‘వైరాగ్యమేవ
అభయం, భయం లేకపోవడం నుంచి ైవె రాగ్య భావన కలుగుతుంది’ అని భర్తృహరి
సుభాషితం చెబుతోంది. భయం ఉన్నంతకాలం, ఏ పని చేయాలన్నా ‘ఏవైనా ఇబ్బందులు
ఎదుర్కోవలసి వస్తుందేమో!’ అని వారిని వెనక్కి లాగుతుంది. ఎప్పుడు తమలోని
భయాన్ని పారద్రోలతారో అప్పుడు వారి మనసు వైరాగ్యం దిశగా మళ్లుతుంది.
భయాన్ని దూరం చేయడమంటే... ఋజువర్తన, ధర్మాచరణ, న్యాయపాలన... వంటివి కలిగి
ఉండటం అని అర్థం. భ్రాంతి గొల్పే భయం కాకుండా, మనలను తీర్చిదిద్దే భయం
అవసరం. ఏ భయం ఉండాలి, ఏ భయం ఉండకూడదు... అనే విచక్షణా జ్ఞానం ప్రతిఒక్కరికీ
అవసరం. దానిపై అవగాహన కలిగించేందుకే ఈ ప్రయత్నం...
తప్పు
చేయడానికి భయపడాలి. పాపం చేయడానికి భయపడాలి. అన్యాయం చేయడానికి భయపడాలి.
అధర్మ ప్రవర్తనకు భయపడాలి. హింస చేయడానికి భయపడాలి. ధర్మసంరక్షణకు
భయపడకూడదు. అహింసామార్గంలో ముందుకుసాగడానికి భయపడకూడదు. న్యాయసాధనకోసం
పోరాటం చేయడానికి భయపడకూడదు. పుణ్యకార్యాలు చేయడానికి భయపడకూడదు. ఒప్పు
చేయడానికి భయపడకూడదు.
భయం మానవలక్షణం
అభయం దైవీ లక్షణం. అందుకే
భగవంతుడి హస్తం అభయముద్రలో దర్శనమిస్తుంది. అనవసర భయాన్ని దేవుళ్లు
పోగొడతారనడానికి ఇది సూచిక. మంచి భయం, చెడ్డ భయం అని భయాన్ని రెండు రకాలుగా
వర్గీకరించారు పండితులు. అక్కర్లేని భయం వల్ల పిరికితనం, అవసరమైన భయం వల్ల
విజయం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడికి ఏ
భీతీ లేకపోవడం వలనే... ఋషులను, సాధువులను, పసిబాలుడైన ప్రహ్లాదుడిని
హింసించాడు. విష్ణుమూర్తి చేతిలో మరణించాడు. స్త్రీలోలత్వం కారణంగా
రావణుడు... సోదరులు, పుత్రులను పోగొట్టుకొన్నాడు. చివరకు రాముడి చేతిలో
కన్నుమూశాడు. వరగర్వంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని దుర్భాషలాడాడు. నూరు
తప్పులు పూర్తవ్వగానే శ్రీకృష్ణుని చేతిలో చచ్చాడు. పాపభీతి లేనివారు ఏ
పొరపాటు చేయడానికైనా వెనుకాడరనడానికి పురాణాలు, ఇతిహాసాలలోని ఈ ఉదంతాలే
ఉదాహరణలు.
మానవులకు ధర్మభీతి, పాపభీతి, న్యాయభీతి... వంటి భీతులు ఉండితీరాలన్నది శాస్త్రోక్తి.
ధర్మభీతి...
ధర్మబద్ధంగా జీవించినవారికి విజయం లభిస్తుందనడానికి పాండవులే ఉదాహరణ.
పదమూడేళ్ల ్లపాటు అష్టకష్టాలపాలైనప్పటికీ ధర్మాన్ని వీడలేదు. ‘అధర్మం
చేస్తే చెడు జరుగుతుందేమో!’ అనే భయంతో ధర్మబద్ధంగా ఉంటారనడానికి ఇదే
నిదర్శనం.
పాపభీతి... ధర్మవిరుద్ధంగా నిర్వర్తించే పనులను
పాపకార్యాలు అంటారు. స్త్రీ, వృద్ధ, బాలలను సంహరించడం మహాపాపం. ఇతరులకు
కీడు తలపెట్టని గోవులను హత్య చేయడమూ పాపమే. పాపభీతి లేనివారు మాత్రమే ఈ
విధంగా ప్రవర్తిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
న్యాయభీతి...
‘అన్యాయానికి పాల్పడటానికి భయపడాలి’ అనేది శాస్త్రవాక్యం. యుద్ధం
చేసేటప్పుడు నిరాయుధుడిగా ఉన్న శత్రువుని సైతం చంపకూడదనేది న్యాయం. అందుకే,
యుద్ధం చేయడానికి వచ్చిన రావణుడితో, ‘నువ్వు బాగా అలసిపోయావు. ఈ స్థితిలో
నీతో యుద్ధం చేయడం అన్యాయం. నేడు పోయి, రేపురా! ’ అని పలికి,
న్యాయరక్షకుడయ్యాడు రాముడు.
సామాజిక భీతి... క్రమపద్ధతి,
కట్టుబాటులతో ఉన్న సమాజానికి లోబడి ప్రవర్తించినవారు అందరికీ ఆదర్శ
ప్రాయులవుతారు. లేనినాడు అరాచకం ఏర్పడుతుంది. అందుకే... కట్టుబాట్లను
అతిక్రమిస్తే, సమాజం వెలివేస్తుందనే భయం ఉండి తీరాలంటారు పెద్దలు.
శాస్త్రభీతి...
శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తే నష్టం కలుగుతుందనే భీతి ఉండాలి.
గణితశాస్త్రంలో ‘రెండు రెళ్లు నాలుగు’ అని తెలియక, ‘రెండు రెళ్లు ఐదు’
అనకుండా ఉండాలంటే, ఆ శాస్త్రం తెలిసుండాలి. అవసరమైన జ్ఞానాన్ని వృద్ధి
చేసుకోవాలేగాని, అజ్ఞానంతో వితర్కం చేయకూడదని, అందుకు శాస్త్రభీతి
ఉపయుక్తమవుతుందని శాస్త్రకారులు చెబుతారు.
భయం ఉండకూడదు... ‘భయం’
ఉండకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. సృష్టిలోని సకల ప్రాణులకు, అంటే...
పేడలోని పురుగు నుంచి, మేడలోని రాజు వరకు ‘ఆహారనిద్రాభయమైథునం’
(ఆహారసంపాదన, నిద్ర, భయం, సంసారం) సమానమే. సకలప్రాణులకు భయం సహజగుణం.
జ్ఞానాన్ని సముపార్జించగల శక్తి మనుషులకు మాత్రమే ఉంది. అందువల్ల అనవసర
భయాన్ని పోగొట్టుకొనే విచక్షణ కలిగి ఉంటాడు. కాని జ్ఞానంలేని
పశుపక్ష్యాదులు భయంతోనే జీవిస్తుంటాయి. మానవులు అవసరమైన భయాన్ని వీడక,
అనవసరమైన భయాన్ని దరిచేరనీయక, భయం తాలూకు రేఖలను మాత్రం తమలో ఉంచుకుంటూ
జీవించాలి.
జ్ఞాన సముపార్జనతో భయం తొలగిపోవాలి. ‘‘జ్ఞానాదేవపి
కైవల్యం... జ్ఞానం వల్లే ముక్తి లభిస్తుంది’’ అని వేదం చెబుతోంది.
కర్తవ్య, అకర్తవ్యాలు (చేయదగినవి, చేయకూడనివి) జ్ఞానం ద్వారా మాత్రమే
తెలుస్తాయి. (జ్ఞానం వల్ల కలిగే మనోవికాసాన్ని ‘ముక్త’ అంటారు). దీనివలన
జీవన్ముక్తులవుతారు.
పెద్దలంటే భయం... గురువు, తల్లిదండ్రులు,
జ్ఞానవృద్ధులు... వీరి పట్ల భయభక్తులు కలిగి ఉన్ననాడు, పిల్లలు పేరు
ప్రఖ్యాతులు సంపాదించుకుని పెద్దలు గర్వపడేలా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
తల్లిదండ్రులు, గురువులు దండిస్తారనే భీతి ఉన్నప్పుడు పిల్లలు
తప్పుచేయడానికి భయపడతారు.
నచికేతుడు... నచికేతుడి తండ్రి...
యాగపరిసమాప్తి వేళ, బ్రాహ్మణులకు... బక్కచిక్కిన ఆవులను దానమిచ్చాడు.
అప్పుడు నచికేతుడు, ‘‘తండ్రీ! ఇటువంటివాటిని దానం చేసి పాపం
మూటకట్టుకుంటావా! ఎప్పుడో ఒకప్పుడు నన్ను కూడా ఎవరికైనా దానంగా
ఇచ్చేస్తావా!’’ అని ప్రశ్నించాడు. కోపంతో ‘‘నిన్ను యముడికి దానమిస్తాను’’
అన్నాడు తండ్రి. నచికేతుడు యముడి దగ్గరకు వెళ్లి ‘‘నన్ను నా తండ్రి నీకు
దానంగా ఇచ్చాడు’’ అన్నాడు. ఆ బాలుడిని చూసి, ‘‘నీకు వరమీయాలనిపిస్తోంది,
కోరుకో’’ అన్నాడు యముడు. అందుకు నచికేతుడు, ‘‘యమధర్మరాజా! నాకు జ్ఞానోపదేశం
చెయ్యి’’ అన్నాడు. (కఠోపనిషత్తు). తండ్రి చేసే అధర్మాన్ని నిర్భయంగా
నిలదీసిన నచికేతునిలో ధర్మభీతి ఉందని అర్థమవుతోంది. తండ్రి అయినప్పటికీ
అధర్మంగా ప్రవర్తిస్తే నిలదీయమని చెబుతోంది ఈ కథ. ‘రాముడి దగ్గర నేను
తప్పుగా మాట్లాడతానేమో, అధర్మంగా వర్తిస్తానేమో’ అని దశరథుడికి రాముడితో
మాట్లాడాలంటే భయంగా ఉండేది. అవసరమైన భీతి మానవులను ఉత్తములుగా చేస్తుంది.
- డా. పురాణపండ వైజయంతి
పారమార్థిక భీతి...
తప్పు
చేస్తే నరకానికి పోతారని, మరుజన్మలో నీచమైన జంతుజన్మ ఎత్తవలసివస్తుందనే
భయం ఉండవలసిందే. దానినే పారమార్థిక భీతి అంటారు. అయితే, ‘నరకం ఉందా!
పునర్జన్మ ఉందా! జంతువులా పుడతామా! నరకంలో చిత్రవధలకు గురవుతామా!’ వంటి
వితండవాదం చేసేవారు ఎంతటి పాపానికైనా సిద్ధపడతారు. పారలౌకికమైన భీతి ఉంటే
ఇతరులకు అపకారం చేయలేరు.
- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్
అన్నిటికీ మూలం భయమే...
‘‘రజ్జుసర్పభ్రాంతి’’ మాత్రం ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. అంటే
అక్కర్లేని భయమన్నమాట. ఒక తాడు చీకట్లో వంకరటింకరగా పడి ఉంటుంది. ఎవరైనా
హఠాత్తుగా అటు వచ్చినప్పుడు, సర్పమనే భ్రాంతి కలుగుతుంది. అందుకు కారణం
అజ్ఞానం. అది తొలగాలంటే ధర్మభీతి ఉండితీరాలని ఇది తెలియచేస్తోంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ...
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ప్రణశ్యతి
కోపం నుంచి మూఢత్వం, (విచక్షణ జ్ఞానం కోల్పోవడం), దానితో జ్ఞాపకశక్తి
నశించడం, దాని నుంచి బుద్ధి కోల్పోడం, చివరగా పతనమై పోతారు... అని
వివరించాడు.