29, డిసెంబర్ 2011, గురువారం

గతం నుండి గుణపాఠం నేర్చుకోవాలి


కాలం ఎంతో విలువైనది, అది నిరంతరం పరుగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే గాని మజిలీలు లేవు. కాలాన్ని మనం ఎన్నో రకాలుగా విభజించుకున్నాం. సెకనులు, నిమిషాలు, గంటలు, ఘడియలు, విఘడియలు, ఝాములు. ప్రకృతి సిద్ధంగా ఈ విభజన ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అమావాస్య, పౌర్ణమి, పగలు, రేయి, రోజు, వారం, మాసం, సంవత్సరం. ఈ ప్రకృతి నియమాన్నే మనిషి అనాదిగా అనుసరిస్తూ వస్తున్నాడు.

కాలగతిలో క్యాలండర్లు మారుతుంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ‘ఉగాది’గా, మహారాష్ట్రలో ‘గుడిపద’గా, అస్సాంలో ‘బిహు’గా, కేరళలో ‘కాలవర్ష’. పారశీలు ‘జష్నెనౌబహార్’ అని, ‘నౌరోజ్’ అని పిలుచుకుంటారు. హి.శ.మొదటిమాసంతో ప్రారంభమయ్యే ‘ముహర్రం’ మాసం ఇస్లామీయ క్యాలండరు ప్రకారం నూతన సంవత్సరం. అలాగే క్రీ.శ. జనవరితో ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది.

గతకాలానికి వీడ్కోలు, కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోనుకావడం సహజమే. అయితే ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ధార్మికంగానే కాకుండా, సామాజికంగా, నైతికంగా కూడా తప్పే. దీనికి దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే, ‘కాలం సాక్షి! మానవుడు ఘోరమైన నష్టంలో ఉన్నాడు. అయితే సత్యాన్ని విశ్వసించి, తదనుగుణంగా సత్కార్యాలు చేసేవారు తప్ప’ అంటున్నాడు దైవం పవిత్ర ఖురాన్‌లో (103 - 1).

గతాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరాన్ని అర్థం పర్థం లేని కార్యకలాపాలతో ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. గతంలో ఏమైనా తప్పులు, పాపాలు జరిగి ఉంటే, ఇక ముందు వాటిని కచ్చితంగా విసర్జిస్తామని ప్రతినబూనాలి. గతంగతః ఇక నుంచి ఓ కొత్త శకానికి ప్రారంభమన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి.

అన్నిరకాల దుర్వ్యసనాలకు, నిషిద్ధాలకు దూరంగా, దేవుని మార్గదర్శకత్వంలో జీవితం గడుపుతామన్న స్థిర నిర్ణయం తీసుకోవాలి. కాలం చాలా కర్కశమైందని, అది ఎవర్నీ వదలదని, ఏదో ఒకనాడు తాము కూడా కాలగర్భంలో కలిసిపోవలసిన వాళ్లమేనన్న నగ్నసత్యాన్ని అనునిత్యం జ్ఞాపకం ఉంచుకుని కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. కనుక పవిత్రఖురాన్‌లో ప్రవచించబడినట్లు, సాధ్యమైనంతమేర సత్కార్యాలు చేస్తూ, గతం నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్ కాలాన్ని ఇహ పర ప్రయోజనకారిగా మలచుకోవడమే వివేకవంతుల లక్షణం.

- ఎం.డి. ఉస్మాన్‌ఖాన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి