15, డిసెంబర్ 2011, గురువారం

తెలవారనీకు స్వామీ...

డా॥చింతకింది శ్రీనివాసరావు


లైఫ్ టార్గెట్లు మారిపోయాక, గజీ‘బిజీ’గా జీవితం ఏమారిపోయాక, మనకిప్పుడు మిగిలినవన్నీ వారాలే తప్ప ఆదివారాలు అంటూ స్పెషల్‌గా ఏమీ లేకుండా పోయాయి. రోజూ అలుపెరుగని పరుగులే. సండేనాడూ తేడా లేదు. బండెడు హోమ్‌వర్క్‌లతో పిల్లలు, ముంచుకొచ్చే మరో వారాన్ని ఎటాక్ చేసేందుకు పెద్దలు... ‘వీక్’ ప్లాను గీసుకుంటుంటారు.

ఆఫీసులో పెండింగ్ పనితల్చుకుని మనసు గాభరాపడుతుంది. సెల్‌ఫోన్ రింగు రింగు రింగుమంటుంది. దాంతో సండే పనిఅయిపోయినట్టే. మన్డే వచ్చిపడినట్టే. కథ మళ్లీ మామూలే.

రవివారం ఇప్పుడింత ఘోరవి వారంగా మారింది కానీ గతంలో ఎంతగా మనిషికి ఆనందం పంచేదో! మరెంతగా కుటుంబమంతటినీ సంతోషాల్లో ముంచేదో! అసలా రోజుల్ని తల్చుకుంటే చాలు, మనసంతా హాయిలో మునిగేది. అప్పట్లో ఆదివారం ఎలా ఉండేది! నికార్సయిన సెలవు దినంలా ఉండేది. ఆ వాతావరణమే వేరు. పిల్లలంతా ఉదయాన్నే ఎవరూ లేపకుండానే నిద్రలేచిపోయేవారు. వారమంతా పట్టిపీడించే బడిభూతం ఆనాడు దరికిరాబోదని తల్చుకుని చెలరేగిపోయేవారు. ఎవరూ చేయించకుండానే స్నానాలు కానిచ్చి, అమ్మ పెట్టింది తిని, నిక్కరు జేబుల్లో గోళీలు పోసుకుని వీధుల్లో వీరంగాలేసేవారు.

ఇంకొందరైతే గాలిపటాలు పట్టుకుని ఆకాశంలోకి దూరిపోయేందుకు బీడుభూముల్ని శరణువేడేవారు. తీరుబడిగా లేచిన నాన్నారు కాఫీ గ్లాసుతో కుంపటి పక్కన చేరేవారు. అమ్మతో కష్టం సుఖం కలబోసుకునేవారు. ఆ వారంలో వచ్చిన ఉత్తరాలు పత్తరాలు, వెళ్లాల్సిన పెళ్లిళ్లు... ఒకటేంటి, అమ్మానాన్నల మాటలే కుటుంబబంధాలకు బాటలు.

ఇక అమ్మాయిలకయితే అప్పట్లో ఆదివారం వెరీ స్పెషలు. వారికది తలగడుగుల రోజు. షీకాయతో అమ్మాయిల జుట్టుకి కాసేపు దోస్తీ కుదిరేది. ఆనక చిక్కులు తీసుకుంటూ ఇల్లంతా చుక్కల్లా తిరుగుతుండేవారు. ఆదివారం నాడు ఏం తినాలనేదీ ఒక పెద్ద చర్చే. సెలవు కాబట్టి పాఠోళీ చెయ్యమ్మా..పెద్దకొడుకు ఆర్డరేసేవాడు. పెసరట్ల కూర, చంద్రకాంతాల స్వీటు చేసి పెట్టవే.. చిన్నపిల్ల పెద్దకోరికే కోరేది. ఇప్పట్లోలా నాటి కాలాన హోటళ్లు లేవు. ఎవరేం తినాలన్నా అమ్మ చేతి వంటే.

ఇంతమందికీ కోరినవన్నీ హాయిగా వండిపెట్టినా తల్లిముఖాన చిన్నమెత్తు విసుగూ కనిపించేది కాదు. బామ్మ నుంచి మనవడి దాకా అందరూ కింద కూర్చునే ఏకబంతి తినేవారు. ఆదివారం భోజనాలు అంత మజాగా సాగేవి. తిళ్లయ్యాక అందరి దృష్టీ రేడియో మీదికి మళ్లేది. చిన్న కునుకు తీసిన నాన్న, బామ్మ కూడా రేడియో బల్ల ముందుకొచ్చేవారు.

సరిగ్గా మూడున్నర అయ్యేసరికి రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం దూసుకొచ్చేది. శబ్ద చిత్రం అయ్యేదాకా శబ్దం చేయని పిల్లకాయలు అది అయిందనగానే ఆకలి కేకలు పెట్టేవారు. జంతికలో, మురుకులో వారికి నైవేద్యం పెట్టి రాత్రి వంటకి అమ్మ నిప్పుచేయడం ఆరంభించేది. పెద్దన్న స్నేహితులతో కలిసి బంతాట మైదానానికి పోయేవాడు. చిన్నవాడు కోతికొమ్మచ్చంటూ అదృశ్యమైపోయేవాడు. ఆడపిల్లలు కుట్లో అల్లికలో చేసుకునేవారు.

ఇలా అంతా కలిసి ఆదివారాన్ని పండగలా చేసుకున్నాక నానమ్మ కథలు మొదలయ్యేవి. కాశీమజిలీ, బాలవర్థిరాజు, కాంభోజరాజు కథలు కళ్లకు కట్టినట్టు చెప్పేది. బుజ్జిగాళ్లంతా టెన్షన్‌గా వింటుండేవారు. పెద్దక్క, అన్న మాత్రం బామ్మగారి పాత స్క్రీన్‌ప్లే, సంభాషణలకు విసిగి వేసారి ముసుగుతన్నేవారు. అలా అంతా నిద్దరోయి లేచాక మరో వారంలోనే ఇంకో మంచి ఆదివారం చేతికందేది. అమృతంలాంటి ఆహ్లాదాన్ని పంచిపెట్టేది.

ఇలాంటి ఘనమైన సండేలను ఇప్పుడు ఊహించగలమా? డబ్బు వెనుక దౌడాయింపు మొదలెట్టాక ఈ కాలాన మనకేం మిగిలింది? బ్యాంకు నిండా బ్యాలెన్సులున్నా హృదయంలో ప్రశాంతత లేకుండా పోయింది. రవివారం మనకి తెలియకుండానే వస్తోంది... వెలుగులేవీ పంచకుండానే చప్పున చేజారిపోతోంది. లాభం లేదు! ఇకమీదట ఆదివారాలను ఒడిసి పట్టాల్సిందే! నా(మే)టి మధుర క్షణాలను స్వంతం చేసుకోవాల్సిందే!ఇక నో ఆలస్యం... ఆన్ యువర్ మార్క్.. సెట్.. గో..!

12, డిసెంబర్ 2011, సోమవారం

శ్రమలో దాగిన దీవెన


దిశ
జీవితంలో శ్రమలు, బాధలు మనల్ని ఆవహించినపుడు ఆవేదనతో కుంగిపోతాం. ఇబ్బందులలో ఉంటే కలిగే అవమానాన్ని తలచుకుని భయపడుతుంటాం. మనల్ని మనం శపించుకుంటూ దేవుణ్ని దూషిస్తూ, జీవిత ంపై విరక్తిని, వైరాగ్యాన్ని పెంచుకుంటాం. జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు తమ జీవిత కష్టాలకు, శ్రమలకు ఒక కొత్తకోణాన్ని కనుగొనవలసిన అవసరం, కొత్త దృక్పథాన్ని అలవరచుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కష్టాలు, బాధలనుండి మనం పారిపోతే అవే మనల్ని తరుముకువస్తాయి. జీవితంలో కష్టాల నుండి, శ్రమల నుండి పారిపోకుండా సామర్థ్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం వాటిని అధిగమించగలుగుతాం, పరిష్కరించుకోగలుగుతాం.

‘‘శ్రమ దినమున నీవు కుంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు’’ (సామె 24:10) మనం ఎదుర్కొనే జీవిత సవాళ్ళు మనలో దేవుడుంచిన శక్తి సామర్థ్యాలను వెలికితీస్తాయి. ‘‘దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు’’ (తిమోతి 1:7) గనుక పిరికితనంతో ఉండక, దైవమునందలి దృఢమైన విశ్వాసంతో కష్టాలను, ఇబ్బందులను, శ్రమలన్నిటిని ధైర్యంగా ఎదురాడి పోరాడాలి. కష్టానుభవం మనం ప్రభువు వైపునకు మరలుటకు, శ్రమల్లో విశ్వాసంతో ప్రార్థించుటకు తద్వారా దైవసహాయంతో జీవితంలో కష్ట శ్రమలు అధిగమించుటకు శ్రమలే పరోక్షంగా దోహదపడతాయి. కష్టానుభవాలను, జీవిత అధిరోహానికి మెట్లుగా మలుచుకొన్న యోసేపును గూర్చి బైబిల్‌లో ఇలా చెప్పబడింది.

యోసేపు అనునతడిని చిన్న వయసులోనే తన స్వంత అన్నలు అసూయతో కుట్రపూరితంగా ఇస్మాయేలీయులు అను బానిస వర్తకులకు అమ్మివేశారు. అలా ఒక బానిసగా ఐగుప్తు దేశంలోని పొతీఫరు అనునతని ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అక్కడ నిందలపాలై, తాను చేయని నేరానికి శిక్షగా జైలుపాలవుతాడు. అట్లుండగా ఒకనాడు ఆ దేశపు రాజుకు కలిగిన స్వప్నానికి దైవజ్ఞానంతో భావమును వివరించి, ఫలితంగా విడుదలనొంది, ఫారో రాజు దయనొందినవాడై, ఆ రాజు తరువాత అంతటి ప్రముఖ అధిపతిగా, అధికారిగా ఎదిగాడు. యోసేపు తాను ఎదుర్కొన్న శ్రమలలో, ఇబ్బందులలో, అవమానంతో కుంగిపోలేదు. ధైర్యాన్ని, దైవాన్ని వీడలేదు. అందుకే శ్రమలే అతని ముందు ఓడిపోయాయి తప్ప అతని జీవితాన్ని నాశనం చేయలేదు.

శ్రమానుభవం మనల్ని జీవిత వాస్తవాలలోనికి తీసుకువెళ్తుంది. జీవితాన్ని గూర్చిన శ్రద్ధ, బాధ్యత, క్రమశిక్షణ, లక్ష్యం, ఆశయం అన్నవి లేకుండా జీవించే నిర్లక్ష్య నిర్లిప్త జీవిత విధానం నుండి, జీవితానికున్న అర్థం, పరమార్థం తెలుసుకొని, అర్థవంతంగా జీవించుటకు శ్రమలు, కష్టాలు, బాధలు కూడా పరోక్షంగా ఉపకరిస్తాయి. ‘‘శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను’’ (కీర్తన 119:67) కష్టం కలుగక మునుపు జీవితాన్ని గూర్చి మనకున్న అవగాహన వేరు, కష్టాలను ఎదుర్కొన్న తరువాత జీవితం మనకు కనిపించే తీరు వేరు.

దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉన్న వ్యక్తి తన జీవిత శ్రమలను, ఇబ్బందులను దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో, సామర్థ్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులను, అవకాశాలను గూర్చి అన్వేషిస్తాడు. శ్రమల తరువాత కలిగే సత్ఫలితానికై నిరీక్షిస్తాడు. కష్టాలు, శ్రమలు నేర్పే నిజ జీవిత పాఠాన్ని నేర్చుకుంటాడు. తన చుట్టూ అలుముకొన్న కష్టపరిస్థితులకు అతీతంగా విశ్వాసంతో నడవగలుగుతాడు. కాబట్టి శ్రమలకు కుంగక, బెదరక ఓ మంచి దృక్పథంతో చూసి సమర్థవంతంగా ఎదుర్కొందాం. కష్టాలు మనకు నేర్పే జీవితపాఠాలను నేర్చుకుందాం. అప్పుడే జీవితంలో నిజ విజయాన్ని సాధిస్తాం.

- రెవ. పి. ఐజక్ వరప్రసాద్