12, ఫిబ్రవరి 2012, ఆదివారం

అద్దె తల్లులు


 - కె. అంజన   
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
అంగడిలో దొరకనిదీ అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే అన్నాడో సినీ కవి.
ఆ పాట రాసే నాటికి అమ్మను అంగట్లో కొనలేమన్నది అక్షర సత్యం. ఇప్పుడు అమ్మ (అమ్మ గర్భం) కూడా అంగడి సరకే. డాలర్లకు పిల్లలు పుడతారిక్కడ. సరొగసీ ప్రక్రియ వారి పాలిట వరంగా మారింది. పేదరికంలో మగ్గిపోయే అద్దెతల్లులకు కొదవలేని భారతగడ్డ నిస్సంతులకు ప్రీతిపాత్రమైన ప్రాంతంగా తయారైంది. తమ రక్తం పంచుకు పుట్టే బిడ్డకోసం సప్త సంద్రాలు దాటి భారత గడ్డమీద అడుగెడుతున్నారు. మన దేశంలో సైతం ఆమిర్‌ఖాన్‌ వంటి సెలబ్రిటీలు, వ్యాపారస్థులు అద్దె తల్లులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఫణంగా పెట్టి పరాయివారి బిడ్డలను కనిపెడుతున్నారు అద్దె తల్లులు. పేగు బంధం సైతం వ్యాపారమైంది.
ఈ మధ్య అడపా దడపా వినిపిస్తున్న మాట 'సరొగసీ'. ఏళ్ల తరబడి పిల్లలకోసం ఎదరుచూసిన విదేశీయులకు సరొగసీ వరంగా మారింది. అనేక సార్లు అబార్షన్లయినవారు, ఐవిఎఫ్‌ పద్ధతి విఫలమైనవారు, గర్భసంచి సంబంధిత సమస్యలున్నవారు సొంత బిడ్డల కోసం మన గడ్డపై కాలు మోపుతున్నారు. బ్రిటన్‌కి చెందిన నిక్కి, బాబీ బైన్స్‌ ఆ కోవకు చెందిన వారే. వీరు పిల్లల కోసం ఎంతగానో తపించారు. 13 ఏళ్లపాటు తిరగని ఆసుపత్రి లేదు. కలవని వైద్యులు లేరు. నీళ్లలా పౌండ్లు ఖర్చు చేశారు. అయినా వారి వడి నిండలేదు. పైగా అక్కడ అద్దె తల్లులు దొరకడం కూడా కష్టమే. ఒక వేళ లభించినా చాలా అరుదుగా వుంటారు. అన్ని అనుమతులూ పొందడానికి బోలెడంత సమయం పడుతుంది. దాంతో వారు గంపెడాశతో ఇండియా వచ్చారు. ఇక్కడ కూడా పదికిపైగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైద్య ఖర్చులకే లక్షల రూపాయలు వెచ్చించారు. చివరగా గుజరాత్‌లోని ఆనంద్‌ చేరుకొని అద్దె తల్లిని సంపాదించారు. పండంటి బిడ్డతో సంతోషంగా స్వదేశం చేరారు. ఇలాంటి విదేశీ కేసులను చెప్పుకోడానికి పేజీలు చాలవు. అందాకా ఎందుకు? మన దేశంలోనూ సంతానం కోరుకునేవారు సరొగసీని ఎంచుకుంటున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఒకరు ఈ పద్ధతిద్వారానే లీలావతి ఆసుపత్రిలో పండంటి బిడ్డను కన్నారు. అతని భార్యకు 9సార్లు ఐవిఎఫ్‌ ప్రయత్నించగా విఫలమైంది. దాంతో అద్దెతల్లిని ఆశ్రయించారు.
మనది ఎల్లలు లేని దరిద్రం. పైసలు కావాలి. కొన్ని సంవత్సరాలపాటు రెక్కలు ముక్కలు చేసుకున్నా రాని సంపాదన ఒక్కసారి గర్భాన్ని అద్దెకు ఇచ్చినందుకు వస్తుంటే ఎలా కాదంటారు? గుజరాత్‌లోని ఆనంద్‌కి చెందిన మంజుల గాథ అలాంటిదే. ఈమె నాలుగిళ్లలో పాచిపని చేసుకుంటుంది. భర్త తాగుబోతు. పైసా సంపాదించడు. పైగా ముగ్గురు పిల్లలు. పిల్లల భవిష్యత్తు కోసం అద్దె తల్లి అవతారమెత్తి 3.5 లక్షల రూపాయలు సంపాదించింది. 2.85 లక్షలతో ఇల్లు కొని మిగతా పైకాన్ని పిల్లల చదువుకోసం అట్టిపెట్టింది. కాజల్‌ది మరో కథ. అప్పులపాలైన భర్త ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ పరిస్థితుల్లో గర్భాన్ని అద్దెకిచ్చింది. తద్వారా వచ్చిన మొత్తంలో భర్త కిరాణా కొట్టు కోసం 3 లక్షల రూపాయలు కేటాయించింది. కొడుకు చదువు కోసం 50 వేల రూపాయలు బ్యాంకులో వేసింది. పై సంఘటనలు చూస్తుంటే డాలర్లు పిల్లలు పెడతాయన్న పెద్దల మాట నిజమే సుమా అనిపించకమానదు.
ఇక్కడే ఎందుకు?
మన మాత్రం నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక పరిజ్ఞానం విదేశాల్లోనూ వుంది. కానీ బిడ్డలు కావాలనుకున్న వారు వెతుక్కుంటూ భారతదేశానికే ఎందుకు వస్తున్నారు? ఇక్కడివారి గర్భాలనే ఎందుకు అద్దెకు తీసుకొంటున్నారు? భారతదేశంలో కార్మికులే కాదు. అద్దె తల్లులు కూడా చవకే. భారత్‌ చవకబారు సంతలా.... బిడ్డలను కనిచ్చే ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రంగా మారింది. బిడ్డలకోసం తహతహలాడిపోయే విదేశీ తల్లిదండ్రులు రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. అమెరికాలో సరొగసీ ద్వారా బిడ్డను పొందడానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అదే ఇండియాలో అయితే 5 నుంచి 10 లక్షల రూపాయలతో పనైపోతుంది. పండంటి బిడ్డతో తిరుగు విమానం ఎక్కవచ్చు. పైగా ఇక్కడ మాతృభాష తర్వాత ఆంగ్లాన్నే ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో వైద్యుల నుంచి వైద్య సిబ్బంది వరకు ఎవరితో మాట్లాడాలన్నా విదేశీయులకు భాషా సమస్య ఉత్పన్నం కాదు. తమ పని చక్కబెట్టుకోవడం సులభం. ఇంకా ఇక్కడ సంతాన సామర్థ్యం అధికం.
మన దేశంలో దత్తతుపై స్పష్టమైన చట్టాలున్నాయి. సరొగసీకి సంబంధించి మాత్రం లేవు. అలాగని ఇది చట్ట వ్యతిరేకం కాదు. నామకః కొన్ని మార్గదర్శకాలున్నాయి. పైగా డబ్బు చెల్లించి అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే ప్రక్రియ (సరొగసీ ) కు 2002లో సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. దాంతో ఈ తంతు చట్టబద్ధంగానే నడుస్తోంది. అప్పటి నుంచి సంతానలేమితో బాధపడుతున్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి ఎందరో నిస్సంతులు ఇండియా వస్తున్నారు. ఐవిఎఫ్‌, సరొగసీ ద్వారా బిడ్డను కంటున్నారు. 2005లో మాత్రం అత్యున్నత న్యాయస్థానం సరొగసీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. దాని ప్రకారం అసలు తల్లిదండ్రులు ... బిడ్డను నవమాసాలు మోసి కనబోయే మహిళ, ఆమె భర్త ...కాంట్రాక్టు పత్రాలు రాసుకోవాలి. బిడ్డ పుట్టే వరకు అద్దె తల్లికి ఆర్థిక మద్దుతు ఇవ్వాల్సి వుంటుంది. అండము, వీర్యము కూడా అసలు తల్లిదండ్రులదే అయివుండాలి. అద్దె తల్లి అండాన్ని ఉపయోగించకూడదు. అన్నిటినీ మించి ఈమె ఎవరో కూడా గోప్యంగా వుంచాలి. బహిర్గతం చేయకూడదు. ఆర్థికపరమైన సంరక్షణ కూడా కల్పించాలి. వీటిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడడం కోసమే ప్రభుత్వం 'ఎఆర్‌టి (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ) నియంత్రణ బిల్లు 2010'ను రూపొందించింది.
కొన్ని దేశాల్లో సరొగసీకి సంబంధించిన చట్టాలు బలంగా, స్పష్టంగా వున్నాయి. కొన్ని దేశాల్లో ఒకరి బిడ్డను మరొకరు కనడానికి చట్టాలు అంగీకరించవు కూడా. కెనడా ప్రభుత్వం 2004లో కమర్షియల్‌ సరొగసీని నిషేధించింది. బ్రిటన్‌లోనూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ చట్టవ్యతిరేకమే. అయితే ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌, జార్జియా చట్టాలు మాత్రం ఇందుకు అంగీకరిస్తున్నాయి. అద్దె గర్భంతో పిల్లల్ని కనడానికి అనుమతి లేదు. ఒకవేళ వున్నా బోలెడన్ని షరతులు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అనుమతి వుంటే కొన్ని రాష్ట్రాల్లో నేరం. బిడ్డను మోస్తున్న మహిళకు కూడా అనేక హక్కులుంటాయి. పారాయివాళ్ల బ్డియితేనేం. తన కడుపులో వున్నందున మమకారం పెంచుకుని 'ఇవ్వను' అని అడ్డం తిరిగినా ఏం చేయలేరు. మరి మనకో! అద్దె తల్లులకు ప్రత్యేకంగా ఎటువంటి హక్కులూ లేవు. అసలు తల్లిదండ్రులపై ఎలాంటి నిబంధనలూ లేవు. పైగా మన దేశంలో పేదరికానికి ఆకాశమే హద్దు కావడం కూడా విదేశీయుల పాలిటి వరంగా మారింది. రోజంతా కాయకష్టం చేసినా కడుపునిండని పేద, దిగువమధ్య తరగతి వారే ఆ డబ్బుకోసం తమ గర్భాన్ని అద్దెకివ్వడానికి ముందుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యులు సైతం దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ చక్రంలో దళారులది లాభాల పంట. వైద్య పరీక్షలు, చికిత్స, మందులు తీసుకుంటూ ప్రాణాలకు తెగించి గర్భాన్ని అద్దెకిచ్చినవారికి నామమాత్రపు పైకం అందుతుంది. నాలుగు మాటలు చెప్పే దళారులకు మాత్రం లాభాల పంట పండుతోంది. కష్టం ఒకరిది. ఫలితం మరొకరిది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అహ్మదాబాదు, హైదరాబాదు వంటి నగరాలు ఇలాంటి ఆసుపత్రులు సంతాన సాఫల్య కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. దేశదేశాల నుంచి సంతానం కోరుకునేవారెందరో ఇక్కడకు వస్తున్నారు.
ఆనంద నిలయం
గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతం పాల విప్లవానికే కాదు అద్దె తల్లులకూ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దేశదేశాల్లో ఈ పేరు మారుమోగిపోతోంది. 'ఆకాంక్ష' వంటి సంతాన సాఫల్య కేంద్రాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. స్కూలు పిల్లల సంక్షేమ హాస్టళ్ల మాదిరి వీటిని నిర్వహిస్తుంటారు. మూడేసి అంతస్తులున్న భవనాలను అద్దెకు తీసుకొని మరీ వీటిని నడుపుతుంటారు. ఇక్కడో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. భవనంలో కన్పించేవారంతా మహిళలే. అందరూ గర్భవతులే. కాకపోతే వారు మోసేది మాత్రం తమ సొంత బిడ్డలను కాదు. విదేశీ బిడ్డలను. నవమాసాలు మోసి కని ఇచ్చి వెళ్లిపోవాలి. అంతవరకే వారి పని. అందుకోసం వారికి చక్కటి ఆహారం, వైద్యం, వసతి అందిస్తారు. అయితే బిడ్డను కనిచ్చే వరకు ఆ భవనాన్ని దాటిపోవడానికి లేదు. భర్తా పిల్లలూ ఎప్పుడైనా తమను చూడాలనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చు. అదీ పగటిపూట మాత్రమే అనుమతి లభిస్తుంది. పిల్లలను, భర్తను వదిలి అన్ని నెలల పాటు వంటరిగా కానివారి మధ్య, పరాయి బిడ్డను మోయడమంటే చిన్న విషయం కాదు. పైగా తాము మోస్తున్న బిడ్డమీద మాత్రం వారికి ఎటువంటి మమకారం వుండకూడదు. తర్వాత ఆ బిడ్డకు లాలపోయడానికి, జోల పాడడానికి, రాత్రుళ్లు కథలు చెప్పడానికి కూడా వుండదు. వారెక్కడో వీరెక్కడో. బిడ్డను ఇచ్చేసి తమకు ముట్టచెప్పిన పైకంతో తొమ్మిది నెలల తర్వాత సొంత గూటికిి చేరతారు. పిల్లల చదువుకోసం, అప్పులు తీర్చడంకోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, ఆటో/ఇల్లు కొనుక్కోవడం కోసం ఆ డబ్బును వెచ్చిస్తారు. పేదరికమే అందుకు వారిని ఒప్పిస్తుంది.
'గే'లూ పిల్లలు కనొచ్చు!

ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు 'గే' వివాహాలను, సహజీవనాన్ని అనుమతిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత అనుమతించినా, సమాజం చూసీచూడనట్టు వదిలేసినా అసహజ బంధాలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. బిడ్డలు కావాలన్న కోరికను చంపుకోలేరు. అటువంటి వారికి సైతం సరొగసీ వరంగా మారింది. అందుకు అత్యంత అనువుగా వున్న భారతదేశం వారికి ప్రియాతిప్రియమైన ప్రదేశంగా మారింది. అలాంటి జంటే ఇజ్రాయిల్‌కి చెందిన యొనాటన్‌-ఒమర్‌ఘెర్‌. అందరిలాగే తమ ఇంట్లోనూ పిల్లల కేరింతలు వినిపించాలనుకున్నారు. అందుకోసం మొట్టమొదటిసారిగా 2008 జనవరిలో ముంబై వచ్చారు. బంద్రాలోని సంతానసాఫల్య కేంద్రంలో వైద్యులు యొనాటన్‌ వీర్యం సేకరించి మరొక దాత అండంతో ఫలదీకరించి అద్దెతల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం ఆ 'గే' జంట కలల పంట చేతికొచ్చింది. ముద్దులొలికే బిడ్డను తీసుకొని ఆ జంట స్వదేశం వెళ్లిపోయింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 377 సెక్షన్‌ ప్రకారం 'స్వలింగ సంపర్కం' అసహజ ప్రక్రియే అయినప్పటికీ ఇండియాలో 'గే', 'లెస్బియన్‌' జంటలు అద్దె గర్భం ద్వారా బిడ్డను కనడానికి ఎటువంటి ఆటంకం లేదనడానికి ఇదో ఉదాహరణ.
తొలి అద్దె తల్లి

'ఇంతకీ మన దేశంలో తొలిసారిగా తన గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ ఎవరబ్బా?!' అన్న ప్రశ్న మెదళ్లను తొలచివేస్తుంది. 1994 జూన్‌ 23న మన దేశంలో తొలిసారిగా అద్దె గర్భంలో ఊపిరి పోసుకున్న చిన్నారి భూమి మీదకొచ్చింది. ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియడానికి ఎనిమిదేళ్లు పట్టింది. బ్రిటన్‌లో నివసించే తన కుమార్తె కోసం ఓ తల్లి తన గర్భాన్ని అరువిచ్చిన అరుదైన సందర్భమది. అయితే అప్పటికీ ఇప్పటికీ వైద్య రంగంలోనేగాక సమాజ ఆలోచనల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెలకొన్న 200,000 ఎఆర్‌టి (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ) ఆసుపత్రులే అందుకు నిదర్శనం.
సరొగేట్‌ మదర్‌ అంటే..
పురుషుడి వీర్యాన్ని, స్త్రీ అండాన్ని నాళికలో ఫలదీకరిస్తారు. ఆ పిండాన్ని ఆరోగ్యవంతమైన గర్భసంచి వున్న మహిళలో ప్రవేశపెడతారు. ఆమె నవమాసాలు మోసి ఆ బిడ్డను కంటుంది. ఇలా వేరొకరి బిడ్డను తన గర్భంలో మోసి కనే మహిళను సరొగేట్‌ మదర్‌ అంటారు. మనం ఇల్లు అద్దెకిచ్చినట్టు ఈమె తన గర్భాన్ని అద్దెకిస్తుందన్నమాట. 
తెలుగునేలపై అద్దె తల్లులు
'అబ్బే! గర్భాన్ని అద్దెకివ్వడమేంటి అసహ్యంగా' అనుకున్న మన రాష్ట్రంలోనూ ఇవాళ ఆ పని నిరాటంకంగా సాగిపోతోంది. ఒక్క రాజధాని నగరంలోనే నెలకు ఎనిమిది నుంచి పది మంది అద్దె తల్లులు బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఖండాలనుదాటి తండాలకూ పాకుతోందీ అద్దె మహమ్మారి. కాకపోతే ఇక్కడ దళారులదే రాజ్యం. నిస్సంతుల నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి అమాయక గిరిజన మహిళల చేతిలో యాభై వేలు పెట్టి మిగతా పైకాన్ని కొట్టేస్తున్నారు. తాగుబోతు భర్తలకు మందు పోయించి మత్తులో ముంచేసి అప్పులిచ్చి రెండేసి సార్లు వారి మహిళల గర్భాన్ని అద్దెకివ్వడానికి ఒప్పిస్తున్నారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో మాదిరిగా వీరుకూడా తొమ్మిది నెలలపాటు అయినవారికి దూరంగా మరొకరి బిడ్డలను మోస్తుంటారు భారంగా.
ఎవరికోసం?
సంతానం లేని వారి కోసం ఈ 'సరొగసీ' వచ్చింది. అందుకు కారణాలు అనేకం.
గర్భాశయం పిల్లలు పుట్టడానికి అనువుగా లేకపోవడం.
ఎక్కువగా అబార్షన్లు కావడం.
గర్భ సంచి చిన్నగా వుండడం.
గర్భ సంచికి ఇన్‌ఫెక్షన్లు రావడం.
అనేకసార్లు ఐవిఎఫ్‌ ప్రయత్నాలు విఫలమైనవారు, గుండెజబ్బులు, మూత్రపిండ, కాలేయ మార్పిడి జరిగినవారు...
పలు కారణాలవల్ల గర్భసంచి తొలగించబడిన వారు పిల్లలను కనలేరు. వీరికి ఐవిఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతాన భాగ్యం కలిగిస్తున్నారు వైద్యులు. 
తారల 'అద్దె' బాట
'సొంత రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే కావాలి. పరాయి రక్తం వద్దు' అనుకుంటే మాత్రం 'టు లెట్‌' బోర్డులను వెతుక్కోవాల్సిందే. విదేశీయులేకాదు. సెలబ్రిటీలూ అదే రూటు పడుతున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు, సెలబ్రిటీలకు అద్దె తల్లులు పరిచితులే. ఆ మధ్య వచ్చిన 'చోరీ చోరీ చుప్కే చుప్కే, ఫిల్హాల్‌' చిత్రాలలో వారు కనిపిస్తారు. అందాకా ఎందుకు! ఇటీవలే బాలీవుడ్‌ జంట ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావ్‌లు అద్దె తల్లి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారన్న విషయం తెలిసిందే. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కిరణ్‌రావ్‌ కృత్రిమ సంతాన సాఫల్య పద్ధతులను అనుసరించాల్సి వచ్చింది. హాలీవుడ్‌ స్టార్లకు అద్దె తల్లులు కొత్త కాకపోయినా బాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి ఆనందాన్ని నలుగురితో పంచుకున్న వ్యక్తి ఆమిర్‌. దీనివల్ల ఇటువంటి శాస్త్రీయ విధానాలకు సామాజికంగానూ ఆమోదం లభించే అవకాశాలున్నాయని పలువురు హీరోగారిని ప్రశంసిస్తున్నారుకూడా. హాలీవుడ్‌ తారలు నికోల్‌ కిడ్‌మాన్‌-కెయిత్‌ అర్బన్‌, సారా జెస్సికా పార్కర్‌- మాథ్యూ బ్రాడెరిక్‌, డెన్నిస్‌ క్వైడ్‌-కింబర్లే... అద్దె తల్లుల ద్వారా బిడ్డలను కన్నారు. పాప్‌ గాయకుడు రికీ మ్టాన్‌ సింగిల్‌ పేరెంట్‌గా అద్దె గర్భం ద్వారానే కవలలను పొందాడు. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్‌ జారు, ఆయన భాగస్వామి డేవిట్‌ ఫర్నిష్‌ లు 'గే' జంటగా ఈ పద్ధతిలోనే బాబును కన్నారు.
మనసు మాట వింటుందా!
ఆర్థిక పరిస్థితులు గర్భాన్ని అద్దెకివ్వడానికి ప్రోత్సహించినా నవమాసాలు మోసి కన్న బిడ్డ మీద ఎలాంటి బంధం వుండకూడదంటే సాధ్యమేనా! కన్న మరుక్షణం పరాయివారికి అందించడం ఆ తల్లి వల్లవుతుందా? బిడ్డ కదలికలను ప్రతిక్షణం అనుభూతించిన ఓ సాధారణ తల్లి అకస్మాత్తుగా తనను వదిలిపెట్టగలదా? మనసు ఆమె మాట వింటుందా? ఒకవేళ సర్దిచెప్పుకున్నా అప్పటివరకు శరీరభాగంగా వున్న బిడ్డకోసం మనసు ఆరాటపడకుంటుందా? కన్నబిడ్డకు పాలివ్వకుండా వుండగలదా? మరెప్పుడైనా ఆ బిడ్డను చూడాలనిపిస్తే ...? చుట్టుపక్కలవారు, చుట్టాలు దీన్ని ఎలా తీసుకుంటారు? అసలు శారీరక సంబంధం లేకుండా బిడ్డను కనడమేంటి... కాకమ్మ కథలు కాకపోతే? వంటి అనుమానపు ముళ్లు గుచ్చుకుండా వుంటారా? వాటిని తట్టుకోలేకే ఆ తొమ్మిది నెలలపాటు వనవాసం చేయాలనుకుంటారా? ఒకవేళ అలా వున్నా తర్వాత బిడ్డేమైందంటే ఏం చెప్తారు? ఇప్పుడంటే వయసులో వున్నారు కాబట్టి బిడ్డను మోసి కని ఇచ్చేస్తారు. పదే పదే గర్భాన్ని అద్దెకిచ్చి ఆరోగ్య సమస్యలు తలెత్తితే బాధ్యత ఎవరిది? వంటి వేలాది ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. పేదరికం, మరో మార్గం లేనితనం కూడా అన్నిటినీ మౌనంగా భరించే శక్తినిస్తుందేమో!
ఏమైనప్పటికీ తల్లి గర్భాన్ని సైతం సరకుగా భావించి బిడ్డల్ని తీసుకెళ్లే ధోరణి పెరుగుతూనే వుంది. పేదరికంలో మగ్గేవారికి ఆ తర్వాత పౌష్టికాహారం లభించడమూ కష్టమే. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆలకించే నాథుడే వుండడు. వైద్యం చేయించే దిక్కే వుండదు. అందుకే ప్రభుత్వమే చట్టం చేసి స్పష్టమైన నియమనిబంధనలు ఏర్పాటుచేసి అద్దె తల్లులకు ఆలంబనగా నిలవాలి మరి.
ఎవరు అర్హులు?
తమ గర్భాన్ని అద్దెకివ్వాలంటే అంటే సరొగేట్‌ మదర్‌ కాబోయేవారికి సంబంధించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ కొన్ని నిబంధనలు విధించింది. వారికి...
పెళ్లయి పిల్లలుండాలి.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా... హెపటైటిస్‌, హెచ్‌ఐవి వంటి వ్యాధులు వుండకూడదు.
45 సంవత్సరాలలోపు వుండాలి.
గర్భం ధరించడానికి పూర్తిగా అర్హతగలిగినవారుగా ఆసుపత్రి వారు నిర్థారించాలి.
పైగా తమ సొంత పిల్లలతో సహా ఐదు సార్లు మాత్రమే గర్భం ధరించాలి. అంతకు మించితే గర్భాన్ని అద్దెకివ్వడానికి అనర్హులు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి