నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ ఉండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా, పాతికట్లకంటే తక్కువ తిన్నవాడు లేడు. అందుకనే ఆమెని అట్లబామ్మ అనేవాళ్లం. ఎల్లా చేసేదో ఆ పిండిలో 'ఏం కలిపేదో' ఎవరికీ తెలియదు. ఒకసారి నేను మా చెల్లెలుగారి ఊరు వెళుతున్నా. మా చెల్లెలు గర్భంతో ఉండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరం రాసింది. బామ్మ ఏం చేసిందంటే, పిండి కలిపి ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బి బోర్లించి, గుడ్డ వాసిన కట్టి, నన్ను ముందు తీసుకెళ్లమంది. మర్నాడు తను బయలుదేరి వస్తానంది. చేబ్రోల్లో మధ్య ఒక రోజు దిగాను. మర్నాడు తెల్లవారి రైలుకొచ్చి, మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటుఫారం మీద నుంచున్నా. దగ్గిర వున్న వాళ్లందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక ఎందుకన్నా మంచిది పోనీ అని, నా మూటా గిన్నా తీసుకుని నేనూ వాళ్ల వెనకాల వెళ్లి నుంచున్నా. వాళ్లు నాకేసి కోపంతో చూసి వెనక వొదిలిన చోటికే వెళ్లి మళ్లీ నుంచున్నారు. ఆలోచించా ఎందుకట్లా ఏడిపిస్తున్నారని. ఒకవేళ ఈ అట్లపిండి వాసనేమో. కాని మా ఇంట్లో వాళ్లందరికి చాలా అలవాటే. అదిగాక ఆ వాసన తగిలేటప్పటికి సంతోషం కూడాను. ఈ కాస్త భాగ్యానికే ఇంత హడావుడా? ఎంత సుకుమారం అబ్బా అనుకున్నా.
రైలంతా కిక్కిరిసి ఉంది. నేనెక్కిన పెట్టెలో ఆ వూరి వాళ్లెవరూ ఎక్కలేదు. వాళ్లు కనిపెట్టే ఉన్నారు నేనెక్కడ ఎక్కుతానో చూస్తా.
నేనెక్కిన చోట ఇది వరకే పదిమంది ఉన్నారు. చోటు లేదన్నారు. కాని నా తప్పాల ముందు తోసి, వెనకాల నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్లమీద పెట్టి, ఇద్దరు లావాటివాళ్ల మధ్య ఇరికి, చాలా వుక్కగా ఉందండీ ఇవాళ అన్నాను. రెండు నిమిషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలుపెట్టాడు. ''చాలా ఉక్కగా ఉందండీ ఇక్కడ'' అని పెద్ద ట్రంకోటి మోసుకుని బయటికి బయలుదేరాడు. ''ఇంకోచోట అసలు ఒకరిమీద ఒకరు నుంచున్నారండి'' అన్నా ఆగలా. రెండో లావాటాయన కూడా లేచి వెనకాల వెళ్లాడు. ఒకర్ని ఒదిలి ఒకరు ఉండలేరు గాబోలు అనుకుని హాయిగా సర్దుకున్నాము.
ఇంతలో తక్కిన వారందరూ ''హూ...హూ...'' అని ముక్కుల్తో అనడం మొదలుపెట్టారు. ఒకాయన మీద తెల్లని బొట్టు పడ్డది. పైకి చూస్తే తాప్పాల్లో పిండి కారుతోంది. బండి అంతా పరిమళం. హఠాత్తుగా ఒకమాటైనా ఆడకుండా, పలుగురు లేచి బస్తాలు, ట్రంకులు దింపుకుని బయిటికి నడిచారు. మిగిలిన వాళ్లం హాయిగా కాళ్లు జాచుకున్నాం. మిగిలిన వాళ్లల్లో ఒక బ్రాహ్మడు, శవం వాసన'' అన్నాడు. ఆ మాటల్తో అదిరిపడి, ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ల కాళ్లకి ఒకళ్లు అడ్డం పడుతూ, బండిలోనుంచి కిందికి దొర్లారు. రైలు కదులుతోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయనా మిగిలాం. ''ఏమిటండీ ఈ కొంచానికి ఇంత హడావిడి చేస్తారు వీళ్లు. అంతా వేషం!'' అన్నాడు. ఆయనకి చాలా జలుబు చేసింది. కాని రైలు బయలుదేరిన కాసేపటికల్లా, ఒక్కసారి గాలి రివ్వున కొట్టేప్పటికి చాలా బాధపడడం మొదలుపెట్టాడు. ఆ జలుబూ గిలుబూ వొదిలిపోయింది. తరవాత స్టేషనులో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచమైన పని చేశాడనుకున్నా.
తరవాత బండి అంతా నాదే. ప్రతి స్టేషనులో మనుషులు అటూ ఇటూ చూచి, హాయిగా ఒక్కణ్ణి నిశ్చింతగా కూచున్న నన్ను నా బండిని చూసి, కళ్లు కుట్టి, ''ఒరేరు శంకరయ్యా! ఖాళీ బండిరా. ఇట్లారా! అని ట్రంకులూ, సంచులూ మోసుకొచ్చి తలుపు తెరచి మెట్లెక్కి ముక్కుతో ఇటూ ఇటూ వూది, బండికేసి నా మొహంకేసి, చూసి అమాంతం వెనకాల వాళ్లమీద విరుచుకుపడేది. అందరూ అంతే. ప్రతి స్టేషను దగ్గరా అంతే. ఏమెరగనట్టు అటుకేసి మొహం తిప్పేసి కూచున్నా. రయిలు కదులుతున్నా, అట్టే వుండిపోయినారు గాని, నా బండిలో మాత్రం ఎక్కలేదు.
గిన్నె దించుకుని, హాయిగా గోదావరి స్టేషన్లో దిగాను. కూలీ మా ఇంటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తిమీద పెట్టాను. దించాడు. ''రానండి'' అని వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి రెండణాలకొస్తానన్నాడు. గిన్నె నెత్తిన పెట్టుకున్నాడు. కష్టంతో బళ్లదాకా నడిచాడు. దింపాడు. ''నా చాతకాదండి బాబూ'' అని వెళ్లాడు. పావలా ఇస్తానని కేకేశా. మాట్లాడకుండా నెత్తిమీద గుడ్డ తీసుకుని, వాసన చూసుకుంటూ పోతున్నాడు.
ఆఖరికి అర్థరూపాయికి బండి మాట్లాడుకున్నాను. వాడు మాత్రం వొదలదలచుకోలా. అసలు రెండణాల మామూలు మా చెల్లెలుగారింటికి. ఒక నిముషం తరువాత ''బాబూ కేవుచాలదు. ముప్పావలా ఇప్పించాలి'' అన్నాడు. కొంచెం దూరం తోలాడు. ''ఒక రూపాయి ఇచ్చినా కష్టం చాలదు'' అని ఆపాడు. ఏం కష్టం అది అతనికే తెలియాలి. ఎంత కష్టంగా లేకపోతే, అంత నశ్యం పీలుస్తాడు? సరేనన్నా. ఏం చెయ్యను? అంతకంటే మళ్లీ రూపాయిన్నర కావాలి అనబోతున్నాడు. ఇంతలో గోదావరి మీదనుంచి గాలి విసిరింది ఎద్దు వైపు. ఎద్దు పరుగు మొదలుపెట్టింది. గుర్రం పనికిరాదు. వెనకనుంచి ఏం వస్తూందనుకున్నదో, ఏమిటో. బండి ఎవరి మీదనుంచన్న పోతుందనుకున్నా. కాని బండి రాకముందే, గాలి తగలగానే ఎక్కడున్న వాళ్లు అక్కడే ఇళ్లల్లోకి, దుకాణాల్లోకి, పక్క సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగితేనా? నలుగురు ఎద్దుని పట్టుకున్నారు. ముక్కులవతలకి తిప్పేసి. అప్పటికీ ఆగకపొయ్యేదే. బండివాడు దూకి ఎద్దు ముక్కుకి గుడ్డ కప్పేసి, నశ్యం వాసన చూపించకపోతే. ఇంటి లోపలికి వెళ్లాము గిన్నా నేను. చెల్లెలూ పిల్లలూ పరిగెత్తుకుంటూ ఒచ్చారు. ''అన్నయ్యా'' అనీ, ''మామయ్యొచ్చాడు, మామయ్యొచ్చాడ''నీ గదిలోకి. గుమ్మం దగ్గర అందరూ తటాలున ఆగారు. కష్టంమీద మా చెల్లెలు మాత్రం మొహం మీద పమిటకొంగు కప్పుకుని వచ్చి, యేడుస్తా నన్ను కావలించుకుని, ''అన్నయ్యా! యెందుకు దాస్తావు చెప్పు నాతో. యేం ఘోరం జరిగిందో'' అంది. ఏం లేదమ్మా బామ్మ ఇచ్చిన అట్లపిండి'' అన్నాను.
బామ్మ రాత్రి కూడా రాలేదు. మూడు రోజులు చూశాం. రాలేదు. ఏం కదిపితే ఏమవుతుందో అని ఆ గిన్నెని అట్లానే ఉంచాం. ఆ తలుపు మాత్రం గొళ్లెం వేసి, తాళం వేసి, శీలు చేసి, చిల్లుల్లో గుడ్డపేలికలూ అవీ కుక్కాము. ఎవరం ఆ వేపు పోలేదు. నేను స్నానం చేసి, సబ్బుతో కడుక్కున్నాను. కాని ఇంకా బజార్లో నా గాలి తగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు తప్పుకునేట్టు తప్పుకోవడం మానలేదు. రెండు రోజులుండి మా చెల్లెలు, అట్ల ఆశ వదులుకుని ఇంక వూరుకోలేక ''ఈ పిండిని బామ్మ ఏం చెయ్యమంది'' అని అడిగింది. ''ఒచ్చిందాక ముట్టుకోకుండా అట్లానే ఉంచమంద''న్నాను. చెప్పడమెందుకు, దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజులూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు. ఆడుకోరు. అక్కడక్కడ దిగాలుగా చతికిలపడతారు. చంటిపిల్ల కారణం లేకుండా మారంపట్టి యేడుపు. బామ్మకి ఉత్తరాలు రాశాం. రిప్లయి ప్రీపెయిడు టెలిగ్రాములిచ్చాం! జవాబు రాలేదు.
నాలుగో రోజున మా చెల్లెలంది ''ఒక్క రూపాయి ఇచ్చి, దీన్ని అవతల పారేయిస్తే బామ్మ కోప్పడుతుందా?''
''ఆ. తప్పకుండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చెయ్యదు. నవ్వదు. మాట్లాడదు. మన మొహం చూడదు. అయినా రూపాయికి ఎవడు పారేస్తాడు. ఒట్టి పీనిక్కి పది రూపాయలు తీసుకుంటాడే'' అన్నాను.
వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు, అబ్బాయికి జ్వరం, చిన్న పిల్లకి పొంగు, మా చెల్లెలికి ఆరో నెల నొప్పులు. ఏం చెయ్యం. ఎవరితో చెప్పకుండా ఇల్లు తాళం వేసి, సత్రానికి పోయాము.
ఇన్నాళ్లు మా బావ వూళ్లో లేడు. మేం సత్రానికెళ్లిన మర్నాడు ఊళ్లో దిగి ఇల్లు తాళం వేసుంటే మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాడు. అతని వెనకాల పెద్ద గుంపు.
చుట్టుపక్కల వాళ్లందరూ ''ఇల్లు తెరుస్తారా? లేదా? లోపల నూరు కూనీలన్నా జరిగాయి. మరియాదస్తులనుకున్నాను. సత్రానికొస్తే దాగుతుందా?'' అని ఒకటే అరుపులు.
మునిసిపాలిటీ వారు ఇల్లు తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెయ్యం. జబ్బు పిల్లల్నేసుకుని వెనకాలికెళ్లాము.
అర్థరాత్రి నేనూ, మా బావ మూతులకి గుడ్డలు కట్టుకుని ఒక సెంటు బుడ్డి మీద గుమ్మరించుకుని ఆ తప్పాల భుజాల మీద మోసుకుంటూ గోదావరివేపు బయలుదేరాం. నిద్దర్లో మనుషులు కలవరించారు. కేకలు పెట్టారు. తొందరగా వెళ్లి, శేషయ్య మెట్ట దగ్గర నావ తీసుకుని నీళ్ల మధ్యకు పోయి గిన్నె పళంగా గోదావరిలో పడేశాం. నీళ్లల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కానీ మూత తీస్తే, లోపలినుంచి ఏమొస్తుందో, ఏదన్నా విష జంతువు బయలుదేరుతుందేమో అని భయమేసింది. రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తిపోయింది. ఒక్కడూ నీళ్లు ముంచుకోలేదు. ఏదో చాలా ఉపద్రవం రాబోతుదని వూళ్లో పుకారు. రైలు బ్రిడ్జిమీద, రూల్సుకి వ్యతిరేకంగా ముప్పైమైళ్ల వేగంతో పోతోంది. పెద్ద పెద్ద చేపలు చచ్చి తేలుతున్నాయి. కాని ఒక్కరూ వాటిని ముట్టుకోరు. గోదావరి దాటే పిట్టలు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ, వలలూ వేసుకుని గోదావరి కెలికి, గిన్నెని పట్టి బయటికి తీశారు. యెట్టా కనుక్కున్నారో ఏమో. హాయిగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదికి అర్థరాత్రి హఠాత్తుగా వెళకువ వొచ్చింది. వూపిరి పీలవడం అసాధ్యమై తంటాలు పడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆ వుపద్రవం ఏమిటని వెడితే, అరుగు మీద ఆ గిన్నె వుంది. వెంటనే ఆ గిన్నెని తీసుకెళ్లి వూరి బయట దూరంగా శ్మశానంలో నడువు లోతున గుంట తీసి ిపాతి పెట్టించాం. మర్నాటికి కలెక్టరుకీ, ఛైర్మన్‌లకీ పెద్ద మాన్‌స్టరు అర్జీలు వెళ్లాయి. వాసనకి దెయ్యాలన్నీ లేచి శ్మశానంలోంచి ఊళ్లోకి బయలుదేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి ప్రాసిక్యూషన్ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము. అనంతపురంలో మేం ఒకరికి అయిదు వేలు బాకీ. ఆయన పేర దీన్ని బంగీకట్టి పోస్టాఫీసుకు తీసికెళ్లాం. యిరవయి రూపాయలు లంచమిస్తేగాని ఆ గుమస్తా బంగీ తీసుకోలా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకు సెలవు. ఆ సాయంత్రం రైలు గోదావరి స్టేషన్కి అరమైలు ముందే ఆగింది. మర తిప్పినా ఇంజన్ కదలలేదు. చివరికి యేం చేశారో తెలియదు. వార్తా పత్రికల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంతపురంలో ప్లేగు మొదలుపెట్టిందని చదివాం. ఆయన ఇంతవరకూ అప్పుకోసం అడగలేదు. ఆయనకి ఆరుగురు కొడుకులూ, పదిమంది మనుమలూ ఉన్నారు. వాళ్లెవరూ ఇంత వరకు మాకు ఉత్తరం రాయలేదు.
నాకు నచ్చిన గురజాడ కథ -శ్రీశ్రీ
కథారచనలో నన్ను మించిన వాళ్లెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్కువే గానీ గుణంలో మాత్రం ఒక్కొక్కటీ ఒక్కొక్క వజ్రపు తునక. అన్నిటిలోకి మిన్నగా నాకు నచ్చిన కథ ''మీ పేరేమిటి?'' అనేది.
దీని పూర్తిపేరు ''దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా మీ పేరేమిటి?'' అని. సుమారు వంద సంవత్సరాల క్రింద విజయనగరం దగ్గరలోని ఒక కుగ్రామం ఈ కథకి రంగస్థలం. అయినా దీన్ని చదువుతూ ఉంటే ఇందులోని సంఘటనలన్నీ నిన్న గాక మొన్న జరిగినట్లుంటాయి.
అన్ని గ్రామాల్లోలాగే ఇక్కడ కూడా రెండు పార్టీలుంటాయి. అయితే అవి మతానికి సంబంధించినవి. ఒక పార్టీ శైవులది. మరో పార్టీ వైష్ణవులది. శైవులది పేదవాళ్ల పార్టీ. వైష్ణవులది గొప్పవాళ్ల పార్టీ (ఇటువంటి రాజకీయ విశ్లేషణ ఆనాడే గురజాడ జరిపి ఉండడం ఒక విశేషమే!).
ద్వాదశి ద్వాదశికీ వైష్ణవులు పులిహోరా, చక్రపొంగలి ఆరగిస్తూ ఉంటారు. ఇటువంటి భోగాలు శైవులకి లభ్యంకావు. వాళ్ల దేవుడయిన శివుడి దగ్గర ఏముంటుంది బూడిద తప్ప!
జంగం శరభయ్య శైవాలయంలో పూజారి. వైష్ణవులకు కెప్తాను సాతాని మన వాళ్లయ్య. వీళ్లిద్దరి మధ్యా అగ్గివేస్తే గుగ్గిలంలా ద్వేషం మండుతుంది. శరభయ్య తాను నందికేశ్వరుడి అవతారమని చాటుకుంటాడు. మన వాళ్లయ్య తానయితే గరుడాళ్వార్ పూర్ణావతారం కాకపోయినా, అప్పుడప్పుడు గరుత్మంతుడి గోళ్లు ఖండన అయితే వాటి అంశలో తాను జన్మించినట్లు చెప్పుకుంటాడు. అయితే శైవుల్ని చీల్చి చెండాడుతున్నానని సగర్వంగా ప్రకటించుకుంటాడు.
ఇందులోని అనేకానేక మహద్గుణాలలో గురజాడ మహత్తర కథన కౌశలం ఎంతో ఆశ్చర్యకరమైనదని మాత్రం ఇక్కడ చెప్పదలచుకున్నాను. ''కన్యాశుల్కం''లోని నాటకీయత కూడా ఈ కథలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇందలి పాత్రలన్నీ ''కన్యాశుల్కం'' నాటకంలోని పాత్రల్లాగే సజీవమైనవి. ఇందలి సంఘటనలన్నీ కథ చదువుతున్నంతసేపూ మన కళ్లెదుట కట్టినట్టుగా కనిపిస్తాయి.
అక్కడే ఉంది గురజాడ గొప్పతనం.
(స్వాతి వార పత్రిక, 15-8-1986)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి