4, డిసెంబర్ 2011, ఆదివారం

మీ విలువను మీరు ధృవీకరించుకోండి

మీ విలువను మీరు ధృవీకరించుకోండి

గెలుపు దారి

సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ అవ్వాలంటే మీ విలువ ఏమిటో మీకు తెలియాలి. మీపట్ల మీకు గౌరవం ఏర్పడాలి. విలువ ఉంటేనే కదా గౌరవం ఏర్పడేది? మనం ప్రిన్సిపాల్ గారిని గౌరవిస్తాం. ఆయన హోదా, స్థానం ఆయన వృత్తిలో వున్న ఆదర్శం ఇవ్వన్నీ ప్రామాణికమైనవి. విలువైనవి. సమాజం దృష్టిలో అందరిచేత విలువైనవిగా అంగీకరింపబడినవి. అందుచేతనే మనం ప్రిన్సిపాల్‌ని గౌరవిస్తాం. ఆయన మాటకు విలువిస్తాం. ఈ గౌరవం అన్నది ఏర్పడకపోయినట్లయితే విలువ ఇవ్వడం సాధ్యం కాదు. మీపట్ల మీకు గౌరవం ఉంటేనే మీ సెల్ఫ్‌ఇమేజ్ పెరుగుతుంది. ఆ గౌరవం మీకు మీరు ఇచ్చుకునే విలువనుబట్టి ఉంటుంది. మనమంతా విలువను ధృవీకరించుకోవాలి. ఈ అవసరం అందరికీ ఉంటుంది. మనమొక పనిని చాలా సమర్ధవంతంగా చేయగలమన్న ధృవీకరణ కావాలి. మనం చాలా ఆకర్షణీయంగా ఉంటామన్న నిజానికి ధృవీకరణ కావాలి. మనం ఈ సమయంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందడానికి అర్హులమేనన్న సాక్ష్యం ఉండాలి. మనం ఎంతోమంది ఇతర మనుషులకు బాగా కావాల్సిన వారమన్న నిజం మనం అంగీకరించడానికి తిరుగులేని సాక్ష్యాధారాలు కావాలి. కొంతమందికి ఈ అవసరం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. బహుశా వారంతా డిప్రెషన్ క్లైంట్‌లో లేక పాజిటివ్ వైఖరి పూర్తిగా లోపించిన వ్యక్తులో లేక సెల్ఫ్ ఇమేజ్ లేనివాళ్లో అయుంటారు.
విలువలపట్ల ధృవీకరణ ఎక్కువ అవసరమయ్యే పరిస్థితి కూడా బాల్యదశలోనే ప్రారంభమవుతుంది. ఒక పిల్లవానిపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోయినా, లేక ఆ పిల్లవాడు తనపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టడంలేదని ఎక్కువగా మదనపడినా అతనిలో క్రమంగా సెల్ఫ్ ఇమేజ్ పడిపోతుంది. తన విలువపట్ల ధృవీకరణ లభిస్తే తప్ప తన సెల్ఫ్ ఇమేజ్‌ని డెవలప్ చేసుకోలేడు. వయసు పెరిగేకొద్దీ తనపట్ల తాను విశ్వసనీయతను ఏర్పరుచుకోవడానికి ఇతరులు తనపై దృష్టి పెట్టడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాడు. తాను ఎవరి దృష్టినీ ఆకర్షించలేకపోతున్నాననే అభిప్రాయం కనక స్థిరపడిపోతే అతనిలో సెల్ఫ్‌ఇమేజ్ పెరగదు. ఈ తరహా వైఖరి వల్ల సెల్ఫ్ ఇమేజ్ తక్కువకల వ్యక్తులు సాధారణంగా ఎక్కువ సామాజిక మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత విలువలపట్ల మీకు ధృవీకరణ ఎక్కువ మోతాదులో అవసరం ఉన్న వ్యక్తులైతే మీలో ఈ కింది అంశాలలో కొన్నయినా ఉంటాయి. పరిశీలించండి
* మీరు మీ దృష్టిలోకన్నా, ఇతరుల దృష్టిలో ఎలా కనబడతారన్న అంశంమీద ఎక్కువ మదన పడుతూ ఉంటారా?
* మీ చుట్టూ ఉన్న వాళ్లు మిమ్మల్ని తమ పనులకోసం ఎక్కువ వినియోగించుకుంటూ ఉంటారా?
* మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ మీకు మానసికంగా అసౌకర్యంగా ఉండే పనులనే చేస్తూ ఉంటారా?
*మీకు ఎప్పుడూ ఏదో ఒక అవసరం ఉంటూనే ఉందా?
* మీ పార్టనర్ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న ఆశతో ఎక్కువ శ్రమిస్తూ ఉంటారా?
* మీబోటి వాళ్లనే మీరు ఎక్కువగా ఆకర్షిస్తుంటారా?
* మీతో కలిసి గడపడానికి వ్యక్తులు పెద్దగా సుముఖత చూపడంలేదా?
* మీరు స్వార్ధపరులని తరచుగా అందరూ మిమ్మల్ని వర్ణిస్తుంటారా?
* మీ పట్ల మీకు గల విలువపట్ల మీకు ధృవీకరణం అవసరమున్నట్లయితే అది మీరు ఊహించినదానికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే మీరు ఇంకా ఈ కింది అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
* ఎవరైనా మీపై దృష్టి పెట్టకపోతే మీకు చాలా విచారంగా ఉంటుందా?
* ఇతరుల దృష్టిని వెంటనే ఆకర్షించాలనే నెపంతో మీరు హఠాత్తుగా ఏదైనా విభిన్న తరహాకు చెందిన దానిని చేస్తుంటారా?
* నలుగురితో మాట్లాడుతూ ఉండేటప్పుడు మీరే ప్రధానమైన అంశం కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారా?
* మీ పార్టనర్‌పట్ల వంచన పూర్తి స్వభావాన్ని ప్రదర్శిస్తారా?
*మీ వ్యక్తిగత శ్రద్ధను కూడా పక్కకునెట్టి గుర్తింపుకోసం తెగ పాకులాడతారా?
* ఎక్కువగా సాధించడం ద్వారా, అందరూ మిమ్మల్ని మీ విలువను గుర్తిస్తారని భావిస్తుంటారా?
*మీకన్నా తక్కువ అని మీకు నమ్మకం కలిగిన వ్యక్తులతోనే ఎక్కువ స్నేహం చేస్తుంటారా?
* మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను సంపాదించడానికి మీకు చాలా కష్టమవుతున్నదా?
* ఇతరులపట్ల నిక్కచ్చిగా ఉండడానికి హద్దులు ఏర్పరచడానికి కాదని ఖండితంగా చెప్పడానికి మీరు ఇబ్బందిగా ఫీలవుతుంటారా?
* ఒంటరిగా ఉన్నప్పుడు పరమబోరుగా ఎవరితోనో గడిపేటప్పుడు కాస్త బెటర్‌గాను అనిపిస్తుంటుందా?
పైన తెలుపబడిన వాక్యాల్లో ఎక్కువ వాటికి మీరు అవును అని సమాధానం ఇచ్చినట్టయితే మీపట్ల మీకు గల ‘విలువ’పట్ల మీకంత సంతృప్తికరమైన భావనలు లేనట్టేనని స్పష్టమవుతుంది. మీరనుకున్న విలువను ధృవీకరించే ప్రామాణిక అంశాలు చాలా పెద్దవి. మరీ మోతాదుకు మించిన ఉన్నతమైనవి అని అర్ధం. మీపట్ల మీకు గౌరవం ఏర్పడాలంటే మీ విలువల ధృవీకరణ ఎంతో అవసరం. మీరు మంచివారని మీకు తెలుసు. ఎవరో మిమ్మల్ని మంచివారని సర్ట్ఫికెట్ ఇస్తేనే తప్ప మీరు మంచివారన్న అభిప్రాయం మీకు కలగకపోవడం, ఆ ధృవీకరణ కోసం వెంపర్లాడడం మీ వ్యక్తిత్వ వికాసానికి గొడ్డలిపెట్టులాంటిది.మిమ్మల్ని మీరే విలువనిచ్చి చూసుకోకపోతే ఆ పనిని మీ అంతటి నైపుణ్యంతో ఎవరు చేయగలరు. మీరు ఎట్లాంటివారో మీ వ్యక్తిత్వం ఏమిటో, మీలో ప్లస్ పాయింట్లు ఏమిటో మీకు కాక ఇంకెవరికి తెలుస్తాయి. మీ నైతిక నిబద్ధతను ఎవరు సర్టిఫై చేయగలరు? ఒకవేళ చేసినప్పటికీ అది మీరు సర్టిఫై చేసినంత స్థాయిలో ఉంటుందా? ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం చేయాలి. ఆ తర్వాతే ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని తపించాలి. ముందు మీ కారెక్టర్ మీద మీరు మంచి కాండక్టు సర్ట్ఫికెట్ ఇచ్చుకోవాలి. అపుడే మీరు ఎట్లాంటివారో ఇతరులకు అర్ధమవుతుంది. మీరు బయటకు వస్తేనే మీరు ఇతరులకు కనపడతారు. ఇతరుల దృక్పథంలోకి మీరు వెళ్లాలి. వారి దృక్పథం ఎప్పుడూ మీ ఇంటి లోపలికి రాదు. ఈ సత్యాన్ని గుర్తిస్తే తప్ప మీలో సెల్ఫ్ ఇమేజ్ పెరగదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి