24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మిక్స్చ్‌ర్ - 02-18

పిలక ముడి

"అన్నట్లు మీ ఇంటికి గతంలో చుట్టాల తాకిడి ఎక్కువగా ఉండేది కదా. ఇప్పుడెవరూ రావట్లేదు. ఏం చిట్కా ప్రయోగించావు?'' కుతూహలంగా అడిగాడు రామనాథం.
"ఒకరి నుంచి ఒకరికి అప్పులిప్పించాను. అంతే! అప్పులివాల్సి వస్తుందని కొందరు, అప్పు తీర్చాల్సి వస్తుందని ఇంకొందరు పూర్తిగా రావడం మానేశారోయ్'' దీర్ఘంగా ఊపిరి వదులతూ చెప్పేడు చిదంబరం.

ఐదోవాడేడీ?!
నలుగురు స్టూడెంట్స్ బైక్ మీద వెళ్తుండగా, ఆపి "ముగ్గురు వెళ్లడమే తప్పు. పైగా నలుగురా?'' కోపంగా అన్నాడు పోలీసు వెంకటస్వామి.
"అదేమిటీ నలుగురమే ఉన్నామా? ఐదో వాడు ఎక్కడ పడిపోయాడ్రా?'' వెనక్కి తిరిగి చూస్తూ గొల్లుమన్నాడు డ్రైవర్ స్టూడెంట్.

అదృష్టానికి ఫీజెందుకు?
"మీకున్న జబ్బు తగ్గడం చాలా కష్టం. కానీ, మీ అదృష్టం కొద్ది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. యు ఆర్ లక్కీ!'' భుజం తట్టాడు డాక్టర్ దైవాదీనం.
"థాంక్యూ డాక్టర్ ... వస్తాను'' కృతజ్ఞతగా చెప్పేడు ఏసుపాదం.
"అన్నట్లు నా ఫీజు ఆరు వేలు - కౌంటర్లో చెల్లించి వెళ్లండి'' ప్రిస్కిప్షన్ రాస్తూ అన్నాడు దీనం.
"ఫీజా? ఇప్పుడేగా నా అదృష్టం వల్ల తగ్గిందన్నారు?'' అమాయకంగా నోరు తెరిచాడు పాదం.

తానొవ్వక...ధన్యుడు సుమతీ!
"బస్‌లో నిలుచున్న ఆడవాళ్లని చూసి కూడా లేచి సీట్లివ్వని మగవాళ్లని చూసే ఒళ్లు మంట నాకు'' చెప్పేడు బ్రహ్మానందం.
"నువ్వు లేస్తావా?'' అడిగాడు భజగోవిందం.
"నేను కూర్చోగానే కళ్లు మూసుకుంటా కదా'' చెప్పేడు బ్రహ్మానందం.

రాలని నవ్వులు
"అదేంటోయ్, మీ ఆఫీసులో పనిచేసే సుబ్బారావుకి 'నవ్వుల్రావు' అని పేరు పెట్టారు. అతగాడు అంత బాగా నవ్విస్తాడా?''
"అక్కడే ఉంది తిరకాసు. వాడు జోకేస్తే నవ్వులు రావు కాబట్టే వాడికా పేరు పెట్టాం''

ఆడగాలి
"నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు మాస్టారూ'' చెయ్యి చూస్తూ చెప్పేడు జ్యోతిష్యుడు.
"నిజమా! ఇంద వంద! ఎప్పుడు, ఎలా?'' చెయ్యి మరింత ముందుకు చాస్తూ అడిగాడు మన్మథరావు.
వంద జేబులో పెట్టుకుంటూ "ఒక భార్య, ఐదుగురు కూతుళ్లూ'' చెప్పేడు జ్యోతిష్యుడు.

రెండూ కరక్టే!
"ఒక స్ట్రాంగ్ కాఫీ పట్రావోయ్... అన్నట్టు ఎంత?''
"20 రూపాయలండి.''
"అదేంటోయ్! ఎదురు కొట్టు ముందు 50 పైసలని రాసుంటేనూ?''
"ఇది హోటలండి- అది జిరాక్స్ షాపండి.''

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి