14, నవంబర్ 2011, సోమవారం

మతం మానవత్వానికి అడ్డుకాదు

మతం మానవత్వానికి అడ్డుకాదు

రఘుపతి వస్తానని పోన్ చేశాడు.
సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను.
ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఎటూ వెళ్లడంలేదు.
మిత్రులుకూడా చాలామంది రావడం తగ్గించేశారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.

పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది. అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక ఆట, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర.

వీరందరిలోకీ రఘుపతి నాకు ప్రాణస్నేహితుడు. మాది చిన్ననాటి స్నేహం. మావి పక్కపక్క ఊర్లు. వాడి ఊరి స్కూల్లో నేను రెండేళ్లు చదువుకున్నాను. అప్పటినుండీ స్నేహం గత యాభై ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిన్ననాటి స్నేహం పర్సులోని కరెన్సీ నోట్లవంటిది. అప్పుడప్పుడూ తాకి చూసుకుంటే కలిగే ఆనందం వేరు. వాడు, వాడి ఆర్థిక స్థితి వాణ్ని డాక్టరు చదివించాయి.

నేను ఓ కాలేజీ అధ్యాపకునిగా నాలుగేళ్లక్రితం రిటైరయ్యాను. నా కొడుకూ, కోడలూ కెనడాలోఉంటారు. నేనూ, శ్రీమతి ఇక్కడ హైదరాబాదులో మారేడ్పల్లిలో ఉంటాం. ఇక, డాక్టరుగా రఘుపతి బాగా సంపాయించాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నా, కూతురూ, అల్లుడూ ఇక్కడే ఉంటారు. వాడూ నేనూ నెలకోసారైనా కలుస్తూ ఉంటాం. వాడు మా యింటికి వస్తే అదో ప్రత్యేకమైన సందర్బం. వస్తూ వస్తూ వాడు ఖరీదైన విదేశీ మద్యం సీసా తెస్తాడు. మా ఆవిడవేసే ఉల్లిపకోడీలు తింటూ ఏవేవో మాట్లాడుకుంటూ గడిపేస్తాం.
మార్కెట్టుకు వెళ్లివచ్చి, భోంచేసి పడుకున్నాను. లేచేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది, ఎంతగా నిద్రపట్టింది అనుకుంటూ.. స్నానంచేసి, టీ తాగుతూ కూచున్నా. ఇంతలో రఘుపతి రానే వచ్చాడు. వాడికి టీ అందించి క్షేమ సమాచారం కనుక్కున్నది నా శ్రీమతి. కాసేపు అక్కడే కూచుని, మేడపైకి వెళ్లాం.

వెళుతూనే.. టీవీ ఆన్ చేశా. ఆదివారం కదా పాత సినిమా ఏదైనా వస్తుందేమోనని. అయితే హోం మంత్రి పాటిల్ రాజీనామా చేశాడని ప్లాష్ న్యూష్. అలా మా మాటలు రాజకీయలలోకి మళ్లాయి. గత నాలుగురోజులుగా దేశాన్ని కుదిపివేసిన ముంబాయిపై దాడులు చర్చనీయాంశంగా మారింది. కళ్లు నీటితో నిండాయి. మనసు మూగబోయింది. ముష్కరులు ఎందుకోసం ఇంత దారుణానికి పాల్పడ్డారో నాకు అర్థంకాలేదు.

ధనం కోసం కాదు, మతం కోసం కాదు. చనిపోయిన వారిలో అన్నిమతాల వారూ ఉన్నారు కదా అని నా అనుమానం. ఒక దేశాన్ని, దేశ సంపదనూ నాశనం చేయాలనుకునే.. ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతుంటారేమో.. అని రఘు అన్నాడు. కానీ దీనివలన వారికి కలిగే లాభం ఏమిటి మా మనసులు ఆక్రోశించాయి.

పట్టుమని -20 ఏళ్ళు కూడాలేని యువకులు కరడుగట్టిన నరహంతకులుగా మారడానికి దోహదపడుతున్న అంశం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ప్రపంచానికి లేదా అని ప్రశ్నించుకున్నాం. మాలో వేల వేల సందేహాలు.. ఇంతలో వేడి పకోడి తీసుకువచ్చింది పనిమనిషి. అక్కడి వాతావరణం ఆమెకు అర్ధంకాలేదు.

ఛలోక్తులతో సరదాగా ఉండే నా గదినిండా ఆవేదనల అలలు వ్యాపించి ఉండడం గమనించి ఎంతోనెమ్మదిగా వచ్చి ప్లేట్లు అక్కడ పెట్టి అంతే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక దాడి ఎన్ని వేల లక్షల గుండెలను పిండి వేస్తుందో అర్ధమైంది నాకు. అల్ ఖైదా, ముజాహిదీన్ ఎవరైనా ఇతరులను చంపడంద్వారా తాము సాధించగలుగుతున్నది ఏమిటి.. అని ప్రశ్నించుకున్నాం, సమాధానం లభించలేదు.

ఊహలనిండా వేదన ఘనీభవించింది. దాడిలో చనిపోయినవారి త్యాగాలను స్మరించుకున్నాం. అపార్థానికి, ఆవేశానికి విజ్ఞత ఉండదని అన్నాను.నిజమే...మూర్ఖత్వం అంత త్వరగా పాఠాలు నేర్చుకోదని అన్నాడు రఘుపతి. మామధ్య కాసేపు మౌనం ఆవరించుకుంది.

ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తిరిగి నావైపు చూసి నీకో సంఘటన చెప్పాలి . ఇది చరిత్ర, ఇది వాస్తవం.. ముంబై దాడుల నేపధ్యంలో ఇది నీకు చెప్పాలనిపించింది అని ఆగాడు. చెప్పమని కళ్ళతోనే అర్ధించాను.

నేను డాక్టరుగా చాలా సమావేశాలకు హాజరయ్యేవాడిని. అలా అవయవ మార్పిడికి సంబంధించి ఓ సమావేశంలో ప్రసిద్దవైద్యుడు చేరనయ్య కలిశాడు. అపుడు మామధ్య అవయవ మార్పిడి గురించిన చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య శాస్త్రం ఈ అంశంపైనే తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆయన ఈ విషయం చెప్పాడు. డా. చేరనయ్య దేశంలోనే ప్రముఖుడైన హ్రుద్రోగనిపుణుడు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో కూడా ఆయన స్వచ్చందంగా తన వైద్యసేవలందిస్తున్నారు. మన దేశంలో గుండెమార్పిడి చేసిన తొలి డాక్టర్ ఆయన. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏమిటంటే.. యాదృశ్చికంగా జరిగిన సంఘటన. మానవత్వానికీ, మంచితనానికీ ప్రేరణగా నిలిచిన సంఘటన కావడం. సరే, విషయానికి వస్తాను. డాక్టర్ తొలి గుండే ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఓ మహిళకు గుండె మార్పిడి అత్యవసరంగా జరిపించాలి. దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ దాతకోసం వెదుకుతున్నారు.. ఫలితం కనిపించలేదు. అపరేషన్ తేదీ దగ్గరపడింది. రోగికి ప్రాణాపాయం పెరిగిపోతోంది. ఏంచేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు చేరనయ్య ఉంటున్న ఊరిలోని ఆసుపత్రినుండే ఫోను వచ్చింది.

ఒక ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఒక మహిళ గుండె దానం చేయడానికి ఆమె భర్త అంగీకరించినట్టు వార్త. ఇది విన్న చేరనయ్య ఆనందపడ్డాడు. దేశంలో గుండెమార్చే ఆపరేషన్ చేసే తొలి వ్యక్తిగా నిలువనున్నందుకు సంతోషించాడు. మరునాడు ఉదయమే సంబంధిత వ్యక్తులతో మాట్లాడాడు. చట్టపరమైన ఇబ్బందులను తెలిపాడు.

అయితే మరణిస్తున్న తన భార్య శరీరావయవాలు మరొకరికి జీవితాన్ని ప్రసాదించడం తనకు ఎంతో గర్వకారణం అని అతనన్నాడు. ఆపరేషన్ పూర్తయింది, రోగి కోలుకుని మరో పదేళ్లు బ్రతికింది. అర్థం కానట్టు రఘుపతి వైపు చూశాను.

చెబుతానని, చేత్తో సైగ చేసి...
ఇంతకూ ఈ విషయంలో విశేషం ఏమిటని కదూ నీ చూపులకర్ధం అన్నాడు.
తల ఊపాను
ఓ క్షణం ఆగి, చేతితో నా చేయిపై తట్టి....
గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళ ముస్లీం. ఆమెకు తన గుండె దానం చేసిన స్త్రీ హిందువు. ఈ అపరేషన్‌తో చరిత్ర సృష్టించిన వైద్యుడు క్రిస్టియన్. మతం మానవత్వానికి అడ్డుకాదు అనడానికి ఇది నిదర్శనం. అన్నాడు.

నా కళ్లు చెమ్మగిల్లాయి.
మరి మతంకోసం మారణకాండ సృష్టించడం ఎలా సాధ్యం.. ఆలోచిస్తున్నాను. . . .
టైం అయిపోయింది.. నేను వెళతానురా, అంటూ.. రఘుపతి బయలుదేరాడు.

ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది

ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది

నిండు గర్భిణిలా మెల్లగా కదులుతూ బస్టాండ్‌లోంచి బయటపడిన నెల్లూరు - మద్రాసు ఎక్స్‌ప్రెస్ బస్సు మెల్ల మెల్లగా వేగాన్ని పుంజుకుంటూ మద్రాసు వైపు పరుగులు తీస్తోంది. "మద్రాసు వరకు ఎలాగైనా నిల్చుని వస్తాం. అర్జెంటు పనులున్నాయి. నన్ను ఎక్కించుకోండి ప్లీజ్." అంటూ మరీ బస్సెక్కారు నిల్చున్న ప్రతి ప్రయాణికుడు.

టిక్కెట్లు కొట్టే కార్యక్రమం ప్రారంభించాడు కండక్టర్. ఎక్కేంతవరకూ బతిమాలి ఎక్కిన ప్రయాణికులు, అన్ని గంటలపాటు ఇప్పుడెలా నిలబడాలా అని ఆలోచిస్తూ దిగులుగా నిలుచున్నారు. కూర్చుని ఉన్న ప్రయాణికులు మాత్రం సొంత జాగీరులా గర్వంగా కూర్చున్నారు. బస్సు లోపల చివరగా వెనుక ఉండే పెద్ద సీటులో పద్ధతి ప్రకారం ఐదుగురు విశాలంగా కూర్చున్నారు. ఆ కూర్చున్న వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు.

వారు కొంచెం సర్దుకోగలిగితే ఇంకొకరు ఫ్రీగా కూర్చునే అవకాశం ఉంది. అది గమనించిన ఒక గర్భిణీ "ఏమండీ! మా పిల్లాడు... మద్రాసు వరకూ నిలబడి ప్రయాణించాలంటే వాడికి కాళ్లనొప్పులు పుడతాయేమో. కొద్దిగా సర్దుకొని వాడిని కూర్చోపెట్టుకోండి" అంటూ ప్రాధేయపడింది. మనల్ని కాదులే అన్నట్లు మొహం తిప్పుకున్నారు పిల్లలు కలిగిన ముగ్గురు తల్లులూను.

వారిలో ఏ ఒక్కరైనా ఆ పిల్లవాడిని ఒడిలోనైనా కూర్చోపెట్టుకోవచ్చు. అయినా మొహాలు తిప్పుకున్నారు. ఆ సీటు పర్మనెంట్‌గా తమదే అయినట్లుగా ఫీలయిపోతున్న మిగిలిన ఇద్దరు మగ మహారాజులు "ఈ సీట్లో కూర్చోవలసింది అయిదుగురేనమ్మా!" కొంచెం విసుగ్గా అన్నారు. కూర్చోవలసింది అయిదుగురే కానీ పిల్లాడు నిలబడలేడేమోనని మళ్ళీ ప్రాధేయపడిందా తల్లి. అదీ తన స్వార్థం కోసం కాదు. కేవలం కొడుకు కోసం ప్రాధేయపడింది.

"పిల్లాడు నిలబడలేడని తెలిసినప్పుడు బస్సెక్కకూడదమ్మా! తరువాతి బస్సులో రావలసింది" సమాధానమిచ్చాడు ఇంకో మగమహారాజు. "ఎక్కేటప్పుడు సీట్లు లేవని తెలిసినా ఎక్కేస్తారు. తర్వాత కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు. ఛ! ఛ!" విసుక్కున్నాడు ఇంకోఆయన. టిక్కెట్లు కొడుతూ వారి సంభాషణను విన్న కండెక్టర్ విననట్టే "ఏమిటమ్మా?" అంటూ ఆమెని ప్రశ్నించాడు.

కండక్టర్ వైపు దీనంగా చూస్తూ అతడే ఈ బస్సుకు సర్వాధికారి, తప్పక ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించి పిల్లాడికి సీటు ఇప్పించగలడని సమస్యను అతడితో మొరపెట్టుకుందా పిచ్చితల్లి. ఆమె వైపు పరిశీలనగా చూసిన కండక్టర్ ఆమెనో గర్భిణీ స్త్రీగా గుర్తించాడు. "సాటి ఆడవారి కోసం మీరైనా సర్దుకోకపోతే ఎలాగమ్మా? కొద్దిగా సర్దుకోండి" అంటూ కూర్చున్న ఆడవారినుద్దేశించి చెప్పాడు.

"ఏమయ్యా ఇది ఎంతమంది కూర్చునే సీటనుకుంటున్నావ్?" అంటూ ఎగిరిపడుతూ ప్రశ్నించారు సీట్లో ఉన్నవారంతా ముక్తకంఠంతో. మీ ఇష్టం నాకెందుకు అన్నట్లుగా వారికి సమాధానం చెప్పకుండా టికెట్లు కొట్టే కార్యక్రమంలో మునిగిపోయాడు కండక్టర్. బస్సులోపలి సమస్యలతో తనకేమీ సంబంధం లేనట్లు నేషనల్ హైవే మీద వేగంగా పరుగెడుతోందా ఎక్స్‌ప్రెస్ బస్సు.

"ఎక్కేటప్పుడు ఎలాగైనా నిలబడతాం అని కండక్టర్‌ని బ్రతిమాలి మరీ ఎక్కుతారు. తీరా ఎక్కాక ఇంతే! మనం కనుక సర్దుకొని ఉంటే మద్రాసు వెళ్ళేటప్పటికి నలిగి పిప్పి అయిపోతాం... తెలుసా? ఆ నిజం తెలుసు కాబట్టే సర్దుకోలేదు" అని లోగొంతుతో పక్కన కూర్చుని ఉన్న ఆడవారితో చెప్పాడో మగమహారాజు.

నిల్చుని ఉన్న వాళ్ళు వాళ్ళ మాటల్ని వింటున్నారే తప్ప ఎవ్వరూ సర్దుకోమని చెప్పలేదు. కనీసం చిన్న పిల్లవాడినైనా కూర్చోపెట్టుకోమని చెప్పడం కానీ జరగలేదు. నిల్చున్న కొందరు నిల్చునే నిద్రపోతూ ఉన్నారు. బస్సు కుదుపులకు అప్పుడప్పుడూ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తున్నారు. కొంతమంది నిల్చుని అనర్గళంగా రాజకీయాల్ని గురించి చర్చిస్తూ పక్కవారికి పరమ బోర్ కొట్టిస్తున్నారు.

"ఈ బస్సుల్లో ప్రయాణం అంటేనే పరమ బోర్ గురూ! ఎంచక్కా లగ్జరీ బస్సు ఎక్కాల్సింది" అంటూ పక్కనున్న ప్రయాణికుడితో మొరపెట్టుకుంటున్నాడు ఓ యువకుడు. కండక్టర్ సీటు పక్కన నిల్చుని ఉన్న నాని వెనుక జరుగుతున్న సంభాషణను జాగ్రత్తగా వింటూ ఎవరైనా సర్దుకుంటారేమోనని చూస్తున్నాడు. వాళ్ళలో అలాంటి ఉద్దేశం లేకపోయేసరికి నిల్చున్న ప్రయాణికుల్ని తోసుకుంటూ వెనుక సీటు వద్దకు వెళ్లాడు.

అక్కడ గర్భిణీ స్త్రీ తన కుమారునితోపాటు నానా అవస్థలు పడుతూ నిలబడి ఉంది. "ఆడవారు మీరైనా సర్దుకుని ఆ పిల్లవాడిని కూర్చోపెట్టుకోవచ్చు కదా? వెనక సీట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరుగురు కూర్చోవచ్చు" సీట్లో కూర్చున్న ఆడవారిని చూస్తూ వాళ్ళనుద్దేశించి చెప్పాడు నాని.
" ఈ సీట్లో ఎంతమంది కూర్చోవాలో నీకు తెలుసా?". అన్నాడొకాయన
"అయిదుగురే కూర్చోవాలని తెలియదు కాబోలు పాపం!" వ్యంగ్యంగా ఇంకొకాయన అన్నాడు.

నానికి వాళ్ళ మాటలు ఎంతో కోపం తెప్పించాయి. "అవును ఐదుగురే కూర్చోవాలి. కానీ ఎలాగో తెలుసా? మీలా కాళ్ళు చాపుకుని కాదు. మీ ముందున్న ముగ్గురు కూర్చునే సీటు వెనుక ముగ్గురు కూర్చోవాలి. ఇద్దరు కూర్చునే సీటు వెనుక ఇద్దరే కూర్చోవాలి. అంతేకానీ పెళ్ళి భోజనాల బంతిలో కూర్చున్నట్లు కూర్చోకూడదు. సర్దుకోండి.. సర్దుకోండి" అంటూ కొంచెం గట్టిగా దబాయించాడు నాని. అయినా వారిలో ఏమాత్రం చలనం రాలేదు.

ముందున్న యువకుడొకడు నానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని సర్దుకోమని దబాయించాడు. మళ్ళీ ఇంకో ఇద్దరు. తర్వాత ముగ్గురు, అలా దాదాపు ఓ ఇరవైమంది నానిని సపోర్ట్ చేశారు. సీట్లో కూర్చున్న మగవాళ్లిద్దరూ కొద్దిగా భయపడినట్లు వారి ముఖ కవళికల్ని బట్టి తెలుస్తోంది. ఇంత గొడవ జరుగుతున్నా ఆర్టీసీ బస్సు ఆగకుండా పోతూనే ఉంది. సమస్యల్లోంచే నాయకుడు పుడతాడు.

ప్రస్తుతం బస్సులోని సమస్యను లాజిక్‌గా ధైర్యంగా ఎదుర్కొని నిల్చున్న తోటి ప్రయాణికుల సపోర్టుతో చిన్న సైజు నాయకుడైపోయాడా బస్సులో నాని. నిల్చున్న వారి సపోర్ట్‌తో మళ్ళీ సర్దుకోమని వాళ్ళను దబాయించాడు నాని. కూర్చున్నవారిలో ముగ్గురు స్త్రీలు కుడివైపుకి, ఇద్దరు పురుషులు ఎడమవైపుకి సర్దుకున్నారు.

దాంతో సీటు మధ్యలో చిన్నపిల్లాడేం కర్మ పెద్దవారే విశాలంగా కూర్చునేంత ఖాళీ ఏర్పడింది. నానీని అందరూ మెచ్చుకోలుగా చూశారు. తన బాధను అర్థం చేసుకుని తనకు సహాయం చేయవచ్చిన అతడి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసిందా యువతి. "రా బాబు! కూర్చుందాం" అని పిల్లవాడిని పిలిచి కూర్చోబోయిందా పిచ్చితల్లి. ఇంతలో చుట్టుప్రక్కల ప్రయాణికుల వైపోసారి చూస్తూ మెల్లగా పిల్లాడితో సీట్లో గబుక్కున కూర్చున్నాడు నాని. దీంతో నిర్ఘాంతపోతూ చూసిందా యువతి.

బస్సు వేగంగా పోతూనే ఉంది. బస్సు వేగానికి చల్లటి గాలి బస్సులోకి ప్రవేశిస్తోంది. హాయిగా సీట్లో కూర్చున్న నాని కనురెప్పలు చల్లటి గాలికి బరువెక్కసాగాయి. ఆ గర్భిణి మాత్రం అలా నిల్చునే ఉంది.

గాంధీ, నెహ్రూలకంటే మగాళ్లులేరా?


ఆగస్టు 15.. అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది.. ఇండియాకు... అది సాధించింది ఎవరు? ప్రతి ఆగస్టు 15న రాజకీయనాయకులు కానీ, అధికారులుకానీ, పుస్తకాల్లోగానీ.. గాంధీ, నెహ్రూ కుటుంబాలవారే తెచ్చారన్నట్లుగా ప్రచారం చేసేశారు. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు.. మన తాతలు, ముత్తాతలతో పాటు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి, భగత్‌సింగ్‌. ఇలా ఎంతోమంది త్యాగఫలం మనం అనుభవిస్తున్నాం. 

అలాంటిది... కేవలం రెండుకుటుంబాల వారే చేసినట్లుగా.. ప్రతి ఆగస్టు 15వ తేదీన నాయకులు.. తెల్లటిబట్టలు కట్టుకుని.. ఓ టోపీని కొనుక్కుని.. అది కూడా... అతని అసిస్టెంట్‌ కొంటే తెచ్చిపెట్టుకుంటారు. కానీ స్వంతంగా వెళ్ళి కొనరు... మన ఇంట్లో సంక్రాంతికి, ఇతర పండుగలకు పిండి వంటలు కొనుకున్నట్లు... రాజకీయనాయకులు టోపీలు కొనుక్కుని.. ఆరోజు తూతూమంత్రంగా కానిచ్చేస్తారు.. ఇది ఎంత దురుదృష్టకరం... అని సంచలన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. 

పోసాని ముఖ్య అతిథిగా 'ఆగస్టు 15' అర్థరాత్రి 12 గంటలు' అనే చిత్రం ఆడియో వేడుకలో (సోమవారం, 14 నవంబర్ 2011) ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు.