25, నవంబర్ 2011, శుక్రవారం

సిసలైన భాషా ప్రేమికుడు


సిసలైన భాషా ప్రేమికుడు
వన్ మ్యాన్ ఆర్మీ
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని ఎలుగెత్తి పాడుతుంటాం. కానీ ఆ అమ్మ బిడ్డలుగా తెలుగు పలుకుబడిని ఎంతవరకూ పెంచగలుగుతున్నాం! ఇదే ప్రశ్నను తనకు తానే సంధించుకున్నాడు నాయుడు. ఆయన పుట్టింది బర్మాలో. స్థిరపడింది ఏపీలో. జన్మించిన విదేశీ గడ్డమీదయినా తెలుగును బతికించాలని కంకణం కట్టుకున్నాడు. మహోద్యమాన్ని మొదలెట్టాడు. మొదటిమెట్టుగా తెలుగు-బర్మీస్ నిఘంటువును రూపొందించాడు. ఇప్పుడు బర్మా పిల్లల కోసం పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథల్ని అక్కడి భాషలోకి తర్జుమా చేస్తున్నాడు.

ఇది అరవై డెబ్భయ్యేళ్ల నాటి మాట. కరువుకాటకాలతో ఉత్తరాంధ్ర తల్లడిల్లిపోతుండేది. కలిగినవారి కంచాల్లోనే వరి మెతుకులు కళకళలాడేవి. అలాంటి సమయంలో పొట్ట చేతపట్టుకుని వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో బర్మా వెళ్లిపోయేవారు. బర్మాలోనూ తెల్లదొరల పాలనే గనుక వలసలకు ఇబ్బందులు లేవు. రంగూన్ (దీన్నే రంగం అనేవారు) వెళితే ఎలాగయినా బతికేయొచ్చన్న ధీమాతో విశాఖపట్నానికి చెందిన ఎర్ర నూకాలు కుటుంబం ఆ దారి పట్టింది. రంగూన్‌కి కాస్తంత దూరంలోని మోల్‌మేన్ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. నూకాలు అక్కడే ఉంటున్న తెలుగమ్మాయి సముద్రాన్ని వివాహం చేసుకున్నాడు. 1950లో వారికి మగపిల్లాడు పుట్టాడు. నాయుడు అని పేరుపెట్టుకున్నారు.

పెద్దబాలశిక్షకు నమోనమో...
నాయుడి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని సంసారాన్ని లాక్కొచ్చేవారు. పిల్లాణ్ణి మోల్‌మేన్‌లో ఉన్న తెలుగుబడిలో వేశారు. రెండు క్లాసులు పూర్తయ్యాక బర్మా బడికి మారిపోవాల్సి వచ్చింది. ‘నేను రెండో క్లాసువరకూ చదివిందే తెలుగు చదువండీ. పెద్ద బాలశిక్ష చెప్పుకున్నాం. అది మన భాష తియ్యందనాన్ని రుచిచూపింది. వేమన, సుమతీ పద్యాలు, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాల తెలుగు పేర్లు నేర్పింది. వట్రసుడి, కరారావుడు లాంటివన్నీ బోధించడం వల్లనే ఇప్పటికీ తప్పులు లేకుండా రాయగలుగుతున్నాను.

దురదృష్టం కొద్దీ బర్మాలో మూడోతరగతి చెప్పే తెలుగు స్కూలే లేదు. బర్మా బడిలో ఆరో తరగతి వరకూ లాగించాను. మాతృభాషను వదిలిపెట్టి మరో భాషను బుర్రకెక్కించుకోవడం అంత సులువుకాదు. అందుకే ఫస్ట్ ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పేశాను’ అంటూ నాయుడు తన బర్మా చదువును వివరించారు. 1966 నాటికి అక్కడ బ్రిటిషర్ల రాజ్యం పోయి, స్వదేశీ మిలిటరీ రూల్ వచ్చేసింది. బర్మీస్ కానివారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో నూకాలు భార్యాపిల్లలతో వైజాగ్ వచ్చేశారు.

కూలీనాలీ చేసి...
అలా విశాఖ చేరుకున్న పదహారేళ్ల నాయుడు విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో కూలిపనులు చేశాడు. హోటళ్లలో పనిచేశాడు. మరోవైపు పూర్ణామార్కెట్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీలో తెలుగు కథలు, పత్రికలు చదువుతుండేవాడు. మలేషియా, హాంకాంగ్, బర్మా తెలుగు సంఘాలతో ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ అక్కడి తెలుగువారి విశేషాలను తెలుసుకుంటుండేవాడు. ‘1973లో యారాడ కొండమీద ఉండే వాతావరణ హెచ్చరిక కేంద్రం వాటర్ వర్క్స్‌లో క్లాస్‌ఫోర్ ఉద్యోగం దొరికింది. వివాహమైంది. జీవితం దార్లో పడ్డట్టయింది. కొన్ని జీతం రాళ్లు వస్తుంటాయి గనుక తెలుగు పుస్తకాలు కొనడం చదవడం, పంచడం మొదలెట్టాను. చందమామలయితే ఎన్ని కాపీలు కొనేవాణ్ణో.

యాంగో అనే బర్మా పదానికి రూపాంతరమే రంగూన్. యాం అంటే ఆయుధాలు. కో అంటే విడిచిన చోటు. ఎక్కడయితే అప్పటి సైన్యాలు ఆయుధాలు విడిచిపెట్టారో ఆ ప్రాంతంలోనే నేను తెలుగు అక్షరాయుధాలను అందుకున్నాననే ఊహ మెరిసేసరికి నా మనసు నిండుపున్నమి అయ్యేది. నేను పుట్టిన బర్మాలో తెలుగు భాషాభివృద్ధికి ఏదయినా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నాడే భావించాను. నేనేం తెలుగులో నిష్ణాతుణ్ణి కాను. నా ముగ్గురు పిల్లలూ సెటిలయ్యారు. నా భార్య రోజా సహకారం ఉండనే ఉంది. అందుకే మరొకసారి బర్మా వెళ్లొచ్చి అప్పుడు నిర్ణయించుకోవాలనుకున్నాను’ నాయుడు తెలియజేశారు.

ఘన నిఘంటువు...
సరిగ్గా పదేళ్ల కిందట నాయుడు రెండోసారి రంగూన్ వెళ్లివచ్చారు. అక్కడి తెలుగువారిని కలిశారు. వారానికి రెండు రోజులే నడుస్తున్న తెలుగు బడిని చూశారు. ‘అక్కడున్న మనవారికి తెలుగు నేర్చుకోవాలన్న కోరిక బలంగా ఉంది. కానీ పుస్తకాల్లేవు, ప్రోత్సాహం లేదు. ‘డో లుమ్యూ డో బాద డోటి’ (మా జాతి భాష నేర్చుకోవాలని ఉంది) అంటూ నా చుట్టూ చేరి కేరింతలు కొడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అంటూ కళ్లు తుడుచుకున్నారు నాయుడు.

మయన్మార్ నుంచి వైజాగ్ తిరిగి వచ్చాక, బర్మా పిల్లలు తెలుగును ఇష్టపడుతున్నారు గనుక వారికో నిఘంటువును రూపొందించాలను కున్నారు నాయుడు. అందుకే పలు భాషా నిఘంటువులను సేకరించి, అధ్యయనం మొదలెట్టారు. అటు తన మాతృ భాష తెలుగు పదం... ఇటు దానికి సమానమైన తను పుట్టిన బర్మా దేశపు పదం వెతకడం. రెండేళ్ల కిందట ఆయన ఉద్యోగం నుంచి రిటైరయ్యాక పూర్తికాలం ఈ పని మీదనే ఉన్నారు. దాదాపు పదివేల తెలుగు పదాలను నిఘంటువులో చేర్చారు.

రుణానుబంధం...
ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మూడురోజులపాటు మయన్మార్ వాకిట ఆంధ్ర మహాజనసంఘం శతజయంతి ఉత్సవాలు జరిగాయి. 1911లో అక్కడ తెలుగు సంఘం నెలకొని నేటికీ అద్భుతంగా పనిచేస్తోంది. దీనికి నాయుడు హాజరయ్యారు. ‘మన జానపద నృత్యాలు, పద్యనాటకాలు ఎవరైనా కళాకారులు పిల్లలకు నేర్పిస్తుంటే ఆ క్లాసులన్నీ వీడియో తీసి సీడీలు బర్మాకు పంపాలని ఉంది.

అలాగే తెలుగులో నీతి కథలను క్యాసెట్లు, సీడీలుగా అక్కడికి తరలించదలిచాను. నా డిక్షనరీ అచ్చువేయిస్తామని కొందరు బర్మా వెళ్లొచ్చిన తెలుగు పెద్దలు చెబుతున్నారు. దీనికోసం అక్కడ చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ పని పూర్తయితే నా జీవితానికో అర్థం ఉందని భావిస్తాను’ అని నాయుడు చెబుతుంటేఆంధ్రమాత చేతిలో అలరారే పూర్ణకుంభం ఇతడేననిపించింది.

- డా॥చింతకింది శ్రీనివాసరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి