక టూరిస్ట్ బస్ అక్కడికి వెళుతుందిగానీ కారు లేదా ట్యాక్సీ
మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం. సరస్సు చూడాలంటే ప్రవేశ రుసుము చెల్లించాల్సి
ఉంటుంది.
రెండువేల పదిలో ‘ఎల్ డొరాడో’ పేరుతో బ్రిటిష్
హర్రర్-కామెడీ సినిమా వచ్చింది. గతంలో కూడా ‘ఎల్ డొరాడో’ ఆధారంగా
హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి.
-యాకూబ్ పాషా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి