11, ఫిబ్రవరి 2012, శనివారం

చార్మినార్ చుట్టూ అల్లుకున్న బతుకు తీగలు


పొద్దున షేరింగ్ ఆటోలో ఒకాయన జనుము సంచీతో ఎక్కాడు. రైతుబజార్‌కు తీసుకెళ్తున్న ఆ సంచీ... చాలా పరిచితమైన వాసన, కాని నేను మరిచిపోయిన వాసన వీయడంతో క్షణకాలం కళ్లు మూసుకున్నాను. శనగ చెట్ల ఉప్పదనపు వాసన! అది నా మూలాలతో ముడివేసుకున్న దేనినో తడిమింది. చార్మినార్ కూడా అలాంటి ఒక సాంస్కృతిక మూలం. దీన్ని తడిమితే?

మొదటిసారి చార్మినార్‌ను చూసినప్పుడు నిరాశకు లోనయ్యాను. ఇదేనా చార్మినార్? ఇంకేదో ఉంటుందనీ, ఇంకేదో ఉండాలనీ ఆశించాను. నా ఊహలో ఉన్న ఏవో ఖాళీలను అది పూరించలేకపోయింది. ఇప్పుడైనా అవి భర్తీ అవుతాయా?

...సిద్ధి అంబర్ బాజార్... మహబూబ్ గంజ్... సాలార్‌జంగ్ మ్యూజియం... పురానీ హవేలీ... హిమ్మత్‌పురా... నూర్‌ఖాన్ బాజార్... జెహ్రా నగర్... మీర్ ఆలమ్... బీబీ బాజార్... మొఘల్‌పురా... సుల్తాన్ షాహీ... హరి బౌలి... వెళ్తున్నకొద్దీ తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసిన కట్టడాలు పెరుగుతున్నాయి. షేర్వాణీలు, కుర్తాపైజామాలు, తెల్లటోపీలు ఎక్కువవుతున్నాయి.

పరమాలంకారమైన కళ్లు మాత్రమే కనపడే బురఖా స్త్రీల సాంద్రత అధికమవుతోంది. అదిగదిగదిగో చార్మినార్! మౌనంగా, ఠీవిగా, తనను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న జీవిత నదుల్ని కన్నార్పకుండా చూస్తూ! అప్పుడప్పుడూ పావురాలు తమ రెక్కలు టపటపలాడిస్తూ గుమ్మటాలతో ముచ్చట్లాడుతున్నాయి. ఓ యాభై అరవై మంది విద్యార్థుల బృందం ఒకరికంటే ఒకరు ఎక్కువ మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. భార్యకు చేయెత్తి ఏదో సీరియస్‌గా చూపిస్తున్నాడు కొత్త పెళ్లికొడుకు, తానే ఈ లోకాన్ని కొత్తగా పరిచయం చేస్తున్నట్లు.

ఇక్కడ- ఈ 420 ఏళ్ల చారిత్రక ప్రదేశంలో, కోట్లాదిమంది పాదాలను ముద్దాడిన ఈ నేలమీద నిలబడి చుట్టూచూస్తే... ఎత్తై నాలుగు కమానులు... ఇరుకైన దారులు... చురుకైన మనుషులు. ఒక్కోసారి ఇందరు మనుషుల మధ్య మన పాత్రేమిటో తెలియని గందరగోళం.

‘అస్సలామ్ వాలేకుమ్ బాయీజాన్’
‘వాలేకుమ్ సలామ్’
మీసాలతో గడ్డం, మీసాలు లేని గడ్డం, మీసాలు ఉండీలేనట్టుగా గడ్డం, నల్లగడ్డం, తెల్లగడ్డం, రంగువెలసిన గడ్డం, పొట్టిగడ్డం, పొడుగు గడ్డం, పిల్లిగడ్డం... ఈ గడ్డ మీద ఎన్నిరకాల గడ్డాలు!
అహ్మద్ పచ్చళ్లు... బడేమియా డైరీఫామ్... బిస్మిల్లా పెరల్స్... జహంగీర్ ఎలక్ట్రానిక్స్... షాహీన్ గార్మెంట్స్... నిజామియా జనరల్ హాస్పిటల్(యునానీ), ప్రభుత్వ ఆయుర్వేద చికిత్సాలయం...

బంగారు, వెండి పల్చటిరేకులు తయారు చేసే ఇత్తెహాద్ వరఖ్ షాపులో సుత్తులు ఏకలయలో మోగుతున్నాయి. అటుపక్కగా రోడ్డుపక్కన బట్టలమ్ముతున్న షంషాద్ దవడకు పాన్ బిగిస్తున్నాడు. ఆవైపు నాన్‌మహల్‌లో ఫహీమ్ డబల్‌రొట్టె కాలుస్తున్నాడు. తెల్లబట్టల తాత దగ్గరి ఒక సెంటుబుడ్డిని ముక్కు దగ్గర పెట్టుకొని మరొకాయన పరీక్ష వాసన పీలుస్తున్నాడు.

కుక్క ఒకటి తనను తానే ప్రేమించుకుంటూ నాక్కుంటోంది. అంటించని సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని ఆటో దిగిన పొగరాయుడు పాన్‌డబ్బా దగ్గర ఆగాడు. డబ్బారాయుడు పక్కన చేయి చూపించాడు. ఫర్లేదు, అగ్గి మనదగ్గర ఇంకా ఉచితమే! తన షాపు ముందు పెట్టుకున్న తోపుడు బండిని ‘ఛల్ హఠ్’ అని ఒకతను చేయిని మరోవిధంగా చూపిస్తున్నాడు. అసలే సుర్మా పెట్టుకున్నాడేమో, కళ్లల్లో కోపం ఉన్నదానికంటే ఎక్కువగా కనిపిస్తోంది.

పాత నాణేలను కుప్పగా పోసుకుని అమ్ముతున్నాయన ‘ఆ కుప్పల ఏదైనా పదిరూపాయలు, ఈ కుప్పల్ది ముప్ఫై... హోనా హైతో హాత్ లాగావో, టైమ్‌పాస్ మత్‌కరో’ అని ఊరికే కూర్చుని చూసేవాళ్లను గదమాయిస్తున్నాడు. గుత్తులుగా వేలాడదీసిన కీ చైన్లమీద ‘786’ కనబడుతోంది. చార్మినార్ కట్టడం అంచుల్లోనే ఉన్న భాగ్యలక్ష్మీ మందిరంలో ‘శాంతి’ని కాపాడటానికి పోలీసులు కావలికాస్తున్నారు. మరోవైపు రోడ్డున మినార్‌కు అతి సమీపాన ఉన్న ఇక్బాల్ హోటల్ అతణ్ని అడిగాను. పేరు ఆర్.కె.ఖాన్. ‘హోటల్ ఇక్కడ ఉందికదా, ఏమైనా టెన్షన్‌గా ఉంటుందా ఇక్కడ?’

‘టెన్షన్ ఎందుకుంటుంది? ఆ..రా..మ్’ అన్నాడు. ఈ ప్రశ్న అడిగినందుకు నన్ను నేను ఎందుకు క్షమించుకోవాలి!
ఉన్నట్టుండి నాకోటి స్ఫురించింది. నేనెందుకు ఇంతసేపిక్కడ ముస్లింతనాన్నే వెతుకుతున్నాను? నయీమ్ భాయికి అటుపక్కన ఉన్న శ్రీరాములు ముదిరాజ్, ఇటుపక్కనున్న చంద్రయ్య గౌడ్‌ను ఎందుకు చూడట్లేదు! నా ప్రెజ్యుడిస్ తగలెయ్య!

అదిగో, ఎడమ చెంప మీద లావు పుట్టుమచ్చే అందంగా ఉన్న సింధీ అమ్మాయి నడచుకుంటూ వెళ్తోంది. ఇద్దరు విదేశీయులు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. రంజాన్ కాకపోయినా ఓ చోట ‘చికెన్ హలీమ్’ బ్యానర్ ఊగుతోంది. హలీమ్ ఎప్పుడో మతేతర ఆహారమైపోయింది.

మనుషుల్నే తోసుకుంటూ వెళ్తున్నట్టుగా తోపుడు బళ్లు! నడవని ఆటోను నెట్టుకుంటూ వెళ్తున్నాడొకతను. ‘ఏం నడుపుతున్నవ్ నా ...ల బండి?’ ఆర్టీసీ బస్సు డ్రైవర్లిద్దరూ కొట్లాడుతున్నారు. వాళ్లను చూసుకుంటూ లాడ్ బాజార్‌లోకి వెళ్తే-

గాజులు. గాజులు. గాజులు. ఖలీల్ బ్యాంగిల్ స్టోర్... కిష్టయ్య బ్యాంగిల్ స్టోర్... అహ్మద్, మదిర, సంగం, నవరంగ్, శ్రీనాథ్, పటేల్... ఎన్ని స్టోర్స్! ఎన్ని రంగులు! ఎన్ని హంగులు! ఎన్ని తళుకులు! ఎన్ని బెళుకులు! ఎన్ని వన్నెలు! ఎన్ని చిన్నెలు! మనుషులు మనుషులు రాసుకునేంత దగ్గరగా నడుస్తూ, గాజులను చేతుల్లోకి తీసుకుని దగ్గరగా చూస్తూ... కన్నెపిల్లలు, పిల్లతల్లులు, ముద్దబంతులు, ముత్తయిదువలు! మగవాణ్ని లాలించే స్త్రీ చేతులే అత్యంత అందంగా ఉంటాయీ అనుకుంటే, ఈ గాజులు వాటినే మించిపోయాయేంటి చెప్మా! గాజులు వేసుకుంటూ చూసుకుంటున్న వాళ్ల మురిపాల్ని తనివి తీరా చూడకుండానే ఇంకా ముందుకు వెళ్తే... ఎన్ని, ఎన్నెన్ని దుకాణాలు! తాళాలు, కత్తులు, చెప్పులు, పుస్తకాలు, గిన్నెలు, గడియారాలు, చీరలు, బ్యాగులు, చికెన్, మటన్, బీఫ్, పువ్వులు, బిస్కెట్లు...

ముర్గీ చౌక్‌కు నాలుగు వైపులా ఉన్న గడియారాలు నాలుగు భిన్న సమయాలను సూచిస్తున్నాయేమిటనుకుంటూ గుల్జార్ హౌజ్ వీధిలోకొస్తే... ఎన్ని ముత్యాల, నగల దుకాణాలు! అగ్రవాల్, మోతీలాల్, సంత్‌లాల్, టిబరుమల్... పూనమ్ చంద్, రమేష్ చంద్, సూరజ్‌భాన్, సత్యనారాయణ్...
శివుడి గుడిలో గంట అదేపనిగా మోగుతోంది. కృష్ణా టాకీసులో ‘టార్జాన్’ నడుస్తోంది. ఇక్కడో థియేటర్ ఉందనే తెలియదే!

తమలపాకు అంచుల్ని కత్తిరించి సున్నం, కాసు, భాగం వక్కలు చకచకా వేస్తూ, టకటకా చుడుతున్న పాన్‌షాపు యువకుడి చేతివేళ్లంత వేగంగా ఇక్కడి జీవితం సాగిపోతోంది. అయినా మున్సిపాలిటీ ఉద్యోగి ఫాగింగ్ చేస్తూవుంటే వెలువడే శబ్దపు పొగను ఆగిచూసేంత కుతూహలం ఇంకా మిగిలేవుంది. అదుగో, ఒక మెటల్ స్టోర్‌లో అరవై ఏళ్ల పైబడిన నలుగురు పెద్దమనుషులు సాయంత్రాన్ని టీతో సెలె బ్రేట్ చేసుకుంటున్నారు.

అరే, అక్కడ చూడు, బక్క ముసలాయన రిక్షా తొక్కుతున్నాడు. ఇక్కడొకాయన అల్లమురబ్బా అని నిమిషానికి శ్వాస పీల్చినన్నిసార్లు అరుస్తున్నాడు. ఎవరూ కొనరేం? తల తగిలేంత చిన్న కొట్టులో ఒకతను వర్కుషాపు నడుపుతున్నాడు. చిన్న డబ్బాలాంటి దాన్లో ఒకాయన సైకిల్ పంచరు వేస్తున్నాడు. చిన్న చిన్న సంపాదనలకోసం ఇంత పెద్ద పెద్ద కష్టాలేమిటబ్బా!
దేక్కుంటూ అడుక్కుంటున్న అవ్వ, కళ్లు ఎక్కడో లోతులో ఉన్న ముసలయ్య, చినిగిన బురఖా, కన్నీటి చారిక... కొందరికి జీవితమే రాచపుండు, ఎన్ని మలాములు రాస్తే అది మానాలి!

ఎవరో ఒకతణ్ని తెలుగులో అడ్రస్ అడిగితే ‘నాకు తెలుగు రాదు’ అంటున్నాడు. దీనికి పూర్తి విరుద్ధంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు ట్యాక్సీ డ్రైవర్ లక్ష్మణ్ ‘అన్నా నీకు తెలుగొచ్చా?’ అని నా దగ్గరకు వచ్చి, సెల్ ఇచ్చి, ‘కొంచెం ఈ అడ్రస్ విని చెప్పమ’న్నాడు. ట్యాక్సీ మాట్లాడుకున్న ఇస్మాయిల్ భాగ్యలక్ష్మీ మందిర్ పక్కనే నిలుచున్నానని చెబితే, అదే అతడికి చెప్పాను. ఇంతలో ఇద్దరూ చేతులు ఊపుకున్నారు. కారు సాగిపోయింది. ఎదుటివాళ్లు కాస్త ఓపిగ్గా మనకోసం తలొగ్గగలిగితే, ఈ ప్రపంచంలో మనకు ఏ భాషా రాకపోయినా బతకొచ్చనిపించింది.

ఉన్నవాళ్లు, లేనివాళ్లు, చేయిచాపేవాళ్లు, చేతికి ఎముకలేనివాళ్లు, దుకాణదారులు, కొనుగోలుదారులు, ఆటోవాలాలు, ప్రయాణీకులు, వాహన చోదకులు, పాదచారులు... ఎవరికి వారుగా కనిపిస్తూనే అందరినీ ముడివేసే సామాన్యాంశం ఏదో ఉండేవుంటుంది.
ఇన్ని రకాల శబ్దాల మధ్య ఒక విరామచిహ్నంలాగా, మీమీ జీవనవ్యాపారాలను తాత్కాలికంగా ఆపమన్నట్టుగా, జామా మసీదులోంచి నమాజ్‌కు రమ్మంటూ ‘అజాఁ’ వినిపిస్తోంది.
‘అ...ల్లా...హు... అక్బర్’
విశాలమైన ప్రాంగణం. నల్లచారలున్న బూడిదరంగు పావురాలు... తెల్లరంగు బుల్లిమేకలు... జొన్నలు విసురుతున్నవాళ్లు...

తెలుపు గౌను పాపను నలుపు రంగు పోలీసు ముద్దుచేస్తున్నాడు. పాలరాతి కుర్చీల నునుపుదనం అనుభవిస్తూ సందర్శకులు కూర్చున్నారు. సదాచారులు లోపలికి వెళ్లడానికి ముందటి కొలనులో కాళ్లు కడుక్కుంటున్నారు. పావురాలు వందలుంటాయా? వేలుంటాయేమో! మనుషులకు ఇవి పెద్దగా భయపడుతున్నట్టు లేదు. అనుకుంటున్నానో లేదో, పైనుంచి టప్... కుడిచేతి మణికట్టు మీద పెసర్రంగు రెట్ట! నిజంగానే వీటికి భయం లేదు.

ఫోన్లు స్విచాఫ్ చేయండి, ఇతరులు లోనికి ప్రవేశించరాదు... లోపలి ప్రవేశద్వారం దగ్గరి బోర్డులు. ఇతరులంటే మతేతరులనేకదా! పోనీ, వెనకవైపు వెళ్తే ఎవరూ ఏమీ అనరుకదా!
కుడివైపు ‘మదర్సా-ఎ-హఫ్పాజ్’ విద్యార్థులు... ఎడమవైపు పతంగులు ఎగరేస్తున్న బుజ్జిగాళ్లు... అబ్బబ్బబ్బబ్బా.... ఎంత ఎత్తై గోడలు! ఎన్ని రెట్లు పెరిగితే ఆ పైకప్పు చేతికి అందుతుంది! దేవుడు చాలా ఎత్తున ఉంటాడు అన్న సింబాలిజాన్ని ఇందులో వెతుక్కోవచ్చా!

అప్పటికే చీకటి చిక్కపడుతోంది. వీధుల్లో మనుషుల ముఖాలు తగ్గుముఖం పడుతున్నాయి. వీళ్లంతా ఏమయ్యారు? మసీదు గూళ్లలో పావురాలు వరుసగా నిద్రోయినట్టుగా, వీళ్లంతా ఎక్కడ, ఎలాంటి గూళ్లల్లో ముడుచుకుపోయారు! ఇప్పుడు ప్రశాంతంగా రెణ్నిమిషాలు కూర్చుందాం!

వెలుగుతున్న లైట్లతో చార్మినార్ వన్నెలీనుతోంది. బహుశా, ఎక్కడో కొండమీద, అందుబాటులో ఉండనంత దూరాన ఉంటే చార్మినార్ అందం మరింత పెరిగేదేమో! కవి పొరబడ్డాడుగానీ అందే ద్రాక్ష... పుల్లన!
ప్రజల మధ్యన నిలబడుతూనే నడవటానికి దారి ఇస్తోంది. నికార్సయిన జన చిహ్నం. అయినా చార్మినార్ అంటే ఇన్నాళ్లూ ఒక కట్టడంగానే ఎందుకు చూశాను? దాని చుట్టూ అల్లుకున్న జీవితాలను కదా చూడాల్సింది!

గులాబీ రేకులోంచి ఒక పరిమళపు బిందుసారాన్ని తీసినట్టుగా, ఇక్కడి మట్టిలోంచి అలాంటి రసాన్ని గనక పిండగలిగితే... అది హైదరాబాద్ వాసన వేస్తుందేమో! హైదరాబాద్ కీ ఖుష్బూ!
బట్టలు బేరమాడేందుకు మడిచి కూర్చుండటంతో కనిపించిన ముస్లిం స్త్రీ మట్టెల కాలి గోరింటాకు సాక్షిగా- ఈ స్థలాన్ని నేను ప్రేమించాను. ఇక నిష్ర్కమించాలి! ఖుదా హఫీజ్. దేవుడు నన్ను కూడా కాపాడుగాక!

పూడూరి రాజిరెడ్డి

1 కామెంట్‌: