25, ఫిబ్రవరి 2012, శనివారం

లేడీ కండక్టర్లున్న బస్సుల్లో...


రియాలిటీ చెక్

ఇప్పుడు, ఈ ఉదయాన మెహిదీపట్నం నుంచి బయలుదేరుతున్నాను.

బోర్డులతో నిమిత్తం లేకుండా ఎందులో లేడీ కండక్టర్ ఉందో వెతుకుతున్నాను. డ్రైవర్ ఇట్టే కనబడతాడుగానీ కండక్టర్ ఒక పట్టాన కనబడరు... ఆ ఆఁ.. అదిగో ఆ బస్సేదో వెళ్తోంది... అందులో లేడీనే... పరుగెత్తుకెళ్లినా అది అందలేదు. మళ్లీ వెనక్కి వస్తే, పక్కనున్నాయన అంటున్నాడు: ‘కోఠీకి బొచ్చెడు బస్సులుంటయ్ గదా!’
కోఠీకి ఉంటయ్‌లే అన్నా, మహిళా కండక్టరున్న బస్సు కావాలి నాకు.

ఇంకాసేపు వెయిట్ చేయగానే ఉప్పల్ బస్సొచ్చింది. మెట్రో. ఊఁ.. ఇందులో లేడీ కండక్టరుంది. బక్కపలుచటి కళ్లద్దాలమ్మ. బుడిదరంగు చీర. కాళ్లకు సాక్సు, బట్టబూట్లు. ఉద్యోగినుల బ్రాండ్ పాదరక్షలు. ప్రయాణీకుడొకతను అడిగితే చెబుతోంది: ‘ఉప్పల్ పోతదిగనీ లిబర్టీ మీదికేలి వోదు’
స్పాంజ్‌కు చేయి తడిచేసుకుంటూ టికెట్లు చించుతోంది. ‘అమ్మా చేంజ్ వొస్తయిగదా?’... ‘ఇస్త ఇస్త’
ప్రారంభ స్టాప్ కాబట్టి సీట్ కెపాసిటీకి సరిపడా ఉన్నారు. అందరికీ ఇవ్వడం పూర్తయ్యాక మరోసారి ‘టికెట్’ ‘టికెట్’ అని తిరిగి, ‘రైట్’ కొట్టింది. సిగరెట్ కిందపడేసి డ్రైవరన్న బస్సెక్కాడు. బస్సు కదిలింది. ఒంటిచేత్తో రాడును పట్టుకొని ఇంతకుముందటి ప్యాసెంజర్‌కు చిల్లర ఇచ్చింది.

ముందుకెళ్లి ఒక పెద్ద యూ టర్న్ తీసుకున్నాక, బస్సును రెణ్నిమిషాలు నిలబెట్టి, రోడ్డు పక్కనే డ్రైవర్ ‘కానిచ్చేశాడు’. లేడీ కండక్టర్ల ‘రియాలిటీ చెక్’ అనుకోగానే నాకు తలెత్తిన మొట్టమొదటి సందేహం ఇదే. ఆడవాళ్లు వాళ్ల దేహాన్ని ఎంత ప్లానింగ్‌గా ఉంచుకోవాలి!
మళ్లీ బస్సు కదిలింది.

సీనియర్ సిటిజన్ కోసం ఓ కాలేజీ విద్యార్థినిని లేపింది కండక్టర్.
ఒక ప్రయాణీకుడి దగ్గరికొచ్చి అడిగింది: ‘లేడీస్ ఆరుగురు, మీరొకరా?’
ఏమైనా తేడా వచ్చిందా? నిమిషం లెక్కలుకట్టి, ‘సరిపోయింది, సరిపోయింది’ అని ఏం ఫర్వాలేదన్నట్టుగా నోటితోనే కాదు, అరచేతిని ఆడిస్తూ కూడా సమాధానం చెప్పుకుంది.
ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు, దిగేవాళ్లు దిగుతున్నారు. లక్డీకాపూల్, ఇందిరాపార్క్, ఎక్స్ రోడ్... బస్సు ఊయల్లా ఊపుతుంది. అమ్మ ఒడిలో తలపెట్టుకున్నంత హాయిగా నిద్ర ముంచుకొస్తోంది నాకు.

శివం, అంబర్‌పేట్... బస్సు వెళ్తూనే ఉంది. సినిమాలో చకచకా దృశ్యాలు మారినట్టుగా సీట్లలో ముఖాలు మారిపోతున్నాయి. ఒంట్లో ప్రాణమే లేనట్లుగా ఉన్న ఈమె అలాగే నిలబడి టికెట్స్ ఇస్తోంది. లేనప్పుడు రాడు పట్టుకొని నిల్చుంటోంది. ‘పద్నాలుగు రూపాయల దూరం’ ఆమె అలా వేలాడాల్సిందేనా?

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నారు. వాళ్లకు నిలబడి సీటు ఇస్తే సంతోషిస్తారు, సరే! మరీ కండక్టరుకు కూడా మనం లేచి సీటు ఇవ్వడం... అతిగాలేదూ! పాపం, ఆమె కండక్టర్ అయినందువల్ల ఒక స్త్రీత్వపు ప్రివిలేజ్ కోల్పోయిందా! రామంతాపూర్‌లో సీటు దొరికిందామెకు. ఒక్క నిమిషం రిలాక్స్‌గా కూర్చుని, తర్వాత ఎస్.ఆర్. ఫిల్ చేసుకుంది. దాన్ని బ్యాగులో ఒక అరలో పెట్టేసి, వంద, ఇరవై, పదుల నోట్లను వేటికవే సర్దిపెట్టుకుంది.

అటుపై టికెట్స్ ట్రే నట్టు ఊడదీసి, చింపగా మిగిలిపోయిన టికెట్ ముక్కలను చేత్తో తొలగించి, ఉఫ్‌మని ఊదింది. అబ్బా... మనం కూడా కండక్టర్ అయిపోవాలన్నంత శుభ్రంగా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండగానే, ‘సుయ్...’మని ఎయిర్ రిలీజ్ చేసిన చప్పుడు. ఉప్పల్ వచ్చింది. బస్సు ఆగింది. నయమే, ఇక్కడ టాయ్‌లెట్ ఉంది. ఆమె అటువైపు మాయమైపోయింది.

నేను రెండో లేడీ కండక్టరున్న బస్సుకోసం చూస్తున్నాను. యూసుఫ్‌గూడ, కొర్రెముల, ఇంకేవేవో వెళ్తున్నాయి. 1 2 3 4... అరే ఒక్కటీ కనబడదే. 8, 9... 13, 14, 15.. 16... పదహారవ బస్సులో లేడీ ఉంది. స్వీట్! ఇది కూడా మెట్రోనే. అయితే కంట్రోలర్స్ ఆడవాళ్లకు డ్యూటీ వేసేటప్పుడు మెట్రోల్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

బస్సు కదిలింది. కండక్టరుది నవ్వు ముఖం. నడుస్తున్నప్పుడు గెయిర్ బాక్స్‌కు కాపలాగా ఉండే పసుప్పచ్చటి రాడులో జడచివర్లు చిక్కుకున్నాయి. ఒక్కసారి మెడ వెనక్కి వంగింది. చిన్నపాటి సిగ్గు. డ్రైవర్ క్షణంలో కురులను అందులోంచి ఒడుపుగా తప్పించేశాడు. ఆమె టికెట్స్ ఇష్యూలో పడిపోయి, ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చి, ‘టికెట్’ అంది.

ఇంతకీ ఇది ఎటు వెళ్తోంది? నేను బోర్డు చూడనేలేదు. ‘ఇదేంటీ, ఎటుపోవాల్నో తెలియకుండానే జర్నీ చేస్తున్నారా?’ గమ్యం లేని ప్రయాణం బాగుంది నాకు. లింగంపల్లి వెళ్తోందట. ఠక్కున ‘మాసాబ్‌ట్యాంక్’ అన్నా.
బస్సు వెళ్తోంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు లారీని తోస్తున్నారు. మధ్య మధ్యలో కుదుపులు. ఇంకా వాటికి అలవాటు పడనట్లుగా ఆమె ముఖం చిట్లిస్తోంది.

‘టికెట్’
‘పాస్’
‘పాస్ తియ్యాలి’

నీకేంటి చూపించాలన్నట్టుగా ఉంది అతడి వాలకం. చాలా తాపీగా, తొందరేమీ లేనట్టుగా, పోయేలోపులో తీస్తానన్నట్టుగా, అసలు జేబులోంచి పాస్ తీయడమంటే మాటలు కాదన్నట్టుగా, చాలా కష్టపడి ... మొత్తానికి తీశాడు.

‘లోపలికి రా బాబూ’

‘లోపలికి రండి బాబూ, లోపల ప్లేస్ ఉందిగదా’ కొంచెం పెద్దరికాన్ని తెచ్చుకుని, ఫుట్‌బోర్డర్‌కు రెండుసార్లు, రెండు రకాలుగా చెప్పింది. ఇతను విన్నాడు. కొంతదూరం పోయాక మరొకతను. ‘లోపలికి రా బాబూ...’
‘పది రూపాయల టికెటియ్యి మేడమ్’
‘ఇవ్వాల్సింది ఇవ్వాలా? మీ జేబులో చేంజ్‌ను బట్టి ఇవ్వాలా?’

వెళ్తూ వెళ్తూ ఎవరితోనో ‘లేదక్కా’ అని మాట్లాడింది. రెగ్యులర్ ప్యాసెంజర్ కావొచ్చు. ఎక్కినప్పుడు ఊపిరాడినట్టుగా, ఇప్పుడు లేదు. విపరీతమైన రద్దీ. బస్సులో బస్సు.

కండక్టర్‌గానో, ట్రాఫిక్ కానిస్టేబుల్‌గానో పనిచేయడానికి స్త్రీ జన్మెత్తిందంటేనే ఎక్కడో కలుక్కుమంటుంది. అలాంటిది మనుషుల్ని తోసుకుంటూ, కాళ్లు లోపలికి జరుపుకొమ్మని అభ్యర్థిస్తూ, తన దారి ఏర్పచుకుంటూ, సీటును ఆసరాగా చేసుకుని టికెట్లు చింపుతూ, తగినంత చిల్లర లేదంటే వెనక రాస్తూ, మళ్లీ ఎవరికి ఇవ్వాలో గుర్తుపెట్టుకుని తిరిగొచ్చి చిల్లర ఇస్తూ, అందరికంటే ముఖ్యంగా ‘ఏయ్ చిచ్చా’ అని రోడ్డుపక్కవాళ్లను గేలి చేస్తున్న అల్లరిమూకతో వేగుతూ, బస్సులో నడకలోనే కిలోమీటర్లు చుట్టేస్తూ, పలుచటి కాగితాన్ని ఒకరకమైన చిరుశబ్దంతో చింపగలిగే ఆమె చేతి గోళ్లను కంటిపాపలో ముద్రిస్తుండగానే...

నా పాయింట్ వచ్చేసింది.
ఇప్పుడు ఎటువెళ్తాన్నేను?

తొలి పాయింట్ దగ్గర నిల్చుని తుదిని ఊహించడంలో మజా ఏముంది? ‘తుది’ పాయింట్ దగ్గర నిలబడి, ఏ పాయింట్ నుంచి ప్రయాణం ప్రారంభించామో తలచుకోవడంలో థ్రిల్ ఉంటుందిగానీ!

కొంచెం దూరం ఎల్ ఆకారంలో నడిచి, ప్యాట్నీ పోయే బస్సెక్కాను. స్థూలంగా ఉన్న స్త్రీ. అయినా గొంతు అంత ఉంటుందని ఊహించలేదు. ‘నీదమ్మా టికెట్’, ‘ఏయ్ దిగూ’, ‘ఇంకా నాల్రూపాయలూ’... ఓర్నాయనో, ఈమె సున్నితత్వాన్ని ఉద్యోగం ధ్వంసం చేసినట్టే ఉంది. ‘ఎక్కడికి?’ ఎక్కినవాళ్లను దగ్గరికే వచ్చి, టికెట్ తీసుకొమ్మన్నట్టుగా పిలుస్తోంది. ప్చ్!
విజిల్ మాత్రం సొగసుగా ఊదుతోంది.

సింగిల్ విజిల్.. స్టాప్. డబుల్ విజిల్.. స్టార్ట్. మళ్లీ ప్యాట్నీ స్టాపులో దిగి, ముఖాన్ని పన్నెండుసార్లు అటూ ఇటూ తలాడించి, ఆల్వాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న బస్సెక్కాను. చిక్కటి శ్యామవర్ణపు వనిత. ఈమె చిల్లరడబ్బులు బ్యాగులో కాకుండా పంజాబీ డ్రెస్‌మీద వేసుకున్న చొక్కాలో వేసుకుంటోంది. అదే ఆమెకు ఈజీగా ఉన్నట్టుంది.

ఇక్కడి ఈ దృశ్యం చూడండీ! పాస్ చూపించమని ఓ విద్యార్థిని అడుగుతుంది. పక్కనున్న మరో విద్యార్థి అంటాడు: ‘ఏయ్ మేడమ్ అడుగుతుంది చూపించురా’

అక్కడ దిగేసి, కోఠి బస్సు పట్టుకున్నా. తిరుపతికెళ్లిన నెలరోజులకు పెరిగిన జుట్టుతో ఉన్న కండక్టర్. ఆడవాళ్లు గుండు కొట్టించుకోవడం కొంచెం జీర్ణించుకోలేని విషయమే. కానీ చలాకీగా కనబడింది. చకచకా చిటికెలు వేస్తూ టికెట్లు చించేసి, బ్యాగులో డబ్బులు పోగేసింది.

ప్రయాణీకులు ఎవరి సెల్ సంభాషణల్లో వాళ్లు, ఎవరి కిటికీ చూపుల్లో వాళ్లు, ఎవరి ఆలోచనల్లో వాళ్లు, ఎవరి పత్రికా పఠనాల్లోవాళ్లున్నారు. గాలికి ఆమె జూకాలు ఊగుతున్నాయి.

‘అశోక్‌నగరా? ఓసారాపన్నా’ డ్రైవర్‌ను ఉద్దేశించి ఠింగ్‌మని రాడును కొట్టింది. ప్రయాణికుడు దిగిపోయాడు. నేను కోఠీలో దిగాక గుర్తొచ్చింది, టికెట్ వెనక రాసిన రెండ్రూపాయల చిల్లర. ‘‘అక్కా, బొట్టుబిళ్లలు కొనుక్కో’’

తర్వాతి ప్రయాణం దిల్‌సుఖ్‌నగర్‌కు. ముందు సీట్లో కండక్టర్ ఉంది. నేను వెనక సీట్లో. తల ముందుకు వంచి అడిగాను: ‘మేడమ్, మీరు సర్వీసులో చేరి ఎన్నేళ్లయింది?’

ఈ ప్రశ్న ఎవరు వేశారు, ఎందుకు వేశారన్న శంక లేకుండా ఆమె క్షణం పాటు సీటుకు చేరగిలబడి, ‘11 ఏళ్లు’ అంది. భలే ముచ్చటేసింది. ఆమె పేరు తిరుమల. జుట్టు కొద్దిగా నెరిసింది. పదో తరగతి అర్హత మాత్రమే సరిపోయే ఈ ఉద్యోగంలో చేరాక ఆమె ఎం.కామ్. చేశారట.

ఇప్పుడు ఈ 2012లో స్త్రీలు ఉద్యోగం చేయడం గురించిన చర్చ హాస్యాస్పదంగా కనిపిస్తుండొచ్చుగానీ, సమాజం తన మనుగడకు కావాల్సిన కార్మిక శక్తిని భర్తీ చేసుకోవడానికి ఎవరికైనా పనిచెబుతుంది. పనిలోకి దిగాక కొన్ని బాధలు పడాల్సిందే! ‘డ్యూటీ దిగిపోయేసరికి మానసికంగా, శారీరకంగా చాలా అలిసిపోతాం’ అన్నారు. మరి, లేడీగా ఉండే అదనపు ఇబ్బందులు?
‘డ్రైవర్లు మాతో బానే ఉంటారు, ప్రయాణికులు కూడా చాలామంది బానే ప్రవర్తిస్తారు. అయినా, మనుషులన్నాక మంచివాళ్లుంటారు, చెడ్డవాళ్లుంటారు’.

అందరూ ఒకేలా ఉంటే ఇది ప్రపంచం ఎందుకవుతుంది?

ఆమెకు వెళ్లొస్తానని చెప్పి, దిగి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీ నగర్; అక్కణ్నుంచి నేరుగా మళ్లీ మెహిదీపట్నానికి రావడంతో సాయంత్రమైంది, ఒక సర్కిల్ పూర్తయినట్టు కూడా అయింది. మధ్యలో ‘అల్ఫా’లో సింగిల్ చాయ్, ‘హరిద్వార్’లో ప్లేట్ మీల్స్. అయితే, భౌతికంగా ఎంతదూరం ప్రయాణించినా మానసికంగా చేసుకునే కంక్లూజన్స్ ముఖ్యం.

ప్లెయిన్‌గా బస్సెక్కి కూర్చున్నప్పుడు ఏమీ ఉండదు, దిగేసరికి మనతోపాటు కొన్ని జ్ఞాపకాలుంటాయి. ఆ జ్ఞాపకాల్లో నల్లటి దిగులు కళ్లద్దాలమ్మలు, ఎల్బీ నగర్‌లో తారసపడిన గాలికి పడిపోయే అమ్మాయిలు కూడా ఉంటారు. భర్త చనిపోతే తప్పదన్నట్టు ఇందులో చేరిన వాళ్లు, భర్త చిరుద్యోగంలో ఉంటే చేదోడుగా పనిలోకి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. వాళ్ల గమ్యాలతో నిమిత్తం లేకుండా మనల్ని గమ్యాలకు చేర్చుతూ ఉంటారు.

-పూడూరి రాజిరెడ్డి

పీఎస్: తెల్లారి బస్సులో ఆఫీసుకు వస్తుంటే మగకండక్టరు తనలో తానే విసుక్కుంటు న్నాడు: ‘ఒకడు చేయివెడుతడు ఎక్కడు, ఒకడు దిగుతనంటడు దిగడు. దిమాక్ కరాబ్ ఉద్యోగం. మానిపడదొబ్బాలె’.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి